‘బిగ్’ కాపీ! | nani movie copy as hollywood version! | Sakshi
Sakshi News home page

‘బిగ్’ కాపీ!

Published Sun, Dec 6 2015 3:38 AM | Last Updated on Sun, Sep 3 2017 1:33 PM

‘బిగ్’ కాపీ!

‘బిగ్’ కాపీ!

ఆ సీన్ - ఈ సీన్
రామాయణంలోని వాలి, సుగ్రీవుల కథ ఆధారంగా ఎస్‌జే సూర్య ‘వాలి’ సినిమాని రూపొందించి ప్రశంసలు అందుకున్నాడు. అయితే భారతీయ ఇతిహాసం నుంచి కాన్సెప్ట్‌ను లిఫ్ట్ చేయడంలో మంచి ప్రతిభను ప్రదర్శించిన సూర్య... ఒక విదేశీ సినిమా నుంచి కాన్సెప్ట్‌ను లేపుకొచ్చి మాత్రం ఫెయిలయ్యాడు. కాపీ కొడితే కొట్టాడు... కనీసం పాసయినా అయ్యాడా అంటే అదీ లేదు.
 
ప్రఖ్యాత హాలీవుడ్ నటుడు టామ్ హాంక్స్ యువకుడిగా ఉన్నప్పుడు వచ్చిన సినిమా ‘బిగ్’. 1988లో విడుదలైన దీన్ని 2004లో తనదైన ధోరణిలో ‘నాని’గా తీసి మనకు చూపించాడు సూర్య. మహేశ్ బాబు, అమీషా పటేల్ నటించారు.
 
‘చందమామ కథ’లాంటి సినిమా ‘బిగ్’. ఈ మాట చాలు ఆ సినిమా ఎంత సరదాగా, హుందాగా, చక్కగా ఉంటుందో చెప్పడానికి. జోష్ బక్సిన్ అనే పన్నెండేళ్ల పిల్లాడు ఓసారి కార్నివాల్‌ను చూడటానికి వెళ్తాడు. అక్కడ అతీత శక్తులున్న ఒక మిషన్ దగ్గర నేను ఉన్నపళంగా పెద్ద వాడిని అయిపోవాలి అనే ఆకాంక్షను వ్యక్తం చేస్తాడు. అంతే... రాత్రికి రాత్రి పెద్దవాడైపోతాడు.
 
హాలీవుడ్ సినిమాలో తెలిసీ తెలియక కుర్రాడు వ్యక్తపరిచిన కోరికతో ముప్ఫై ఏళ్లవాడిగా మారిపోతే.. ఎస్‌జే సూర్య మాత్రం దీనికి ‘సైన్స్’ని యాడ్ చేశాడు. ‘సైన్స్’ పేరుతో ఒక పాత్రను క్రియేట్ చేసి అతడు ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల ఎనిమిదేళ్ల కుర్రాడు 28 ఏళ్ల వాడిగా మారి మహేశ్ బాబుగా కనిపించేలా చూపించాడు.

ఆదిలో ఈమాత్రం తేడాను చూపించినా, అక్కడి నుంచి చాలా వరకూ హాలీవుడ్ సినిమా బాటనే అనుసరించాడు.
 తమ బాబు ఎక్కడకు వెళ్లాడో తెలియని పరిస్థితుల్లో ఇంట్లో వాళ్లు కిడ్నాప్ అయ్యాడేమోనని పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతుంటారు. ఉన్నపళంగా పెద్దవాడై పోవడం కొంత సరదాగానే అనిపించినా.. తల్లిదండ్రులను మిస్ అవుతున్నానే బెంగ పట్టుకుంటుంది హీరోకి.  తను ఇలా మారి పోయాను అని చెబితే ఎవరూ నమ్మరు. ఆఖరికి స్నేహితుడొకడు నమ్ముతాడు.
 
ఇంతలో కుర్రాడిలా మారిన ఈ పిల్లాడిని చూసి ఒక అమ్మాయి ప్రేమలో పడిపోతుంది. హాలీవుడ్ సినిమాలో తన ప్రమేయం లేకుండా హీరో ఆమెతో డేటింగ్‌కు సిద్ధపడాల్సి వస్తుంది. తెలుగు సినిమాలో మాత్రం ఏకంగా హీరోకి పెళ్లే చేసేశారు! ఇక్కడి నుంచి హాలీవుడ్ వెర్షన్ హుందాగా సాగితే, తెలుగు వెర్షన్ మాత్రం విమర్శల పాలయ్యింది.

‘బిగ్’ సినిమాలో పెద్దవాడైన పిల్లవాడితో హీరోయిన్ ప్రేమ, వారి సాన్నిహిత్యం... ఇదంతా సున్నితంగా, సరదాగా ఉంటుంది. కానీ ఇక్కడ అలా ఉండదు. ఒక వైపు ప్రియురాలి ప్రేమను ఆస్వా దించడం బాగానే అనిపించినా, మిస్ అవు తున్న తల్లిప్రేమ కోసం తను తిరిగి చిన్న వాడైపోయే ప్రయత్నాల్లో ఉంటాడు హీరో. అందుకోసం ‘బిగ్’లో మాయాయంత్రం కోసం వెదుకుతూ ఉంటాడు.

ఆ కార్నివాల్ తమ ఊరి నుంచి తరలి వెళ్లిపోవడంతో దాని గురించి శోధన సాగిస్తుంటాడు. తెలుగులో మాత్రం హీరో ‘సైన్స్’ను ఆశ్రయిస్తాడు. మూల కథనూ, ఉన్నట్టుండి పెద్దాడయిపోవడంతో బాల్యాన్ని మిస్ అయ్యే హీరో భావోద్వేగాలనూ, అతడిని ఎవరూ గుర్తించకపోవడం, హీరోకి బొమ్మలు తయారు చేసే కంపెనీలో ఉద్యోగం రావడం, చిన్నపిల్లాడి మనస్త త్వమే ఆ ఉద్యోగంలో అతడికి పేరు తెచ్చిపెట్టడం వంటి అంశాలను ‘బిగ్’ నుంచి యథాతథంగా తీసుకున్నారు.
 
అయితే ‘బిగ్’లో హీరో తనను పెద్దవాడిగా మార్చేసిన మాయాయంత్రం ద్వారా తిరిగి బాల్య దశలోకి వెళ్లిపోతాడు. వెళ్లేముందు హీరోయిన్‌ని కూడా బాల్యదశలోకి రమ్మని కోరతాడు. కానీ ఆమె నిరాకరిస్తుంది. దాంతో వారి ప్రేమకథకు తెర పడుతుంది.

కానీ తెలుగులో మాత్రం హీరో మళ్లీ చిన్నగా మారే ప్రయత్నం విఫలం కావడంతో, పగలు పిల్లాడిగా, రాత్రిపూట పెద్దవాడిగా జీవితాంతం కొనసాగినట్టుగా చూపించారు. ఇలా సొంత క్రియేటివిటీని వాడటం మంచిదే అయినా, అందులో ఏమాత్రం సహజత్వం లేకపోవడం అనేదే ఫెయిల్యూర్‌కి దారి తీసిందేమో!
 - బి.జీవన్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement