గురి తప్పని గ్రామం!
మన ఊరు
ఉత్తరప్రదేశ్‌లో కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ అడుగడుగునా స్త్రీకి సంకెళ్లు కనిపిస్తాయి. ‘అమ్మాయిలు ఇల్లు దాటి బయటికి వెళ్లడం తప్పు’, ‘బహిరంగంగా నవ్వడం తప్పు’, ‘ఆటలు ఆడడం తప్పు’, ‘స్త్రీ వంటింటికే పరిమితం కావాలి’... ఇలా ఆలోచించే గ్రామాల్లో భగ్‌పట్ జిల్లాలోని జొహ్రీ ఒకటి.
జొహ్రీ గ్రామాన్ని గురించి చెప్పుకో వాల్సి వచ్చినప్పుడు ‘షూటింగ్‌కు ముందు... షూటింగ్‌కు తరువాత’ అని చెప్పుకోవాలి. ఆ గ్రామంలో రైఫిల్, పిస్టల్ షూటింగ్ అంటే అందరికీ ఎంతో ఆసక్తి. ‘జొహ్రీ రైఫిల్ క్లబ్’ పేరుతో గ్రామంలో షూటింగ్ రేంజ్‌నే ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఇదేమీ విశేషం కాదు. కానీ ఈ రైఫిల్ క్లబ్‌లో ఎప్పుడైతే స్త్రీలు పాదం మోపారో అప్పటి నుంచి విశేషమై కూర్చుంది. జాతీయంగా అంతర్జాతీ యంగా ఈ ఊరు అందరినీ ఆకర్షించడం మొదలైంది.నిజానికి ఒకప్పుడు ఈ ఊళ్లోని ఆడవాళ్లు ఇంటికే పరిమితమయ్యేవారు. వంట చేసుకోవడం, పశువుల్ని చూసుకో వడంతో సమయం గడిపేవారు. కానీ ప్రకాషి తోమర్ కారణంగా ఆ ఊరి ఆడవాళ్ల తలరాతే మారిపోయింది.
ఎలా మారింది?
‘జొహ్రీ రైఫిల్ క్లబ్’ ఎప్పుడూ షూటింగ్ ప్రాక్టీస్ చేసే పురుషులతో కళకళ లాడుతూ ఉండేది. ఒక్కోసారి వారితో పాటు పిల్లలు కూడా వెళ్తుండేవారు. ప్రకాషి తోమర్ మనవరాలు కూడా అలాగే వెళ్లింది. తనను ఇంటికి తీసుకురావడానికి ప్రకాషి తోమర్ క్లబ్‌కు వెళ్లింది. ఆమె వెళ్లేసరికి మనవరాలు సరదాగా ఓ పిస్టల్‌తో ఆడుతోంది. అది చూడగానే ప్రకాషికి కూడా సరదాగా తుపాకిని పేల్చాలనిపించింది. మనవరాలి చేతిలో ఉన్న పిస్టల్‌ను తీసుకుని సరదాగా గురి చూసి కాల్చింది. గురి తప్పలేదు! దాంతో ఆమెకు షూటింగ్ మీద విపరీతమైన ఆసక్తి పెరిగింది. కానీ తన ఆసక్తిని కుటుంబ సభ్యులెవరికీ తెలియనివ్వలేదు. తెలిస్తే ఏమంటారో ఆమెకు తెలుసు. అందుకే రహస్యంగా ప్రాక్టీస్ చేయసాగింది. ఆ తరువాత కొంతకాలానికి ధైర్యంగా ‘రైఫిల్ క్లబ్’కు వెళ్లడం మొదలు పెట్టింది. ఓ మహిళ అలా రావడం చూసి కొందరు ఆశ్చర్యపడ్డారు. కొందరు వెక్కిరించారు. కొందరు అభ్యంతరం తెలిపారు. కానీ ప్రకాషి లెక్క చేయలేదు. షూటింగ్ ప్రాక్టీస్ కొనసాగించింది.
అక్కడితో తృప్తి పడలేదు ప్రకాషి. ఊళ్లో సాటి మహిళలను కూడా ‘రైఫిల్ క్లబ్’కు తీసుకువెళ్లాలని ప్రయత్నించింది. కానీ వాళ్లంతా భయపడటంతో విఫలమైంది తోమర్. కానీ ఆమె వదిన చంద్రో మాత్రం ప్రకాషి బాటలో నడవడానికి ముందుకొచ్చింది. అంతలో ప్రకాషి తోమర్ వెటరన్ కేటగిరీలో పలు సార్లు నేషనల్ చాంపియన్‌గా నిలవడంతో మిగతా వారిలో కూడా మార్పు వచ్చింది. ‘మేము సైతం’ అంటూ వాళ్లంతా కూడా షూటింగ్ రేంజ్‌కు రావడం మొదలైంది. వాళ్ల పట్టుదల చూసి పురుషుల ఆలోచనల్లో సైతం మార్పు వచ్చింది.
ఒకప్పుడు షూటింగ్ రేంజ్‌లో పురుషులు తప్ప స్త్రీలు కనిపించేవారు కాదు.అలాంటిది ఇప్పుడు పురుషుల కంటే ఎక్కువగా స్త్రీలే కనిపిస్తున్నారు. మూడు తరాలుగా ఆ ఊరి ఆడపిల్లలు షూటింగ్‌లో ప్రావీణ్యులవుతున్నారు. జాతీయ స్థాయిలో బహమతులు సైతం గెలుచుకుంటూ ఊరికి పేరు తీసుకు వస్తున్నారు. ప్రకాషి కూతురు సీమా తోమర్ జాతీయస్థాయిలో 32, అంతర్జాతీయ స్థాయిలో 5 బంగారు పతకాలు అందుకుంది. పతకాలు, గుర్తింపు మాత్రమే కాదు... షూటింగ్ పుణ్యమా అని గ్రామానికి చెందిన అమ్మాయిలు ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ మొదలైన రంగాల్లో ఉద్యోగాలు కూడా సాధించగలిగారు. వీరు ఇదంతా సాధించడంలో ప్రకాషి తోమర్‌తో పాటు నీతూ షెరాన్ అనే ట్రెయినర్ సహకారం కూడా ఎంతో ఉంది.
ఈ విజయం గురించి అడిగినప్పుడు.. ‘‘ఇది నా ఒక్కదాని విజయం కాదు, మా ఊరి ఆడపిల్ల విజయం. మా ఊరిని ఇతర గ్రామాలు కూడా ఆదర్శంగా తీసుకుంటే.. స్త్రీ శక్తిని లోకానికి చాటవచ్చు’’ అంటుంది ప్రకాషి ఆనందంగా. ఆమె అన్నదని కాదు గానీ, ఇప్పటికే ఉత్తర ప్రదేశ్‌లోని ఎన్నో గ్రామాలు జొహ్రీని ఆదర్శంగా తీసుకుంటున్నాయి. విజయాలు సాధించాలని ఉవ్విళ్లూరుతున్నాయి.