pilla zamindar
-
భాగమతి దర్శకుడికి బంపర్ ఆఫర్
పిల్ల జమీందార్ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన దర్శకుడు అశోక్. తరువాత సుకుమారుడు, చిత్రాంగథ సినిమాలతో నిరాశపరిచినా.. అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కిన భాగమతి సినిమాతో మరోసారి సత్తా చాటాడు. డిఫరెంట్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఘనవిజయం సాధించటంతో అశోక్‌కు అవకాశాలు క్యూ కట్టాయి. త్వరలో ఈ యువ దర్శకుడు ఓ అంతర్జాతీయ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. 1914 నాటి కథతో తెరకెక్కనున్న ఈసినిమాను పెన్ ఎన్ కెమెరా ప్రొడక్షన్స్ కంపెనీ, కెనడియన్ ఫిలిం కౌన్సిల్ తో కలిసి నిర్మించనుంది. బ్రిటీష్ పరిపాలన కాలంలో కొమగట మరు అనే స్టీమ్ షిప్లో కెనడా వెళ్లేందుకు కొందరు భారతీయులు ప్రయత్నించగా అక్కడి ప్రభుత్వం వారు దేశంలోకి ప్రవేశించేందుకు అనుమంతించలేదు. ఈ సంఘటననే కథగా ‘కొమగట మరు 1914’ అనే పేరుతో సినిమాగా తెరకెక్కిస్తున్నాడు అశోక్. -
మాది అమలాపురమండి.. ఆయ్!
శ్రీనగర్‌కాలనీ: ఎర్రబస్సెక్కి కృష్ణానగర్ వచ్చిన పతోడు హీరో అయిపోదామనే అనుకుంటాడు. అదే ఆశతో వస్తారు.. శ్వాసగా జీవిస్తారు. అవకాశాల కోసం స్టూడియోల చుట్టూ చక్కర్లు కొడతారు. కొందరు ఇంట్లో చెప్పి వస్తే.. ఇంకొందరు ఇంటి నుంచి పారిపోయి వస్తారు. ‘సత్య అక్కల’ది కూడా అలాంటి బాపతే. ఎవరీ సత్య అనుకుంటున్నారా..! ‘స్వామిరారా’ గుర్తింది కదా.. అందులో ‘ఐదు లక్షలు తీసుకునేటప్పడు ఐదు నిమిషాలు ఆగలేవా..!’ అంటూ తన అమాయకత్వంతో ఐదుకోట్ల రూపాయిలు చేజార్చుకునేలా చేస్తాడే అతడే ఇతడు. సినిమాల్లో అవకాశాల కోసం ఇంట్లో నుంచి పారిపోయి తూ.గో.జి లోని అమలాపురం నుంచి వచ్చాడు. గోదారి ఎటకారానికి తన హావభావాలు జోడించి ఇప్పుడు వెండితెరపై నవ్వులు పూయిస్తున్న సత్య తన కెరీర్ విషయాలను ‘సాక్షి’తో పంచుకున్నాడు. ఆ వివరాలు సత్య మాటల్లోనే.. మాది తూగో జిల్లా అమలాపురమండి. నాన్న వెంకట్రావు టీచర్. చిన్నప్పట్నుండి సినిమాలంటే మా పిచ్చిగా ఉండేది. చిరంజీవి, రజనీకాంత్ బొమ్మ పడిదంటే తొలాట చూడాల్సిందే. అలా బీటెక్‌ను మధ్యలోనే ఆపేసి 2005లో రైలెక్కి హైదరాబాద్‌లో దిగిపోయానండి. కానీ మా అమ్మా, నాన్న అస్సలు ఒప్పుకోలేదు. చేసేది లేక తిరిగి అమలాపురం వెళ్లిపోయా. కానీ నరనరాల్లో ఉన్న సినిమా అక్కడ ఉండనీయలేదు. దీంతో ఇంట్లో చెప్పి మరుసటి ఏడు మళ్లీ సిటీకి వచ్చేశా. నా స్నేహితుల పరిచయాలతో అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరాను. ‘రౌడీ ఫెలో’ చిత్రంలో నారా రోహిత్‌తో పిల్ల జమిందార్లో బొమ్మ పడిందండి.. అసిస్టెంట్ డైరెక్టర్‌గా ద్రోణ, పిల్లజమిందార్ చిత్రాలకు పనిచేశా. పిల్లజమిందార్ చిత్రంలో కూడా నటించే అవకాశం వచ్చిందండి. అందులో నా పాత్ర పండడంతో సుధీర్‌వర్మ దర్శకత్వం వహించిన ‘స్వామిరారా’ చిత్రంలో లీడ్ రోల్ ఇచ్చారు. ఆ సినిమా హిట్టవడంతో ఇక వరుసగా అవకాశాలొచ్చాయి. రౌడీ ఫెల్లో, కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య, స్పీడున్నోడు, మజ్ను, జై లవకుశ, ప్రేమమ్, ఎక్కడిపోతావు చిన్నవాడా.. చిత్రాల్లో చేసిన పాత్రలకు మంచి స్పందన వచ్చింది.లిక దర్శకుడు సుధీర్ వర్మ ప్రోత్సాహమైన మర్చిపోలెనండి బాబు. ‘ఫ్లైయింగ్ కలర్స్’ తోడుగా.. తెలుగు కమెడియన్స్‌లో శ్రీనివాసరెడ్డి, శివారెడ్డి, వెన్నెల కిషోర్, సప్తగిరి, సత్యం రాజేష్ లాంటి సీనియర్లు, యువ కమెడియన్లు 14 మందితో ‘ఫ్లైయింగ్ కలర్స్’ అనే గ్రూప్‌ను ఏర్పాటు చేసుకున్నామండి. ప్రతీ నెలా రెండో శనివారం గ్రూప్‌లోని ఓ కమెడియన్ పార్టీ ఇస్తారు. అన్ని వంటకాలతో పాటు వెరైటీ ప్రోగ్రామ్స్‌తో సంతోషాన్ని పంచుకుంటామండి. ఆరోజు మా కామెడీతో కడుపు చెక్కలవ్వాల్సిందేనండి. అంతేకాదండి.. గోదారోణ్ని కదా అండి ఆయ్.. తినడం కూడా ఇష్టమేనండి. నచ్చిన తిండి ఎక్కడున్నా తిని తీరాల్సిందేనండి.. ఆయ్. ఇది దేవుడిచ్చిన వరమండి.. అసిస్టెంట్ డైరెక్టర్‌గా వచ్చిన నేను అనుకోకుండా ప్రేక్షకులను నవ్వించే అవకాశం వచ్చిందండి. ఇది దేవుడిచ్చిన వరమనుకుంటానండి. ఇంక బ్రహ్మానందం, సునీల్ అన్నయ్య అంటే చాలా ఇష్టమండి. తెలుగులో హీరో రామ్‌చరణ్ నటిస్తున్న రంగస్థలం, నాగచైతన్య హీరోగా సవ్యశాచి చిత్రాల్లో నటిస్తున్నానండి. నన్ను ఆదరిస్తున్న తెలుగువారికి ఎప్పటికీ రుణపడి ఉంటానండి.. ఆయ్. -
పిల్ల జమీందార్ from సౌత్ కొరియా!
ఆ సీన్ - ఈ సీన్ సౌత్ కొరియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ.. హాలీవుడ్‌కు సవాలు విసురుతున్న పరిశ్రమ. వైవిధ్యమైన కథ, కథనాలతో కూడిన సినిమాలతో సుసంపన్నమైన ఇండస్ట్రీ. సినిమాల బడ్జెట్ పరంగా పోలిక లేకపోయినా... విభిన్నమైన కథాంశాలతో సినిమాలను రూపొందించడంలో కొరియన్ ఫిల్మ్మేకర్లు హాలీవుడ్‌కు పోటీనిస్తున్నారనే చెప్పాలి. మరి అలాంటి ఇండస్ట్రీని మనవాళ్లు వదిలిపెడతారా? దాన్నుంచి ‘స్ఫూర్తి’ పొందారు. కొరియన్ క్రియేటర్లను చూసి అలాంటి ధీటైన సినిమాలను రూపొందించడంలో కాదు కానీ.. వారి క్రియేటివిటీని యాజిటీజ్‌గా దించేయడంలో మనోళ్లు ‘స్ఫూర్తి’ని కనబరుస్తున్నారు! దాన్నొక వనరుగా మార్చుకున్నారు. అలాంటి కాపీయిడ్ వెర్షన్ సినిమాల్లో ఒకటి ‘పిల్ల జమీందార్’. నాని, హరిప్రియ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఒరిజినల్ కొరియన్ వెర్షన్ పేరు ‘ఏ మిలియనీర్స్ ఫస్ట్ లవ్’కథకు సంబంధించి ఏదో ఒక మూల పాయింట్‌ను తీసుకుని, దాన్ని లోకలైజ్ చేస్తూ అల్లుకుపోవడం కాదు... ‘కార్బన్ కాపీ’లాగా ఈ సినిమాను రూపొందిం చాడు తెలుగు వెర్షన్ దర్శకుడు అశోక్ . ఒక మల్టీ మిలియనీర్‌కు మనవడు కాంగ్ జే కుంగ్. పబ్‌లు, డిస్కోలు, విందులు, వినోదాల్లో తేలియాడటం ఇతడి తరహా. పద్దెనిమిదేళ్లు నిండి వారసత్వ సంపదకు వారసుడినవుతున్నాననే ఆనందంలో ఉన్న ఈ గర్విష్టికి తాతగారి వీలునామా గురించి తెలుస్తుంది. ఆస్తికి వారసుడు కావడానికి ఉన్న షరతులూ అర్థమవుతాయి. వాటికి తలొగ్గి ఒక పల్లెటూరులో గ్రాడ్యుయే షన్ను పూర్తి చేయడానికి వచ్చిన కాంగ్లో వచ్చే పరివర్తనే మిగతా సినిమా. కేవలం ఈ కథ వరకే కాదు... ‘పిల్ల జమీందార్’ సినిమాలో కొరియన్ మూవీ ఆనవాళ్లు పూర్తిగా కనిపిస్తాయి. హీరో ఇంట్రడక్షన్ షాట్ మొదలుకొని.. మిగతా పాత్రలు, వాటి నేపథ్యాలు, స్వభావాలు, ఆఖరికి చాలా సీన్లలో కూడా బోలెడు పోలికలుంటాయి. 2006లో వచ్చిన ‘ఏ మిలియనీర్స్ ఫస్ట్ లవ్’కు 2011లో వచ్చిన ‘పిల్లజమీందార్’కు తేడాలు కనిపెట్టమంటే అది నిజంగా పెద్ద కసరత్తే. అంత పెద్ద కాపీ మరి! తొలి సగంలో కాంగ్ పాత్రలోని గర్వాన్ని ఎలివేట్ చేసే సన్నివేశాలనే తెలుగులో యథాతథంగా వాడుకొన్నారు. కాలేజీలో వరండాల్లోకి అతడు బైక్‌పై దూసుకురావడం, లెక్చెరర్లతో దురుసుగా ప్రవర్తించడం, ‘నేటితో నాకు 18 యేళ్లు నిండాయి, వేల కోట్లకు అధిపతిని అయ్యాను’ అని వారికి గర్వంగా చెప్పడం, సర్టిఫికెట్స్‌ను కూడా నిర్లక్ష్యంగా పడేసి రావడం వంటి సీన్లు హీరో స్వభావాన్ని ఆవిష్కరిస్తాయి. ఈ సీన్లను కాస్త కూడా మార్చే ప్రయత్నం చేయకుండా మక్కీకి మక్కీ దించేశారు. ఇక్కడి నుంచి మొదలయ్యే కాపీకళ సినిమా నడిచేకొద్దీ ఓ రేంజ్‌కి చేరుకుంటుంది! ప్రత్యేకంగా కమెడియన్లు లేకుండా చక్కటి ఫన్ పండే సినిమా ‘పిల్ల జమీందార్’. అయితే ఆ ఫన్ కూడా కొరియా నుంచి కొరియర్ చేసి తెచ్చుకొన్నదే. విలాసవంతంగా బతికిన హీరో ఒక ట్రస్టుకు సంబంధించిన హాస్టల్లో ఉండి, తను తాకడానికి కూడా ఇష్టపడని మనుషుల మధ్య బతకాల్సి రావడంతో అతడు పడే ఇబ్బందుల నుంచి జనరేట్ అయ్యే కామెడీని కూడా పక్కాగా దించేశారు. గర్విష్టి అయిన హీరో నాని మంచి వాడిగా మారే క్రమం, అతని చిన్నప్పటి ఫ్లాష్‌బ్యాక్ సీన్, ఆ క్యారెక్టర్ ట్రాన్స్ ఫార్మేషన్, అందుకు తగ్గట్టుగా వచ్చే సన్నివేశాలు కొరియన్ వెర్షన్వే వాడుకున్నారు. కాకపోతే కాస్తో కూస్తో లోకలైజ్ చేశారంతే. సెకెండాఫ్‌లో వచ్చే ఈ సన్నివేశాల్లో సందేశం మోతాదు కొంత ఎక్కువయ్యిందనిపిస్తుంది. అయితే మన తెలుగు దర్శకుడికి మాత్రం అది ఎక్కువని పించలేదు. అందుకే కాపీ చేసేశారు పాపం! అలాగే కొన్ని సీన్ల విషయంలో అమెరికన్ కామెడీ ఫిల్మ్ ‘బిల్లీ మాడిసన్’ ఛాయలు కూడా మన ‘పిల్ల జమీం దార్’లో కనిపిస్తాయి. కథాంశం పరంగా 1995లో వచ్చిన ఆ హాలీవుడ్ సినిమా కొంచెం ఈ తరహాలోనే ఉంటుంది. ఇలా ఒరిజినల్ దర్శకులకు క్రెడిట్ ఇవ్వకుండా కాపీ చేసేసిన సినిమాలను ‘ఫ్రీమేక్’ అని అంటారు. మన పిల్ల జమీందార్ గారు అలా పెరిగినవాడే! - బి.జీవన్‌రెడ్డి -
'మా ఆవిడ నానికి పెద్ద ఫ్యాన్'
హైదరాబాద్: భర్త అల్లాటప్పా హీరో కాదు టాలీవుడ్ బాద్షా. అతడి భార్య మాత్రం మరో హీరోకు పెద్ద ఫ్యాన్. అతడు నటించిన చిత్రాలు చూసి ముగ్ధురాలవుతుంది. ఆ విషయాన్ని ఆమె భర్తే స్వయంగా వెల్లడించారు. ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసా? అయనే జూనియర్ ఎన్టీఆర్. ఆయన భార్య లక్ష్మీ ప్రణతి. ఆమెకు 'ఈగ' హీరో నాని నటన అంటే చాలా చాలా ఇష్టమట. 'పిల్ల జమీందార్' చిత్రంలో నాని నటన ఆమెకు చాలా నచ్చిందట. ఆ చిత్రాన్ని తనతో కలసి ప్రణతి ఎన్నో సార్లు చూసిందో లెక్కించడం చాలా కష్టమని ఎన్టీఆర్ చెప్పారు. మళ్లీ మళ్లీ ఆ సినిమా చూద్దామని ఆమె తెగ పోరు పెడుతోందని తెలిపారు. టాలీవుడ్లో ప్రస్తుతం ఉన్న మంచి నటుల్లో నాని ఒకరని ఈ సందర్బంగా జూనియర్ ఎన్టీఆర్ వెల్లడించారు. -
అమెరికాలో అంజలి...
‘గీతాంజలి’ చిత్రం తర్వాత తమిళంలో మూడు సినిమాలు అంగీకరించిన అంజలి తెలుగులో ఒకే ఒక్క చిత్రానికి మాత్రమే పచ్చజెండా ఊపారు. ఈ మధ్యకాలంలో తెలుగులో బోల్డన్ని కథలు విన్న అంజలికి ఈ ఒక్క కథ మాత్రమే నచ్చిందట. ‘పిల్ల జమిందారు’ ఫేమ్ అశోక్ దర్శకత్వంలో శ్రీ విఘ్నేశ్ కార్తీక్ సినిమా పతాకంపై ఈ చిత్రాన్ని గంగపట్నం శ్రీధర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రవిశేషాలను నిర్మాత చెబుతూ -‘‘అంజలి నటిస్తున్న మరో లేడీ ఓరియంటెడ్ మూవీ ఇది. ఓ భిన్నమైన కథాంశంతో సాగే కామెడీ థ్రిల్లర్. నవంబర్ 18న అమెరికాలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించాం. జనవరి 10 వరకు అక్కడ షూటింగ్ చేసి, ఆ తర్వాత హైదరాబాద్‌లో రెండో షెడ్యూల్ మొదలుపెడతాం’’ అని చెప్పారు. -
మెగాఫోన్ పట్టనున్న అవసరాల శ్రీనివాస్
ఆష్టా చెమ్మా, పిల్ల జమిందార్ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులను మెప్పించిన ప్రముఖ నటుడు అవసరాల శ్రీనివాస్. త్వరలో ఓ తెలుగు చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు వర్థమాన నటుడు అవసరాల శ్రీనివాస్ బుధవారం చెన్నైలో వెల్లడించారు. హాస్య ప్రధానంగా నడిచే కథకు హీరోతోపాటు ప్రముఖ హస్య నటులను ఎంపిక చేయనున్నట్లు చెప్పారు. అందుకు సంబంధించిన కథను రూపొందించినట్లు తెలిపారు. తాను నిర్మించనున్న చిత్రానికి సాయి కోర్రపాటి నిర్మాతగా వ్యవహారిస్తున్నారని చెప్పారు. ఆయన గతంలో ఈగ, అందాల రాక్షసి లాంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించారని శ్రీనివాస్ తెలిపారు. అలాగే ప్రముఖ దర్శకుడు శ్రీనివాస్ గోగినేనితో మరో చిత్రానికి పని చేస్తున్నట్లు ఆయన వివరించారు. ఆ చిత్రం కూడా ప్రధానంగా వినోదభరితంగా ఉంటుందన్నారు. ఆ రెండు చిత్రాలు త్వరలో ప్రారంభంకానున్నాయన్నారు.