
ఆ వెలుగైనా... ఆ పరుగైనా...
ఇది ఊదితే ఆరిపోయేది కాదు. సుడి గాడ్పులు చుట్టూ విరుచుకుపడుతున్నా దీని సముత్థాన చైతన్యం తలవంచదు.
కవిత
- డా॥సి.నారాయణరెడ్డి
ఇది ఊదితే ఆరిపోయేది కాదు.
సుడి గాడ్పులు
చుట్టూ విరుచుకుపడుతున్నా
దీని సముత్థాన చైతన్యం తలవంచదు.
తాకితే కందిపోయే ఈ
తరుణ సుమ గుళుచ్ఛాలు
మండుటెండలోనైనా
తమ లాలిత్యాన్ని
అక్షతంగా నిలుపుకుంటాయి.
పోల్చి చూస్తే అది
నేలమీద కదిలిపోయే
మిణుగురు పురుగు తీరుగా వుంటుంది.
విడిదిని బట్టి అది
వియన్మండలంలో వెలిగే తారక.
ఠిఠిఠి
ఇది తవ్వితే బయటపడేది కాదు.
తనంత తాను పైకి ఉబికి వస్తే తప్ప.
జుట్టు నిమురుకుంటే ప్రతిసారీ
కొత్త కొత్త ఊహలు ఉబికిరావు.
సాగు చేసుకున్న మేధా క్షేత్రాన్ని బట్టి
పరిణత భావుకత
అపూర్వ భావ సస్యాలను పండిస్తుంది.
ఈడ్చుకుంటూ పోతే
పాదాలు నిలిచిపోయేవి
ఎటూ కాని చోట.
తెగించి దూకితే
ఆ గతి తీవ్రతకు జడుసుకుని
ఎక్కడోవున్న తీరం ఉరికొచ్చి
ఇక్కడ వాలుతుంది.
ఆరిపోని వెలుగు
ఆగిపోని పరుగు
ప్రకృష్ట లక్ష్య సఫలతకు
ప్రతీకలు.