డాక్టరు గారు... నా వయసు 26 సంవత్సరాలు. మా ఆయన వయసు 28 సంవత్సరాలు. పెళ్లై సంవత్సరం దాటింది. మాకు సంతానం కలగలేదు. నాకు పిరియడ్స్ సక్రమంగానే వస్తాయి. వైద్య పరీక్షల్లో ఏ సమస్య లేదని చెప్పారు. మాకు పిల్లలు కలగాలంటే ఏ సమయాల్లో కలుసుకుంటే బాగుంటుంది తెలియజేయగలరు. – భావన, గుంటూరు
సాధారణంగా భార్య, భర్తల్లో ఏ సమస్య లేనప్పుడు, 80 శాతం మంది పెళ్లయిన సంవత్సరం లోపల గర్భం దాల్చుతారు. 15 శాతం మంది రెండు సంవత్సరాల లోపల గర్భం దాల్చుతారు. మిగతా 5 శాతం మందికి మాత్రమే, చికిత్స అవసరమవుతుంది. మీకు పెళ్లై సంవత్సరమే అయ్యింది. వైద్య పరీక్షలలో సమస్యలు ఏమీ లేవు కాబట్టి, ఇంకొక సంవత్సరం పాటు సాధారణ గర్భం కోసం ప్రయత్నించవచ్చు. వైద్య పరీక్షలు నీకు మాత్రమే చేశారా లేక మీ వారికి కూడా వీర్య పరీక్ష చేశారా అనే విషయం సరిగా తెలుపలేదు. మీ వారికి కూడా వీర్య పరీక్ష చేసి, వీర్య కణాల సంఖ్య, కదలిక సరిగా ఉంటే పర్వాలేదు. ఒకవేళ చెయ్యకపోతే, చేయించి చూడండి. అన్నీ బాగుంటే నీకు నెలనెలా పీరియడ్స్ సక్రమంగా వస్తున్నాయి కాబట్టి, బ్లీడింగ్ మొదలైన రోజు మొదటి రోజుగా లెక్కపెట్టి, 9వ రోజు నుంచి 16వ రోజు లోపల కలవడం వల్ల గర్భం నిలిచే అవకాశాలు పెరుగుతాయి.
నా వయసు 31 సంవత్సరాలు. పదహారు సంవత్సరాల క్రితం నాకు పెళ్లయింది. మా వారికి బ్లడ్ టెస్ట్‌లో హెచ్‌బియస్ ఏజీ పాజిటివ్ అని వచ్చింది. నాకు పిల్లలకు టెస్ట్ చేయించుకుంటే నెగెటివ్ అని వచ్చింది. మావారు కండోమ్‌లాంటివి ఎలాంటి సేఫ్టీ యూజ్ చేయరు. ఫ్యూచర్‌లో ఏమైనా సమస్య వస్తుందా? హెచ్‌బియస్ ఏజీ అంటే ఏమిటి? దీనికి ఏమైనా చికిత్స అవసరమా? నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మావారికి ఆల్కహాల్, నాన్‌వెజ్ తీసుకునే అలవాటు లేదు. – ఒక సోదరి, వరంగల్
శరీరంలో హెపటైటిస్–బి అనే వైరస్ ప్రవేశించడం వల్ల వచ్చే ఇన్‌ఫెక్షన్‌ను హెపటైటిస్–బి ఇన్‌ఫెక్షన్ అంటారు. ఇది హెపటైటిస్–బి ఇన్‌ఫెక్షన్ ఉన్నవాళ్లతో సెక్స్ వల్ల, వారు వాడిన సిరెంజ్‌లు వాడటం వల్ల, ఇన్‌ఫెక్షన్‌తో కూడిన రక్తం ఎక్కించుకోవడం వల్ల, డెలివరీ సమయంలో తల్లి నుంచి బిడ్డకు సోకే అవకాశం ఉంటుంది. ఈ వైరస్ లివర్ పనితీరు మీద ప్రభావం చూపి, దానిని దెబ్బతీస్తుంది. కొందరిలో ఇన్‌ఫెక్షన్‌ను ఎక్కువ కలగజేసి తర్వాత అదే తగ్గిపోతుంది. కొందరిలో మాత్రం ఈ వైరస్ రక్తంలో, శరీరంలోనే ఉండిపోయి, క్రానిక్ హెపటైటిస్–బిని కలగజేస్తుంది. ఏఆ అజ అంటే హెపటైటిస్–బి వైరస్ మీద ఉండే యాంటిజన్. బ్లడ్ టెస్ట్‌లో ఏఆ అజ ఉందని తేలితే, హెపటైటిస్–బి వైరస్ వారి రక్తంలో