చేయని హత్య
మల్లాది వెంకట కృష్ణమూర్తి క్రైమ్ కథలు - 1
అమెరికన్ చరిత్రకి చెందిన ఓ రహస్యం నాకు అనుకోకుండా తెలిసింది. దాని కోసం నేనెక్కడికీ వెళ్ళి వెదకలేదు. అది మా ఇంట్లోనే తెలిసింది. మేం చాలా తరాలుగా న్యూయార్క్‌లో నివసిస్తున్నాం. డిసెంబర్ 21, 1820న రిచర్డ్ హిల్‌లో వేలిక్ స్ట్రీట్‌లోని ఓ ఇంటిని మా తాతకి తాత ఏంథోనీ పోర్టర్ కొన్నాడు. దానికి ‘మార్టియర్ హౌస్’ అనే పేరు కూడా పెట్టాడు. న్యూయార్క్‌లోని డౌన్ టౌన్‌లో గల అతి కొద్ది పురాతన ఇళ్ళలో అదొకటి.
స్థానిక చట్టం ప్రకారం దాన్ని పడగొట్టకూడదు. లేకపోతే, ఈపాటికి అక్కడో స్కై స్క్రేపర్ వచ్చి ఉండేది.
ఆ రోజు నేను వంట గదిలోని చిమ్నీకి ఉన్న ఓ ఇటుక వదులవడం గమనించాను. దాన్ని సర్దడానికి తీస్తే దాని వెనక నాకు ఓ కవర్ కనిపించింది. తెల్ల రంగు కవర్ గోధుమ రంగులోకి మారడంతో అది పురాతన కవర్ అని గ్రహించాను. అందులోని ఉత్తరం ఎవరికి రాశారో కాని అది ఆ ఇంట్లోంచి ఎందుకనో బయటకి వెళ్లలేదు అని గ్రహించాను. రాసిన వారు దాన్ని అక్కడ ఎందుకు దాచారా అనుకుంటూ ఆ కవర్‌ని చింపి ఆసక్తిగా చదివాను.
జూలై 29, 1776న, న్యూయార్క్‌లోని లెఫ్టినెంట్ జనరల్ సర్ విలియం హోవే అనే బ్రిటిష్ సైనిక కమాండర్‌కి రాసినదా ఉత్తరం. బాతు ఈకతో దళసరి కాగితం మీద రాసిన ఆ ఉత్తరంలోని అక్షరాలు వెలిసిపోయినా, లేత తోపు రంగులో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ ఉత్తరం అమెరికన్ చరిత్రనే మార్చి వేన ఉదంతం గల ఉత్తరం అని దాన్ని చదవగానే నాకు అర్థమైంది.
ఎస్టీమ్డ్ అండ్ రెస్పెక్టెడ్ లెఫ్టినెంట్ జనరల్ సర్ విలియం హోవే... ఈ ఉత్తరం మీకు అందేసరికి తిరుగుబాటు దళాలకి నాయకత్వం వహించే జార్జి వాషింగ్టన్ మరణిస్తాడు. తల లేని పాము కొంతసేపు కొట్టుకున్నా దాని వల్ల ప్రమాదం ఎలా ఉండదో, అలా తిరుగుబాటు దళాలు కూడా ఇక ప్రమాదరహితం అవుతాయి. నేను కూడా చంపబడొచ్చు. ఐతే అది నాకూ, నా కుటుంబ సభ్యులకి మాత్రమే విషాదకరం. బ్రిటిష్ సామ్రాజ్యానికి మాత్రం ఇది ఆనందకరమవుతుంది.
జనరల్ వాషింగ్టన్ దగ్గర వంటవాడిగా పనిచేన నేను మీకు వారి పథకాలు, సైనికుల కదలికల గురించిన సమాచారం ఇస్తూ వస్తున్నాను. ఇప్పుడు బ్రిటిష్ రాజరికానికి గూఢచారిగా మరింత ప్రాముఖ్యం గల సేవని అందించబోతున్నాను. పంటి నొప్పితో బాధపడే వాషింగ్టన్ కొద్ది రోజులుగా ఒంటరిగా భోజనం చేస్తున్నాడు. ఈ రాత్రి ఆయనకి నేను ఉల్లిపాయలు, బంగాళదుంపలలో ఎద్దు మాంసం కలిపి వండే వంటకంలో ప్రాణాంతకమైన స్కార్లెట్ పండుని కలుపుతున్నాను.
వాషింగ్టన్ సాహని., యుద్ధ నిపుణుడు. మర్యాద గల మనిషి. తిరుగుబాటు దళాలన్నీ ఆయన్ని గౌరవిస్తాయి. అందువల్ల కింగ్ జార్జి పాలన ఇక్కడ కొనసాగడానికి వీలుగా అతని అడ్డంకిని తొలగించడానికి నేను ఈ రాత్రి తనని చంపుతున్నాను. ఈ ఉత్తరం మళ్ళీ పూర్తి చేస్తాను. పని పూర్తయింది. జనరల్ వాషింగ్టన్ భోజనం చేసి పడుకోడానికి వెళ్ళాడు. ఇక రేపు ఉదయం నిద్ర లేవడు. నేను ఈ ఇంట్లోంచి పారిపోయే అవకాశం లేదు. గట్టి కాపలా ఉంది.
రేపు వాషింగ్టన్ విషప్ర యోగంతో మరణించాడని తెలీగానే నన్ను తిరుగుబాటుదారులు చిత్రవధ చేసి చంపుతారు. నేను విషంతో మరణించడానికి ఇష్టపడను. ఉరి వేసుకోవడం కూడా నాకు ఇష్టం లేదు. నేను నిత్యం వంటలో ఉపయోగించే కార్వింగ్ నైఫ్‌ని ఉపయోగించి మరణించదలుచుకున్నాను. ఎందుకంటే దాని వినియోగంలో నేను నిపుణుడ్ని. నా భార్యాపిల్లల దక్షతని నేను కింగ్ జార్జికి వదిలి వెళ్తున్నాను. నా పేరు, గౌరవం నాశనమైనా సరే, నేను బ్రిటిష్ సామ్రాజ్యానికి చక్కటి సేవ చేశాననే తృప్తితో పోతాను.డియర్ సర్. ఉంటాను.
మీ విధేయుడు, గౌరవనీయమైన సేవకుడు - జాన్ బెయిలీ
అమెరికాలో ఓ ప్రముఖ రాజకీయవేత్త హత్య జరగడం ఒక్క జార్జి వాషింగ్టన్ విషయంలోనే సంభవించి ఉండేది. ఐతే ఆ తర్వాత జార్జి వాషింగ్టన్ 1799 దాకా, అంటే మరో ఇరవై మూడేళ్ళు జీవించాడని మనం పాఠాల్లో చదువుకున్నాం. వాషింగ్టన్ మీద హత్యాయత్నం జరిగిందని, ముఖ్యంగా జూలై, 1776లో జరిగిందని ఎక్కడా నమోదు కాలేదు. ఐనా జాన్ బెయిలీ తను చేయని హత్యకి ఫలితం అనుభవించాలనే భయంతో ఆత్మహత్య చేసుకున్నాడు! ఎందుకని?
సమాధానం తెలుసుకోడానికి నేను ఆసక్తిగా న్యూయార్క్ లైబ్రరీకి వెళ్ళి స్కార్లెట్ మొక్క గురించి లైబ్రేరియన్‌ని అడిగాను. ఆమె కొన్ని రిఫరెన్స్ పుస్తకాలని తిరగేశాక ఓ పుస్తకం ఇచ్చింది. ‘‘ఇందులో మీకు కావాల్సిన సమాచారం దొరుకుతుంది’’ అని చెప్పింది.
నేను ఓ మూలకి వెళ్ళి కూర్చుని దాని ఇండెక్స్‌ని చదివాను. స్కార్లెట్ ఫ్రూట్ వివరం కనిపించింది. వెంటనే ఆ పేజీని తిప్పాను. అక్కడ ఉన్న స్కార్లెట్ ఫ్రూట్ ఫొటోని కొద్ది క్షణాలు చూశాను. అమెరికాలో 1825 దాకా ఆ పండు విషపూరితం అని నమ్మేవారని రాసిన వాక్యం కూడా చదివాను. ఇప్పుడు ఆ నమ్మకం అబద్ధం అని అందరికీ తెలుసు. ఆ ఫొటోలో ఉన్నది ఒకప్పుడు స్కార్లెట్ ఫ్రూట్‌గా పిలవబడ్డ టొమేటో!
మూలం: రిచర్డ్ ఎంగార్డన్ కథ