ఈ రోజా విరిసింది ఏ వనంలో..?!
ఆ సీన్ - ఈ సీన్
‘రోజా’... భారతీయ సినిమా చరిత్రలో ఎపికల్ స్టేటస్ ఉన్న సినిమా. కశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితుల ఆధారంగా మణి రత్నం సృజించిన అద్భుత ప్రేమకావ్యం. భార్యాభర్తల బంధాన్ని అద్భుతంగా ఆవి ష్కరించిన చిత్రం. ఇలా చెబుతూ పోతే ‘రోజా’ గురించి ఎంతైనా చెప్పవచ్చు. ఇంతకీ ఈ రోజా విరిసింది ఏ వనంలో?! భారతీయ పురాణాలను ఆధారంగా చేసుకుని సినిమాలను సృజించడంలో మణిరత్నానిది అందెవేసిన చెయ్యి.
దుర్యోధనుడు, కర్ణుడి మధ్య స్నేహాన్ని నేటి కాలానికి అనుగుణంగా సోషలైజ్ చేస్తూ ‘దళపతి’ చిత్రాన్ని ఆవిష్కరించా డాయన. ఆ తర్వాత ‘రోజా’లో కూడా భారతీయ పురాణాల ఛాయలు ఉన్నా యని, ఈ కథను సావిత్రి-సత్యవంతుల స్ఫూర్తితో మణి రూపొందించాడనేది కొంతమంది అభిప్రాయం. భర్త ప్రాణాల కోసం యముడితో పోరాడే సావిత్రిలాగే ‘రోజా’ కూడా భర్త కోసం కశ్మీర్‌లో టైస్టులతో పోరాటం చేస్తుందనే భాష్యం చెబుతూ ఉంటారు. అయితే రోజా పాత్రలో సావిత్రి నైజం ఉంది కానీ.. అంతకు మించి ఆ పురాణానికీ ఈ సినిమా కథకూ ఎలాంటి సంబంధం లేదు.
అలా అని దేనితోనూ పోలికలు లేవా అంటే మాత్రం లేవని చెప్పలేం. ఎందు కంటే ‘రోజా’ సినిమాకూ 1970లో వచ్చిన ఇటాలియన్ సినిమా ‘ఐ గిరసోలి’కీ చాలా పోలికలుంటాయి. మొదటి పోలిక టైటిల్ దగ్గరే మొదలవుతుంది. ఇటాలియన్ భాషలో ‘ఐ గిరసోలి’ అంటే ‘సన్ ఫ్లవర్’ (పొద్దు తిరుగుడు పువ్వు) అని అర్థం. అందుకే ఆంగ్లంలోకి ఆ చిత్రాన్ని ‘సన్ ఫ్లవర్’ పేరుతో డబ్ చేశారు. అక్కడ ఆ పువ్వు పేరుతో రూపొందితే ఇక్కడ అంతకన్నా అందమైన ‘రోజా’ పువ్వు పేరుతో సినిమా తయారైంది!
‘ఐ గిరసోలి’ క థ రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంతో సాగుతుంది. ఇటా లియన్ సైనికుడిగా రష్యాలో యుద్ధం చేయడానికి వెళ్లిన తన భర్త యుద్ధం ముగిసిన తర్వాత కూడా తిరిగి రాకపోవ డంతో అతడిని వెతుక్కుంటూ వెళుతుంది భార్య జియోవనా. ఎంతకూ అతడి జాడ దొరకదు. సైనికాధికారులను అడిగితే... అతడు మిస్సింగ్ సోల్జర్స్ జాబితాలో ఉన్నాడని, బహుశా ఎవరైనా కిడ్నాప్ చేసి ఉండవచ్చునని అంటారు. అలాంటి సైని కులు ఎంతోమంది ఉన్నారని, నీ భర్త విషయంలో ప్రత్యేకంగా ఏమీ చేయలేమని తేలికగా మాట్లాడతారు.
అది జియోవనాని చాలా బాధిస్తుంది. అంత పెద్ద యుద్ధంలో తన భర్త సామాన్యుడే అయ్యుండవచ్చు, కానీ తన జీవితానికి మాత్రం తనే ఊపిరి. అందుకే ఆమె అతడిని వెదకడం ప్రారంభి స్తుంది. యుద్ధబీభత్సంతో భయోత్పా తంగా మారిన పరిసరాల మధ్య ఆమె అతడిని కనుగొంటుంది. అలా సాగు తుంది ‘ఐ గిరసోలి’ సినిమా.
ఇక రోజా కథ ప్రత్యేకంగా చెప్పనవ సరం లేదు. ఇండియన్ మిలటరీకి సహా యంగా వెళ్లిన ఇంజనీర్ రిషికుమార్ (అరవింద్‌స్వామి)ని వేర్పాటువాద ఉగ్ర వాదులు అపహరించుకుపోవడం, అతడితో పాటు వెళ్లిన అతడి భార్య రోజా (మధుబాల) అతడిని భారత మిలటరీ సాయంతో వెదకడం, రిషిని వదలాలంటే తమవారిని జైలు నుంచి విడిచి పెట్టాలని తీవ్రవాదులు డిమాండ్ చేయడం, చివరకు కథ సుఖాంతం కావడం జరుగుతుంది.
ఈ కథలో కశ్మీరీ వేర్పాటువాదపు అంశం గురించి చర్చించడంతో పాటు భర్తను ఉగ్రవాదుల చెర నుంచి విడిపించుకోవ డానికి ఒక సాధారణ యువతి చేసే ప్రయత్నాన్ని అద్భుతంగా చూపారు మణిరత్నం. ఈ విషయంలోనే ‘ఐ గిరసోలి’కి ‘రోజా’కు పోలికలు కని పిస్తాయి. అయితే రెండు సినిమాల ప్రారంభాలు, ముగింపులు వేరే రకంగా ఉంటాయి. కానీ క్రిటిక్స్ మాత్రం 1970లో వచ్చిన ‘ఐ గిరసోలి’ నుంచి మణిరత్నం స్ఫూర్తి పొందాడని అంటారు. అయితే మణిరత్నం సినిమా చాలా వరకూ వాస్తవిక సంఘటనలను స్పృశిస్తుంది.
ప్రస్తుతం జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రిగా ఉన్న ముఫ్తీమహ్మద్ సయీద్ కూతురు మెహబూబా ముఫ్తీని వెనుకటి రోజుల్లో వేర్పాటువాద తీవ్రవాదులు అపహరిం చడం, ఆమెను విడిపించడానికి ప్రభుత్వం కొంతమంది తీవ్రవాదులను విడుదల చేయడాన్ని కూడా ‘రోజా’లో పరోక్షంగా ప్రస్తావించడం జరుగుతుంది. అసలు మణిరత్నం ఆ సంఘటన స్ఫూర్తితోనే ‘రోజా’కథను తయారు చేశాడనే వాదనలు విన్నప్పుడు మాత్రం ఈ ‘రోజా’ మనవద్ద విరిసినదే అనిపిస్తుంది.
- బి.జీవన్‌రెడ్డి