ఉందన్నమాట. కాకపోతే ఈ వైరస్ నిద్రావస్థలో ఉందా, యాక్టివ్‌గా ఉందా అనే దాని బట్టి, ఇన్‌ఫెక్షన్ తీవ్రత, వేరేవారికి సోకే అవకాశాలు, వారికి హాని కలిగించే లక్షణాల తీవ్రత ఆధారపడి ఉంటుంది. మీవారికి ఉండే హెపటైటిస్–బి ఇన్‌ఫెక్షన్ ఎటువంటిదో, దాని తీవ్రత తెలుసుకోవడానికి ఒకసారి ఫిజీషియన్ లేదా గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ను కలిసి అవసరమైన పరీక్షలు ((HBSAg, HBSAb, Viral DNA load, LRT)) చెయ్యించుకుని, దానిని బట్టి చికిత్స తీసుకోవడం మంచిది. మీ టెస్ట్ నెగెటివ్ వచ్చింది కాబట్టి, మీరు హెపటైటిస్–బి వ్యాక్సిన్ మూడు డోస్‌లు తీసుకోవాలి. ఈ లోపల కండోమ్స్ వాడటం మంచిది.
∙నాకు ఒకప్పుడు క్యాన్సర్ వచ్చి కీమోథెరపీ చేయించుకున్నాను. ఇప్పుడు ఎలాంటి సమస్య లేదు. అయితే పిల్లలు కావాలనుకుంటున్నాను. కీమోథెరపీ ప్రభావం అండాలపై పడి, అండాలు తరిగిపోతాయని, ఉన్నవి ఆరోగ్యంగా ఉండవనే విషయం తెలిసింది. ఇది ఎంత వరకు నిజం? కీమోథెరపీ చేయించుకున్న నేను పిల్లల్ని కనవచ్చా? కంటే ఎలాంటి సమస్యలు ఏర్పడతాయి?
– రాధ, చిత్తూరు
మీ వయస్సు ఎంతో రాయలేదు. కీమోథెరపీ తీసుకుని ఎన్ని సంవత్సరాలు అవుతుందో రాయలేదు. కీమోథెరపీలో వాడే చాలా మందుల ప్రభావం వల్ల అండాశయంలోకి అండాలు పెరిగే ఫాలికల్స్ ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి, వయస్సును బట్టి, మందుల మోతాదును బట్టి నశించిపోవటం, వాటి నాణ్యత తగ్గిపోవటం జరుగుతుంది. కీమోథెరపీ పూర్తయి కొన్ని సంవత్సరాలకి, దాని ప్రభావం పూర్తిగా తగ్గిపోయిన తర్వాత అండాశయాల సామర్ధ్యతను బట్టి, కొందరిలో కొన్ని ఫాలికల్స్ మెల్లగా పెరిగి అండాలను విడుదల చేయడం జరుగుతుంది. కీమోథెరపీ సమయంలో కొన్ని సంవత్సరాల పాటు, పీరియడ్స్ ఆగిపోవటం జరుగుతుంది. వాటి ప్రభావం తగ్గిన కొన్ని సంవత్సరాలకు, కొందరిలో వయస్సును బట్టి, మళ్లీ పీరియడ్స్ మొదలవుతాయి. మీకు ఇప్పుడు పీరియడ్స్ వస్తున్నాయా లేదా అనేది రాయలేదు. పీరియడ్స్ వస్తుంటే, గర్భం రావటానికి అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. కీమోథెరపీ తర్వాత పుట్టే పిల్లలకు తప్పనిసరిగా సమస్యలు ఉండాలని ఏమీలేదు. ఒకసారి మీకు చికిత్స ఇచ్చిన డాక్టర్‌ను సంప్రదించి, క్యాన్సర్ పూర్తిగా తగ్గిపోయిందా, తిరగబెట్టే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అని, అవసరమైన పరీక్షలు చేయించుకుని, అండాలు తయారవుతున్నాయా లేదా వంటి పరీక్షలు చేయించుకుని, వారి సలహా మేరకు నిర్ణయం తీసుకోవటం మంచిది.
Comments
Please login to add a commentAdd a comment