పిల్ల జమీందార్ from సౌత్ కొరియా! | pilla Zaminadar from South Korea! | Sakshi
Sakshi News home page

పిల్ల జమీందార్ from సౌత్ కొరియా!

Published Sun, Sep 13 2015 12:38 AM | Last Updated on Sun, Sep 3 2017 9:16 AM

పిల్ల జమీందార్ from సౌత్ కొరియా!

పిల్ల జమీందార్ from సౌత్ కొరియా!

ఆ సీన్ - ఈ సీన్
సౌత్ కొరియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ..  హాలీవుడ్‌కు సవాలు విసురుతున్న పరిశ్రమ. వైవిధ్యమైన కథ, కథనాలతో కూడిన సినిమాలతో సుసంపన్నమైన ఇండస్ట్రీ. సినిమాల బడ్జెట్ పరంగా పోలిక లేకపోయినా... విభిన్నమైన కథాంశాలతో సినిమాలను రూపొందించడంలో కొరియన్ ఫిల్మ్‌మేకర్లు హాలీవుడ్‌కు పోటీనిస్తున్నారనే చెప్పాలి. మరి అలాంటి ఇండస్ట్రీని మనవాళ్లు వదిలిపెడతారా? దాన్నుంచి ‘స్ఫూర్తి’ పొందారు. కొరియన్ క్రియేటర్లను చూసి అలాంటి ధీటైన సినిమాలను రూపొందించడంలో కాదు కానీ..

వారి క్రియేటివిటీని యాజిటీజ్‌గా దించేయడంలో మనోళ్లు ‘స్ఫూర్తి’ని కనబరుస్తున్నారు! దాన్నొక వనరుగా మార్చుకున్నారు. అలాంటి  కాపీయిడ్ వెర్షన్ సినిమాల్లో ఒకటి ‘పిల్ల జమీందార్’. నాని, హరిప్రియ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఒరిజినల్ కొరియన్ వెర్షన్ పేరు ‘ఏ మిలియనీర్స్ ఫస్ట్ లవ్’కథకు సంబంధించి ఏదో ఒక మూల పాయింట్‌ను తీసుకుని, దాన్ని లోకలైజ్ చేస్తూ అల్లుకుపోవడం కాదు... ‘కార్బన్ కాపీ’లాగా ఈ సినిమాను రూపొందిం చాడు తెలుగు వెర్షన్ దర్శకుడు అశోక్ .

ఒక మల్టీ మిలియనీర్‌కు మనవడు కాంగ్ జే కుంగ్. పబ్‌లు, డిస్కోలు, విందులు, వినోదాల్లో తేలియాడటం ఇతడి తరహా. పద్దెనిమిదేళ్లు నిండి వారసత్వ సంపదకు వారసుడినవుతున్నాననే ఆనందంలో ఉన్న ఈ గర్విష్టికి తాతగారి వీలునామా గురించి తెలుస్తుంది. ఆస్తికి వారసుడు కావడానికి ఉన్న షరతులూ అర్థమవుతాయి. వాటికి తలొగ్గి ఒక పల్లెటూరులో గ్రాడ్యుయే షన్‌ను పూర్తి చేయడానికి వచ్చిన కాంగ్‌లో వచ్చే పరివర్తనే మిగతా సినిమా.
 
కేవలం ఈ కథ వరకే కాదు... ‘పిల్ల జమీందార్’ సినిమాలో కొరియన్ మూవీ ఆనవాళ్లు పూర్తిగా కనిపిస్తాయి. హీరో ఇంట్రడక్షన్ షాట్ మొదలుకొని.. మిగతా పాత్రలు, వాటి నేపథ్యాలు, స్వభావాలు, ఆఖరికి చాలా సీన్లలో కూడా బోలెడు పోలికలుంటాయి. 2006లో వచ్చిన ‘ఏ మిలియనీర్స్ ఫస్ట్ లవ్’కు 2011లో వచ్చిన ‘పిల్లజమీందార్’కు తేడాలు కనిపెట్టమంటే అది నిజంగా పెద్ద కసరత్తే. అంత పెద్ద కాపీ మరి!
 
తొలి సగంలో కాంగ్ పాత్రలోని గర్వాన్ని ఎలివేట్ చేసే సన్నివేశాలనే తెలుగులో యథాతథంగా వాడుకొన్నారు. కాలేజీలో వరండాల్లోకి అతడు బైక్‌పై దూసుకురావడం, లెక్చెరర్లతో దురుసుగా ప్రవర్తించడం, ‘నేటితో నాకు 18 యేళ్లు నిండాయి, వేల కోట్లకు అధిపతిని అయ్యాను’ అని వారికి గర్వంగా చెప్పడం, సర్టిఫికెట్స్‌ను కూడా నిర్లక్ష్యంగా పడేసి రావడం వంటి సీన్లు హీరో స్వభావాన్ని ఆవిష్కరిస్తాయి. ఈ సీన్లను కాస్త కూడా మార్చే ప్రయత్నం చేయకుండా మక్కీకి మక్కీ దించేశారు.

ఇక్కడి నుంచి మొదలయ్యే కాపీకళ సినిమా నడిచేకొద్దీ ఓ రేంజ్‌కి చేరుకుంటుంది!
 ప్రత్యేకంగా కమెడియన్లు లేకుండా చక్కటి ఫన్ పండే సినిమా ‘పిల్ల జమీందార్’. అయితే ఆ ఫన్ కూడా కొరియా నుంచి కొరియర్ చేసి తెచ్చుకొన్నదే. విలాసవంతంగా బతికిన హీరో ఒక ట్రస్టుకు సంబంధించిన హాస్టల్‌లో ఉండి, తను తాకడానికి కూడా ఇష్టపడని మనుషుల మధ్య బతకాల్సి రావడంతో అతడు పడే ఇబ్బందుల నుంచి జనరేట్ అయ్యే కామెడీని కూడా పక్కాగా దించేశారు.
 
గర్విష్టి అయిన హీరో నాని మంచి వాడిగా మారే క్రమం, అతని చిన్నప్పటి ఫ్లాష్‌బ్యాక్ సీన్, ఆ క్యారెక్టర్ ట్రాన్స్ ఫార్మేషన్, అందుకు తగ్గట్టుగా వచ్చే సన్నివేశాలు కొరియన్ వెర్షన్‌వే వాడుకున్నారు. కాకపోతే కాస్తో కూస్తో లోకలైజ్ చేశారంతే. సెకెండాఫ్‌లో వచ్చే ఈ సన్నివేశాల్లో సందేశం మోతాదు కొంత ఎక్కువయ్యిందనిపిస్తుంది. అయితే మన తెలుగు దర్శకుడికి మాత్రం అది ఎక్కువని పించలేదు.

అందుకే కాపీ చేసేశారు పాపం! అలాగే కొన్ని సీన్ల విషయంలో అమెరికన్ కామెడీ ఫిల్మ్ ‘బిల్లీ మాడిసన్’ ఛాయలు కూడా మన ‘పిల్ల జమీం దార్’లో కనిపిస్తాయి. కథాంశం పరంగా 1995లో వచ్చిన ఆ హాలీవుడ్ సినిమా కొంచెం ఈ తరహాలోనే ఉంటుంది. ఇలా ఒరిజినల్ దర్శకులకు క్రెడిట్ ఇవ్వకుండా కాపీ చేసేసిన సినిమాలను ‘ఫ్రీమేక్’ అని అంటారు. మన పిల్ల జమీందార్ గారు అలా పెరిగినవాడే!
 - బి.జీవన్‌రెడ్డి

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement