రాజకీయ నేపథ్యంగా మణిరత్నం చిత్రం?
భారతీయ సినీపుస్తకంలో దర్శకుడు మణిరత్నం కంటూ కచ్చితంగా కొన్ని పేజీలు ఉంటాయి. రోజా, నాయకన్, దళపతి ఇలా పలు ఆణిముత్యాల సృష్టికర్త మణిరత్నం. ఈ ప్రఖ్యాత దర్శకుడి చిత్రాల కథలను ముందుగా ఊహించడం కష్టం. రోజా లాంటి వైవిధ్య భరిత ప్రేమ కథా చిత్రాన్ని మలచిన ఆయనే నాయకన్ లాంటి ప్రభుత్వ వ్యతిరేక శక్తిగా ఎదిగిన నాయకుడి ఇతి వృత్తాన్ని ఎంతో సహజంగా తెరపై ఆవిష్కరించారు. ఇటీవల సహజీవనం అన్న అంశాన్ని ప్రధానంగా తీసుకుని ఒరు కాదల్ కణ్మణి చిత్రాన్ని ఎంత హృద్యంగా తెరపై ఆవిష్కరించారో తెలిసిందే. తాజాగా కార్తి, అతిథిరావ్ జంటగా కాట్రు వెలియిడై పేరుతో మరో ప్రేమ కథా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారన్నది విదితమే. ఈ చిత్రం చిత్రీకరణ చివరి దశకు చేరుకుంటోంది.
దీంతో మణిరత్నం తదపరి చిత్రానికి సిద్ధమవుతున్నట్లు కోలీవుడ్‌లో తాజాగా వినిపిస్తున్న టాక్. ఈ చిత్రానికి ఎదుర్‌కట్చి అనే టైటిల్‌ను అప్పుడే రిజిస్టర్ చేయించారు. మణిరత్నం తదుపరి చిత్రంలో ఆయన తొలి రోజుల్లో కథానాయకుడు మురళి వారసుడు అధర్వ హీరోగా నటించనున్నారనే ప్రచారం జోరందుకుంది. ఎదుర్‌కట్చి అంటే ప్రతిపక్షం అని అర్థం. దీని ఆధారంగా మణిరత్నం తన తదుపరి చిత్రానికి రాజకీయ నేపథ్యాన్ని కథాంశంగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన అధికారపూర్వక ప్రకటన వెలువడడానికి కొంచెం సమయం పడుతుందని భావించవచ్చు.