b.jeevan reddy
-
ఆకాశ్ పూరీ ‘చోర్ బజార్’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్, ఎప్పుడంటే
ఆకాశ్ పూరి, గెహనా సిప్పీ జంటగా నటించిన లవ్, యాక్షన్ ఎంటర్టైనర్ ‘చోర్ బజార్’. ‘దళం, జార్జ్ రెడ్డి’ చిత్రాల ఫేమ్ జీవన్ రెడ్డి దర్శకత్వంలో వీఎస్ రాజు నిర్మించాడు. అంతేకాదు ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని పాటు మంచి హిట్ అయ్యాయి. ఇక బాలకృష్ణ ఇటీవల విడుదల ఈ మూవీ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో చోర్ బజార్ మూవీపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. చదవండి: పోస్ట్ వెడ్డింగ్ అంటూ ఫొటోలు షేర్ చేసిన కీర్తి, పక్కనే మరో హీరోయిన్ ఈ నేపథ్యంలో ఈ మూవీ విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. ఈ నెల్ 24వ తేదీన సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. కాగా ఈ సినిమాకు సురేష్ బొబ్బిలి సంగీతాన్ని అందించగా.. ప్రియదర్శన్ బాలసుబ్రహ్మణ్యం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. ఐవీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత వీఎస్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. అల్లూరి సురేశ్ వర్మ సహ నిర్మాతగా వ్యవహరించారు. చదవండి: విజయ్, రష్మికల షూటింగ్ ఫొటోలు లీక్.. డైరెక్టర్ అప్సెట్ -
చోర్ బజార్: మూగ అమ్మాయితో లవ్‌లో పడ్డ హీరో
ఆకాశ్ పూరి, గెహనా సిప్పీ జంటగా నటించిన లవ్, యాక్షన్ ఎంటర్టైనర్ ‘చోర్ బజార్’. ‘దళం, జార్జ్ రెడ్డి’ చిత్రాల ఫేమ్ జీవన్ రెడ్డి దర్శకత్వంలో వీఎస్ రాజు నిర్మించాడు. గురువారం ఈ సినిమా నుంచి ట్రైలర్ రిలీజైంది. 'నా పేరు బచ్చన్.. బచ్చన్ సాబ్.. దునియాల ప్రతివోనికీ ఏదో ఒక దూల ఉంటది. నాకు నా చేయి దూల' అంటూ ఆకాష్ డైలాగ్‌తో ట్రైలర్ మొదలైంది. హీరోయిన్ మూగ అమ్మాయిగా నటించినట్లు తెలుస్తోంది. ఇక డైమండ్ ఎలాగైనా మ్యూజియంలో ఉండాలన్న సునీల్ మాటలను బట్టి దాన్ని దొంగిలించారని తెలుస్తోంది. అసలీ డైమండ్ గోల తెలియాలన్నా, హీరో ప్రేమ గెలిచిందా? లేదా? అన్నది చూడాలన్నా సినిమా వచ్చేవరకు ఆగాల్సిందే. ఈ చిత్రానికి కెమెరా: జగదీష్ చీకటి, సంగీతం: సురేష్ బొబ్బిలి, సహనిర్మాత: అల్లూరి సురేష్ వర్మ. చదవండి: ఇద్దరం ఒక్కటయ్యాం.. పెళ్లి ఫొటో షేర్ చేసిన విఘ్నేశ్ నాన్న సినిమా చేద్దామంటే కుదరదని చెప్పేశా: ఆకాశ్ పూరి -
కాపీ చేశారు... పేస్ట్ చేయడంలో ఫెయిలయ్యారు!
ఆ సీన్ - ఈ సీన్ ఒక రకంగా చూస్తే కంప్యూటర్ను కనుక్కొన్నవాడి కన్నా కాపీ పేస్ట్‌ను కనుకున్నవాడు గొప్పవాడు. అయితే సరిగ్గా పేస్ట్ చేయడం తెలీనప్పుడు కాపీ చేస్తే మాత్రం చేసిన ప్రయత్నం వృథా అయిపోతుంది. ముఖ్యంగా క్లాసిక్స్ అనదగ్గ సినిమాలను కాపీ చేసేసి, వాటిని అతి సాదాసీదాగా పేస్ట్ చేస్తే... సినిమా అభిమానుల ఫీలింగ్స్ దారుణంగా హర్ట్ అవుతాయి. అలా హర్ట్ చేసిన ఓ సినిమా... ‘మా నాన్నకు చిరంజీవి’. సూపర్ హిట్ అయిన ‘ద పర్స్యూట్ ఆఫ్ హ్యాపీనెస్’కి అనుకరణగా రూపొందిన ఈ సినిమా ఘోరంగా విఫలమైంది. విల్ స్మిత్‌కు ఆస్కార్ అవార్డును, అంతకు మించిన అభిమానగణాన్ని సంపాదించి పెట్టిన సినిమా ‘ద పర్స్యూట్ ఆఫ్ హ్యాపీనెస్’. 2006లో వచ్చిన ఈ హాలీవుడ్ సినిమా ఒక వాస్తవ కథ. అతుకుల్లేని, అలంకారాల్లేని, పారదర్శకమైన కథ. స్మిత్ నులివెచ్చని భావవ్యక్తీకరణ సినిమాను కొత్త హైట్స్‌కు తీసుకెళ్లింది. ప్రస్తుతం అమెరికాలో ఉన్న శ్రీమంతుల్లో ఒకరు క్రిస్ గార్డ్నర్. ఈ వ్యాపారవేత్త తన జీవితంలోని ఒక దశలో ఎదుర్కొన్న కష్టాలు, వాటిని ఆయన అధిగమించిన తీరును ఆటోబయోగ్రఫీగా రాశారు. దాన్నే ‘ద పర్స్యూట్ ఆఫ్ హ్యాపీనెస్’ సినిమాగా మలిచారు. తాను పొదుపు చేసుకున్న డబ్బుతో కొన్ని ఎక్స్‌రే మిషన్లను కొని, వాటి వ్యాపారంలో తేడాలొచ్చి కట్టుబట్టలతో మిగులుతాడు క్రిస్ గార్డ్నర్ (విల్ స్మిత్). దీంతో కుటుంబాన్ని పోషించడం కష్టమవుతుంది. కొడుకును తన దగ్గర వదిలిపెట్టి భార్య వెళ్లిపోతుంది. ఆరేళ్ల వయసున్న కొడుకుతో కలిసి ఆ సేల్స్‌మెన్ రోడ్డున పడ తాడు. తన పరిస్థితి తనయుడికి ఏ మాత్రం అర్థం తెలియ నీకుండా జాగ్రత్తపడతాడు. బాబుకి ఎలాంటి ఇబ్బందీ రాకుండా చూసుకోవ డానికి ఆ తండ్రి పడే తపన, మరోవైపు అడుగడుగునా దురదృష్టం ఎదురవుతున్నా ఎక్కడా ఆత్మవిశ్వాసాన్ని వదలక తన లక్ష్యం దిశగా ప్రయత్నాలను కొనసాగించే అతని ప్రయాణమే ఈ చిత్రం. ఎంతో స్ఫూర్తిదాయకంగా సాగుతుందీ సినిమా. ఈ కథా నేపథ్యాన్ని ‘మా నాన్న చిరంజీవి’ సినిమాకు అన్వయించే ప్రయత్నం చేశారు. హాలీవుడ్ వెర్షన్లో విల్ స్మిత్, ఆయన సొంత తనయుడు జేడెన్ స్మిత్‌లు నటించిన పాత్రల్లో తెలుగు వెర్షన్లో జగపతిబాబు, మాస్టర్ అతులిత్లు కనిపిస్తారు. భార్య మాట విని తనకు తెలియని వ్యాపారంలో డబ్బులన్నీ పెట్టి నష్టపోతాడు జగపతిబాబు. ఆయన ఆర్థికంగా నష్టపోవడానికి తనే కారణం అయినా... భార్య అతడిని వదలి వెళ్లిపోతుంది. దీంతో హీరో కొడుకును తీసుకుని హైదరాబాద్ వ స్తాడు. ఈ రకంగా నేపథ్యాన్ని మార్చినా... ఇక్కడి నుంచి ఇక హీరోకి ఎదురయ్యే అనుభవాలన్నీ హాలీవుడ్ సినిమాకు అనుకరణగా రాసుకున్నవే. కొడుకుతో కలిసి ఒక రాత్రి రైల్వేస్టేషన్ బాత్రూమ్లో తల దాచుకోవాల్సి వస్తుంది హీరోకి. ఈ సీన్లో విల్‌స్మిత్ నటన కన్నీటిని తెప్పిస్తుంది. ఈ సన్నివేశాన్ని తెలుగు సినిమాలో కూడా యథాతథంగా వాడుకున్నారు. హాలీవుడ్ వెర్షన్లో హీరో తన దగ్గరే మిగిలిపోయిన ఎక్స్‌రే మిషన్‌ను అమ్మడానికి హీరో ప్రయత్నం చేస్తుంటాడు. తెలుగులో హీరో చేతిలో డిక్షనరీలు పెట్టారు. ఇలాంటి చిన్న చిన్న మార్పులు, అనుకరణలు ఎన్నో ఉన్నా... ఏ దశలోనూ తెలుగు సినిమా హాలీవుడ్ డ్రామాను రీచ్ కాలేదు. అమెరికా నేపథ్యంలో సాగే కథను లోకలైజ్ చేయబోయి... గొప్ప కాన్సెప్ట్‌ను సాధారణ స్థాయికి తీసుకొచ్చేశారు రూపకర్తలు. అందుకే ఈ సినిమా ఎప్పుడొచ్చి వెళ్లిందో కూడా చాలామందికి తెలియదు! వాస్తవానికి విల్‌స్మిత్ సినిమాలో ఉన్న గొప్పదనం... నాటకీయమైన కథలోనిది కాదు. ఆ చిత్రంలోని అందమంతా దాని నిజాయితీలో ఉంది. ప్రతి సన్నివేశం ఎంతో వాస్తవికంగా, మనసును తడిమేలా ఉంటడమే దాని సక్సెస్ సీక్రెట్. అలాంటి ఫీల్ తెలుగు సినిమాలో మిస్ అయ్యింది! అందుకే... పరాజయాల లిస్టులో చేరిపోయింది! - బి.జీవన్‌రెడ్డి -
‘బిగ్’ కాపీ!
ఆ సీన్ - ఈ సీన్ రామాయణంలోని వాలి, సుగ్రీవుల కథ ఆధారంగా ఎస్జే సూర్య ‘వాలి’ సినిమాని రూపొందించి ప్రశంసలు అందుకున్నాడు. అయితే భారతీయ ఇతిహాసం నుంచి కాన్సెప్ట్‌ను లిఫ్ట్ చేయడంలో మంచి ప్రతిభను ప్రదర్శించిన సూర్య... ఒక విదేశీ సినిమా నుంచి కాన్సెప్ట్‌ను లేపుకొచ్చి మాత్రం ఫెయిలయ్యాడు. కాపీ కొడితే కొట్టాడు... కనీసం పాసయినా అయ్యాడా అంటే అదీ లేదు. ప్రఖ్యాత హాలీవుడ్ నటుడు టామ్ హాంక్స్ యువకుడిగా ఉన్నప్పుడు వచ్చిన సినిమా ‘బిగ్’. 1988లో విడుదలైన దీన్ని 2004లో తనదైన ధోరణిలో ‘నాని’గా తీసి మనకు చూపించాడు సూర్య. మహేశ్ బాబు, అమీషా పటేల్ నటించారు. ‘చందమామ కథ’లాంటి సినిమా ‘బిగ్’. ఈ మాట చాలు ఆ సినిమా ఎంత సరదాగా, హుందాగా, చక్కగా ఉంటుందో చెప్పడానికి. జోష్ బక్సిన్ అనే పన్నెండేళ్ల పిల్లాడు ఓసారి కార్నివాల్‌ను చూడటానికి వెళ్తాడు. అక్కడ అతీత శక్తులున్న ఒక మిషన్ దగ్గర నేను ఉన్నపళంగా పెద్ద వాడిని అయిపోవాలి అనే ఆకాంక్షను వ్యక్తం చేస్తాడు. అంతే... రాత్రికి రాత్రి పెద్దవాడైపోతాడు. హాలీవుడ్ సినిమాలో తెలిసీ తెలియక కుర్రాడు వ్యక్తపరిచిన కోరికతో ముప్ఫై ఏళ్లవాడిగా మారిపోతే.. ఎస్జే సూర్య మాత్రం దీనికి ‘సైన్స్’ని యాడ్ చేశాడు. ‘సైన్స్’ పేరుతో ఒక పాత్రను క్రియేట్ చేసి అతడు ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల ఎనిమిదేళ్ల కుర్రాడు 28 ఏళ్ల వాడిగా మారి మహేశ్ బాబుగా కనిపించేలా చూపించాడు. ఆదిలో ఈమాత్రం తేడాను చూపించినా, అక్కడి నుంచి చాలా వరకూ హాలీవుడ్ సినిమా బాటనే అనుసరించాడు. తమ బాబు ఎక్కడకు వెళ్లాడో తెలియని పరిస్థితుల్లో ఇంట్లో వాళ్లు కిడ్నాప్ అయ్యాడేమోనని పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతుంటారు. ఉన్నపళంగా పెద్దవాడై పోవడం కొంత సరదాగానే అనిపించినా.. తల్లిదండ్రులను మిస్ అవుతున్నానే బెంగ పట్టుకుంటుంది హీరోకి. తను ఇలా మారి పోయాను అని చెబితే ఎవరూ నమ్మరు. ఆఖరికి స్నేహితుడొకడు నమ్ముతాడు. ఇంతలో కుర్రాడిలా మారిన ఈ పిల్లాడిని చూసి ఒక అమ్మాయి ప్రేమలో పడిపోతుంది. హాలీవుడ్ సినిమాలో తన ప్రమేయం లేకుండా హీరో ఆమెతో డేటింగ్‌కు సిద్ధపడాల్సి వస్తుంది. తెలుగు సినిమాలో మాత్రం ఏకంగా హీరోకి పెళ్లే చేసేశారు! ఇక్కడి నుంచి హాలీవుడ్ వెర్షన్ హుందాగా సాగితే, తెలుగు వెర్షన్ మాత్రం విమర్శల పాలయ్యింది. ‘బిగ్’ సినిమాలో పెద్దవాడైన పిల్లవాడితో హీరోయిన్ ప్రేమ, వారి సాన్నిహిత్యం... ఇదంతా సున్నితంగా, సరదాగా ఉంటుంది. కానీ ఇక్కడ అలా ఉండదు. ఒక వైపు ప్రియురాలి ప్రేమను ఆస్వా దించడం బాగానే అనిపించినా, మిస్ అవు తున్న తల్లిప్రేమ కోసం తను తిరిగి చిన్న వాడైపోయే ప్రయత్నాల్లో ఉంటాడు హీరో. అందుకోసం ‘బిగ్’లో మాయాయంత్రం కోసం వెదుకుతూ ఉంటాడు. ఆ కార్నివాల్ తమ ఊరి నుంచి తరలి వెళ్లిపోవడంతో దాని గురించి శోధన సాగిస్తుంటాడు. తెలుగులో మాత్రం హీరో ‘సైన్స్’ను ఆశ్రయిస్తాడు. మూల కథనూ, ఉన్నట్టుండి పెద్దాడయిపోవడంతో బాల్యాన్ని మిస్ అయ్యే హీరో భావోద్వేగాలనూ, అతడిని ఎవరూ గుర్తించకపోవడం, హీరోకి బొమ్మలు తయారు చేసే కంపెనీలో ఉద్యోగం రావడం, చిన్నపిల్లాడి మనస్త త్వమే ఆ ఉద్యోగంలో అతడికి పేరు తెచ్చిపెట్టడం వంటి అంశాలను ‘బిగ్’ నుంచి యథాతథంగా తీసుకున్నారు. అయితే ‘బిగ్’లో హీరో తనను పెద్దవాడిగా మార్చేసిన మాయాయంత్రం ద్వారా తిరిగి బాల్య దశలోకి వెళ్లిపోతాడు. వెళ్లేముందు హీరోయిన్ని కూడా బాల్యదశలోకి రమ్మని కోరతాడు. కానీ ఆమె నిరాకరిస్తుంది. దాంతో వారి ప్రేమకథకు తెర పడుతుంది. కానీ తెలుగులో మాత్రం హీరో మళ్లీ చిన్నగా మారే ప్రయత్నం విఫలం కావడంతో, పగలు పిల్లాడిగా, రాత్రిపూట పెద్దవాడిగా జీవితాంతం కొనసాగినట్టుగా చూపించారు. ఇలా సొంత క్రియేటివిటీని వాడటం మంచిదే అయినా, అందులో ఏమాత్రం సహజత్వం లేకపోవడం అనేదే ఫెయిల్యూర్‌కి దారి తీసిందేమో! - బి.జీవన్‌రెడ్డి -
కథ వాళ్లది... క్రియేటివిటీ మనది!
ఆ సీన్ - ఈ సీన్ రాయలసీమ నేపథ్యాన్ని వెండితెరపై ఆవిష్కరించిన సినిమాల్లో ఒకటి. ఇళయ రాజా సెకెండ్ ఇనింగ్స్ మొదలుపెట్టాక వచ్చిన మంచి మ్యూజికల్ హిట్. కృష్ణ వంశీ ప్రతిభని ఆవిష్కరించిన సినిమా. ప్రకాష్‌రాజ్‌కు జాతీయ అవార్డును సంపా దించి పెట్టిన సినిమా. తమిళం, హిందీ వంటి భాషల్లో రీమేక్ అయిన సబ్జెక్ట్. అంతఃపురం సినిమా గురించి పరిచయం చేయడానికి ఇలాంటివెన్నో చెబుతుంటారు విశ్లేషకులు. అయితే ఈ సినిమాకి సంబం ధించి చాలామందికి తెలియని విశేషం ఒకటుంది. అదేంటంటే ఈ చిత్ర కథ, క్రియేటివ్ డెరైక్టర్ కృష్ణవంశీ క్రియేషన్ కాదు. దీనికి మూలం... ‘నాట్ వితౌట్ మై డాటర్’ అనే హాలీవుడ్ సినిమా! అనుకోకుండా భయంకరమైన మనుషులు, ఊహించని పరిస్థితుల మధ్య చిక్కుకున్న ఒక వివాహిత... ఆ పరిస్థితుల నుంచి కూతురితో పాటు ఎలా బయట పడిందనేది 1991లో వచ్చిన ‘నాట్ వితౌట్ మై డాటర్’ కథాంశం. ఆ తర్వాత ఏడెనిమిదేళ్లకు అదే కథాంశంతో, పాపను బాబుగా మార్చి... సౌందర్య, సాయి కుమార్, ప్రకాష్‌రాజ్, జగపతిబాబులను ప్రధాన పాత్రల్లో పెట్టి ‘అంతఃపురం’ను రూపొందించారు కృష్ణవంశీ. అయితే భిన్నమైన నేపథ్యంతో, భిన్న పరిస్థితుల కల్పనతో తెలుగు వెర్షన్ చిత్రీకరణ జరిగింది. పాత్రల స్వభావాలు మారాయి, కొత్త పాత్రల సృష్టి జరిగింది. అవే తెలుగు వెర్షన్‌ను సక్సెస్ చేశాయి. కాపీ అన్న అనుమానం రాకుండా చేశాయి. ‘నాట్ వితవుట్ మై డాటర్’ కథని పరిశీలిస్తే... అమెరికాలో సెటిలైన ఓ ఇరానీ డాక్టర్... ఒక అమెరికన్ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. వారికి ఒక పాప పుడుతుంది. తప్పనిసరి పరిస్థితు లేవో ఏర్పడటంతో... ఇరాన్లో ఉన్న తమ కుటుంబాన్ని చూసి వద్దామని అతడు ప్రతిపాదిస్తాడు. తిరిగి అమెరికాకు వచ్చేద్దా మని హామీ ఇవ్వడంతో భార్య సరే అంటుంది. తీరా ఇరాన్లో అడుగుపెట్టాక... ఆడది ముఖానికి ముసుగు వేసుకోవాల్సిందేననే ఛాందసవాదం అమెకు స్వాగతం పలుకుతుంది. ఇక అక్కడ్నుంచి అడుగడుగునా ఇబ్బందులే. అమెరికాలో ఎంతో స్వేచ్ఛగా పెరిగిన ఆమెకు ఇరాన్‌లోని భర్త కుటుంబ ఛాందసత్వం నరకాన్ని తలపింపజేస్తుంది. నాలుగేళ్ల కూతురిని కూడా తమ పద్ధతు లతో పెంచాలని అత్తమామలు భావించే సరికి తట్టుకోలేక ఎదురు తిరుగుతుంది. అమెరికా వెళ్లిపోదామంటుంది. కానీ భర్త ఒప్పుకోడు. అమెరికా వెళ్లేది లేదని స్పష్టం చేస్తాడు. చివరకు ఆమెను చంపడానికి కూడా వెనుకాడనంటాడు. నిర్ఘాంతపోయిన ఆమె ఎలా బయట పడుతుంది, బిడ్డను తీసుకుని అమెరికా ఎలా చేరుకుందనేది మిగతా కథ. ఈ ఆంగ్ల చిత్రంలో... రెండు సంస్కృతుల మధ్య ఉన్న తేడాలను ఎలివేట్ చేయడానికి ప్రయత్నించాడు దర్శకుడు. భర్తను ఛాందసవాదిగాను, ఇరాన్ కల్చర్‌ను భయంకరమైనదిగాను చూపించారు. కానీ తెలుగుకు వచ్చేసరికి కొన్ని మార్పులు చేశారు కేవీ. ఇరాన్ కల్చర్‌ను రాయలసీమ కల్చర్‌గా మార్చారు. భర్తను మంచివాడిగానే చూపి, ఆ క్యారెక్టర్‌ను అంతం చేశారు. ఆపైన సినిమాను హీరోయిన్ భుజస్కంధాల మీద వేశారు. కొన్ని అదనపు పాత్రలను జోడించి, మనసులకు హత్తుకునే కొన్ని హృద్యమైన సన్నివేశాలను చేర్చారు. అలాగే సౌందర్య తప్పించుకోవడానికి సహాయపడే పాత్రను జగపతిబాబు పోషించారు. ఈ పాత్ర ఆలోచన కేవీది కాదు. హాలీవుడ్ సినిమా లోనూ ఇలాంటి పాత్ర ఉంది. కాకపోతే దాని కంత ప్రాధాన్యత లేదు. కానీ తెలుగులో జగపతిబాబు హీరోయి జాన్ని ఎలివేట్ చేసి, మనసుల్లోకి చొచ్చుకు పోయేలా ఆ పాత్రని మలిచారు. సాధారణంగా రీమేక్ సబ్జెక్టులకు అవార్డులివ్వరు. కాపీ అనిపించినవి కూడా అవార్డులకు అనర్హ మైనవే. కానీ ఈ చిత్రానికి చాలా అవార్డు లొచ్చాయి. జాతీయ స్పెషల్ జ్యూరీ అవార్డు సైతం వచ్చింది. దానిక్కారణం కృష్ణవంశీ. ఎక్కడా కాపీ అనిపించని విధంగా ఈ చిత్రాన్ని మలిచారాయన. కాపీ చేయడంలో మాయను, కథను లోక లైజ్ చేయడంలో అద్భుతమైన ప్రతిభను ప్రదర్శిస్తే... ఎవ్వరైనా ముగ్ధులవ్వాల్సిందే. ఎలాంటి అవార్డులైనా దక్కాల్సిందే! - బి.జీవన్‌రెడ్డి -
పిల్ల జమీందార్ from సౌత్ కొరియా!
ఆ సీన్ - ఈ సీన్ సౌత్ కొరియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ.. హాలీవుడ్‌కు సవాలు విసురుతున్న పరిశ్రమ. వైవిధ్యమైన కథ, కథనాలతో కూడిన సినిమాలతో సుసంపన్నమైన ఇండస్ట్రీ. సినిమాల బడ్జెట్ పరంగా పోలిక లేకపోయినా... విభిన్నమైన కథాంశాలతో సినిమాలను రూపొందించడంలో కొరియన్ ఫిల్మ్మేకర్లు హాలీవుడ్‌కు పోటీనిస్తున్నారనే చెప్పాలి. మరి అలాంటి ఇండస్ట్రీని మనవాళ్లు వదిలిపెడతారా? దాన్నుంచి ‘స్ఫూర్తి’ పొందారు. కొరియన్ క్రియేటర్లను చూసి అలాంటి ధీటైన సినిమాలను రూపొందించడంలో కాదు కానీ.. వారి క్రియేటివిటీని యాజిటీజ్‌గా దించేయడంలో మనోళ్లు ‘స్ఫూర్తి’ని కనబరుస్తున్నారు! దాన్నొక వనరుగా మార్చుకున్నారు. అలాంటి కాపీయిడ్ వెర్షన్ సినిమాల్లో ఒకటి ‘పిల్ల జమీందార్’. నాని, హరిప్రియ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఒరిజినల్ కొరియన్ వెర్షన్ పేరు ‘ఏ మిలియనీర్స్ ఫస్ట్ లవ్’కథకు సంబంధించి ఏదో ఒక మూల పాయింట్‌ను తీసుకుని, దాన్ని లోకలైజ్ చేస్తూ అల్లుకుపోవడం కాదు... ‘కార్బన్ కాపీ’లాగా ఈ సినిమాను రూపొందిం చాడు తెలుగు వెర్షన్ దర్శకుడు అశోక్ . ఒక మల్టీ మిలియనీర్‌కు మనవడు కాంగ్ జే కుంగ్. పబ్‌లు, డిస్కోలు, విందులు, వినోదాల్లో తేలియాడటం ఇతడి తరహా. పద్దెనిమిదేళ్లు నిండి వారసత్వ సంపదకు వారసుడినవుతున్నాననే ఆనందంలో ఉన్న ఈ గర్విష్టికి తాతగారి వీలునామా గురించి తెలుస్తుంది. ఆస్తికి వారసుడు కావడానికి ఉన్న షరతులూ అర్థమవుతాయి. వాటికి తలొగ్గి ఒక పల్లెటూరులో గ్రాడ్యుయే షన్ను పూర్తి చేయడానికి వచ్చిన కాంగ్లో వచ్చే పరివర్తనే మిగతా సినిమా. కేవలం ఈ కథ వరకే కాదు... ‘పిల్ల జమీందార్’ సినిమాలో కొరియన్ మూవీ ఆనవాళ్లు పూర్తిగా కనిపిస్తాయి. హీరో ఇంట్రడక్షన్ షాట్ మొదలుకొని.. మిగతా పాత్రలు, వాటి నేపథ్యాలు, స్వభావాలు, ఆఖరికి చాలా సీన్లలో కూడా బోలెడు పోలికలుంటాయి. 2006లో వచ్చిన ‘ఏ మిలియనీర్స్ ఫస్ట్ లవ్’కు 2011లో వచ్చిన ‘పిల్లజమీందార్’కు తేడాలు కనిపెట్టమంటే అది నిజంగా పెద్ద కసరత్తే. అంత పెద్ద కాపీ మరి! తొలి సగంలో కాంగ్ పాత్రలోని గర్వాన్ని ఎలివేట్ చేసే సన్నివేశాలనే తెలుగులో యథాతథంగా వాడుకొన్నారు. కాలేజీలో వరండాల్లోకి అతడు బైక్‌పై దూసుకురావడం, లెక్చెరర్లతో దురుసుగా ప్రవర్తించడం, ‘నేటితో నాకు 18 యేళ్లు నిండాయి, వేల కోట్లకు అధిపతిని అయ్యాను’ అని వారికి గర్వంగా చెప్పడం, సర్టిఫికెట్స్‌ను కూడా నిర్లక్ష్యంగా పడేసి రావడం వంటి సీన్లు హీరో స్వభావాన్ని ఆవిష్కరిస్తాయి. ఈ సీన్లను కాస్త కూడా మార్చే ప్రయత్నం చేయకుండా మక్కీకి మక్కీ దించేశారు. ఇక్కడి నుంచి మొదలయ్యే కాపీకళ సినిమా నడిచేకొద్దీ ఓ రేంజ్‌కి చేరుకుంటుంది! ప్రత్యేకంగా కమెడియన్లు లేకుండా చక్కటి ఫన్ పండే సినిమా ‘పిల్ల జమీందార్’. అయితే ఆ ఫన్ కూడా కొరియా నుంచి కొరియర్ చేసి తెచ్చుకొన్నదే. విలాసవంతంగా బతికిన హీరో ఒక ట్రస్టుకు సంబంధించిన హాస్టల్లో ఉండి, తను తాకడానికి కూడా ఇష్టపడని మనుషుల మధ్య బతకాల్సి రావడంతో అతడు పడే ఇబ్బందుల నుంచి జనరేట్ అయ్యే కామెడీని కూడా పక్కాగా దించేశారు. గర్విష్టి అయిన హీరో నాని మంచి వాడిగా మారే క్రమం, అతని చిన్నప్పటి ఫ్లాష్‌బ్యాక్ సీన్, ఆ క్యారెక్టర్ ట్రాన్స్ ఫార్మేషన్, అందుకు తగ్గట్టుగా వచ్చే సన్నివేశాలు కొరియన్ వెర్షన్వే వాడుకున్నారు. కాకపోతే కాస్తో కూస్తో లోకలైజ్ చేశారంతే. సెకెండాఫ్‌లో వచ్చే ఈ సన్నివేశాల్లో సందేశం మోతాదు కొంత ఎక్కువయ్యిందనిపిస్తుంది. అయితే మన తెలుగు దర్శకుడికి మాత్రం అది ఎక్కువని పించలేదు. అందుకే కాపీ చేసేశారు పాపం! అలాగే కొన్ని సీన్ల విషయంలో అమెరికన్ కామెడీ ఫిల్మ్ ‘బిల్లీ మాడిసన్’ ఛాయలు కూడా మన ‘పిల్ల జమీం దార్’లో కనిపిస్తాయి. కథాంశం పరంగా 1995లో వచ్చిన ఆ హాలీవుడ్ సినిమా కొంచెం ఈ తరహాలోనే ఉంటుంది. ఇలా ఒరిజినల్ దర్శకులకు క్రెడిట్ ఇవ్వకుండా కాపీ చేసేసిన సినిమాలను ‘ఫ్రీమేక్’ అని అంటారు. మన పిల్ల జమీందార్ గారు అలా పెరిగినవాడే! - బి.జీవన్‌రెడ్డి -
ఈ రోజా విరిసింది ఏ వనంలో..?!
ఆ సీన్ - ఈ సీన్ ‘రోజా’... భారతీయ సినిమా చరిత్రలో ఎపికల్ స్టేటస్ ఉన్న సినిమా. కశ్మీర్లో నెలకొన్న పరిస్థితుల ఆధారంగా మణి రత్నం సృజించిన అద్భుత ప్రేమకావ్యం. భార్యాభర్తల బంధాన్ని అద్భుతంగా ఆవి ష్కరించిన చిత్రం. ఇలా చెబుతూ పోతే ‘రోజా’ గురించి ఎంతైనా చెప్పవచ్చు. ఇంతకీ ఈ రోజా విరిసింది ఏ వనంలో?! భారతీయ పురాణాలను ఆధారంగా చేసుకుని సినిమాలను సృజించడంలో మణిరత్నానిది అందెవేసిన చెయ్యి. దుర్యోధనుడు, కర్ణుడి మధ్య స్నేహాన్ని నేటి కాలానికి అనుగుణంగా సోషలైజ్ చేస్తూ ‘దళపతి’ చిత్రాన్ని ఆవిష్కరించా డాయన. ఆ తర్వాత ‘రోజా’లో కూడా భారతీయ పురాణాల ఛాయలు ఉన్నా యని, ఈ కథను సావిత్రి-సత్యవంతుల స్ఫూర్తితో మణి రూపొందించాడనేది కొంతమంది అభిప్రాయం. భర్త ప్రాణాల కోసం యముడితో పోరాడే సావిత్రిలాగే ‘రోజా’ కూడా భర్త కోసం కశ్మీర్లో టైస్టులతో పోరాటం చేస్తుందనే భాష్యం చెబుతూ ఉంటారు. అయితే రోజా పాత్రలో సావిత్రి నైజం ఉంది కానీ.. అంతకు మించి ఆ పురాణానికీ ఈ సినిమా కథకూ ఎలాంటి సంబంధం లేదు. అలా అని దేనితోనూ పోలికలు లేవా అంటే మాత్రం లేవని చెప్పలేం. ఎందు కంటే ‘రోజా’ సినిమాకూ 1970లో వచ్చిన ఇటాలియన్ సినిమా ‘ఐ గిరసోలి’కీ చాలా పోలికలుంటాయి. మొదటి పోలిక టైటిల్ దగ్గరే మొదలవుతుంది. ఇటాలియన్ భాషలో ‘ఐ గిరసోలి’ అంటే ‘సన్ ఫ్లవర్’ (పొద్దు తిరుగుడు పువ్వు) అని అర్థం. అందుకే ఆంగ్లంలోకి ఆ చిత్రాన్ని ‘సన్ ఫ్లవర్’ పేరుతో డబ్ చేశారు. అక్కడ ఆ పువ్వు పేరుతో రూపొందితే ఇక్కడ అంతకన్నా అందమైన ‘రోజా’ పువ్వు పేరుతో సినిమా తయారైంది! ‘ఐ గిరసోలి’ క థ రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంతో సాగుతుంది. ఇటా లియన్ సైనికుడిగా రష్యాలో యుద్ధం చేయడానికి వెళ్లిన తన భర్త యుద్ధం ముగిసిన తర్వాత కూడా తిరిగి రాకపోవ డంతో అతడిని వెతుక్కుంటూ వెళుతుంది భార్య జియోవనా. ఎంతకూ అతడి జాడ దొరకదు. సైనికాధికారులను అడిగితే... అతడు మిస్సింగ్ సోల్జర్స్ జాబితాలో ఉన్నాడని, బహుశా ఎవరైనా కిడ్నాప్ చేసి ఉండవచ్చునని అంటారు. అలాంటి సైని కులు ఎంతోమంది ఉన్నారని, నీ భర్త విషయంలో ప్రత్యేకంగా ఏమీ చేయలేమని తేలికగా మాట్లాడతారు. అది జియోవనాని చాలా బాధిస్తుంది. అంత పెద్ద యుద్ధంలో తన భర్త సామాన్యుడే అయ్యుండవచ్చు, కానీ తన జీవితానికి మాత్రం తనే ఊపిరి. అందుకే ఆమె అతడిని వెదకడం ప్రారంభి స్తుంది. యుద్ధబీభత్సంతో భయోత్పా తంగా మారిన పరిసరాల మధ్య ఆమె అతడిని కనుగొంటుంది. అలా సాగు తుంది ‘ఐ గిరసోలి’ సినిమా. ఇక రోజా కథ ప్రత్యేకంగా చెప్పనవ సరం లేదు. ఇండియన్ మిలటరీకి సహా యంగా వెళ్లిన ఇంజనీర్ రిషికుమార్ (అరవింద్‌స్వామి)ని వేర్పాటువాద ఉగ్ర వాదులు అపహరించుకుపోవడం, అతడితో పాటు వెళ్లిన అతడి భార్య రోజా (మధుబాల) అతడిని భారత మిలటరీ సాయంతో వెదకడం, రిషిని వదలాలంటే తమవారిని జైలు నుంచి విడిచి పెట్టాలని తీవ్రవాదులు డిమాండ్ చేయడం, చివరకు కథ సుఖాంతం కావడం జరుగుతుంది. ఈ కథలో కశ్మీరీ వేర్పాటువాదపు అంశం గురించి చర్చించడంతో పాటు భర్తను ఉగ్రవాదుల చెర నుంచి విడిపించుకోవ డానికి ఒక సాధారణ యువతి చేసే ప్రయత్నాన్ని అద్భుతంగా చూపారు మణిరత్నం. ఈ విషయంలోనే ‘ఐ గిరసోలి’కి ‘రోజా’కు పోలికలు కని పిస్తాయి. అయితే రెండు సినిమాల ప్రారంభాలు, ముగింపులు వేరే రకంగా ఉంటాయి. కానీ క్రిటిక్స్ మాత్రం 1970లో వచ్చిన ‘ఐ గిరసోలి’ నుంచి మణిరత్నం స్ఫూర్తి పొందాడని అంటారు. అయితే మణిరత్నం సినిమా చాలా వరకూ వాస్తవిక సంఘటనలను స్పృశిస్తుంది. ప్రస్తుతం జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రిగా ఉన్న ముఫ్తీమహ్మద్ సయీద్ కూతురు మెహబూబా ముఫ్తీని వెనుకటి రోజుల్లో వేర్పాటువాద తీవ్రవాదులు అపహరిం చడం, ఆమెను విడిపించడానికి ప్రభుత్వం కొంతమంది తీవ్రవాదులను విడుదల చేయడాన్ని కూడా ‘రోజా’లో పరోక్షంగా ప్రస్తావించడం జరుగుతుంది. అసలు మణిరత్నం ఆ సంఘటన స్ఫూర్తితోనే ‘రోజా’కథను తయారు చేశాడనే వాదనలు విన్నప్పుడు మాత్రం ఈ ‘రోజా’ మనవద్ద విరిసినదే అనిపిస్తుంది. - బి.జీవన్‌రెడ్డి -
కాపీ హాసన్!
ఆ సీన్ - ఈ సీన్ ‘పంచతంత్రం’... రిటన్ బై కమల్ హాసన్. ‘పోతురాజు’... డెరెక్టైడ్ బై కమల్ హాసన్. విశ్వనాయకుడు ముఖ్యపాత్రల్లో నటించి రూపొందించిన సినిమాలు ఇవి. మొదటిది 2002లో వచ్చింది. మరోటి 2004లో వచ్చింది. ఇవి సూపర్‌హిట్ సినిమాలు. ఇంకో పోలిక ఏమిటంటే.. రెండు సినిమాల్లోనూ విదేశీ సినిమాల ప్రభావం కనిపిస్తుంది. కమల్ విదేశీ సినిమాల స్ఫూర్తితో సినిమాలు రూపొందిస్తాడనే వాదనకు బలాన్ని ఇస్తాయివి. అయితే కమల్ ఎలాంటి కథనైనా లోకలైజ్ చేయగలడు.. మూలాల ప్రభావం లేకుండా తన సృజనాత్మకతను చాటగలడు అనే మాటకు కూడా రుజువులు ఈ సినిమాలు. తమిళనాడు గ్రామీణ సంప్రదాయాలను కళ్లకు కట్టిన సినిమా ‘పోతురాజు’. తమిళంలో ‘వీరుమాండి’ పేరుతో రూపొందిన ఈ సినిమా అంతర్లీనంగా ఇండియన్ పీనల్ కోడ్‌లోని ఉరిశిక్షపై గొప్ప చర్చలా సాగుతుంది. అత్యంత వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో ఉరి రద్దు డిమాండ్‌ను వినిపించే కమల్ దర్శకత్వ ప్రతిభకు ఎవరైనా ముగ్ధులు కావాల్సిందే. ఈ అద్భుత సినిమా కథ, కథనాల క్రెడిట్ పూర్తిగా కమల్‌కే దక్కుతాయి. అయితే ఈ కథా కథనాలను వినిపించే విధానంలోనే కమల్‌పై ‘రషోమన్ ఎఫెక్ట్’ కనిపిస్తుంది. జపాన్ దర్శకుడు అకిరా కురసోవా ‘రషోమన్’ సినిమా కథను చెప్పిన పద్ధతిలోనే కమల్ ‘పోతురాజు’ కథను వివరించాడు. ‘నీకు తెలిసింది ఒకటి.. నాకు తెలిసింది మరోటి.. అసలు నిజం ఇంకోటి’ అనే తాత్వికతను తెరపై ఆవిష్కరించేదే ‘రషోమన్ ఎఫెక్ట్’. అకిరా కురసోవా తన ‘రషోమన్’ స్క్రిప్ట్ విషయంలో తొలిసారి ఈ ప్రక్రియను అనుసరించాడు. దీంతో దీనికి రషోమన్ ఎఫెక్ట్‌గా పేరు. ఇదెలా ఉంటుందంటే పోతురాజు సినిమాలో చూపినట్టుగా... మొదట కథ అంతా విలన్ పశుపతి పాత్ర ద్వారా చెప్పిస్తారు. ఆ తర్వాత అవే సంఘటనల గురించి కమల్ చేసిన పోతురాజు పాత్ర చేత చెప్పిస్తారు. పరస్పర విరుద్ధమైన తీరున కథను వివరిస్తాయి ఆ పాత్రలు. 1950లో వచ్చిన రషోమన్ సినిమాతో ఇలా కథను వివరించాడు అకిరా. తర్వాత ఆ పద్ధతిని అనుకరిస్తూ ఎన్నో సినిమాలు వచ్చాయి. అలాంటి వాటిలో ‘పోతురాజు’ కూడా ఒకటి. ఇక్కడ స్పష్టమయ్యే విషయం ఏమిటంటే.. కథ చెప్పే విధానంలో కమల్ అకిరాను ఫాలో అయ్యాడేమో కానీ, అసలు కథ, కథనాల విషయంలో మాత్రం అణువణువునా కమల్ శ్రమ కనిపిస్తుంది. అది పోతురాజు వెనుక ఉన్న కథ. ఇక ‘పంచతంత్రం’ సంగతి. ఐదుగురు స్నేహితులు. ఉల్లాసంగా గడపడానికి బయలుదేరతారు. బ్యాచిలర్ పార్టీ ఏర్పాటు చేసుకుని ఒక కాల్గాళ్తో ఆనందించాలనేది వారి ప్రణాళిక. ఈ ప్రయత్నంలో వారు అనుకోని చిక్కుల్లో పడతారు. ఈ చిన్న పాయింట్‌ను మాత్రమే అమెరికన్ సినిమా ‘వెరీ బ్యాడ్ థింగ్స్’ నుంచి తెచ్చుకొన్నారు కమల్. దాన్ని గొప్ప కామెడీ ఎంటర్ టైనర్‌గా మార్చి లోకలైజ్ చేస్తూ ‘పంచ తంత్రం’ కథను తీర్చిదిద్దాడు. ఎలాంటి బ్యాడ్ మూడ్‌నైనా మార్చేసి మనసును తేలిక పరిచే సినిమా ‘పంచతంత్రం’. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో కమల్‌తో సహా నలుగురు దక్షిణాది నటులు ముఖ్యపాత్రల్లో నటించిన సినిమా ఇది. ఆద్యంతం నవ్వులు పండించే ఈ సినిమాకు కమల్, క్రేజీ మోహన్‌లు రచ నా బాధ్యతలు తీసుకున్నారు. ‘వెరీ బ్యాడ్ థింగ్స్’ అనేది ఒక ట్రాజెడీ మూవీ. అయితే పంచతంత్రం మాత్రం ఆద్యంతం నవ్వులు పంచుతుంది. ట్రీట్మెంట్ విషయంలో రెండు సినిమాలకూ ఎక్కడా పోలిక ఉండదు. అయితే మూల కథ కాపీ అనే ముద్ర మాత్రం మిగిలిపోయింది. - బి.జీవన్‌రెడ్డి -
అరుణాచలం మేడిన్ అమెరికా!
