అరచేతుల్లోనే ఆయురారోగ్యాలు | Global Hand Washing Day On 15th October | Sakshi
Sakshi News home page

అరచేతుల్లోనే ఆయురారోగ్యాలు

Published Sun, Oct 9 2016 2:42 AM | Last Updated on Mon, Sep 4 2017 4:40 PM

అరచేతుల్లోనే ఆయురారోగ్యాలు

అరచేతుల్లోనే ఆయురారోగ్యాలు

అక్టోబర్ 15 గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే
అరచేతుల్లో అదృష్టరేఖలు ఉంటాయో లేదో గాని, ఆయురారోగ్యాలు మాత్రం చాలావరకు మన అరచేతుల్లోనే ఉంటాయి. అరచేతులను ఎప్పటికప్పుడు శుభ్రంగా, సురక్షితంగా ఉంచుకున్నంత వరకు ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా ఉండదు. ఆరోగ్యం బాగుంటే, ఆయుర్దాయానికీ ఢోకా ఉండనట్లే కదా! ఆయురారోగ్యాలు బాగుండాలంటే, అరచేతులపై దృష్టి సారించాలి. వాటిని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకుంటూ ఉండాలి. తినడానికి ముందు, బాత్‌రూమ్‌కు వెళ్లిన తర్వాత అరచేతులను శుభ్రంగా కడుక్కోవాలి. అలా కడుక్కునేలా ఇంట్లోని చిన్నారులకు కూడా అలవాటు చేయాలి. అరచేతుల శుభ్రతే ఆరోగ్యానికి శ్రీరామరక్ష అని వారికి తెలియజేయాలి.
 
వ్యాధులను కడిగేద్దాం
చేతులను కడుక్కోవడమంటే వ్యాధులను కడిగేసుకున్నట్లే! అరచేతులను శుభ్రంగా కడుక్కోకపోతే జలుబు మొదలుకొని బ్యాక్టీరియా, వైరస్ వంటి సూక్ష్మజీవుల ద్వారా వ్యాపించే రకరకాల వ్యాధులు శరీరంపై దాడి చేసే ముప్పు ఉంటుంది. ఇలాంటి వ్యాధులు సోకిన వారు శుభ్రతలేని చేతులతో ఇతరులకు కరచాలనం చేసినా, అందరూ ఉపయోగించే వస్తువులను తాకినా ఆ వ్యాధులు ఇతరులకూ వ్యాపిస్తాయి. కొద్దిపాటి జాగ్రత్తతో, కాస్తంత అప్రమత్తతతో చాలా వ్యాధులను తేలికగా నివారించవచ్చు.

పరిసరాలతో పాటు మన చేతులనూ నిత్యం పరిశుభ్రంగా ఉంచుకుంటే చాలు. చాలావరకు వ్యాధులు మన దరికి చేరవు. చేతులను శుభ్రంగా ఉంచుకోకపోవడం వల్ల ఇన్‌ఫ్లుయెంజా, లారింజైటిస్, న్యుమోనియా వంటి ఊపిరితిత్తుల వ్యాధులతో పాటు డయేరియా, డిసెంట్రీ, టైఫాయిడ్, హెపటైటిస్, బోటులిజం, అమీబియాసిస్ వంటి జీర్ణకోశ వ్యాధులు సోకుతాయి. ఇన్‌ఫ్లుయెంజాలో బర్డ్ ఫ్లూ, స్వైన్ ఫ్లూ వంటి కొన్ని మొండిరకాలు, హెపటైటిస్ వంటి వ్యాధులు ప్రాణాల మీదకు తెస్తాయి కూడా. ఇలాంటి వ్యాధులు సోకిన తర్వాత చికిత్స కోసం పరుగులు తీసే కంటే, అవి సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడమే మేలైన పని.
 
అకాల మరణాలను అరికడదాం
ప్రకృతి విపత్తులు, ప్రమాదాల కారణంగా సంభవించే మరణాలను అరికట్టడం దుస్సాధ్యం. అయితే, చేతులను శుభ్రంగా ఉంచుకోవడం అనే తేలికపాటి చర్య ద్వారా చాలావరకు అకాల మరణాలను నివారించవచ్చు. పరిశుభ్రతా లోపం వల్ల తలెత్తే  వ్యాధుల వల్ల ఎక్కువగా ఐదేళ్ల వయసు లోపు చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు. శుభ్రతా లోపం వల్ల తలెత్తే న్యుమోనియా, డయేరియా వ్యాధుల కారణంగా ఏటా 35 లక్షల మంది చిన్నారులు మృత్యువాత పడుతున్నారు. తీవ్రమైన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ల వల్ల మరో 18 లక్షల మంది చిన్నారులు బలైపోతున్నారు. తినే ముందు తప్పనిసరిగా చేతులను శుభ్రంగా కడుక్కునే అలవాటు చేసుకుంటే, ఇలాంటి మరణాలను దాదాపు 30 శాతం వరకు అరికట్టవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా.
 
శుభ్రతా లోపం... ప్రపంచంపై భారం
పరిశుభ్రతా లోపం వల్ల తలెత్తే వ్యాధుల కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పెనుభారం పడుతోంది. విలువైన మానవ వనరుల ఉత్పాదకతకు కూడా విఘాతం కలుగుతోంది. కేవలం ఇన్‌ఫ్లుయెంజా కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఏటా దాదాపు 167 బిలియన్ డాలర్ల (రూ. 11.10 లక్షల కోట్లు) ఆర్థికభారం పడుతోంది. భారత్ సంగతి చూసుకుంటే, శుభ్రతా లోపం వల్ల తలెత్తే వ్యాధుల కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థపై ఏటా రూ.1.75 లక్షల కోట్ల మేరకు భారం పడుతోంది. జనాభా అంతా చేతులను శుభ్రంగా కడుక్కునే అలవాటు చేసుకుంటే ఆరోగ్య సమస్యలు చాలావరకు దూరం కావడం మాత్రమే కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా బలం పుంజుకుంటుంది.
 
ఇదీ చరిత్ర
చేతులను శుభ్రంగా ఉంచుకోవడం వల్ల చాలావరకు వ్యాధులను అరికట్టవచ్చని హంగేరియన్ వైద్యుడు ఇగ్నాజ్ సెమెల్వీస్ 1846లోనే గుర్తించారు. ఆ కాలంలో ఆయనతో పాటు ఆధునిక నర్సింగ్‌కు ఆద్యురాలైన ఫ్లారెన్స్ నైటింగేల్ కూడా చేతుల శుభ్రత ద్వారా వ్యాధులను అరికట్టవచ్చనే విషయాన్ని ప్రచారంలోకి తెచ్చారు. దాదాపు శతాబ్దం తర్వాత గాని వైద్యరంగం మేలుకోలేదు.

అమెరికాలో ఇరవయ్యో శతాబ్దిలో ఆహార కాలుష్యం వల్ల వ్యాధులు ప్రబలడంతో ఆస్పత్రుల్లో వైద్యులు, ఇతర సిబ్బంది చేతులు శుభ్రం చేసుకోవాలనే నిబంధన తప్పనిసరిగా మారింది. సబ్బు లేదా యాంటీ సెప్టిక్ లోషన్‌తో కనీసం 15 సెకన్ల పాటు చేతులను క్షుణ్ణంగా, శుభ్రంగా కడుక్కుంటే చాలా రకాల వ్యాధులను నివారించవచ్చని ఆధునిక వైద్యరంగం గుర్తించింది. ఆస్పత్రుల్లో వైద్యులు ఏయే సందర్భాల్లో చేతులను శుభ్రంగా ఉంచుకోవాలి, ఎలా శుభ్రంగా ఉంచుకోవాలి అనే అంశాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలను కూడా రూపొందించింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement