వివేకం: మీకందిన మొదటి కానుక మీ శరీరం | Human body a God's gift | Sakshi
Sakshi News home page

వివేకం: మీకందిన మొదటి కానుక మీ శరీరం

Published Sun, Feb 9 2014 3:44 AM | Last Updated on Wed, Apr 3 2019 5:32 PM

Human body a God's gift

శరీరమంటే బాధేనని చాలామంది ఓ అభిప్రాయానికి వచ్చేశారు. శరీరం బాధేమీ కాదు. శరీరంతో ఎంతో చక్కగా కూడా ఉండవచ్చు. మీరు ఎక్కడికి వెళ్లినా, ఏం చేసినా దీన్ని మోసుకుంటూ తిరగాల్సిన అవసరం లేకుండా ఇది మీతో తేలిపోతూ ఉండేలా చేసుకోవచ్చు. కేవలం ఆహారంతో, సాధనతో, మీ దృక్పథంలో కొద్ది మార్పులతో, ఈ శరీరం ఓ అద్భుతంగా మారడం మీరు చూడవచ్చు. మీరు దీన్నో యంత్రంగా చూసినా, ఇది భూమి మీద ఉన్న ఓ అత్యాధునిక యాంత్రిక వ్యవస్థ అనే సంగతి అర్థమవుతుంది. ప్రపంచంలోని అన్ని సూపర్ కంప్యూటర్లూ కూడా దీంతో సరిపోలవు. ప్రపంచంలోని కంప్యూటర్లన్నింటినీ కలిపిన దానికంటే నూరు రెట్లు ఎక్కువగా శరీరంలో ఒక కణంలోని డీఎన్‌ఏ పనిచేస్తుంది.
 
 మీ సృష్టికర్త ఎవరైతేనేం, ఆయన మీకు అద్భుతమైన శరీరాన్ని ఇచ్చాడు. మీకిచ్చిన మొదటి కానుక భౌతికమైంది. మీరు దీన్ని దుర్వినియోగం చేస్తున్నట్లు ఆయన గమనిస్తే, మీకు దీన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియకపోతే, ఇక మీకు మరిన్ని కానుకలిచ్చి ఉపయోగం లేదని ఆయన అర్థం చేసుకుంటాడు. అందువల్ల మీరు ఈ శరీరాన్ని ఆనందదాయకంగా ఉంచుకోవడం అన్నిటికన్నా ప్రధానం.
 
 కొన్ని పదార్థాలు తింటే శరీరం ఆనందంగా ఉంటుంది. మరికొన్ని తింటే శరీరం మందకొడిగా తయారై, మీ నిద్రను మరికొంత పెంచుతుంది. మనం రోజుకు ఎనిమిది గంటలు నిద్రపోతామనుకోండి. అంటే మనం బతికే అరవయ్యేళ్లలో ఇరవై ఏళ్లు నిద్రలోనే గడిపేశామన్న మాట. అంటే మన జీవితంలో మూడవ వంతు కాలాన్ని నిద్రలో గడిపేశామన్న మాట. మిగిలిన జీవితంలో 30 నుంచి 40 శాతం తినడానికీ, కాలకృత్యాలు తీర్చుకోవడానికీ సరిపోతుంది. ఇక జీవితానికి మిగిలిందేమిటి? జీవితానికి సమయమే లేదన్న మాట!
 ఎవరూ తమ నిద్రతో ఆనందించలేరు. అసలు నిద్రలో మీరుండరు. మీరు ఆనందించగలిగింది మీ విశ్రాంతి సమయంలోనే. శరీరానికి బాగా విశ్రాంతినిస్తే మీకు ఆనందంగా ఉంటుంది.
 
  శరీరాన్ని విశ్రాంతిగా ఉంచడం ఎలా? మొదటగా, అసలు దీనికి శ్రమ ఇవ్వడం దేనికి? చాలావరకూ పని కారణంగా శరీరం అలసిపోవడం లేదు. బాగా పనిచేసేవాళ్లు బాగా చురుకుగా ఉంటారు. ఆహారం ఇందులో ప్రధానపాత్ర పోషిస్తుంది. ఆలోచనా ధోరణి కూడా కారణం కావచ్చు. కానీ, ఆహారమే ప్రధాన పాత్ర పోషిస్తుంది. మీరు కనుక చెడు పదార్థాలు తింటే, మీరు మీ శరీరాన్ని తోసుకుంటూ తిరగాలి. మీరు గనుక సరైన ఆహారం తీసుకుంటే, మీ శరీరం మీకన్నా ముందుంటుంది. శరీరం ఉండాల్సిన తీరు అదే!
 
 సమస్య- పరిష్కారం
 మీరెందరో స్వచ్ఛంద కార్యకర్తలను తయారుచేశారని విన్నాను. ఎలా చేయగలిగారు?
 - డి.గోపాల్, వరంగల్
 సద్గురు: స్వచ్ఛందమంటే ఇష్టపడి చేయటం. జీవితాన్ని పూర్తిగా అంకితం చేయడం. చాలామంది తమకు అనుకూలంగా ఉంటే ‘సరే’ అంటారు. అనుకూలంగా లేకపోతే ‘లేదు’ అంటారు. దానివల్ల ఫలితముంటే సరేనంటారు. లేకపోతే కాదంటారు. స్వచ్ఛందమంటే అతను దాన్ని వదులుకున్నాడు. అది తనకు అత్యంత ప్రధానమైన ‘నాకేం లాభం’ అనే లెక్కనే వదులుకున్నాడు. ఈ ఒక్క లెక్కనీ మనిషి వదులుకోగలిగితే, ‘దీనివల్ల నాకు ఉపయోగమేమిటి?’ అనే భావనను వదులుకుంటే, అతను ఓ అద్భుతం అయిపోతాడు. నేను మొదటి నుంచీ దీన్నే జనానికి చూపిస్తున్నాను. మన లాభాపేక్షకు అతీతంగా మరేదో ఉంది. అదేమిటన్నది చాలామంది తెలుసుకోవడానికి ప్రయత్నించరు. స్వచ్ఛంద సేవకులు చిత్తశుద్ధితో పనిచేస్తారు. తమను తాము అర్పించుకోవడానికి సిద్ధపడే జనం మధ్య మనం ఉండటం నిజంగా గొప్ప అదృష్టమనే చెప్పాలి. మనిషి ఇందులో ఎంతో ఆనందం పొందుతాడు. మనిషికి ఇంతకన్నా మించిన అదృష్టం మరొకటి ఉండదు.

- జగ్తీ వాసుదేవ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement