అరువు తెచ్చుకున్న చిరునవ్వు..!
ఆ సీన్ - ఈ సీన్
మనిషిని పోలిన మనిషి.. సినిమాను పోలిన సినిమా. మొదటిది యాదృచ్ఛికం, రెండోది ప్రయత్నపూర్వకం. సప్తసముద్రాలవతల ఎక్కడో తీసిన ఒక సినిమాను మనమూ చూసే అవకాశాన్నిస్తున్నాయి ఈ ప్రయత్నాలు. అయితే ఇంగ్లిష్ సినిమాలు బాగా చూసే వారికి ‘కాపీ రా బాబూ..’ అనిపిస్తుంటాయి! అలాంటి వాటిలో ఇదీ ఒకటి. 1997 నాటి ఇటాలియన్ సినిమా ‘లా విటా ఈ బిల్లా’ (ఇంగ్లిష్‌లో.. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ) విడుదలైనప్పుడు రివ్యూయర్లు ఆ సినిమాకు సరదాగా ఒక ట్యాగ్‌లైన్ ఇచ్చారు.
‘మీరు అమ్మాయిలను పడగొట్టాలనుకొంటుంటే ఈ సినిమాను చూడండి..’ అని. ఆ సినిమాలో హీరోయిన్‌ను పడేయడానికి హీరో ప్లే చేసే ట్రిక్స్ ఆకట్టుకొనేలా ఉండటంతో ఆ లైన్ యాడ్ అయ్యింది. మరి అబ్బాయిలు ఎవరైనా ఆ ప్రయత్నం చేశారో లేదో కానీ... ఆ సినిమా తెలుగు ప్రేక్షకులను పడగొట్టడానికి మాత్రం బాగా ఉపయోగపడింది! కాపీ అనుకొన్నా, స్ఫూర్తి అనుకొని సమాధానపడినా... ఆ ఇటాలియన్ సినిమా ఆధారంగా ఒక తెలుగు సినిమాను చేసేసి మనకు చూపించేశారు. బాధలోనూ చిరునవ్వును వీడకూడదన్న తత్వాన్ని చాటే ఆ సినిమాను మనోళ్లు అచ్చంగా ‘చిరునవ్వుతో’ పేరుతో దించేశారు.
‘చిరునవ్వుతో’లో వేణు, షహీన్‌లు హీరోహీరోయిన్లుగా రామ్‌ప్రసాద్ దర్శకత్వంలో రూపొంది 2000 సంవత్సరంలో విడుదల అయిన ఆ సినిమా యూట్యూబ్‌లో ఎక్కువ మంది చూసిన తెలుగు సినిమాల్లో ఒకటి. సెన్సిబుల్ సీన్స్‌తో హ్యూమర్ పండించే ఈ సినిమా ఎవరికైనా ఇట్టే నచ్చేస్తుంది. ‘అరే భలే తీశారే..’అనిపిస్తుంది. భలే తీయడం అనే క్రెడిట్ ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమా దర్శక, రచయితలకే దక్కాలి.
ఈ సినిమాకు రెండు పార్శ్వాలున్నాయి.
రోబర్ట్ బెనిగ్నీ దర్శకత్వంలో అతడే ముఖ్యపాత్రలో నటించగా రూపొందించిన ఈ సినిమాలో తొలిసగం లవ్‌స్టోరీతో సరదాసరదాగా సాగిపోతుంది. రెండో సగం నాజీల విశృంఖల విహారం, హీరో తన తనయుడి అసలు విషయం అర్థంకాకుండా చేయడానికి అంతా ఒక ఆట అని కప్పిపుచ్చుతూ ఆనందపెడుతూ చేసే హృద్యమైన ప్రయత్నాలతో ఉంటుంది. ఉత్తమ విదేశీ చిత్రంగా ఆస్కార్ అవార్డునుకూడా అందుకొన్న ఈ సినిమాలోని తొలిసగం లోని సీన్లను యథాతథంగా ‘చిరునవ్వుతో’ సినిమాలో వాడేసుకొన్నారు. ఆ సినిమాను చూసిన వారికి కాపీ చేసిన సీన్లను గురించి బాగా అవగాహన ఉంటుంది.
ఉదాహరణకు...
ఒక సీన్లో హీరోయిన్ థియేటర్‌లోకి వెళ్లడం చూసి అదే సినిమా టికెట్ కొని లోపలకు వెళతాడు హీరో. ఆమె వెనుకవైపు ఉండటంతో తను స్క్రీన్‌వైపు చూడకుండా వెనక్కి తిరిగి ఆమెవైపు చూస్తుంటాడు. ఇక్కడితో మొదలు పెడితే.. హీరోహీరోయిన్ల మధ్య జరిగే సీన్లన్నింటి కీ మాతృక లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమానే.
చిరునవ్వుతో సినిమాలో హీరో వేణు తన క్యాప్‌తో గుండు సుందర్శనంతో ఆడే ఫన్నీ గేమ్ ఒరిజినాలిటీ ఇటాలియన్ సినిమాదే. తన ఫ్రెండ్ క్యాప్ తడిసిపోయిందంటూ కొత్త క్యాప్‌తెచ్చివ్వవా అంటూ హీరోయిన్ సరదాగా దేవుడిని వేడుకోగానే గుండు సుదర్శనం పాత్ర వచ్చి ఆ క్యాప్‌లాక్కొని తన క్యాప్‌ను అక్కడ పెట్టి వెళ్లడం దానికి సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్ సీన్స్.. ఇలా చెప్పుకొంటూ పోతే చాలా..!
రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో వచ్చిన సినిమాను తమ సినిమా నేపథ్యానికి అనుగుణంగా చాలా తెలివిగా సీన్లను కాపీ చేశారు ‘చిరునవ్వుతో’ సినిమా వాళ్లు. అలా అని విమర్శించడానికేం లేదు.. ఎందుకంటే ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమా చూడని, చూసే అవకాశం లేని వారికి ఆ మ్యాజికల్ సీన్లను ‘చిరునవ్వుతో’ చూపించారు కదా!
- బి.జీవన్‌రెడ్డి