
ఆనంద బృందావనం
వాళ్లంతా ఎంతో జీవితాన్ని చూశారు. తమ జీవితంలోని ప్రతి క్షణాన్నీ తమ బిడ్డల కోసమే వెచ్చించారు. పిల్లల జీవితాలను తీర్చిదిద్దడానికి తమ రక్తాన్ని చెమటగా చిందించారు. కానీ వాళ్లు చూసిన ప్రేమలో కాస్త కూడా తిరిగి పిల్లలు వాళ్లపై చూపించలేదు. కనీసం జాలిపడి అయినా ముదిమి వయసులో వారికి అండగా నిలబడలేదు. బిడ్డల ఛీత్కారాలు, చీదరింపులతో ఆవేదనకు లోనై, కాస్త ప్రేమగా పలకరించేవారిని వెతుక్కుంటూ బయలుదేరారు. అప్పుడే వారికి కనిపించింది... ఆనంద నిలయం. మెదక్ జిల్లా కొండపాక మండల కేంద్రంలోని అటవీ ప్రాంతంలో ఉన్న ఈ ఆశ్రమం... వయసుడిగిన తరుణంలో వాళ్లందరికీ ఓ మంచి అండ, గొప్ప భరోసా!
కరీంనగర్ జిల్లా చిగురుమామిడికి చెందిన మోతుబరి రైతు మల్లారెడ్డి. తొంభై ఎకరాలకు పైగా భూమి ఉండేదాయనకు. ఎంతో మంది కూలీలు ఆయన పొలంలో పని చేసేవారు. వాళ్లందరినీ ఎంతో ప్రేమగా చూసేవారు మల్లారెడ్డి. పదిమందికీ తాను మంచి చేస్తే, ఆ దీవెనలన్నీ తన పిల్లలకు వస్తాయని అనుకునేవారాయన. పిల్లలంటే అంత ప్రేమ ఆయనకు. వాళ్లను కళ్లలో పెట్టుకుని పెంచారు. ముఖ్యంగా కొడుకులే తన సర్వస్వం అనుకున్నాడాయన. కానీ ఆ కొడుకులే తన కన్నీటికి కారణమవుతారని ఆయన ఊహించలేదు. పెద్దకుమారుడు ఉపాధ్యాయ వృత్తి చేపట్టాడు. చిన్న కుమారుడు గ్రామంలో కిరాణాషాపు పెట్టుకున్నాడు.
వాళ్లిద్దరికీ చెరో 42 ఎకరాల భూమినీ పంచి ఇచ్చారు మల్లారెడ్డి. మిగతా ఆరు ఎకరాలను తనకు, తన భార్య కోసమని ఉంచుకున్నారు. తన రెండు ఇళ్లనూ కూడా కొడుకులకే రాసిచ్చి, ఒక ఇంట్లో ఓ పంచన ఉండేవారు ఆ దంపతులు. పైగా కొడుకుల అవసరాలకు అప్పుడప్పుడూ డబ్బు కూడా సర్దుబాటు చేస్తుండేవారు. ఇంత చేస్తున్నా తల్లిదండులను సక్రమంగా చూసుకోవాలనే ఆలోచన మాత్రం ఆ కొడుకులకు కలగలేదు. వయసు మీద పడి అమ్మానాన్నలు కష్టపడుతుంటే, కనీసం వాళ్లను పట్టించుకున్న పాపాన పోలేదు.
పైగా వాళ్ల దగ్గర ఉన్న ఆరెకరాల భూమి కూడా తమకు ఇవ్వాలని గొడవకు దిగారు. కొడుకుల తీరు నచ్చక మల్లారెడ్డి ఆ భూమిని నాలుగేళ్ల క్రితం కూతురి పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు. దాంతో ఏకంగా తండ్రిపైనే భూమి కోసం కేసు వేశారు. కొడుకులు చేసిన ఈ పనికి ఆ దంపతులు పాపం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. కన్న బిడ్డలే బద్ధ శత్రువుల్లా ప్రవర్తిస్తుంటే ఏం చేయాలో తోచక, కనీసం తమ పొట్ట తాము పోసుకోలేక అవస్థ పడాల్సి వచ్చింది ఆ వృద్ధ దంపతులకు. వీరే కాదు. వీరిలా ఎంతోమంది. అందరికీ ఒకటే కథ. గుండెల్లో పెట్టుకుని పెంచిన పిల్లలు గుండెలపై గుద్ది వెళ్లి పోయిన కథ. కడుపు నిండా ఇంత అన్నం పెట్టి, ప్రేమగా పలకరించేవాళ్లు కూడా లేరే అన్న వ్యథ. వారి కథను మార్చి, వాళ్లందరి వ్యథను తీర్చింది ఓ ఆశ్రమం. అదే ‘ఆనంద నిలయం’.
ఒక్కరితో మొదలై...
మెదక్ జిల్లాలోని కొండపాక శివారులోని కొమురవెళ్లి కమాన్‌కు కిలోమీటర్ దూరంలో అటవీ ప్రాంతం ఉంది. 2010కి పూర్వం అది కేవలం అడవి. దాన్ని మమతకు నిలయంగా మార్చారు, రిటైర్డ్ ఉపాధ్యాయుడు పెద్ది వైకుంఠం. పిల్లల నిరాదరణకు గురై తల్లడిల్లే వృద్ధుల కోసం ఏదైనా చేయాలని తలంచారు వైకుంఠం. తన ఆలోచనను మిత్రుడు కోట రాధాకృష్ణశర్మతో పంచుకోగా, ఆయన కూడా ఆ మహాకార్యంలో పాలు పంచుకుంటానన్నారు. మరికొంత మంది కూడా వీరితో కలవడంతో వృద్ధాశ్రమ స్థాపనకు ప్రణాళిక సిద్ధం అయ్యింది. తాము సంపాదించే దాంట్లో కొంత ఆ ఆశ్రమానికి కేటాయించాలనే నిర్ణయానికి వచ్చారంతా.
ఈ విషయాన్ని అప్పటి హౌసింగ్ బోర్డు కమిషనర్‌గా పనిచేస్తోన్న సిద్దిపేట వాస్తవ్యులు కేవీ రమణాచారికి తెలిపారు. రమణాచారి పెద్ది వైకుంఠంకు డిగ్రీలో జూనియర్ కావడంతో వారి మధ్య చనువుంది. ఆయన వైకుంఠం ఆలోచనను సమర్థించారు. ఆయన ద్వారా ఎందరో దాతలు విరా ళాలు ఇవ్వడానికి ముందుకొచ్చారు. బెంగళూరుకు చెందిన సుధా జనార్దన్ ఆశ్రమానికి తనవంతు సాయంగా రూ. 50లక్షల భారీ విరాళాన్ని అందజేశారు. దాంతో ఆనంద నిలయ స్థాపనకు మార్గం సుగమ మయ్యింది. కొండపాక శివారులో 93 ఎకరాల భూమిని కొనుగోలు చేసి ఆనంద నిలయాన్ని నిర్మించారు. వైకుంఠం, ఆయన మిత్రులు, రమణాచారి దంప తులు తదితరులు కలిసి ట్రస్టుగా ఏర్ప డ్డారు. రమణాచారి భార్య లత చైర్మన్‌గా వ్యవహరిస్తోన్న ఈ ట్రస్టు ఆశ్రమాన్ని ఎంతో గొప్పగా అభివృద్ధి చేస్తోంది.
అమ్మ ఒడి అది...
ముదిమి మీద పడిన మనిషి పసి బిడ్డతో సమానం అంటారు. ఆ సమ యంలో వాళ్లకి ప్రేమ కావాలి. ధైర్యం చెప్పే తోడు కావాలి. మంచాన పడితే సేవ చేసే చేయి కావాలి. మొత్తంగా చెప్పాలంటే అమ్మలా సాకాలి. నాన్నలా నడిపించాలి. అవన్నీ చేస్తోంది ఆనంద నిలయం. అందుకే అది ఆశ్రమం కాదు, అమ్మ ఒడి అంటారు అక్కడ ఉంటోన్నవారు. వాళ్ల మాటల్లో నిజముంది. ఎందు కంటే ఆ ఆశ్రమం వాళ్లను నిజంగా అలానే చూస్తోంది. వాళ్లకి ఎటువంటి లోటూ లేదక్కడ. మూడు పూటలా రుచి కరమైన, ఆరోగ్యకరమైన ఆహారం, అన్ని వసతులూ ఉన్న గదులు, కాలక్షేపం కోసం ఆట వస్తువులు, చక్కని గార్డెన్... అన్నీ ఉన్నాయి.
చివరి రోజుల్లో ప్రతి ఒక్కరూ దేవుని ధ్యానంలో గడపాలని అను కుంటారు. అందుకే ఆశ్రమంలోనే ఒక కళ్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని కట్టారు. ఆ ఆధ్మాత్మిక పవనాలు వారి మనసులు స్వాంతననిస్తున్నాయి. ప్రతి నెలా జరిగే ఆరోగ్య పరీక్షలు ఆరోగ్యం గురించి కూడా చింత వద్దంటూ భరోసా ఇస్తున్నాయి. ఇన్ని చేస్తున్నందుకే వాళ్లు ఆ ఆశ్రమాన్ని అమ్మ ఒడి అంటున్నారు.
అయితే ఆనంద నిలయం సేవ ఇక్క డితో ఆగిపోలేదు. సేంద్రియ పద్ధతుల్లో కూరగాయల్ని పండిస్తోంది. గోశాలను నిర్మించి పశు సంపదనూ పెంచుతోంది. ఓ బనియన్ తయారీ కంపెనీని పెట్టి వారికి చుట్టుపక్కల గ్రామాల ఉపాధిని కల్పిస్తోంది. ఈ సేవల్ని ముందు ముందు మరింత విస్తరించాలని అను కుంటోంది. మంచి పనికి అవరోధం ఏముంటుంది! అవన్నీ చేసే తీరుతుంది.
కనిపించే దైవాలు...
దైవం ఎక్కడో లేడు. తల్లిదండ్రుల్లోనే ఉన్నాడు. వాళ్లే మనకు కనిపించే దైవాలు. తల్లిదండ్రులను గౌరవించే వారు వికాసం, సంతోషం, సంతప్తి పొందగలుగుతారు. పదిహేనేళ్ల క్రితం నాకు వృద్ధులకు చేయూతగా నిలువాలనే ఆలోచన వచ్చింది. ఆ కలల సాకారమే ఈ ఆశ్రమం. సిద్దిపేటలోని మిత్రులు పెద్ది వైకుంఠం, వెంకటేశం తదితరుల సహకారంతో ఆశ్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకువెళ్తున్నాం. ఈ ఆనంద నిలయం నాకు దేవాలయం. ఈ ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న వృద్ధులు ఆరోగ్యంగా, సంతప్తికరంగా ఉండాలన్నదే నా తాపత్రయం.
- కేవీ రమణాచారి,
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు
- వై.సురేందర్, సాక్షి ప్రతినిధి, గజ్వేల్
ఫొటోలు: కనకారెడ్డి