అర్హులకు పింఛన్ అందివ్వండి
బెళుగుప్ప :
అర్హులైన వారికి పింఛన్ అందేలా చూడాలని అధికారులను, అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు ఉరవకొండ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి సూచించారు. మండలంలోని గంగవరం, దుద్దేకుంట గ్రామాల్లో శనివారం నిర్వహించిన జన్మభూమి - మా ఊరు కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. ఈ రెండు గ్రామాల్లో నెలకొన్న పలు సమస్యలపై ఆయన ఆధికారులతో చర్చించారు. ప్రజలకు అన్యాయం జరిగితే విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాల్సి ఉంటుందని అన్నారు.
జీడిపల్లి రిజర్వాయర్‌కు వరుసగా మూడవ సారి శ్రీశైలం నుంచి కృష్ణాజలాలు వచ్చాయని, అయితే నియోజకవర్గంలోని ఏ ఒక్క ఎకరానికి సాగునీరు అందలేదని, అలాగే బెళుగుప్ప మండలంలోని ఒక్కచెరువును కూడా నింపలేకపోయారని ఆవేదన వ్యక్తంచేశారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి హయాంలోనే చాలా వరకు పనులు పూర్తి అయ్యాయని, మిగిలిన పనులను పూర్తి చేయడంలో రాష్ర్ట ప్రభుత్వం అలసత్వం చూపుతోందని అసహనం వ్యక్తం చేశారు.
హంద్రీనీవా కాలువ ద్వారా సాగునీటిని అందించే వరకూ పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. బెళుగుప్పను కరువు మండలంగా ప్రకటించి సహాయక చర్యలు చేపట్టాలన్నారు. రబీ పంటకు కొత్తరుణాలను అందించాలని బ్యాంకర్లను కోరారు. వాతావరణ బీమాతో ప్రయోజనం లేదని, గ్రామాన్ని ఓ యూనిట్‌గా పరిగణిస్తూ బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై అసెంబ్లీలో చర్చ జరిగేలా కృషి చేస్తానని చెప్పారు.
రైతులకు గత ఏడాది ఇన్‌పుట్ సబ్సిడీ, పంటల బీమాను అందించాలని అన్నారు. ఎన్నికలకు ముందు టీడీపీ ఇచ్చిన హామీల నెరవేరే వరకూ పోరాటాలు సాగించాలని అన్నారు. కాగా, దుద్దేకుంటలో తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేశారు. సమస్య పరిష్కరించకుండా మరోసారి గ్రామంలో సభలు ఏర్పాటు చేస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు.
కార్యక్రమంలో తహశీల్దార్ వెంకటాచలపతి, ఎమ్పీడీఓ శ్రీనివాసులు, జెడ్పీ వైస్ చైర్‌పర్సన్ సుభాషిణమ్మ, ఎమ్పీపీ అంజినమ్మ పలువురు ప్రజాప్రతినిధులు, వైఎస్‌ఆర్‌సీపీ నేతలు వీరన్న, దుద్దేకుంట రామాంజనేయులు, హనుమంతరాయుడు, పెద్దన్న, రమేష్; బోయ హనుమంతరాయుడు, తిప్పేస్వామి, నంజుండప్ప తదితరులు పాల్గొన్నారు.