
జస్ట్ 145 ఏళ్లే..!
విడ్డూరం
ఎవడు బతికాడు మూడు యాభైలు అని సందేహపడ్డాడో కవివరేణ్యుడు. మరో ఐదేళ్లాగితే, ‘నేను బతికాను మూడు యాభైలు’ అంటాడేమో ఈ పెద్దాయన. ఈయన వయసు ఎంతో కాదు, జస్ట్ 145 ఏళ్లు మాత్రమే! అంటే, సెంచురీ దాటేయడమే కాదు, మరో హాఫ్ సెంచరీ దిశగా బతుకు పరుగు సాగిస్తున్నాడీయన. గిన్నెస్‌బుక్ వారు ఇంకా ఈ ఘనతను గుర్తించలేదు గాని, బహుశ ఈయనే ప్రపంచంలోకెల్లా అత్యంత వృద్ధుడు. ఇండోనేసియాలోని జావా దీవికి చెందిన ఎంబా గోథో అనే ఈ పెద్దాయన 1870 డిసెంబర్ 31న పుట్టాడట.
అందుకు ఆధారంగా అధికారులు ఎప్పుడో జారీ చేసిన గుర్తింపు కార్డు కూడా ఆయన వద్ద ఉంది. ఆయన మనవలు ఆ ఐడీ కార్డును ఫొటో తీసి ఆన్‌లైన్‌లో పెట్టడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆన్‌లైన్ పోస్టు ఆధారంగా వార్తలు కూడా రావడంతో జావా దీవిలోని స్రాగెన్ పట్టణ అధికారులు కూడా ఈ పెద్దాయన ఐడీ కార్డును ఇటీవలే తనిఖీ చేశారు. అయితే, పాత రికార్డులను తరచి చూసి, ఐడీ కార్డులోని వివరాలను అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉందని వారు చెబుతున్నారు. గోథో వివరాలను అధికారులు అధికారికంగా ధ్రువీకరిస్తే, ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘాయుష్కుడిగా ఈయన పేరు గిన్నెస్ రికార్డును బద్దలు కొట్టడం ఖాయం.
రెండో ప్రపంచ యుద్ధం నాటికి తన వయసు 74 ఏళ్లని చెబుతున్న ఈ పెద్దాయన.. తనకు ఇంకా మిగిలి ఉన్న కోరిక మరణం ఒక్కటేనని అంటున్నాడు. చూపు మందగించి, ఎక్కువగా తిరగలేని స్థితిలో ఉన్న ఈయన బాగోగులను మనవలు, మునిమనవలే చూసుకుంటున్నారు. గోథో నలుగురు భార్యలు, పది మంది పిల్లలు మరణించి చాలా కాలమే అయింది. ఇప్పుడు ఆయనకు ఉన్నవాళ్లంతా మనవలు, మునిమనవలు, ముమ్ముని మనవలు మాత్రమే.