స్వచ్ఛందం సేవకు వేళాయెరా | International Volunteer Day | Sakshi
Sakshi News home page

స్వచ్ఛందం సేవకు వేళాయెరా

Published Sun, Dec 4 2016 1:03 AM | Last Updated on Mon, Sep 4 2017 9:49 PM

స్వచ్ఛందం సేవకు వేళాయెరా

స్వచ్ఛందం సేవకు వేళాయెరా

ఇంటర్నేషనల్ వాలంటీర్ డే... స్వచ్ఛంద సేవలకు ఐక్యరాజ్యసమితి కిరీటం పెట్టిన రోజు. గుడ్డితాతను రోడ్డు దాటించడం, పనిమనిషి కూతురికి చదువుచెప్పడం, అనాథాశ్రమంలో బర్త్‌డే పార్టీ చేసుకోవడం, వృద్ధాశ్రమంలో పెళ్లి చేసుకోవడం, డాక్టర్‌గారు ఉచిత వైద్యం చేయడం, ఇంజనీర్ ఊరి చెరువు మీద బ్రిడ్జికి ఉచితంగా ప్లాన్ ఇవ్వడం, నిస్సహాయంగా ఉన్న గర్భిణిని ఆటోవాలా ఉచితంగా ఆస్పత్రికి తరలించడం, న్యాయవాదులు ఉచితంగా కేసు పోరాడటం, మందుల కంపెనీలు ఉచితంగా మందులు పంపిణీ చేయడం, జవాను తన సాహస గాథను వినిపించడం, ఒక ఆటగాడు ఉచితంగా శిక్షణ ఇవ్వడం, కరాటే మాస్టర్ ఆడపిల్లలకు ఆత్మరక్షణ నేర్పడం, శాస్త్రవేత్తలు రైతుకు కొత్త సాగు విధానం చూపడం, పోలీస్ మామ ట్రాఫిక్ నిర్వహణ నేర్పడం, గాయకుడు పాట పాడించడం, నర్తకుడు నాట్యం నేర్పడం, చిత్రకారుడు కుంచె పట్టించడం.... ఇలా మనందరిలోనూ ఇవ్వడానికి ఏదో ఒకటి ఉంటుంది. ఇస్తారని నమ్ముతున్నాం. స్వచ్ఛందాన్ని స్వచ్ఛఅందంగా మారుస్తారని నమ్ముతున్నాం.
 
 ‘ఎవరో వస్తారని... ఏదో మేలు చేస్తారని... ఎదురు చూసి మోసపోకుమా...’ అని పలికిన సినీ కవి వాక్కులు నిత్య సత్యాలు. ఎవరో వస్తారని... వచ్చిన వారు ఏదో చేస్తారని ఎదురు చూపులతోనే జీవితాన్ని గడిపేస్తే ఒరిగేదేమీ ఉండదు. ఎవరొచ్చినా, రాకున్నా మన వంతుగా మనం చేయగల పనిని, మనం చేయదగ్గ పనిని మనమే మొదలుపెట్టలేమా? ఎవరి కోసమో ఎదురు చూపులు చూడటం మానేసి నిస్సహాయ స్థితిలో ఉన్న ఇతరులకు సాయం చేయడానికి ఎవరికి వారే స్వచ్ఛందంగా ముందుకొస్తే జీవితంలో అంతకు మించినది ఏముంటుంది? సేవా సంకల్పమే మనసులోని స్వచ్ఛతకు తార్కాణం. జీవితంలోని అందానికి దర్పణం.
 
 ఇతరులకు సాయపడటానికి అర్థబలమో, అంగబలమో అక్కర్లేదు. చిత్తశుద్ధితో కూడిన సంకల్పం ఉంటే చాలు. నిస్సహాయతలో ఉన్న ఇతరులను ఆదుకోవాలనుకునే మనిషికి సంకల్పమే సగం బలం. ఇతరుల పట్ల ఔదార్యాన్ని, వదాన్యతను చాటుకోవడానికి అపర కుబేరులే కానక్కర్లేదు. ఇతరుల బాధలకు స్పందించే సహృదయం ఉంటే చాలు. పురాణాల్లో, చరిత్రలో ఇందుకు ఎన్నో ఉదంతాలు, ఉదాహరణలు. ‘పన్ను’పోటును తప్పించుకోవడానికో, కనీసం తగ్గించుకోవడానికో కార్పొరేట్ కుబేరులు ‘సామాజిక బాధ్యత’గా వదాన్యతను చాటుకోవడం మనకు తెలియనిదేమీ కాదు. అదంత పెద్ద విశేషమేమీ కాదు గానీ, రెక్కాడితే గానీ డొక్కాడని సామాన్యులు, ఆదాయంలో పెద్దగా మిగుల్చుకునే అవకాశమే లేని దిగువ మధ్యతరగతి మనుషులు ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా ఇతరుల మేలు కోసం చేస్తున్న గొప్ప గొప్ప పనులు అక్కడక్కడా మన దృష్టిలోకి రాకపోవు. ‘కార్పొరేట్’ వదాన్యతకు వచ్చినంత ప్రాచుర్యం సామాన్యుల సేవా కార్యక్రమాలకు రాకపోవచ్చు. అయితే, మనసున్న మనుషులకు స్ఫూర్తినివ్వడంలో సామాన్యులు చేపట్టే సేవా కార్యక్రమాలు తక్కువేమీ కాదు.
  
 ఉడుతే తొలి వాలంటీర్
 వాలంటీరింగ్ అనే క్రియా పదం నుంచి పుట్టిన వాలంటీర్ అనే ఇంగ్లిష్ పదం మనకు ఆధునిక యుగంలోనే పరిచయమైంది. వాలంటీరింగ్‌ను స్వచ్ఛంద సేవగా అనువదించుకున్నాం మనం. వాలంటీర్స్‌ను స్వచ్ఛంద సేవకులని కూడా అంటున్నాం. ‘పరోపకారార్థం ఇదం శరీరం’ అని మనసా వాచా నమ్మిన మన దేశంలో స్వచ్ఛంద సేవ ఒక అనాది సంస్కృతి. పురాణాలను పరిశీలిస్తే మనకు తెలిసిన తొలి వాలంటీర్ రామాయణంలోని ఉడుతే! సీతను బంధించిన రావణుడిపై యుద్ధానికి రాముడు సన్నద్ధమైనప్పుడు లంకకు చేరుకోవడానికి సముద్రంపై సేతువును నిర్మిస్తున్న వానరులకు ఉడుత చేసిన సాయం మనమంతా ఎరిగినదే! వానర యోధులంతా సేతు నిర్మాణం కోసం బండరాళ్లను తరలిస్తుంటే, ఉడుత తన వంతుగా ఇసుక రేణువులను తరలించింది. 
 
 సేతు నిర్మాణానికి సాయం చేసిన ఆ ఉడుత ఎలాంటి ప్రతిఫలాన్నీ ఆశించలేదు. పురాణాల్లో శిబి చక్రవర్తి, బలి చక్రవర్తి, కర్ణుడు మొదలైన దానశీలురు ఎందరున్నా, ప్రతిఫలాపేక్ష లేని స్వచ్ఛంద సేవ గురించి చెప్పుకోవాల్సి వస్తే మాత్రం రామాయణంలోని ఉడుతను మించిన ఉదాహరణ దొరకదు. ఎంత సాయం చేశామన్నది కాదు, సాయం చేయడానికి మన దగ్గర ఏముందన్నది కాదు, చేసిన సాయానికి ఎంత ప్రచారం దక్కిందన్నదీ కాదు... అవసరంలో ఉన్న వాళ్లకు సాయం చేశామా లేదా అనేదే ముఖ్యం. అవసరంలో, ఆపదలో ఉన్న ఇతరులకు సాయం చేయాలనే సంకల్పం మరింత ముఖ్యం.
 
