లక్నో: ఉత్తరప్రదేశ్ మధురలోని కృష్ణజన్మభూమి ప్రాంతంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలను నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరో పదిరోజుల పాటు ఎలాంటి కూల్చివేతలను చేపట్టవద్దని పేర్కొంది. ఈ మేరకు జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ ఎస్‌వీఎన్ భట్టీ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పును వెలువరించింది. మరో వారం పాటు విచారణను వాయిదా వేసింది.
మధురలో రైల్వే భూభాగాల్లో అక్రమంగా నిర్మించిన ఇళ్లను కూల్చివేసే కార్యక్రమాన్ని రైల్వేశాఖ చేపట్టింది. ఆగష్టు 9న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా.. ఇప్పటికే 100కు పైగా ఇళ్లను కూల్చివేశారు. అయితే.. ఇది పూర్తిగా అన్యాయమని బాధితులు సుప్రీకోర్టును ఆశ్రయించారు. కేసు విచారించిన ధర్మాసనం ప్రస్తుతానికి కూల్చివేతలను ఆపి యధాతథ స్థితిని కొనసాగించాలని పేర్కొంటూ తీర్పును వెలువరించింది.
రైల్వే ప్రాంతంలో నిర్మాణాలను అక్రమంగా కూల్చివేస్తున్నారని బాధితుల తరుపు న్యాయవాది ధర్మాసనానికి విన్నవించారు. ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండానే ఈ కార్యక్రమాన్ని చేపట్టారని ఆరోపించారు. యూపీలో న్యాయవాదుల సమ్మె కారణంగానే కోర్టులో ఈ పిటిషన్ విచారణకు రాలేదు. దీంతో బాధితులు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. గత 100 ఏళ్లుగా ఆ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలను ఉన్నపళంగా వెళ్లగొడుతున్నారని తెలిపారు. ప్రస్తుతం కేవలం 80 ఇళ్లు మాత్రమే మిగిలి ఉన్నాయని చెప్పారు.
ఇదీ చదవండి: అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ ఫోకస్.. ఎన్నికల కమిటీ కీలక సమావేశం
Comments
Please login to add a commentAdd a comment