మధ్య ప్రదేశ్‌లో అనాథాశ్రయం పేరుతో జరుగుతున్న అరాచకాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఆశ్రమం నిర్వహిస్తున్న సిబ్బంది చిన్నారులను తీవ్ర వేధింపులకు గురిచేశారు. పసివాళ్లనే జాలి లేకుండా చిన్న చిన్న తప్పుల పేరుతో భయంకరంగా చిత్రహింసలకు గురిచేశారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ బృందం ఆకస్మిక తనిఖీలు చేపట్టడంతో ఈ బాగోతం బట్టబయలైంది.
ఇండోర్‌లోని అనాథ శరణాలయంలో సుమారు 21 మంది చిన్నారులు ఆశ్రయం పొందుతున్నారు. ఆ ఆశ్రమంలో గతవారం సీడబ్ల్యూసీ అధికారులు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. దీంతో అనాథ బాలలు తమ బాధలను, వేధింపులను అధికారులకు మొరపెట్టుకున్నారు. చిన్న చిన్న తప్పిదాలకే ఆశ్రమం సిబ్బంది తీవ్రంగా వేధించేవారని వాపోయారు.
‘చిన్నారులను తలకిందులుగా వేలాడదీయడం, వేడి ఐరన్ రాడ్‌తో కొట్టడం, బట్టలు తీసేసి ఫోటోలు తీయడం వంటివి చేసేవారు. ఎర్ర మిరపకాయలను కాల్చడం వల్ల వచ్చే పొగను కూడా పీల్చుకునేలా చేశారు’ అని అధికారులు తెలిపారు. మరీ దారుణంగా నాలుగేళ్ల పిల్లవాడు ప్యాంట్‌లో బాత్రూం వెళ్లాడని అతడిని రెండు మూడు రోజులు వాష్‌రూమ్‌లో బంధించి ఆహారం ఇవ్వకుండా వేధించినట్లు చెప్పారు.
సీడబ్ల్యూసీ అధికారుల ఫిర్యాదు మేరకు అయిదుగురు అనాథాశ్రయం సిబ్బందిపై కేసు నమోదైంది. అనాథ శరణాలయాన్ని వెంటనే సీజ్ చేశారు. చిన్నారులను ప్రభుత్వం షెల్టర్‌కు తరలించినట్లు ఇండోర్ ఏసీపీ అమరేంద్ర సింగ్ తెలిపారు. చిన్నారులపై వేధింపుల ఆరోపణలపై విచారణ జరుగుతున్నట్లు పేర్కొన్నారు.
కాగా హోంలోని పిల్లలు మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, ఒడిశా, మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన అనాథలుగా గుర్తించారు. అయితే ఆ అనాథశ్రమాన్ని వాత్సల్యపురం జైన్ ట్రస్ట్ నిర్వహిస్తోంది, దీనికి బెంగళూరు, సూరత్, జోధ్‌పూర్, కోల్‌కతాలో కూడా బ్రాంచ్‌లు ఉన్నాయి.
చదవండి: ప్రముఖ రియల్టర్ కార్తికేయ మ్యాడంపై కేసు నమోదు
Comments
Please login to add a commentAdd a comment