 మన చరిత్రలో వెయ్యేళ్ల కిందటే...
 రామాయణంలోని ఉడుత సంగతి సరే, నిస్వార్థ స్వచ్ఛంద సేవకు సంబంధించి వెయ్యేళ్ల కిందటి మన చరిత్రలోనే మరో ఉదాహరణ ఉంది. క్రీస్తుశకం పదకొండో శతాబ్ది కాలంలో చోళ సామ్రాజ్యాన్ని పాలించిన రాజరాజ చోళుడు తంజావూరులో బృహదీశ్వర ఆలయ నిర్మాణాన్ని తలపెట్టాడు. దేశంలోనే అతిపెద్ద ఆలయాల్లో ఒకటైన ఈ ఆలయ నిర్మాణం పూర్తి కావడానికి దాదాపు ఎనిమిదేళ్లు పట్టింది. వందలాది మంది శ్రామికులు, శిల్పులు ఈ ఆలయ నిర్మాణంలో పాలు పంచుకున్నారు. యంత్ర పరికరాలేవీ అందుబాటులో లేని ఆ రోజుల్లో ఇంతటి బృహత్ నిర్మాణానికి వాళ్లంతా ఎంతటి కాయకష్టం చేసి ఉంటారో ఊహించుకోవాల్సిందే. కాయకష్టం చేస్తున్న ఆ శిల్పులకు, కార్మికులకు ఒక ముసలవ్వ తనవంతుగా ఏదైనా సాయం చేయాలనుకుంది. జీవనాధారానికి తగిన కొద్దిపాటి పాడిసంపద తప్ప ఏమీ లేని పేదరాలు ఆమె. అయితే, సాయం చేయాలనే ఆమె సంకల్పానికి పేదరికం అవరోధం కాలేదు. రోజూ అమ్ముకోగా మిగిలిన పాలను తోడుపెట్టి, మజ్జిగ చేసి ఆలయ నిర్మాణంలో పాలు పంచుకున్న కార్మికులకు, శిల్పులకు ఉచితంగా ఇచ్చి, అలసి సొలసిన వారి దాహార్తి తీర్చేదట. ఆనోటా ఈనోటా ఆమె సంగతి రాజరాజ చోళుడికి చేరింది. ముసలవ్వ చేస్తున్న సేవ గురించి తెలుసుకున్న రాజరాజ చోళుడు ముగ్ధుడయ్యాడు. ఆమె గౌరవార్థం ఆలయ ప్రాంగణంలో ఆమె విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు.
 
 చరిత్ర ప్రసిద్ధుల స్వచ్ఛంద సేవ
 ఇతరేతర రంగాలలో సుప్రసిద్ధులైన వారు కొందరు స్వచ్ఛంద సేవలో తరించిన ఉదంతాలు కొన్ని చరిత్రలో ఉన్నాయి. అమెరికా వ్యవస్థాపకులలో ఒకరైన బెంజమిన్ ఫ్రాంక్లిన్ యువకుడిగా ఉన్నప్పుడు ఫిలడెల్ఫియాలోని అగ్నిమాపక దళంలో కొన్నాళ్లు స్వచ్ఛంద సేవ చేశారు. అప్పట్లో స్వచ్ఛంద సేవ ఎక్కువగా వ్యక్తిగత స్థాయిలోనే ఉండేది. అలాంటి కాలంలో స్వచ్ఛంద సేవను తొలిసారిగా సంఘటితం చేసిన ఘనత ఇంగ్లాండ్‌కు చెందిన సర్ జార్జ్ విలియమ్స్‌కే దక్కుతుంది. కుర్రతనంలో అరాచకంగా గడిపినా, ఒక యాక్సిడెంట్ తర్వాత ఆయన పరివర్తన చెందాడు. చర్చికి వెళ్లడం మొదలుపెట్టాడు. చర్చికి వచ్చే వాళ్లలో నానా బాధలతో సతమతమయ్యే ఆర్తులు కూడా ఉండేవారు. వాళ్ల బాధలను తొలగించడానికి తన వంతుగా ఏదైనా చేయాలనుకున్నాడు జార్జి విలియమ్స్. ఆర్తులను ఆదుకునేందుకు స్వచ్ఛంద సేవ కొనసాగించేందుకు భావసారూప్యత గల తన తోటి యువకులు కొందరిని సంఘటితపరచి 1844లో యంగ్ మెన్స్ క్రిస్టియన్ అసోసియేషన్ (వైఎంసీఏ) స్థాపించాడు. కాలక్రమంలో వైఎంసీఏ ప్రపంచవ్యాప్తంగా శాఖోపశాఖలుగా విస్తరించి, నేటికీ తన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తోంది. ఫ్రాంక్లిన్ రూజ్‌వెల్ట్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నకాలంలో పర్యావరణ పరిరక్షణ కోసం 1933లో సివిలియన్ కన్జర్వేషన్ కాప్స్ స్థాపించి, 300 కోట్ల మొక్కలు నాటడానికి దోహదపడ్డారు. ఈ కార్యక్రమంలో పౌరులను భాగస్వాములుగా చేయడంలో ఆయన సఫలీకృతులయ్యారు. 
 
 
 సేవాపథంలో కొన్ని మైలురాళ్లు
 స్వచ్ఛంద సేవలో రెడ్‌క్రాస్ సంస్థను తిరుగులేని మైలురాయిగా చెప్పుకోవచ్చు. అంతర్యుద్ధంతో అమెరికా అట్టుడికిపోతున్న సమయంలో గాయపడ్డ సైనికులకు సపర్యలు చేసి, వారికి ఆసరాగా నిలవాలనుకుంది క్లారా బార్టన్. ఆమె సంపన్నురాలేమీ కాదు. టీచర్‌గా, పేటెంట్ క్లర్క్‌గా పనిచేసేది. క్షతగాత్రులకు, ఆపన్నులకు సేవ చేయాలనే ఆమె సంకల్పమే రెడ్‌క్రాస్ సంస్థ స్థాపనకు నాంది పలికింది. తొలుత అమెరికన్ రెడ్‌క్రాస్‌గా మొదలైన సంస్థ అచిరకాలంలోనే అంతర్జాతీయ స్థాయికి విస్తరించింది. క్లారా బార్టన్ తన అరవయ్యో ఏట... 1881లో రెడ్‌క్రాస్ సంస్థను స్థాపించింది. ప్రపంచవ్యాప్తంగా శాఖోపశాఖలుగా విస్తరించిన రెడ్‌క్రాస్ సంస్థ ఇప్పటికే సేవా కార్యక్రమాలలో ముందంజలో ఉంటోంది. ఎక్కడ ప్రకృతి విపత్తులు తలెత్తినా, ప్రమాదాలు సంభవించినా ఆపన్నులకు ఆసరాగా నిలుస్తోంది. మన దేశంలో మదర్ థెరిసా స్థాపించిన ‘మిషనరీస్ ఆఫ్ చారిటీ’ స్వచ్ఛంద సేవారంగంలో మరో మైలురాయి. ఎక్కడో అల్బేనియాలో పుట్టి, ఇక్కడకు వచ్చిన ఆమె డార్జిలింగ్‌లో కొన్నాళ్లు టీచర్‌గా పిల్లలకు పాఠాలు బోధించారు. తర్వాత నన్‌గా మారి కలకత్తాకు వచ్చారు. కలకత్తాకు వచ్చిన తర్వాత కూడా కొన్నాళ్లు కాన్వెంట్‌లో పిల్లలకు పాఠాలు బోధించారు. అదే కాలంలో బెంగాల్ కరువు, మత కల్లోలాలు కలకత్తాను కుదిపేశాయి. ఎక్కడ చూసినా ప్రజలు రోగాలతో, దుర్భర దారిద్య్రంతో అలమటించేవారు. వారిని చూసి చలించిన థెరిసా సేవామార్గం పట్టారు. అనాథలకు, ఆపన్నులకు తానే తల్లిగా మారారు. నిస్వార్థ సేవకు గుర్తింపుగా ఆమెను నోబెల్ శాంతి బహుమతితో పాటు పలు అంతర్జాతీయ అవార్డులు వరించాయి. మరణానంతరం ఆమెకు సెయింట్‌హుడ్ కూడా లభించింది.
 
