![Caste system will be eroded says Jaggi vasudev - Sakshi](/styles/webp/s3/article_images/2018/09/17/JAGGI.jpg.webp?itok=AXhc5AyJ)
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఆర్థిక సమానత్వం, సామాజిక రక్షణ సాకారమైనప్పుడే కులవ్యవస్థ రూపుమాసిపోతుందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జగ్గీవాసుదేవ్ అన్నారు. దేశంలోని యువత శక్తిమంతానికి ఈశా ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన యూత్ అండ్ ట్రూత్ (యువతా సత్యాన్ని తెలుసుకో) కార్యక్రమం గురించి వివరించేందుకు ఆయన ఆదివారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. ‘‘దేశంలోని పలు ప్రతిష్టాత్మక ఐఐటీ, ఐఐఎం కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో, మరోవైపు ఆన్‌లైన్లో ఇప్పటికే ఈ ప్రచారం ప్రారంభమైంది. మనదేశంలో 90 శాతంమంది యువత సరైన మార్గనిర్దేశనం, ప్రోత్సాహం లేక లక్ష్యం వైపు వెళ్లలేకపోతున్నారు. ఇలాంటి వారి సందేహాలు నివృత్తి చేసి, సంకల్పబలం నింపి వారి ని లక్ష్యానికి చేరువ చేసే కార్యక్రమాన్ని చేపట్టాం’అని జగ్గీ వివరించారు.
కుటుంబంలో పర్యవేక్షణ కొరవడటం వల్లే
కుటుంబంలో సరైన పర్యవేక్షణ కొరవడటం, సామాజిక పరిస్థితులను పిల్లలతో చర్చించకపోవడం వల్లే యువత మాదకద్రవ్యాలు, మానభంగాలు, ఇతర నేరప్రవృత్తికి అలవాటు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 300 ఏళ్ల క్రితం ప్రపంచంలోని ప్రతీ అన్వేషకుడు భారత్ చేరడం లక్ష్యంగా సముద్రయానం చేశారని, ప్రస్తుతం మన యువత దేశాలు దాటిపోతోందని ఆవేదన చెందారు. విద్యార్థులు వ్యవసాయ రంగంపైనా అవగాహన పెంచుకోవాలన్నారు. చేనేత పరిశ్రమను ప్రోత్సహించాలనీ, వారంలో ఒకరోజు ఖాదీ వస్త్రాలు ధరించాలన్నారు. స్కూలు పిల్లలకు ఖాదీ వస్త్రాలనే యూనిఫారంలుగా వాడాలన్నారు. కేరళ ఇప్పటికే ఈ విధానాన్ని అమలు చేస్తోందని, మిగిలిన రాష్ట్రాలూ ఆ బాటలో నడవాలని హితవుపలికారు.
చేనేత పరిరక్షణకు త్వరలోనే తాము అమెరికా, యూరోప్‌లో ప్రచారం చేస్తామన్నారు. సోమవారం పోచంపల్లిలో పర్యటించనున్నానని వెల్లడించారు. దేశంలో యువత ఆత్మహత్యలపై జగ్గీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గతేడాది 8,600 మంది యువత ఆత్మహత్యకు పాల్పడగా, అందులో 7వేలకుపైగా 15 ఏళ్లలోపు వారు ఉండటం ఆందోళన కలిగించిందన్నారు. తల్లిదండ్రులు పిల్లలతో స్నేహితులుగా ఉండాలన్నారు. తమ ఆశలను తీర్చేయంత్రాలుగా చూడకూడదని స్పష్టంచేశారు. ‘యువతా, సత్యాన్ని తెలుసుకో’కార్యక్రమాన్ని (ఇన్–హౌస్ ఈవెంట్) సెప్టెంబర్ 18న నల్సార్ ఆడిటోరియంలో నిర్వహించనున్నామన్నారు. ఆ తరువాత విద్యార్థులతో ‘‘వన్ నేషన్ – వన్ పోల్’’అనే అంశంపై చర్చ జరుపుతామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment