గ్లోబల్ గోకులం!
మన ఊరు
‘యానిమల్ హాస్టల్’ విషయంలోనే కాదు... ‘డిజిటల్ విలేజి’గా కూడా అకోదరకు పేరు ఉంది. ‘క్యాష్‌లెస్’, ‘కాంప్రహెన్సివ్’, ‘కనెక్టెడ్’ అనే మూడు విషయాల ఆధారంగా ఈ ‘డిజిటల్ విలేజ్’ ఆలోచన రూపుదిద్దుకుంది.
‘యానిమల్ హాస్టల్’తో ప్రపంచ దృష్టిని ఆకర్షించింది అకోదర. గుజరాత్ రాష్ట్రం లోని హిమ్మత్‌నగర్ జిల్లాలో ఉంది ఈ గ్రామం. ‘యానిమల్ హాస్టల్’ పుణ్యమా అని ఈ గ్రామ ప్రజల జీవితాల్లో కొత్త వెలుగు వచ్చింది. గ్రామ ఆదాయం పెరిగింది. అసలింతకీ ఏమిటీ యానిమల్ హాస్టల్?!
యజమాని అంటూ ఒకరు ఉన్నా సరే, ఒకప్పుడు అకోదరలో ఆవులు, గేదెలు ఎవరికీ పట్టని అనాథల్లా తిరుగుతుండేవి.మేత కోసం ఎటెటో వెళుతూ అవి ఊరు కూడా దాటిపోయేవి. అదృష్టం బాగుంటే వాటి ఆచూకీ దొరికేది. లేకపోతే దొంగల పాలయ్యేవి. ఆ పరిస్థితిని తప్పించడానికి ఏర్పడిందే యానిమల్ హాస్టల్. గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడి ఉన్నప్పుడు ఆయన ఆలోచనల్లో నుంచి పుట్టింది ఈ ‘యానిమల్ హాస్టల్’. ఈ హాస్టళ్ల ద్వారా గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడంతో పాటు, పశువుల ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టవచ్చునని మోడి ఆలోచించారు. ఆయన వినూత్న ఆలోచన వృథా పోలేదు అనడానికి అకోదర గ్రామమే ఉదాహరణ.
‘‘మాకు రెండు గేదెలు ఉన్నాయి. ఇంటి పనులు, పొలం పనుల్లో పడి వాటి గురించి పట్టించుకునేవాళ్లమే కాదు. అవి ఏం తింటున్నాయి, ఎలా తింటున్నాయి, ఆరో గ్యంగా ఉన్నాయా... ఏ విషయంపైనా శ్రద్ధ పెట్టేవాళ్లం కాదు. మా ఊరికి యానిమల్ హాస్టల్ వచ్చిన తరువాత పరిస్థితిలో పూర్తిగా మార్పు వచ్చింది. హాస్టల్‌వాళ్లు మా పశువుల్ని కన్నబిడ్డల్లా చూసుకుంటున్నారు’’ అంటాడు ఆనంద్ అనే రైతు. కేవలం పశువుల్ని రక్షించడమే కాదు, వాటి పేడను వర్మీకంపోస్ట్, బయో గ్యాస్ కోసం వినియోగిస్తున్నారు. వర్మీ కంపోస్ట్ అమ్మకాల ద్వారా వచ్చిన సొమ్మును గ్రామసంక్షేమం కోసం ఖర్చు చేస్తున్నారు.
‘యానిమల్ హాస్టల్’ మొదలైన కొత్తలో గ్రామస్థులు ఆసక్తి చూపలేదు. దాంతో ఊళ్లో పశువులు 900 ఉంటే, హాస్టల్‌లో 3 మాత్రమే ఉండేవి. అయితే తక్కువ కాలంలోనే హాస్టల్ ప్రయోజనాల గురించి అందరికీ తెలిసిరావడంతో ఇప్పుడు గ్రామ పశుసంపదకు ‘యానిమల్ హాస్టల్’ కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది.
36 షెడ్‌లు, లక్ష లీటర్ల సామర్థ్యం ఉన్న నీళ్ల ట్యాంక్ వంటి సౌకర్యాలు ఉన్న ఈ హాస్టల్ పుణ్యమా అని పాల ఉత్పత్తి పెరి గింది. ‘‘హాస్టల్‌కు ముందు లక్షల్లో ఉన్న పాల ఆదాయం, హాస్టల్ తరువాత కోటి దాటింది’’ అని అకోదర మిల్క్ ఫెడరేషన్ అన్నదంటే అభివృద్ధి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాగే హాస్టల్‌లోని ‘గోబర్ బ్యాంకు’ ద్వారా విద్యుత్‌ను కూడా ఉత్పత్తి చేస్తున్నారు.
‘యానిమల్ హాస్టల్’ విషయంలోనే కాదు... ‘డిజిటల్ విలేజి’గా కూడా అకోదరకు పేరు ఉంది. ‘క్యాష్‌లెస్’, ‘కాంప్రహెన్సివ్’, ‘కనెక్టెడ్’ అనే మూడు విషయాల ఆధారంగా ఈ ‘డిజిటల్ విలేజ్’ ఆలోచన రూపుదిద్దుకుంది. ఊళ్లో ప్రతి వ్యక్తికీ బ్యాంక్ అకౌంట్ ఉంది. ‘ఎస్.ఎం.ఎస్. బ్యాంకింగ్ ఫ్లాట్‌ఫాం’ అందుబాటులో ఉంది. ఒక్క ఎస్సెమ్మెస్ ద్వారా బ్యాలెన్స్ ఎంక్వయిరీ, మినీ స్టేట్‌మెంట్, ఫండ్ ట్రాన్స్‌ఫర్, మొబైల్ రీచార్జి మొదైలైన పనులన్నీ చేసుకోవచ్చు.
ఐసీఐసీఐ బ్యాంకు ఈ ఊరి పేరు మీద ఒక వెబ్‌సైట్‌ను, ఫేస్‌బుక్ పేజీని మొదలు పెట్టింది. ఇక ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘వై-ఫై’ టవర్ ఇంటర్‌నెట్‌ను ప్రజలకు అందుబాటులో తెచ్చింది. ఇ-హెల్త్ సెంటర్, వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్‌లు కూడా ఈ ఊరి ప్రత్యేకతను చాటు తున్నాయి. ‘‘ఈ ఊరిని చూస్తే... గ్రామీణ ప్రపంచానికి, పట్టణ ప్రపంచానికి మధ్య హద్దు చెరిగినట్లే అనిపిస్తుంది’’ అంటారు ఐసీఐసీఐ యం.డి. చందాకొచ్చర్.అయితే ఎంత ఆధునికంగా తయా రైనా ఆ గ్రామం తన ఆత్మను పోగొట్టు కోలేదు. ఒకవైపు ఆధునికతను అవసరాల మేరకు అవగాహన చేసుకుంటూనే, మరో వైపు గ్రామ సంస్కృతిని కాపాడు కుంటోంది. మరెన్నో గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తోంది.