 అపర అన్నపూర్ణ
 అన్ని దానాల కంటే అన్నదానమే గొప్పదంటారు. అలాంటి అన్నదానాన్ని తన జీవితాంతం కొనసాగించిన ‘అన్నపూర్ణ’ ఒకరు మన తెలుగునాటనే ఉండేవారు. ఆమె పేరు డొక్కా సీతమ్మ. శతాబ్ది కిందట గోదావరి ప్రాంతాల్లో ఆమె పేరు ఎరుగని వారు ఉండేవారు కాదు. ఇంటికి ఏ వేళలో అతిథి అభ్యాగతులు వచ్చినా, లేదనకుండా వండి వడ్డించేవారామె. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం మండలం మండపేట గ్రామంలో జన్మించారామె. ఆమె తండ్రి అనుపింది భవానీశంకరం. ఆయనను అందరూ ‘బువ్వన్నగారు’ అనేవారు. అడిగిన వారికి లేదనకుండా ‘బువ్వ’ పెట్టేవారు. అందుకే ఆయనకు ఆ పేరు వచ్చింది. లంకగన్నవరం గ్రామానికి చెందిన డొక్కా జోగన్న పంతులుతో వివాహమైంది. ఆయన భూవసతి గల రైతు, వేదపండితుడు, ఉదారుడు. సీతమ్మకు ఏనాడూ ఆంక్షలు పెట్టలేదాయన. సీతమ్మ దాతృత్వం ఇంగ్లాండు వరకు పాకింది. సొంత వనరులతోనే ఆమె సాగిస్తున్న సేవను తెలుసుకున్న అప్పటి బ్రిటిష్ చక్రవర్తి ఏడో జార్జి ఆమెను ఘనంగా సత్కరించాలనుకున్నారు. సన్మానం కోసం ఆమెను ఢిల్లీకి తోడ్కొని రావాల్సిందిగా అప్పటి మద్రాసు ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. సేవకు ప్రతిఫలం కోరనంటూ సన్మానానికి నిరాకరించిన నిరాడంబర వ్యక్తిత్వం ఆమెది. జీవితాంతం అన్నదాన యజ్ఞాన్ని కొనసాగించిన డొక్కా సీతమ్మను  గోదావరి జిల్లాల ప్రజలు ‘అపర అన్నపూర్ణ’గా ఇప్పటికీ భక్తిగా తలచుకుంటారు.
 
 బాల్యంలోనే పునాదులు వేయాలి
 పిల్లలకు చిన్నప్పటి నుంచే సేవానిరతిని అలవరచాలి. ఇతరులతో పంచుకోవడంలో ఉన్న ఆనందాన్ని వారికి బోధపరచాలి. ఇతరులకు సాయం చేయడంలో ఉన్న సంతృప్తిని వారికి వివరించాలి. మంచి పనులు చేయడానికి బాల్యంలోనే పునాదులు వేయాలి. అప్పుడే వారు బాధ్యత గల పౌరులుగా ఎదుగుతారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొనేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వారిని ప్రోత్సహించాలి. కొందరు పిల్లలు స్వతహాగానే ఇలాంటి కార్యక్రమాలపై ఆసక్తి చూపుతుంటారు. అలాంటి పిల్లలను మరింతగా ప్రోత్సహించండి. ఎలాంటి పనుల ద్వారా ఇతరులకు సాయం చేయవచ్చో వారికి మార్గదర్శకత్వం వహించండి. వ్యక్తిగత స్థాయిలో మనవంతుగా చేయగలిగే కొన్ని సేవా కార్యక్రమాలను మీ ముందు ఉంచుతున్నాం. ఇలాంటి ఆలోచనలతో మీరూ మీ వంతుగా స్వచ్ఛంద సేవ చేయవచ్చు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement