our town
-
మా ఊరికి రావొద్దు!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/కొండపాక: ‘కాంగ్రెస్.. కమ్యూనిస్టు.. తెలుగుదేశం పార్టోళ్లూ మీ సాయం ఇగచాలు. ఊళ్లేకొచ్చి లేని గొళ్లెం పెట్టకుండ్రి.. మా ఊరికి రావొద్దు.. ఆగం జేయొద్దు. రాజకీయాలుంటే ఊరి బయటే చేసుకోండ్రి’ అని మల్లన్నసాగర్ ప్రాజెక్టు ముంపు గ్రామమైన ఎర్రవల్లివాసులు ప్రతిపక్ష పార్టీలకు నిర్మోహమాటంగా చెబుతున్నారు. వారిని గ్రామంలోకి రానివ్వొద్దని తీర్మానించారు. ఈ మేరకు ‘గ్రామంలోకి ప్రతిపక్షాలు రావద్దు’ అని పలకలపై రాసి మంగళవారం ఊరు చుట్టూ బోర్డులు పెట్టారు. ‘2013వ సట్టం ఒప్పుకొమ్మని ఆగమాగం జేస్తిరి. మీ మాటలు ఇని ఆగమైనం. ఇంక మా ఊరికొస్తే మంచిగుండదు. తపాస్‌పల్లి పోయొచ్చినం.. మీ సక్కదనం జూసొచ్చినం’ అని పేర్కొన్నారు. మల్లన్నసాగర్ ముంపుతో ఇప్పటికే ఆగమైన తమను కాంగ్రెస్, కమ్యూనిస్టు, టీడీపీలు రెచ్చగొడుతున్నాయని వాపోయారు. 123 జీఓ తమకు నచ్చిందని, మంత్రి హరీశ్ మాటలపై నమ్మకం ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. ప్రతిపక్షాల రాజకీయాల వల్లే కలసి మెలసి ఉంటున్న ఎర్రవల్లిలో గొడవలవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. లాఠీచార్జిలో గాయపడిన వేములఘాట్ ముంపు గ్రామస్తులను పరామర్శించడానికి సోమవారం కాంగ్రెస్ నాయకులు వెళ్లబోతే తమ ఊరిగుండా వెళ్లొద్దంటూ ఎర్రవల్లి ప్రజలు పొలిమేరలో కంప అడ్డం వేశారు. ప్రతిపక్షాలకు పరాభవం తప్పదు ఎర్రవల్లి ప్రజలకు కృతజ్ఞతలు. మిగతా గ్రామాల్లో కూడా ప్రతిపక్ష పార్టీలకు పరాభవం తప్పదు. సిద్దిపేట నియోజకవర్గం ఇమాంబాద్, అనంతగిరి ప్రాజెక్టుల కింద భూ సేకరణను సైతం కొన్ని దుష్టశక్తులు అడ్డుకోవాలని చూశారుు. ఇమాంబాద్ రిజర్వాయర్ విషయంలో 120 రోజులు టెంటు వేస్తే వీళ్లు వచ్చి ఒకటే రెచ్చగొట్టుడు. కానీ 120 రోజుల తరువాత ఏం జరిగింది? నేను పోయి అదే టెంటు కింద కూర్చున్న. ఉన్న విషయాలు చెప్పి ఒప్పిం చిన. నిజంగా చెప్పాలంటే రైతులపై ముఖ్యమంత్రికి ఉన్న ప్రేమ ఈ వచ్చిపో యే నాయకులకు ఉంటదా? ఒక్కరోజు బాగోతంగాళ్లు వాళ్లు. ఇయ్యాల ఒస్తరు రేపు పోతరు. నేను మళ్లీ చెప్తున్నా.. ముం పు గ్రామాల ప్రజలను కడుపుల పెట్టుకొని చూసుకుంటా. - మంత్రి హరీశ్‌రావు -
మార్పెరుగని ఊరు... మలానా!
మన ఊరు ‘కాలంతో పాటు ఆధునిక లక్షణాలను సంతరించుకోవడం, ప్రపంచానికి చేరువ కావడం నేటి గ్రామాల లక్షణం’ అనేది ఒక సూత్రీకరణ. అయితే మలానా గ్రామాన్ని దీని నుంచి కచ్చితంగా మినహాయించాలి. హిమాచల్‌ప్రదేశ్‌లోని కులు జిల్లాలో పార్వతీ లోయను ఆనుకొని ఉంది మలానా గ్రామం. ప్రపంచం అంతా ఓ దారిలో సాగుతుంటే... మలానా మాత్రం మరో దారిలో సాగుతోంది. భవబంధాలకు దూరంగా, ఏకాంత దీవిలో తపస్సు చేసుకుంటున్న ముని పుంగవుడిలా ఓ కొండమీద కనిపిస్తుంది మలానా. ఇది ప్రపంచంలోని తొలి ప్రజాస్వామిక గ్రామాల్లో ఒకటి. దీని గురించి ఎన్నో కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఓసారి జమదగ్ని శివుడి కోసం కఠోర తపస్సు చేశాడట. అందుకు మెచ్చి ప్రత్యక్షమైన శివుడు ‘ఏం కావాలో కోరుకో’ అన్నాడట. ‘ప్రశాంతంగా ఉండే చోటు, ప్రకృతి ఒడిలో ఉన్నట్టుగా ఊళ్లో ఉండాలని ఉంది’ అని జమదగ్ని అడిగితే, మలానాను సృష్టించి ఇచ్చాడట. అయితే శివుడు కాదు, అలెగ్జాండర్ సైనికుల వారసులు ఈ గ్రామాన్ని నిర్మించారనేది మరో కథనం. కానీ కొందరు దాన్ని అంగీ కరించరు. అలెగ్జాండర్ సైనికుల వారసులు మలానాలో కాదు, పాకిస్తాన్‌లోని కలాష్ లోయ సమీపంలో ఆశ్రయం పొందారు అంటారు వారు. ఈ ఊరి తీరే వేరు... మలానాకి చాలా విశేషాలున్నాయి. ఆ గ్రామ పాలన, సామాజిక నిర్మాణం ప్రజాస్వామికంగా ఉంటాయి. గ్రామ కౌన్సిల్లో ఉండే పదకొండుమంది సభ్యులు పాలనా వ్యవహారాలను పర్య వేక్షిస్తారు. ఈ సభ్యులను తమ గ్రామ దేవత ‘జంబ్లూ’కి ప్రతినిధులుగా భావి స్తారంతా. అలాగే గ్రామంలో దిగువ న్యాయస్థానం, ఎగువ న్యాయస్థానం ఉంటాయి. దిగువ కోర్టులో న్యాయం జరగలేదంటే ఎగువ కోర్టుకు వెళ్లొచ్చు. మలానాకి ప్రభుత్వంతో ఎటువంటి సంబంధం ఉండదు. ప్రభుత్వం ఇచ్చే పథకాలు అవసరం లేదు. ప్రభుత్వ ప్రతినిధులు వచ్చి ఏదైనా చెప్పబోయినా గ్రామస్తులు వినరు. తమకు నచ్చిన రీతి లోనే జీవిస్తారు. నిజానికి ఈ ఊళ్లో ప్రభుత్వ పాఠశాల ఉంది. వందమంది పిల్లలు చదువుకుంటున్నారు కూడా. కానీ అంతకుమించి ప్రభుత్వం ఇంకే విష యంలో జోక్యం చేసుకున్నా వీరికి నచ్చదు. అది మాత్రమేనా... తమ గ్రామానికి చెందని వ్యక్తులు చేసే వంటకాలను వీరు స్వీకరించరు. తమ గ్రామానికి చెందని వారిని వివాహం చేసుకోరు. పిల్లలకు పేర్లు పెట్టడంలో కూడా వీరికి తమదైన ప్రత్యేకత ఉంది. పుట్టిన రోజును బట్టి పేర్లు పెడతారు. ఆదివారం పుట్టినవారికి అహ్త అని, సోమవారం పుట్టిన వారికి సౌనరు అని, మంగళవారం పుట్టిన వారికి మంగల్ అని... ఇలాంటి పేర్లే పెడతారు. దాంతో ఒకే పేరు గలవాళ్లు చాలామంది కనిపిస్తూ ఉంటారు. ఇక ఈ ఊరివారు మాట్లాడే భాష కనషీ. ఈ భాషలో సంస్కృత పదాలు ఎక్కువ ఉంటాయి. టిబెటన్ భాషల ప్రభావమూ కనిపిస్తుంది. అతి ప్రాచీనమైన ఈ భాషను ఆ గ్రామస్తులు తప్ప ఇతరులు అర్థం చేసుకోవడం కష్టం! ఇలా ప్రతి విషయంలో స్వతంత్రంగా ఉండటం, తమ సొంత విధానాలను ఫాలో అవకం చూసే మలానాని కొందరు ‘ద రిపబ్లిక్ ఆఫ్ మలానా’ అని కూడా పిలుస్తుంటారు. అడుగడుగునా ఔషధాలు... మలానా లోయలో మహిమాన్విత మైన ఔషధాలున్నాయని అందరూ అంటుంటారు. ఓసారి అనారోగ్యానికి గురైన అక్బర్ చక్రవర్తికి ఎవరో మలానా మహత్తు గురించి చెప్పారట. దాంతో ఆయన ఈ గ్రామాన్ని వెదుక్కుంటూ వచ్చాడట. ఇక్కడి ఔషధాలు వాడగా... కొద్ది కాలంలోనే ఆయన వ్యాధి నయమైందట. అయితే అవన్నీ నిజమో కాదో తెలుసుకునే అవకాశం ఎవరికీ ఇవ్వరు మలానా గ్రామస్తులు. సందర్శకులను అనుమతించినా ఎవరినీ చెట్ల మీద చేయి కూడా వేయనివ్వరు. ఇన్నేళ్లలో ఏ మాత్రం మారని మలానా ఇంకా ఎన్నాళ్లు ఇలా తన ప్రత్యేకతను చాటుకుంటుందో వేచి చూడాలి మరి! -
గురి తప్పని గ్రామం!
మన ఊరు ఉత్తరప్రదేశ్‌లో కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ అడుగడుగునా స్త్రీకి సంకెళ్లు కనిపిస్తాయి. ‘అమ్మాయిలు ఇల్లు దాటి బయటికి వెళ్లడం తప్పు’, ‘బహిరంగంగా నవ్వడం తప్పు’, ‘ఆటలు ఆడడం తప్పు’, ‘స్త్రీ వంటింటికే పరిమితం కావాలి’... ఇలా ఆలోచించే గ్రామాల్లో భగ్పట్ జిల్లాలోని జొహ్రీ ఒకటి. జొహ్రీ గ్రామాన్ని గురించి చెప్పుకో వాల్సి వచ్చినప్పుడు ‘షూటింగ్‌కు ముందు... షూటింగ్‌కు తరువాత’ అని చెప్పుకోవాలి. ఆ గ్రామంలో రైఫిల్, పిస్టల్ షూటింగ్ అంటే అందరికీ ఎంతో ఆసక్తి. ‘జొహ్రీ రైఫిల్ క్లబ్’ పేరుతో గ్రామంలో షూటింగ్ రేంజ్‌నే ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఇదేమీ విశేషం కాదు. కానీ ఈ రైఫిల్ క్లబ్లో ఎప్పుడైతే స్త్రీలు పాదం మోపారో అప్పటి నుంచి విశేషమై కూర్చుంది. జాతీయంగా అంతర్జాతీ యంగా ఈ ఊరు అందరినీ ఆకర్షించడం మొదలైంది.నిజానికి ఒకప్పుడు ఈ ఊళ్లోని ఆడవాళ్లు ఇంటికే పరిమితమయ్యేవారు. వంట చేసుకోవడం, పశువుల్ని చూసుకో వడంతో సమయం గడిపేవారు. కానీ ప్రకాషి తోమర్ కారణంగా ఆ ఊరి ఆడవాళ్ల తలరాతే మారిపోయింది. ఎలా మారింది? ‘జొహ్రీ రైఫిల్ క్లబ్’ ఎప్పుడూ షూటింగ్ ప్రాక్టీస్ చేసే పురుషులతో కళకళ లాడుతూ ఉండేది. ఒక్కోసారి వారితో పాటు పిల్లలు కూడా వెళ్తుండేవారు. ప్రకాషి తోమర్ మనవరాలు కూడా అలాగే వెళ్లింది. తనను ఇంటికి తీసుకురావడానికి ప్రకాషి తోమర్ క్లబ్‌కు వెళ్లింది. ఆమె వెళ్లేసరికి మనవరాలు సరదాగా ఓ పిస్టల్‌తో ఆడుతోంది. అది చూడగానే ప్రకాషికి కూడా సరదాగా తుపాకిని పేల్చాలనిపించింది. మనవరాలి చేతిలో ఉన్న పిస్టల్‌ను తీసుకుని సరదాగా గురి చూసి కాల్చింది. గురి తప్పలేదు! దాంతో ఆమెకు షూటింగ్ మీద విపరీతమైన ఆసక్తి పెరిగింది. కానీ తన ఆసక్తిని కుటుంబ సభ్యులెవరికీ తెలియనివ్వలేదు. తెలిస్తే ఏమంటారో ఆమెకు తెలుసు. అందుకే రహస్యంగా ప్రాక్టీస్ చేయసాగింది. ఆ తరువాత కొంతకాలానికి ధైర్యంగా ‘రైఫిల్ క్లబ్’కు వెళ్లడం మొదలు పెట్టింది. ఓ మహిళ అలా రావడం చూసి కొందరు ఆశ్చర్యపడ్డారు. కొందరు వెక్కిరించారు. కొందరు అభ్యంతరం తెలిపారు. కానీ ప్రకాషి లెక్క చేయలేదు. షూటింగ్ ప్రాక్టీస్ కొనసాగించింది. అక్కడితో తృప్తి పడలేదు ప్రకాషి. ఊళ్లో సాటి మహిళలను కూడా ‘రైఫిల్ క్లబ్’కు తీసుకువెళ్లాలని ప్రయత్నించింది. కానీ వాళ్లంతా భయపడటంతో విఫలమైంది తోమర్. కానీ ఆమె వదిన చంద్రో మాత్రం ప్రకాషి బాటలో నడవడానికి ముందుకొచ్చింది. అంతలో ప్రకాషి తోమర్ వెటరన్ కేటగిరీలో పలు సార్లు నేషనల్ చాంపియన్‌గా నిలవడంతో మిగతా వారిలో కూడా మార్పు వచ్చింది. ‘మేము సైతం’ అంటూ వాళ్లంతా కూడా షూటింగ్ రేంజ్‌కు రావడం మొదలైంది. వాళ్ల పట్టుదల చూసి పురుషుల ఆలోచనల్లో సైతం మార్పు వచ్చింది. ఒకప్పుడు షూటింగ్ రేంజ్లో పురుషులు తప్ప స్త్రీలు కనిపించేవారు కాదు.అలాంటిది ఇప్పుడు పురుషుల కంటే ఎక్కువగా స్త్రీలే కనిపిస్తున్నారు. మూడు తరాలుగా ఆ ఊరి ఆడపిల్లలు షూటింగ్లో ప్రావీణ్యులవుతున్నారు. జాతీయ స్థాయిలో బహమతులు సైతం గెలుచుకుంటూ ఊరికి పేరు తీసుకు వస్తున్నారు. ప్రకాషి కూతురు సీమా తోమర్ జాతీయస్థాయిలో 32, అంతర్జాతీయ స్థాయిలో 5 బంగారు పతకాలు అందుకుంది. పతకాలు, గుర్తింపు మాత్రమే కాదు... షూటింగ్ పుణ్యమా అని గ్రామానికి చెందిన అమ్మాయిలు ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ మొదలైన రంగాల్లో ఉద్యోగాలు కూడా సాధించగలిగారు. వీరు ఇదంతా సాధించడంలో ప్రకాషి తోమర్‌తో పాటు నీతూ షెరాన్ అనే ట్రెయినర్ సహకారం కూడా ఎంతో ఉంది. ఈ విజయం గురించి అడిగినప్పుడు.. ‘‘ఇది నా ఒక్కదాని విజయం కాదు, మా ఊరి ఆడపిల్ల విజయం. మా ఊరిని ఇతర గ్రామాలు కూడా ఆదర్శంగా తీసుకుంటే.. స్త్రీ శక్తిని లోకానికి చాటవచ్చు’’ అంటుంది ప్రకాషి ఆనందంగా. ఆమె అన్నదని కాదు గానీ, ఇప్పటికే ఉత్తర ప్రదేశ్‌లోని ఎన్నో గ్రామాలు జొహ్రీని ఆదర్శంగా తీసుకుంటున్నాయి. విజయాలు సాధించాలని ఉవ్విళ్లూరుతున్నాయి. -
ఊరంతా ఒకే కుటుంబం
మన ఊరు అదేదో సినిమాలో ‘మానవా మానవా’ అని పిలిస్తే ‘మానను గాక మానను’ అంటాడో తాగుబోతు. ఆ ఊళ్లో ఒకప్పుడు అలాంటి దృశ్యాలు ఎటు చూసినా కని పించేవి. వేళా పాళా లేకుండా మందు బాబులు ఊరి మీద పడేవాళ్లు. పనీ పాటా మానేసి మందులోనే మునిగి తేలేవారు. కానీ ఇప్పుడు అక్కడ మందు వాసనే రావట్లేదు. మందు అన్న పేరే వినబడ ట్లేదు. ఉన్నట్టుండి ఆ గ్రామంలో అంత మార్పు ఎలా వచ్చింది?! మన దేశంలోని అనేక కుగ్రామాలలో లాగే మహారాష్ట్రలోని కతేవాడిలో కూడా సరియైన రోడ్లు ఉండేవి కాదు. డ్రైనేజీ వ్యవస్థ సరిగా ఉండేది కాదు. మద్య పానం, ధూమపానం, జూదం మొదలైన వ్యసనాలు గ్రామాన్ని పట్టి పీడించేవి. అయితే ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్’ ఈ ఊరిని దత్తత తీసుకున్న తరువాత పరిస్థితిలో పూర్తి మార్పు వచ్చింది. దుర్వ్యసనాల గ్రామం ఇప్పుడు ఆదర్శ గ్రామంగా ప్రశంసలందుకుంటోంది! ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్’ వారు అడుగుపెట్టేసరికి కతేవాడి పరిస్థితి భయంకరంగా ఉంది. గ్రామంలో డెబ్భై శాతం మంది మద్యానికి బానిసలై పోయారు. పని చేయకపోవడంతో సంపా దన ఉండేది కాదు. ఎక్కడ చూసినా పేద రికం. దానికి తోడు ఊళ్లో ఏ సౌకర్యాలూ ఉండేవి కాదు. ఈ పరిస్థితిని మార్చడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఊరిలో చాలా సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు ఏర్పాటయ్యాయి. వీటిలో గ్రామస్తులందరినీ సభ్యులుగా చేర్చుకున్నారు. వారికి మద్యాన్ని దూరం చేశారు. బాధ్యతగా ఎలా నడుచుకోవాలో నేర్పారు. దాంతో ఒకప్పుడు గ్రామంలో మద్యం మీద రోజుకు వంద నుంచి రెండు వందల రూపాయల వరకు ఖర్చు చేసిన వాళ్లు కాస్తా ఇప్పుడు ఆ మొత్తాన్నీ ఇంటి కోసం, ఊరి కోసం వినియోగిస్తున్నారు. అలాగే ‘యస్హెచ్జీ’ల పుణ్యమా అని గ్రామంలో వడ్డీవ్యాపారం తగ్గిపోయింది. గ్రామస్తుల ఆర్థికస్థాయి మెరుగుపడింది. ప్రతి వ్యక్తీ స్థానిక బ్యాంకులో కొంత సొమ్మును డిపాజిట్ చేస్తున్నారు. ప్రతి ఇంటా సంపద చేరింది. ప్రతి కుటుంబంలో సంతోషం నెలకొంది. అందరి ఇళ్లలోనూ మరుగుదొడ్లతో పాటు అన్ని సౌకర్యాలూ ఉన్నాయి. ఊరిలో చక్కని రోడ్లు ఉన్నాయి. విద్యుత్ ఉంది. డ్రైనేజీ వ్యవస్థ ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ప్రజల్లో ఐకమత్యం ఉంది. ‘మద్యం ముట్టను’, ‘పొగ తాగను’ అని గ్రామస్తులందరూ ప్రమాణం చేశారు. ఊరి యువకులు ఒక భారీ ర్యాలీ నిర్వహించి ఇళ్లు, దుకాణాల్లో ఉన్న సిగరెట్లు, చుట్టలు, బీడీలు, మద్యం అన్నిటినీ సేకరించి దహనం చేశారు. అందుకే ఇప్పుడు కతేవాడిలో మద్యం దుకాణాలుకానీ, తాగేవాళ్లు కానీ కనిపించరు. శుభ్రత విషయంలో కూడా కతేవాడి తన ప్రత్యేకతను చాటుకుంటోంది. గ్రామస్తులంతా కలిసి వీధులు, బహిరంగ ప్రదేశాలు, దేవాలయాలు మొదలైన ప్రదేశాలను శుభ్రం చేస్తుంటారు. భారీ ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం కూడా విజయవంతం అయింది. ఈ అభివృద్ధికి గాను ప్రభుత్వం నుంచి ‘నిర్మల్ గ్రామ్ అవార్డ్’ను, ‘సంత్ గాడ్గెబాబా’ అవార్డ్ కూడా అందుకుంది కతేవాడి. ఇదంతా ఎలా సాధ్యపడింది అని అడిగితే... ‘‘ఒకప్పుడు ఊళ్లో మా ఇల్లుంది అనుకునేవాళ్లం. ఇప్పుడు ఊరినే మా ఇల్లు అనుకుంటున్నాం. ఊరు అభివృద్ధి చెందితే మేము అభివృద్ధి చెందినట్లే కదా’’ అని చెప్తారు ఆ గ్రామస్తులు ఉద్వేగంగా. వారిని ఆదర్శంగా తీసుకుంటే ప్రతి గ్రామమూ ఆదర్శ గ్రామమౌతుంది! కతేవాడిలో చెప్పుకోదగ్గ మరో విశేషం ‘దాన్ పేటి’. షాప్కీపర్ లేకుండా షాప్‌ను నడిపే పథకం ఇది. ఈ షాప్‌లో తక్కువ ధరకే నాణ్యత కలిగిన సరుకులు ఉంటాయి. ప్రజలు తమకు కావలసినవి తీసుకొని దాని వెల ఎంతో ఆ సొమ్మును ‘దాన్ పేటీ’ అనే క్యాష్‌బాక్స్‌లో వేస్తారు. దాన్ని ఊరి బాగుకై వినియోగిస్తారు. -
గ్లోబల్ గోకులం!
మన ఊరు ‘యానిమల్ హాస్టల్’ విషయంలోనే కాదు... ‘డిజిటల్ విలేజి’గా కూడా అకోదరకు పేరు ఉంది. ‘క్యాష్‌లెస్’, ‘కాంప్రహెన్సివ్’, ‘కనెక్టెడ్’ అనే మూడు విషయాల ఆధారంగా ఈ ‘డిజిటల్ విలేజ్’ ఆలోచన రూపుదిద్దుకుంది. ‘యానిమల్ హాస్టల్’తో ప్రపంచ దృష్టిని ఆకర్షించింది అకోదర. గుజరాత్ రాష్ట్రం లోని హిమ్మత్‌నగర్ జిల్లాలో ఉంది ఈ గ్రామం. ‘యానిమల్ హాస్టల్’ పుణ్యమా అని ఈ గ్రామ ప్రజల జీవితాల్లో కొత్త వెలుగు వచ్చింది. గ్రామ ఆదాయం పెరిగింది. అసలింతకీ ఏమిటీ యానిమల్ హాస్టల్?! యజమాని అంటూ ఒకరు ఉన్నా సరే, ఒకప్పుడు అకోదరలో ఆవులు, గేదెలు ఎవరికీ పట్టని అనాథల్లా తిరుగుతుండేవి.మేత కోసం ఎటెటో వెళుతూ అవి ఊరు కూడా దాటిపోయేవి. అదృష్టం బాగుంటే వాటి ఆచూకీ దొరికేది. లేకపోతే దొంగల పాలయ్యేవి. ఆ పరిస్థితిని తప్పించడానికి ఏర్పడిందే యానిమల్ హాస్టల్. గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడి ఉన్నప్పుడు ఆయన ఆలోచనల్లో నుంచి పుట్టింది ఈ ‘యానిమల్ హాస్టల్’. ఈ హాస్టళ్ల ద్వారా గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడంతో పాటు, పశువుల ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టవచ్చునని మోడి ఆలోచించారు. ఆయన వినూత్న ఆలోచన వృథా పోలేదు అనడానికి అకోదర గ్రామమే ఉదాహరణ. ‘‘మాకు రెండు గేదెలు ఉన్నాయి. ఇంటి పనులు, పొలం పనుల్లో పడి వాటి గురించి పట్టించుకునేవాళ్లమే కాదు. అవి ఏం తింటున్నాయి, ఎలా తింటున్నాయి, ఆరో గ్యంగా ఉన్నాయా... ఏ విషయంపైనా శ్రద్ధ పెట్టేవాళ్లం కాదు. మా ఊరికి యానిమల్ హాస్టల్ వచ్చిన తరువాత పరిస్థితిలో పూర్తిగా మార్పు వచ్చింది. హాస్టల్వాళ్లు మా పశువుల్ని కన్నబిడ్డల్లా చూసుకుంటున్నారు’’ అంటాడు ఆనంద్ అనే రైతు. కేవలం పశువుల్ని రక్షించడమే కాదు, వాటి పేడను వర్మీకంపోస్ట్, బయో గ్యాస్ కోసం వినియోగిస్తున్నారు. వర్మీ కంపోస్ట్ అమ్మకాల ద్వారా వచ్చిన సొమ్మును గ్రామసంక్షేమం కోసం ఖర్చు చేస్తున్నారు. ‘యానిమల్ హాస్టల్’ మొదలైన కొత్తలో గ్రామస్థులు ఆసక్తి చూపలేదు. దాంతో ఊళ్లో పశువులు 900 ఉంటే, హాస్టల్లో 3 మాత్రమే ఉండేవి. అయితే తక్కువ కాలంలోనే హాస్టల్ ప్రయోజనాల గురించి అందరికీ తెలిసిరావడంతో ఇప్పుడు గ్రామ పశుసంపదకు ‘యానిమల్ హాస్టల్’ కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. 36 షెడ్లు, లక్ష లీటర్ల సామర్థ్యం ఉన్న నీళ్ల ట్యాంక్ వంటి సౌకర్యాలు ఉన్న ఈ హాస్టల్ పుణ్యమా అని పాల ఉత్పత్తి పెరి గింది. ‘‘హాస్టల్‌కు ముందు లక్షల్లో ఉన్న పాల ఆదాయం, హాస్టల్ తరువాత కోటి దాటింది’’ అని అకోదర మిల్క్ ఫెడరేషన్ అన్నదంటే అభివృద్ధి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాగే హాస్టల్లోని ‘గోబర్ బ్యాంకు’ ద్వారా విద్యుత్‌ను కూడా ఉత్పత్తి చేస్తున్నారు. ‘యానిమల్ హాస్టల్’ విషయంలోనే కాదు... ‘డిజిటల్ విలేజి’గా కూడా అకోదరకు పేరు ఉంది. ‘క్యాష్‌లెస్’, ‘కాంప్రహెన్సివ్’, ‘కనెక్టెడ్’ అనే మూడు విషయాల ఆధారంగా ఈ ‘డిజిటల్ విలేజ్’ ఆలోచన రూపుదిద్దుకుంది. ఊళ్లో ప్రతి వ్యక్తికీ బ్యాంక్ అకౌంట్ ఉంది. ‘ఎస్.ఎం.ఎస్. బ్యాంకింగ్ ఫ్లాట్‌ఫాం’ అందుబాటులో ఉంది. ఒక్క ఎస్సెమ్మెస్ ద్వారా బ్యాలెన్స్ ఎంక్వయిరీ, మినీ స్టేట్మెంట్, ఫండ్ ట్రాన్స్ఫర్, మొబైల్ రీచార్జి మొదైలైన పనులన్నీ చేసుకోవచ్చు. ఐసీఐసీఐ బ్యాంకు ఈ ఊరి పేరు మీద ఒక వెబ్‌సైట్‌ను, ఫేస్బుక్ పేజీని మొదలు పెట్టింది. ఇక ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘వై-ఫై’ టవర్ ఇంటర్నెట్ను ప్రజలకు అందుబాటులో తెచ్చింది. ఇ-హెల్త్ సెంటర్, వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్లు కూడా ఈ ఊరి ప్రత్యేకతను చాటు తున్నాయి. ‘‘ఈ ఊరిని చూస్తే... గ్రామీణ ప్రపంచానికి, పట్టణ ప్రపంచానికి మధ్య హద్దు చెరిగినట్లే అనిపిస్తుంది’’ అంటారు ఐసీఐసీఐ యం.డి. చందాకొచ్చర్.అయితే ఎంత ఆధునికంగా తయా రైనా ఆ గ్రామం తన ఆత్మను పోగొట్టు కోలేదు. ఒకవైపు ఆధునికతను అవసరాల మేరకు అవగాహన చేసుకుంటూనే, మరో వైపు గ్రామ సంస్కృతిని కాపాడు కుంటోంది. మరెన్నో గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తోంది. -
అర్హులకు పింఛన్ అందివ్వండి
బెళుగుప్ప : అర్హులైన వారికి పింఛన్ అందేలా చూడాలని అధికారులను, అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు ఉరవకొండ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి సూచించారు. మండలంలోని గంగవరం, దుద్దేకుంట గ్రామాల్లో శనివారం నిర్వహించిన జన్మభూమి - మా ఊరు కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. ఈ రెండు గ్రామాల్లో నెలకొన్న పలు సమస్యలపై ఆయన ఆధికారులతో చర్చించారు. ప్రజలకు అన్యాయం జరిగితే విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాల్సి ఉంటుందని అన్నారు. జీడిపల్లి రిజర్వాయర్‌కు వరుసగా మూడవ సారి శ్రీశైలం నుంచి కృష్ణాజలాలు వచ్చాయని, అయితే నియోజకవర్గంలోని ఏ ఒక్క ఎకరానికి సాగునీరు అందలేదని, అలాగే బెళుగుప్ప మండలంలోని ఒక్కచెరువును కూడా నింపలేకపోయారని ఆవేదన వ్యక్తంచేశారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి హయాంలోనే చాలా వరకు పనులు పూర్తి అయ్యాయని, మిగిలిన పనులను పూర్తి చేయడంలో రాష్ర్ట ప్రభుత్వం అలసత్వం చూపుతోందని అసహనం వ్యక్తం చేశారు. హంద్రీనీవా కాలువ ద్వారా సాగునీటిని అందించే వరకూ పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. బెళుగుప్పను కరువు మండలంగా ప్రకటించి సహాయక చర్యలు చేపట్టాలన్నారు. రబీ పంటకు కొత్తరుణాలను అందించాలని బ్యాంకర్లను కోరారు. వాతావరణ బీమాతో ప్రయోజనం లేదని, గ్రామాన్ని ఓ యూనిట్‌గా పరిగణిస్తూ బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై అసెంబ్లీలో చర్చ జరిగేలా కృషి చేస్తానని చెప్పారు. రైతులకు గత ఏడాది ఇన్పుట్ సబ్సిడీ, పంటల బీమాను అందించాలని అన్నారు. ఎన్నికలకు ముందు టీడీపీ ఇచ్చిన హామీల నెరవేరే వరకూ పోరాటాలు సాగించాలని అన్నారు. కాగా, దుద్దేకుంటలో తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేశారు. సమస్య పరిష్కరించకుండా మరోసారి గ్రామంలో సభలు ఏర్పాటు చేస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో తహశీల్దార్ వెంకటాచలపతి, ఎమ్పీడీఓ శ్రీనివాసులు, జెడ్పీ వైస్ చైర్పర్సన్ సుభాషిణమ్మ, ఎమ్పీపీ అంజినమ్మ పలువురు ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్సీపీ నేతలు వీరన్న, దుద్దేకుంట రామాంజనేయులు, హనుమంతరాయుడు, పెద్దన్న, రమేష్; బోయ హనుమంతరాయుడు, తిప్పేస్వామి, నంజుండప్ప తదితరులు పాల్గొన్నారు. -
‘జన్మభూమి, మా ఊరు’ ప్రతిష్టాత్మకం
గుంటూరు ఈస్ట్ అక్టోబర్ 2 నుంచి ప్రారంభిస్తున్న జన్మభూమి, మా ఊరు కార్యక్రమాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని అధికారులంతా పనిచేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కోరారు. స్థానిక రెవెన్యూ కళ్యాణ మండపంలో సోమవారం ప్రభుత్వ కార్యక్రమాలపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ ఈ కార్యక్రమాల్లో విశేషంగా కృషి చేసిన అధికారులను గుర్తించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతామన్నారు. బదిలీలు జరిగే సమయంలో వారికి ప్రాధాన్యత ఇచ్చి కోరుకున్నచోటికి బదిలీ చేసేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్టీఆర్ సుజల పథకాన్ని ఎక్కువ గ్రామాల్లో అమలు చేసేందుకు ఎన్నారై, స్థానిక ఔత్సాహికుల సహకారం తీసుకోవాలని కోరారు. మరుగుదొడ్ల నిర్మాణం పథకం కింద ఎంపికైన వారందరికీ రూ.15 వేలు వెంటనే అందించాలన్నారు. ఇంటికి ఒక్కరికే పెన్షన్ ఇవ్వాలన్న నిబంధనలు లేవని చెప్పారు. అక్టోబర్ 15 వరకు ఆధార్ అనుసంధానం కానివారికి రేషన్ ఇవ్వాలని ఆదేశించారు. సాంఘిక సంక్షేమ శాఖమంత్రి రావెల కిషోర్‌బాబు మాట్లాడుతూ రాజధాని గుంటూరు జిల్లాలోనే నిర్మిస్తారని ఇది జిల్లా వాసుల అదృష్టమన్నారు. రాజధాని గుంటూరు జిల్లాకు రావడానికి ప్రధాన కారణం మంత్రి ప్రత్తిపాటి పుల్లారావే అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. ఎస్సీ కార్పొరేషన్‌కు ప్రభుత్వం రూ. 520 కోట్లు మంజూరు చేసిందన్నారు. 557 గ్రామ పంచాయతీల్లో సర్వే ప్రక్రియ సరిగా జరుగలేదని ఆరోపణలు వచ్చాయని, నియోజకవర్గంలో తక్కువ పింఛనుదారులు నమోదైన ప్రాంతాల్లో ఒక ప్రత్యేక అధికారిని నియమించినట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి కె.నాగబాబు, డీఆర్డీఏ పీడీ ప్రశాంతి, ఆర్డీవో భాస్కర్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు. మంత్రి మృణాళిని వీడియోకాన్ఫరెన్స్ అక్టోబరు 2 నుంచి ప్రారంభించనున్న పెంచిన సామాజిక భద్రతా పింఛను పంపిణీని సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్రగ్రామీణాభివృద్ధి, గృహనిర్మాణం, పరిశుభ్రత మంత్రి కిమిడి మృణాళిని ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి జన్మభూమి, మా ఊరు కార్యక్రమాలపై వీడియోకాన్ఫరెన్స్‌లో కలెక్టరేట్లోని అధికారులతో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో కొత్తవి, పాతవి కలిపి సామాజిక భద్రతా పింఛన్లు 44,59,683 మందికి అందజేస్తామన్నారు. కొత్త ఇసుక పాలసీకి రాష్ట్రంలో 28 లక్షల క్యూబిక్ మీటర్లు తీసుకోవడానికి అనుమతి వచ్చిందని మైన్స్ అండ్ జియాలజీ కమిషనర్ చెప్పారు. జిల్లాలో రెండు రిజర్వాయర్ ట్యాంకుల ద్వారా ఇసుక తీయాల్సి ఉందన్నారు. కలెక్టర్ కాంతిలాల్ దండే సమాధానం ఇస్తూ రాయపూడి, ఉండవల్లి ఇసుక పూడిక తీయాల్సి ఉందని చెప్పారు. అచ్చంపేట మండలంలో 9.63 లక్షల క్యూబిక్ మీటర్లు, తుళ్ళూరు మండలంలో 3.39 లక్షల క్యూబిక్ మీటర్లు ఇసుక తీయాల్సి ఉందని వివరించారు.