ఆ సీన్ - ఈ సీన్ జార్జ్‌బార్ మెక్‌కుచ్చన్ అనే అమెరికన్ రచయిత ‘బ్రెస్టర్ మిలియన్స్’ నవలను 1902లో రాశాడు. హాలీవుడ్లో ఈ నవల ఆధారంగా ఆరు సినిమాలు వచ్చాయి. మన దగ్గర మూడు వచ్చాయి. హెచ్.ఎం. రెడ్డి దర్శకత్వంలో ఎన్టీ రామారావు హీరోగా ‘వద్దంటే డబ్బు’ సినిమాకు మూల కథను ‘బ్రెస్టర్ మిలియన్స్’ కథాగమనాన్ని అనుసరించి సంగ్రహించారు. 1988లో బాలీవుడ్లో నిసీరుద్దీన్ షా ప్రధానపాత్రలో ‘మాలామాల్’ రూపొందింది. జంధ్యాల దర్శకత్వంలో బాలకృష్ణ సినిమా ‘బాబాయ్ అబ్బాయ్’లోనూ ఈ ఛాయలు కనిపిస్తాయి. అయితే మెక్ నవల, 1985లో వచ్చిన ‘బ్రెస్టర్ మిలియన్స్’ సినిమాల జాడ ఎక్కువగా కనిపించేది మాత్రం ‘అరుణాచలం’ సినిమాలో మాత్రమే. సినీ సృజనలో కాపీ అనేది చాలా సహజమైన ప్రక్రియ. అయితే కాపీ చేసినప్పుడు అసలైన సృజనకారులకు క్రెడిట్ ఇస్తే... కాపీ కొట్టిన వాళ్లు కూడా గొప్పవాళ్లే అవుతారు. భారతీయ కాపీ రాయుళ్లలో ఇలాంటి స్పృహ కనిపించదు. కానీ, ప్రేక్షకులు మాత్రం స్పృహలోనే ఉంటారు. కాపీ కథల జాడను పట్టేస్తారు. ఈ అరుణాచలం కూడా అంతే. అడ్డపంచెలో వచ్చి పలకరించినా ఇతడి మూలాలు మాత్రం అమెరికాలో ఉన్నాయి! ముప్పై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. గడువు ముప్పై రోజులే. ఆస్తులు కొనకూడదు, అప్పుగా ఇవ్వకూడదు. దానధర్మాలు చేయరాదు. అంతా ఖర్చు పెట్టాలి. డబ్బు ఖర్చు పెట్టడంపై విసుగొచ్చేలా ఖర్చు పెట్టాలి. డబ్బుపై మమకారం పోయేలా ఖర్చు చేయాలి. అరుణాచలం సినిమాలో ఒక తండ్రి తనయుడికి పెట్టే పరీక్ష ఇది. ఈ ముప్పై కోట్ల రూపాయలను ఖర్చు పెట్టే పరీక్షలో ఉత్తీర్ణుడు అయితేనే తన మూడువేల కోట్ల రూపాయల ఆస్తి తనయుడికి దక్కేలా వీలునామా రాసి ఉంటాడాయన. రజనీకాంత్ హీరోయిజాన్ని సరికొత్త రీతిలో ఎలివేట్ చేసిన సినిమా ‘అరుణాచలం’ మూల కథ ఇది. సుందర్.సి దర్శకత్వంలో 1997లో వచ్చిన ఈ సినిమా దక్షిణాదిలో సూపర్‌హిట్ అయింది. కేవలం రజనీకాంత్ స్టైల్స్, మ్యానరిజమ్స్ మాత్రమే కాకుండా అత్యంత ఆసక్తిగల రీతిలో సాగే ఈ సినిమా కథ, కథనాలు కూడా ‘అరుణాచలం’ సినిమా సూపర్‌హిట్ కావడానికి కారణాలే. ఇందులో రజనీకాంత్ స్టైల్స్ మాత్రమే ఒరిజినల్. కథాగమనం కాపీ కొట్టిందే. ఆ నవల పేరు, సినిమా పేరు కూడా ‘బ్రెస్టర్ మిలియన్స్’. మాంటీ బ్రెస్టర్ ఓ క్లబ్లో బేస్‌బాల్ ప్లేయర్. స్పైక్ నోలన్ అనే బెస్ట్‌ఫ్రెండ్ కోసం ఓ గొడవలో తలదూర్చి అరెస్ట్ అవుతాడు. నోలన్ కూడా జైలు పాలవ్వడంతో వీరిని విడిపించేవాళ్లే ఉండరు. ఇలాంటి సమయంలో ఒక అపరిచితుడు వచ్చి తనతో పాటు న్యూయార్క్ సిటీకి రావాలనే షరతు మీద బెయిల్ ఇప్పిస్తాడు. జైలు నుంచి బయటపడితే చాలని ఆ షరతుకు ఒప్పుకొని స్నేహతుడితో కలసి న్యూయార్క్ వెళతాడు బ్రెస్టర్. బ్రెస్టర్కు పెదనాన్న వరుసయ్యే రూపర్ట్ హార్న్ శ్రీమంతుడు. తనకంటూ ఎవరూ లేని స్థితిలో మరణించిన ఆ పెద్దాయన తన ఆస్తిపాస్తులన్నింటినీ రక్తసంబంధీకులకే దక్కాలనుకుంటాడు. అయితే వారికి ధనం మీద వ్యామోహం ఉండకూడదు, మనీమేనేజ్మెంట్లో గొప్ప నైపుణ్యం ఉండి తీరాలనే భావనతో... ముప్పై రోజుల్లో ముప్పై మిలియన్ల మొత్తాన్ని ఖర్చు పెట్టే షరతు పెడతాడు. తన వీలునామాను వివరించే వీడియో క్యాసెట్‌ను, తన ఆస్తులను సన్నిహితులయిన పెద్దమనుషులకు అప్పగించి ఉంటాడు. బ్రెస్టర్ను న్యూయార్క్‌కు తీసుకొచ్చిన అపరిచితుడు ఈ కథంతా వివరించడంతో... ముప్పై మిలియన్‌డాలర్ల చాలెంజ్‌ను స్వీకరిస్తాడు హీరో. ఆ తర్వాత ఎలా విజయం సాధించాడనేది అరుణాచలం సినిమాలో చూసేశాం. మిలియన్లు మన కరెన్సీలో కోట్లు అయ్యాయి. ముప్పై రోజుల కాన్సెప్ట్ మారలేదు. హీరోను పరిచయం చేసే బ్యాక్‌గ్రౌండ్‌ను సెంటిమెంట్లతో లోకల్ టచ్ ఇచ్చారు. అరుణాచలం తమిళ, తెలుగు వెర్షన్లలో డబ్బును ఖర్చు పెట్టడానికి హీరో ప్రయత్నిస్తున్నప్పుడు అడ్డంకులు సృష్టించే పన్నాగాలు, వ్యూహాలు, హీరో ఎత్తులు కూడా మూలంలోనివే. - బి. జీవన్‌రెడ్డి -
అరువు తెచ్చుకున్న చిరునవ్వు..!
ఆ సీన్ - ఈ సీన్ మనిషిని పోలిన మనిషి.. సినిమాను పోలిన సినిమా. మొదటిది యాదృచ్ఛికం, రెండోది ప్రయత్నపూర్వకం. సప్తసముద్రాలవతల ఎక్కడో తీసిన ఒక సినిమాను మనమూ చూసే అవకాశాన్నిస్తున్నాయి ఈ ప్రయత్నాలు. అయితే ఇంగ్లిష్ సినిమాలు బాగా చూసే వారికి ‘కాపీ రా బాబూ..’ అనిపిస్తుంటాయి! అలాంటి వాటిలో ఇదీ ఒకటి. 1997 నాటి ఇటాలియన్ సినిమా ‘లా విటా ఈ బిల్లా’ (ఇంగ్లిష్‌లో.. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ) విడుదలైనప్పుడు రివ్యూయర్లు ఆ సినిమాకు సరదాగా ఒక ట్యాగ్‌లైన్ ఇచ్చారు. ‘మీరు అమ్మాయిలను పడగొట్టాలనుకొంటుంటే ఈ సినిమాను చూడండి..’ అని. ఆ సినిమాలో హీరోయిన్ను పడేయడానికి హీరో ప్లే చేసే ట్రిక్స్ ఆకట్టుకొనేలా ఉండటంతో ఆ లైన్ యాడ్ అయ్యింది. మరి అబ్బాయిలు ఎవరైనా ఆ ప్రయత్నం చేశారో లేదో కానీ... ఆ సినిమా తెలుగు ప్రేక్షకులను పడగొట్టడానికి మాత్రం బాగా ఉపయోగపడింది! కాపీ అనుకొన్నా, స్ఫూర్తి అనుకొని సమాధానపడినా... ఆ ఇటాలియన్ సినిమా ఆధారంగా ఒక తెలుగు సినిమాను చేసేసి మనకు చూపించేశారు. బాధలోనూ చిరునవ్వును వీడకూడదన్న తత్వాన్ని చాటే ఆ సినిమాను మనోళ్లు అచ్చంగా ‘చిరునవ్వుతో’ పేరుతో దించేశారు. ‘చిరునవ్వుతో’లో వేణు, షహీన్‌లు హీరోహీరోయిన్లుగా రామ్‌ప్రసాద్ దర్శకత్వంలో రూపొంది 2000 సంవత్సరంలో విడుదల అయిన ఆ సినిమా యూట్యూబ్‌లో ఎక్కువ మంది చూసిన తెలుగు సినిమాల్లో ఒకటి. సెన్సిబుల్ సీన్స్‌తో హ్యూమర్ పండించే ఈ సినిమా ఎవరికైనా ఇట్టే నచ్చేస్తుంది. ‘అరే భలే తీశారే..’అనిపిస్తుంది. భలే తీయడం అనే క్రెడిట్ ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమా దర్శక, రచయితలకే దక్కాలి. ఈ సినిమాకు రెండు పార్శ్వాలున్నాయి. రోబర్ట్ బెనిగ్నీ దర్శకత్వంలో అతడే ముఖ్యపాత్రలో నటించగా రూపొందించిన ఈ సినిమాలో తొలిసగం లవ్‌స్టోరీతో సరదాసరదాగా సాగిపోతుంది. రెండో సగం నాజీల విశృంఖల విహారం, హీరో తన తనయుడి అసలు విషయం అర్థంకాకుండా చేయడానికి అంతా ఒక ఆట అని కప్పిపుచ్చుతూ ఆనందపెడుతూ చేసే హృద్యమైన ప్రయత్నాలతో ఉంటుంది. ఉత్తమ విదేశీ చిత్రంగా ఆస్కార్ అవార్డునుకూడా అందుకొన్న ఈ సినిమాలోని తొలిసగం లోని సీన్లను యథాతథంగా ‘చిరునవ్వుతో’ సినిమాలో వాడేసుకొన్నారు. ఆ సినిమాను చూసిన వారికి కాపీ చేసిన సీన్లను గురించి బాగా అవగాహన ఉంటుంది. ఉదాహరణకు... ఒక సీన్లో హీరోయిన్ థియేటర్లోకి వెళ్లడం చూసి అదే సినిమా టికెట్ కొని లోపలకు వెళతాడు హీరో. ఆమె వెనుకవైపు ఉండటంతో తను స్క్రీన్‌వైపు చూడకుండా వెనక్కి తిరిగి ఆమెవైపు చూస్తుంటాడు. ఇక్కడితో మొదలు పెడితే.. హీరోహీరోయిన్ల మధ్య జరిగే సీన్లన్నింటి కీ మాతృక లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమానే. చిరునవ్వుతో సినిమాలో హీరో వేణు తన క్యాప్‌తో గుండు సుందర్శనంతో ఆడే ఫన్నీ గేమ్ ఒరిజినాలిటీ ఇటాలియన్ సినిమాదే. తన ఫ్రెండ్ క్యాప్ తడిసిపోయిందంటూ కొత్త క్యాప్తెచ్చివ్వవా అంటూ హీరోయిన్ సరదాగా దేవుడిని వేడుకోగానే గుండు సుదర్శనం పాత్ర వచ్చి ఆ క్యాప్లాక్కొని తన క్యాప్‌ను అక్కడ పెట్టి వెళ్లడం దానికి సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్ సీన్స్.. ఇలా చెప్పుకొంటూ పోతే చాలా..! రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో వచ్చిన సినిమాను తమ సినిమా నేపథ్యానికి అనుగుణంగా చాలా తెలివిగా సీన్లను కాపీ చేశారు ‘చిరునవ్వుతో’ సినిమా వాళ్లు. అలా అని విమర్శించడానికేం లేదు.. ఎందుకంటే ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమా చూడని, చూసే అవకాశం లేని వారికి ఆ మ్యాజికల్ సీన్లను ‘చిరునవ్వుతో’ చూపించారు కదా! - బి.జీవన్‌రెడ్డి