ఖమ్మం: మతిస్థిమితం లేక తల్లి ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఎక్కడా వెతికినా ఆచూకీ తెలియలేదు. చివరకు కాలిపోయిన స్థితిలో కనిపించిన మహిళ మృతదేహాన్ని తల్లిదిగానే భావించి కర్మకాండలు నిర్వహించారు. చివరకు యూ ట్యూబ్‌లో అనాథాశ్రమం వీడియోలను ఆమె కుమారుడు చూసే క్రమంలో తల్లి కనిపించడంలో ఆనందానికి పట్టపగ్గాలు లేకుండా పోయింది. దీంతో ఏపీ నుంచి వచ్చిన యువకుడు ఖమ్మం జిల్లా మధిరలోని ఆశ్రమం నుంచి తల్లిని తీసుకెళ్లాడు.
వివరాలు... ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం పుల్లూరు శివారు కొత్తగూడెంకు చెందిన నాగేంద్రమ్మకు భర్త తిరుపతయ్య, కుమారులు ముత్తయ్య, శ్రీనివాసరావు ఉన్నారు. అయితే, నాగేంద్రమ్మకు మతిస్థిమితం సరిగ్గా లేక రెండేళ్ల క్రితం ఇంట్లో నుంచి వెళ్లిపోవడంతో కుటుంబీకులు చుట్టుపక్కల వెతికారు. అప్పట్లో గ్రామ సమీపంలోని గుట్టపై కాలిపోయిన మహిళ మృతదేహం లభించడంతో నాగేంద్రమ్మదిగా భావించి కర్మకాండలు పూర్తిచేశారు. ఇటీవల నాగేంద్రమ్మ కుమారుడు ముత్తయ్య యూట్యూబ్‌లో విజయవాడకు చెందిన హెల్పింగ్ హాండ్స్ ఆధ్వర్యాన రూపొందించిన వీడియో చూశాడు.
ఈ వీడియో ఒక అనాథ శరణాలయం వివరాలు ప్రసారమవుతుండగా తల్లి కనిపించడంతో నిర్వాహకులకు ఫోన్ చేయగా ఖమ్మం జిల్లా మధిరలో ఆర్కే ఫౌండేషన్ చైర్మన్ దోర్నాల రామకృష్ణ, జ్యోతి ఆధ్వర్యాన నిర్వహిస్తున్న ఆశ్రమంగా తేలింది. ఈమేరకు నాగేంద్రమ్మ కుటుంబ సభ్యులు శుక్రవారం మధిరకు రాగా, ట్రెయినీ ఐపీఎస్ అవినాష్‌కుమార్ సమక్షాన ఆశ్రమం నిర్వాహకులు దోర్నాల రామకృష్ణ అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment