నవగ్రహాలు – వాటి ప్రాముఖ్యత | Navagraha their importance | Sakshi
Sakshi News home page

నవగ్రహాలు – వాటి ప్రాముఖ్యత

Published Sun, Mar 31 2019 12:49 AM | Last Updated on Sun, Mar 31 2019 12:49 AM

Navagraha their importance - Sakshi

రవి: ఈ గ్రహానికి గ్రహరాజు అని పేరు. ఈ గ్రహం మేషంలో ఉచ్ఛ, తులలో నీచ స్థితిలో ఉంటాడు. అధికారానికి, ఆరోగ్యానికి, నేత్ర సంబంధిత వ్యాధులకు కారకుడు రవి. రాజకీయంగా అత్యున్నత పదవులు రావడానికి రవిగ్రహ బలం అవసరం. ఐ.ఎ.ఎస్‌., ఐ.పి.ఎస్‌ వంటి వాటికి ఎంపిక అవ్వాలంటే రవిగ్రహ అనుగ్రహం లేనిదే ఆ కోరిక సాధ్యపడదు. రవి అనుగ్రహం వల్ల గొప్ప డాక్టర్‌ అవుతారు. ఈ రవి జాతకంలో శుభగ్రహ దృష్టి కలిగి ఉంటే అలాంటి డాక్టర్లు ప్రజాసేవ బాగా చేస్తారు. పాపగ్రహ దృష్టి కలిగి ఉంటే డాక్టర్‌గా ప్రజలను ఎన్నిరకాలుగా దోచుకోవాలో అన్నిరకాలుగా దోచుకుంటారు. గణపతి హోమం చేయించండి.

చంద్రుడు:  చంద్రుడు మనఃకారకుడు. జలములకు కారకుడు. క్రికెట్, బ్యాడ్మింటన్‌ వంటి క్రీడల్లోను, సంగీత రంగంలో, సినిమా రంగంలో రాణించడానికి చంద్రగ్రహ బలం చాలా అవసరం. చతుష్షష్టి కళాకోవిదుడైన చంద్రుడు ఒక గొప్ప స్థాయికి మనిషి ఎదగడానికి కారకుడు అవుతాడు. చంద్రగ్రహ జాతకుల నవ్వు ఆకర్షణీయంగా ఉంటుంది. మనోబలానికి, మనోధైర్యానికి చంద్రుడు కారకుడు. జల సంబంధమైన వ్యాపారాలు, ఉద్యోగాలు, అదేవిధంగా సినిమాలు తీయడం, వాటికి సంబంధించిన ఫలితాలు చంద్రగ్రహం వల్లనే సంప్రాప్తిస్తాయి. పౌర్ణమి రోజున పండితులను సంప్రదించి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోండి. 

కుజుడు: ధైర్యానికి, పరాక్రమానికి, సైన్యాధ్యక్ష పదవికి, శక్తిమంతమైన మారణాయుధాలతో పోరాటం చేయడానికి, రక్తానికి, భూమి సంబంధమైన సమస్త సంపదలకు కుజుడే కారణం. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో రాణించాలన్నా, కోర్టు వివాదంలో ఉన్న ఆస్తులు మీకు అనుకూలంగా రావాలన్నా కుజగ్రహం చాలాముఖ్యం. ఈ కుజుడు శస్త్ర విద్యకు సంబంధించిన గ్రహం. సర్జన్‌గా రాణించాలంటే కుజుడి అనుగ్రహం తప్పనిసరి. కుజుడు అగ్నిగ్రహం. అంగారక పాశుపతహోమం చేయించండి.
 
రాహువు:
ఛాయాగ్రహం. క్రమశిక్షణకు, కష్టపడి పైకి రావడానికి ప్రయత్నించే మనస్తత్వానికి రాహువే కారకుడు. ఎయిర్‌ఫోర్స్‌లో గానీ, నేవీలో గానీ ఉన్నత పదవులలో రాణించడానికి, యుద్ధరంగంలో వ్యూహప్రతివ్యూహాలు రచించడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. ఎక్కువగా శక్తి పూజలు చేస్తారు. రాజకీయంలో అనూహ్యంగా, ఆకస్మికంగా రాణించడానికి రాహువే కారకుడు. అనూహ్య పతనానికి కూడా రాహువే కారకుడు. రాహుగ్రహం ఇచ్చే శుభయోగాలు అనేకం ఉన్నాయి. డ్రగ్స్‌కి బానిసయ్యే దుర్గుణానికి కూడా రాహువే కారకుడు. రుద్రపాశుపత హోమం చేయించండి.

గురువు:  సంపూర్ణ శుభగ్రహం. ఉన్నతమైన ఆర్థికపరిస్థితి, అఖండ విద్యాయోగం, సాంప్రదాయ బద్ధమైన జీవన విధానం, అఖండమైన మేధస్సు, ఉన్నత పదవులు అధిష్టించి గొప్పగా రాణించడం, కుటుంబ శ్రేయస్సు పట్ల అధిక శ్రద్ధ, పెద్ద పెద్ద వ్యాపార సంస్థలకు అధినేతలుగా రాణించడం, భగవత్‌ అనుగ్రహం సంప్రాప్తించడం, అన్నదాన సత్రాలు పెట్టించడం, గుళ్ళు కట్టించడం, విద్యాదానం చేయడం, ఇలాంటి లక్షణాల న్నీ గురుగ్రహం వల్లనే సంప్రాప్తిస్తాయి. ముహూర్తబలం అంతా గురుగ్రహం పైనే ఆధారపడి ఉంటుంది. నవగ్రహ పాశుపత హోమం చేయించండి.

శుక్రుడు: కళత్ర కారకో శుక్రః అన్నారు. ఈ శుక్రుడు భార్య స్థానానికి, భర్త స్థానానికి కారకుడు. మంచి సంబంధం కుదరాలన్నా, సంసార జీవితం బాగుండాలన్నా శుక్రగ్రహ అనుగ్రహం తప్పనిసరి. ప్రేమ వివాహాలు ఫలించాలన్నా శుక్రుడే గతి. సురాపాన కారకో శుక్రః. సురాపానం చేసే అలవాటు శుక్రుని వల్ల కలుగుతుంది. అంతరాత్మ ప్రబోధానుసారం వీళ్ళు సురాపానం సేవించడం మానేస్తారు. అత్యంత విలాసవంతమైన జీవితం, సమస్త భోగాలు, రాచమర్యాదలు లభించడం, అందానికి, ఐశ్వర్యానికి మారుపేరుగా నిలబడాలంటే అది ఒక్క శుక్రుడి వల్లనే సాధ్యం. ఒక్క మాటలో చెప్పాలంటే జీవితంలో సుఖపడాలంటే శుక్రుని అనుగ్రహం తప్పని సరి. భగుపాశుపత హోమం చేయించండి.

శని: నీతి, నిజాయితీలకు, న్యాయానికి, ధర్మానికి కారకుడు శని. ఎవరి ప్రోత్సాహం లేకపోయినా, ఎందరు ఎన్ని అవమానాలు సృష్టించినా, పట్టువీడక జీవితాశయాన్ని సాధించడానికి శనే కారకుడు. సమన్యాయం, సమధర్మం పట్ల కట్టుబడి ఉండేవాళ్ళు శనిగ్రహ ప్రభావ మానవులే. అవినీతి, లంచగొండితనం, కుల, మత, వర్గ, ప్రాంతీయ ద్వేషాలు వీటన్నింటికి అతీతంగా ప్రవర్తించే వారు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి మీద శనిగ్రహ ప్రభావం ఉన్నట్టే లెక్క. శని అత్యంత ముఖ్యమైన ఆయుర్దాయానికి కారకుడు. జాతకంలో ఎన్ని రాజయోగాలు ఉన్నా అవి అనుభవించాలంటే ఆయుర్దాయం కావాలి. దీనర్థం శనిగ్రహం అనుకూలంగా ఉంటేనే సుదీర్ఘ జీవిత ప్రయాణం సాధ్యం. స్త్రీలను వేధించే వారిపట్ల శని చాలా కఠినంగా ప్రవర్తిస్తాడు. అఘోర పాశుపత హోమం చేరుుంచండి.

బుధుడు: అత్యంత తెలివైన గ్రహం. వ్యాపారానికి బుధుడే కారణం. ఏ వ్యాపారం చేసినా డబ్బులు మిగలాలంటే బుధుడి అనుగ్రహం కావాలి. సాహిత్యరంగంలో ప్రపంచ స్థాయి సాధించాలన్నా, వందలాది పుస్తకాలు వ్రాసి ప్రజలలో మహాపండితుడిగా రాణించాలన్నా, జ్ఞానపీఠ్‌ వంటి ప్రతిష్ఠాత్మకమైన అవార్డులు లభించాలన్నా, ఆయుర్వేద వైద్యుడిగా రాణించాలన్నా, వందల కోట్లు సంపాదించాలన్నా బుధగ్రహ అనుగ్రహం తప్పనిసరి. జాతకంలో బుధుడు బాగుంటే ఇవన్నీ ఇప్పిస్తాడు. జ్యోతిష శాస్త్రంలో అఖండమైన పరిజ్ఞానానికి, అఖండమైన కీర్తిప్రతిష్టలకు బుధగ్రహ అనుగ్రహమే కారణం. సుదర్శన పాశుపతహోమం చేయించండి.

కేతువు: మోక్షానికి, మంత్రసిద్ధికి, భగవత్‌ అనుగ్రహానికి, ఉత్తమమైన అంత్యక్రియలకు, అధమాధమమైన అంత్యక్రియలకు ఛాయాగ్రహమైన కేతువే కారణం. ఈ కేతువు ఏ రంగంలోనైనా జాతకుడిని ఉత్తమ స్థితికి తీసుకు వెళ్తాడు. ఉత్తమస్థితి వచ్చిన తరువాత అహంకారంతో రెచ్చిపోతే పతనం అవడానికి కూడా కేతువే కారణం అవుతాడు. సర్పదోషాలకు కేతువే నియంత్రణ గ్రహం. రాహు కేతువులిద్దరూ సర్పగ్రహాలే. అవధూతలను ప్రసన్నం చేసుకోవడానికి కఠినమైన నియమాలతో పూజాపునస్కారాలు చేయడానికి, పవిత్రమైన పుణ్యక్షేత్రాల సందర్శన, వాటి వల్ల వచ్చే పుణ్యానికీ ఈ గ్రహమే కారణం. పితకర్మలు చేయని వారికి కేతువు వల్ల అరిష్టాలు సంప్రాప్తిస్తారుు. గణపతి హోమం చేయించండి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement