మన ఊరు
‘కాలంతో పాటు ఆధునిక లక్షణాలను సంతరించుకోవడం, ప్రపంచానికి చేరువ కావడం నేటి గ్రామాల లక్షణం’ అనేది ఒక సూత్రీకరణ. అయితే మలానా గ్రామాన్ని దీని నుంచి కచ్చితంగా మినహాయించాలి.
హిమాచల్‌ప్రదేశ్‌లోని కులు జిల్లాలో పార్వతీ లోయను ఆనుకొని ఉంది మలానా గ్రామం. ప్రపంచం అంతా ఓ దారిలో సాగుతుంటే... మలానా మాత్రం మరో దారిలో సాగుతోంది.
భవబంధాలకు దూరంగా, ఏకాంత దీవిలో తపస్సు చేసుకుంటున్న ముని పుంగవుడిలా ఓ కొండమీద కనిపిస్తుంది మలానా.
ఇది ప్రపంచంలోని తొలి ప్రజాస్వామిక గ్రామాల్లో ఒకటి. దీని గురించి ఎన్నో కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి.
ఓసారి జమదగ్ని శివుడి కోసం కఠోర తపస్సు చేశాడట. అందుకు మెచ్చి ప్రత్యక్షమైన శివుడు ‘ఏం కావాలో కోరుకో’ అన్నాడట. ‘ప్రశాంతంగా ఉండే చోటు, ప్రకృతి ఒడిలో ఉన్నట్టుగా ఊళ్లో ఉండాలని ఉంది’ అని జమదగ్ని అడిగితే, మలానాను సృష్టించి ఇచ్చాడట. అయితే శివుడు కాదు, అలెగ్జాండర్ సైనికుల వారసులు ఈ గ్రామాన్ని నిర్మించారనేది మరో కథనం. కానీ కొందరు దాన్ని అంగీ కరించరు. అలెగ్జాండర్ సైనికుల వారసులు మలానాలో కాదు, పాకిస్తాన్‌లోని కలాష్ లోయ సమీపంలో ఆశ్రయం పొందారు అంటారు వారు.
ఈ ఊరి తీరే వేరు...
మలానాకి చాలా విశేషాలున్నాయి. ఆ గ్రామ పాలన, సామాజిక నిర్మాణం ప్రజాస్వామికంగా ఉంటాయి. గ్రామ కౌన్సిల్‌లో ఉండే పదకొండుమంది సభ్యులు పాలనా వ్యవహారాలను పర్య వేక్షిస్తారు. ఈ సభ్యులను తమ గ్రామ దేవత ‘జంబ్లూ’కి ప్రతినిధులుగా భావి స్తారంతా. అలాగే గ్రామంలో దిగువ న్యాయస్థానం, ఎగువ న్యాయస్థానం ఉంటాయి. దిగువ కోర్టులో న్యాయం జరగలేదంటే ఎగువ కోర్టుకు వెళ్లొచ్చు.
మలానాకి ప్రభుత్వంతో ఎటువంటి సంబంధం ఉండదు. ప్రభుత్వం ఇచ్చే పథకాలు అవసరం లేదు. ప్రభుత్వ ప్రతినిధులు వచ్చి ఏదైనా చెప్పబోయినా గ్రామస్తులు వినరు. తమకు నచ్చిన రీతి లోనే జీవిస్తారు. నిజానికి ఈ ఊళ్లో ప్రభుత్వ పాఠశాల ఉంది. వందమంది పిల్లలు చదువుకుంటున్నారు కూడా. కానీ అంతకుమించి ప్రభుత్వం ఇంకే విష యంలో జోక్యం చేసుకున్నా వీరికి నచ్చదు.
అది మాత్రమేనా... తమ గ్రామానికి చెందని వ్యక్తులు చేసే వంటకాలను వీరు స్వీకరించరు. తమ గ్రామానికి చెందని వారిని వివాహం చేసుకోరు. పిల్లలకు పేర్లు పెట్టడంలో కూడా వీరికి తమదైన ప్రత్యేకత ఉంది. పుట్టిన రోజును బట్టి పేర్లు పెడతారు. ఆదివారం పుట్టినవారికి అహ్త అని, సోమవారం పుట్టిన వారికి సౌనరు అని, మంగళవారం పుట్టిన వారికి మంగల్ అని... ఇలాంటి పేర్లే పెడతారు. దాంతో ఒకే పేరు గలవాళ్లు చాలామంది కనిపిస్తూ ఉంటారు.
ఇక ఈ ఊరివారు మాట్లాడే భాష కనషీ. ఈ భాషలో సంస్కృత పదాలు ఎక్కువ ఉంటాయి. టిబెటన్ భాషల ప్రభావమూ కనిపిస్తుంది. అతి ప్రాచీనమైన ఈ భాషను ఆ గ్రామస్తులు తప్ప ఇతరులు అర్థం చేసుకోవడం కష్టం!
ఇలా ప్రతి విషయంలో స్వతంత్రంగా ఉండటం, తమ సొంత విధానాలను ఫాలో అవకం చూసే మలానాని కొందరు ‘ద రిపబ్లిక్ ఆఫ్ మలానా’ అని కూడా పిలుస్తుంటారు.
అడుగడుగునా ఔషధాలు...
మలానా లోయలో మహిమాన్విత మైన ఔషధాలున్నాయని అందరూ అంటుంటారు. ఓసారి అనారోగ్యానికి గురైన అక్బర్ చక్రవర్తికి ఎవరో మలానా మహత్తు గురించి చెప్పారట. దాంతో ఆయన ఈ గ్రామాన్ని వెదుక్కుంటూ వచ్చాడట. ఇక్కడి ఔషధాలు వాడగా... కొద్ది కాలంలోనే ఆయన వ్యాధి నయమైందట. అయితే అవన్నీ నిజమో కాదో తెలుసుకునే అవకాశం ఎవరికీ ఇవ్వరు మలానా గ్రామస్తులు. సందర్శకులను అనుమతించినా ఎవరినీ చెట్ల మీద చేయి కూడా వేయనివ్వరు. ఇన్నేళ్లలో ఏ మాత్రం మారని మలానా ఇంకా ఎన్నాళ్లు ఇలా తన ప్రత్యేకతను చాటుకుంటుందో వేచి చూడాలి మరి!
మార్పెరుగని ఊరు... మలానా!
Published Sun, Sep 6 2015 12:55 AM | Last Updated on Fri, May 25 2018 2:29 PM
Advertisement
Advertisement