బట్టతలపై జుట్టు మొలిపించే మందు!
బట్టతలతో బాధపడేవారికి శుభవార్త! అమెరికాలోని కాలిఫోర్నియా వర్సిటీ శాస్త్రవేత్తలు బట్టతలపై జుట్టు మొలిపించగల మందును కనుగొన్నట్లు ప్రకటించారు. వయసు మళ్లడం, జన్యు లక్షణాలు, హార్మోన్ల అసమతుల్యత, మానసిక ఒత్తిడి, తీవ్రంగా జబ్బుపడటం, కొన్ని రకాల ఔషధాల దుష్ప్రభావాల ఫలితంగా చాలామంది బట్టతల బారిన పడుతుంటారు.
అయితే, బట్టతలకు దారితీసే నిర్దిష్టమైన కారణాలను ఇప్పటి వరకు ఎవరూ గుర్తించలేకపోయారని, తమ పరిశోధనల్లో ఆ కారణాలను గుర్తించామని కాలిఫోర్నియా వర్సిటీకి చెందిన మాలిక్యులర్, సెల్ అండ్ డెవలప్‌మెంటల్ బయాలజీ ప్రొఫెసర్ విలియమ్ లౌరీ వెల్లడించారు.
జుట్టు కుదుళ్లలోని మూలకణాల్లో జరిగే జీవక్రియలు, చర్మ కణాల్లో జీవక్రియలు భిన్నంగా ఉంటాయని, జుట్టు కుదుళ్లలో జట్టు పెరుగుదలకు, తరుగుదలకు దారితీసే జీవరసాయనిక ప్రక్రియలను తమ ప్రయోగాల్లో నిర్దిష్టంగా గుర్తించామని ఆయన తెలిపారు. ఈ ప్రయోగాల ఆధారంగా బట్టతలపై తిరిగి జుట్టుమొలిపించగల ‘ఆర్‌సీజీడీ423’, ‘యూకే5099’ అనే ప్రయోగాత్మక ఔషధ సమ్మేళనాన్ని రూపొందించామని వివరించారు.