‘జన్మభూమి, మా ఊరు’ ప్రతిష్టాత్మకం | "Fatherland, our hometown, 'prestige | Sakshi
Sakshi News home page

‘జన్మభూమి, మా ఊరు’ ప్రతిష్టాత్మకం

Published Tue, Sep 30 2014 12:03 AM | Last Updated on Sat, Sep 2 2017 2:07 PM

‘జన్మభూమి, మా ఊరు’ ప్రతిష్టాత్మకం

‘జన్మభూమి, మా ఊరు’ ప్రతిష్టాత్మకం

గుంటూరు ఈస్ట్
 అక్టోబర్ 2 నుంచి ప్రారంభిస్తున్న జన్మభూమి, మా ఊరు కార్యక్రమాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని అధికారులంతా పనిచేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కోరారు. స్థానిక రెవెన్యూ కళ్యాణ మండపంలో సోమవారం ప్రభుత్వ కార్యక్రమాలపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ ఈ కార్యక్రమాల్లో విశేషంగా కృషి చేసిన అధికారులను గుర్తించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతామన్నారు. బదిలీలు జరిగే సమయంలో వారికి ప్రాధాన్యత ఇచ్చి  కోరుకున్నచోటికి బదిలీ చేసేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్టీఆర్ సుజల పథకాన్ని ఎక్కువ గ్రామాల్లో అమలు చేసేందుకు ఎన్నారై, స్థానిక ఔత్సాహికుల సహకారం తీసుకోవాలని కోరారు. మరుగుదొడ్ల నిర్మాణం పథకం కింద ఎంపికైన వారందరికీ రూ.15 వేలు వెంటనే అందించాలన్నారు. ఇంటికి ఒక్కరికే పెన్షన్ ఇవ్వాలన్న నిబంధనలు లేవని చెప్పారు. అక్టోబర్ 15 వరకు ఆధార్ అనుసంధానం కానివారికి రేషన్ ఇవ్వాలని ఆదేశించారు. సాంఘిక సంక్షేమ శాఖమంత్రి రావెల కిషోర్‌బాబు మాట్లాడుతూ రాజధాని గుంటూరు జిల్లాలోనే నిర్మిస్తారని ఇది జిల్లా వాసుల అదృష్టమన్నారు.   రాజధాని గుంటూరు జిల్లాకు  రావడానికి ప్రధాన కారణం మంత్రి ప్రత్తిపాటి పుల్లారావే అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. ఎస్సీ కార్పొరేషన్‌కు ప్రభుత్వం రూ. 520 కోట్లు మంజూరు చేసిందన్నారు.   557 గ్రామ పంచాయతీల్లో సర్వే ప్రక్రియ సరిగా జరుగలేదని ఆరోపణలు వచ్చాయని, నియోజకవర్గంలో తక్కువ పింఛనుదారులు నమోదైన ప్రాంతాల్లో ఒక ప్రత్యేక అధికారిని నియమించినట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి కె.నాగబాబు, డీఆర్‌డీఏ  పీడీ ప్రశాంతి, ఆర్డీవో భాస్కర్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు.
 మంత్రి మృణాళిని
 వీడియోకాన్ఫరెన్స్
 అక్టోబరు 2 నుంచి ప్రారంభించనున్న పెంచిన సామాజిక భద్రతా పింఛను పంపిణీని సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్రగ్రామీణాభివృద్ధి, గృహనిర్మాణం, పరిశుభ్రత మంత్రి కిమిడి మృణాళిని ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి జన్మభూమి, మా ఊరు కార్యక్రమాలపై వీడియోకాన్ఫరెన్స్‌లో కలెక్టరేట్‌లోని అధికారులతో ఆమె మాట్లాడారు.   రాష్ట్రంలో కొత్తవి, పాతవి కలిపి సామాజిక భద్రతా పింఛన్లు 44,59,683 మందికి అందజేస్తామన్నారు. కొత్త ఇసుక పాలసీకి రాష్ట్రంలో 28 లక్షల క్యూబిక్ మీటర్లు తీసుకోవడానికి అనుమతి వచ్చిందని మైన్స్ అండ్ జియాలజీ కమిషనర్ చెప్పారు. జిల్లాలో రెండు రిజర్వాయర్ ట్యాంకుల ద్వారా ఇసుక తీయాల్సి ఉందన్నారు. కలెక్టర్ కాంతిలాల్ దండే సమాధానం ఇస్తూ రాయపూడి, ఉండవల్లి ఇసుక పూడిక తీయాల్సి ఉందని చెప్పారు. అచ్చంపేట మండలంలో 9.63 లక్షల క్యూబిక్ మీటర్లు, తుళ్ళూరు మండలంలో 3.39 లక్షల క్యూబిక్ మీటర్లు ఇసుక తీయాల్సి ఉందని వివరించారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement