బెన్ హర్ కొత్త రీమేక్ | New 'Ben-Hur' Movie Remake By MGM | Sakshi
Sakshi News home page

బెన్ హర్ కొత్త రీమేక్

Published Sun, Nov 23 2014 1:14 AM | Last Updated on Sat, Sep 2 2017 4:56 PM

బెన్ హర్ కొత్త రీమేక్

బెన్ హర్ కొత్త రీమేక్

ప్రసిద్ధ హాలీవుడ్ చలన చిత్ర నిర్మాణ సంస్థ ఎం.జి.ఎం. వారి సింహం ప్రతి సినిమా ప్రారంభంలోనూ గర్జిస్తుంది. కానీ ‘బెన్ హర్’ చిత్రంలో ఆ సింహం గర్జించలేదు. అయినా ఐదున్నర దశాబ్దాలుగా ‘బెన్ హర్’ విజయ ఢంకా గర్జన వినిపిస్తూనే ఉంది. ఆస్కార్ చరిత్రలో మొట్టమొదటిసారిగా 11 అవార్డుల్ని గెలుచుకున్న ఈ క్లాసిక్ చిత్రం తన చరిత్రని తనే విస్తరించుకుంటూ ఇంకో బెన్ హర్‌గానూ అవతరించబోతోంది. ఈ సందర్భంలో బెన్ హర్ గురించి ‘వివరం’గా...
 
ముఖచిత్రం: యుద్ధనౌక మీద తెడ్డు వేసే బానిసగా బెన్ హర్ పాత్రధారి చార్ల్‌టన్ హెస్టన్
ఒక సినిమా ఒక్కో తరం సోపానమెక్కుతూ కాలదోషాన్ని కాచుకోవడమంటే మాటలు కాదు. అలాంటిది అవలీలగా రెండు తరాలూ దాటుకుని, నేటి మూడో తరం ప్రేక్షకుల ఆదరాభిమానాల్ని అంతే బలంగా చూరగొనడం ‘బెన్ హర్’కే చెల్లింది. కేవలం ఒక సినిమా మాత్రంగానే ఇది కాలవాహికలో ప్రయాణిస్తూ పోవడం లేదు - సర్వాంతర్యామిలా సర్వరూపాలూ ధరించేస్తూ, మనం తొడుక్కునే బట్టల దగ్గర్నుంచి గృహోపకరణాలు, ఆభరణాలు, కారొప్పొడి, పళ్ల పేస్టు, కళ్లద్దాలు, కాఫీ పొడి, వీడియో గేమ్స్, కామిక్సు... బ్లూరే వెర్షన్సు... ఐ ట్యూన్ డౌన్ లోడ్సు... వగైరా వగైరాలకు ఒక బ్రాండ్‌నేమ్‌గా తరాల తారతమ్యం లేని గమ్యంగా అప్రతిహతంగా పురోగమిస్తోంది.

ప్రేమానురాగాలు, కుటుంబ - స్నేహ సంబంధాలు, ప్రతీకారాలు, మత విశ్వాసాలు వంటి సార్వజనీన భావోద్రేకాలే బెన్ హర్‌ని సమకాలీనం చేస్తున్నాయని ఇంకా వేరే చెప్పుకోనవసరం లేదు. ప్రత్యేకించి మత విశ్వాసాల గురించి చెప్పుకోవాల్సి వస్తే, ఏసుక్రీస్తు ఉనికితో ఆధ్యాత్మిక కోణం అనే అదనపు సినిమాటిక్ విలువ జతపడింది. దీనికి ఆధారం ‘బెన్ హర్ : ఎ టేల్ ఆఫ్ ది క్రైస్ట్’ (1880) అనే మహాగ్రంథం. ఆ గ్రంథ రచయిత లివ్ వాలేస్.

 ఆ మహోద్గ్రంథమే కాలపరీక్షకు తట్టుకుని ఎనిమిది దశాబ్దాల తర్వాత కూడా 1959 నాటికి వేలమందికి ఉపాధి కల్పించింది. ఒక కావ్యం జనసామాన్యానికి కళ్లారా కనువిందు చేసే ఏకైక సామూహిక దృశ్య మాధ్యమం సినిమాగా రూపొందే స్థాయికి చేరిందంటే అది అమరమైనట్టే. ఇప్పుడు కూడా మైక్రోసాఫ్ట్ విండోస్ స్టోర్ నుంచి దీని యాప్స్‌ని ఎనభై రూపాయలకే డౌన్‌లోడ్ చేసుకుని ఎంచక్కా చదువుకోవచ్చన్నమాట! ఇంకేం కావాలి? సినిమాతో పాటు ఈ రచనా కాలంలోకి ప్రయాణిస్తూనే ఉంటుంది ఎల్లకాలం. ఐతే ఇప్పుడు మనం చూస్తున్న 1959 నాటి  బెన్ హర్ సినిమాకి ముందు మరికొన్ని బెన్ హర్‌లున్నాయి.
 
మంచిచెడులు నవంబరులోనే!
బెన్ హర్ సినిమాల కంటే ముందు బెన్ హర్ నాటకమే ఉంది. ఆ నాటకం వందేళ్ల తర్వాత మొన్నటికి మొన్న 2009లో మళ్లీ స్టేజికెక్కింది. 1899 నవంబర్ 29న మొదటిసారి నాటకంగా న్యూయార్క్‌లో ప్రారంభమైంది. డిసెంబర్7, 1907న మూకీ లఘు చిత్రంగా తొలిసారిగా వెండితెరకెక్కింది. 1925 డిసెంబర్ ఇరవైన మరో మూకీ చిత్రంగా విడుదలైంది. ఆ నిర్మాణ స్టూడియో ఎంజీఎమ్మే తిరిగి 1959లో ఇప్పుడు మనం చూస్తున్న బెన్ హర్‌ని రీమేక్‌గా నిర్మించి నవంబర్ 18న విడుదల చేసింది. కానీ నిర్మాత సామ్ జింబాలిస్ట్ సినిమా విడుదలకి ముందే, నవంబర్ 4, 1958న షూటింగ్‌లోనే గుండెపోటుతో హఠాన్మరణం చెందాడు! ఇలా నవంబర్ మాసంతో బెన్ హర్‌కి మంచీ చెడూ రెండూ ప్రాప్తించాయి. గ్రంథ ప్రచురణ, తొలి నాటకం, బెన్ హర్ రీమేక్, నిర్మాత మరణం ఇవన్నీ నవంబర్లోనే సంభవించాయి. పైగా తొలి, మలి మూకీలు రెండూ డిసెంబర్‌లోనే విడుదలయ్యాయి. 2003లో యానిమేషన్‌గానూ వచ్చింది. 2010లో టీవీ సిరీస్‌గానూ ప్రసారమైంది.
 
మెట్రో గోల్డ్విన్ మేయర్(ఎం.జి.ఎం.) స్టూడియో 1925 నాటి బెన్ హర్‌ని రీమేక్ చేస్తున్నట్టు ప్రకటించింది 1952లోనే. అంతలోనే స్టూడియోలు వచ్చేసి సినిమా థియేటర్ల మీద గుత్తాధిపత్యాన్ని వదులుకోవాలన్న కోర్టు తీర్పు శరాఘాతంలా తగిలి, పెపైచ్చు టీవీ ఛానెళ్లు వచ్చేసి సినిమా వ్యాపారాన్ని తూట్లు పొడవటంతో రీమేక్ ప్రకటన వెనక్కి తీసుకున్నారు. ఐతే, ఆ ఆర్థిక సంక్షోభం నుంచి స్టూడియోని గట్టెక్కించడానికి అప్పుడప్పుడే (1956లో) విడుదలైన ‘టెన్ కమాండ్‌మెంట్స్’ వంటి బైబిల్ కథాంశంతో కూడిన సినిమా అఖండ విజయం ధైర్యాన్నిచ్చింది. ‘టెన్ కమాండ్‌మెంట్స్’ని సాటి స్టూడియో పారమౌంట్ పిక్చర్స్ నిర్మించింది.

ఈ స్ఫూర్తితో మొత్తమ్మీద ఎమ్జీఎమ్ 1957లో తన నూతన ఆవిష్కరణ 65 ఎం.ఎం. వైడ్ స్క్రీన్ ప్రాసెస్ అనే సాంకేతిక హంగుతో రీమేక్‌ని చేపట్టింది. ఇందుకు సామ్ జింబాలిస్ట్‌ని నిర్మాతగా ప్రకటించింది. బడ్జెట్ 70 లక్షల డాలర్లు. ప్రీ ప్రొడక్షన్ నాటికి కోటి డాలర్లు అని అంచనా వేశారు. తీరా నిర్మాణం ప్రారంభించే నాటికి, కోటిన్నర డాలర్లు అవసరమని లెక్కలేశారు. నిర్మాణం పూర్తయ్యేసరికి కోటి 52 లక్షల డాలర్లని లెక్క తేల్చుకున్నారు.
 
స్క్రిప్టు రైటర్ కోసం కసరత్తు
నిర్మాతగా వ్యవహరించిన సామ్ జింబాలిస్ట్ ఓ పట్టాన స్క్రిప్టుని ఒప్పుకునే మనిషి కాడు. నవల మాదిరిగా క్రైస్తవ ఆధిక్య సమాజాన్ని చూపించడానికి ససేమిరా అన్నాడు. భిన్న సంస్కృతుల అమెరికన్ సమాజమే కావాలని పట్టుబట్టాడు. పన్నెండు మంది రచయితల్ని పరీక్షించాడు. గోర్ విడల్‌ని ఖరారు చేశాడు. ఇంకో కృష్ణుడుగా క్రిస్టఫర్ ఫ్రై అనే రచయిత తెరపైకి వచ్చాడు. తర్వాత ఈ స్క్రిప్టు ఎవరిదన్న దానిమీద పెద్ద వివాదమే రేగింది. అంతిమ విజేత కార్ల్ టున్ బెర్గ్ అయ్యాడు. కానీ దర్శకుడు విలియం వైలర్ చేతికి ఆ స్క్రిప్టు వచ్చేసరికి పరిస్థితి తిరిగి మొదటికొచ్చింది. ఇది పరమ ఆటవికంగా ఉందని తిప్పికొట్టాడు వైలర్. హీరోలు, విలన్లు ఒక పద్ధతిగా లేరని చెప్పాడు.
 
1925లో మూకీ బెన్ హర్‌కి పనిచేసిన 30 మంది సహాయ దర్శకుల్లో విలియం వైలర్ ఒకడు. మూకీ బెన్ హర్ తర్వాత దర్శకుడుగా మారి, 1958 వరకూ 33 ఏళ్ల కాలంలో 57 సినిమాలకి దర్శకత్వం వహించాడు. వాటిలో ‘రోమన్ హాలిడే’, ‘డెస్పరేట్ అవర్స్’ వంటి క్లాసిక్స్ ఉన్నాయి. రెండుసార్లు ఆస్కార్ అవార్డులు పొందాడు. ప్రస్తుత బెన్ హర్ తర్వాత మరో రెండు ఆస్కార్లు అందుకున్నాడు. 1970 నాటికి మరో అయిదు సినిమాలు తీసిన వైలర్, 1981లో 79వ ఏట మృతి చెందాడు.
 
బెన్ హర్ స్క్రిప్టుకి సంబంధించి వైలర్‌ది ఒక్కటే అభ్యంతరం - ఆటవికంగా ఉందని. ‘‘అది నాకు తెలుసండీ, కానీ ఏం చేద్దాం? ఆ రథప్పందాల్ని మర్చిపోండి. అది సెకండ్ యూనిట్ చూసుకునే వ్యవహారం. మీరు దయచేసి ఆ మిగిలిన ఆటవిక తనానికి జీవం పోయండి. సంస్కరించండి, డెప్త్ తీసుకురండి. బాడీ - డెప్త్ - ఇంటిమసీ... వీటికే కదా మీరు ప్రసిద్ధులు. కానివ్వండి, అది పూర్తిచేస్తే ఆటవిక లక్షణాలు పోతాయని నా అభిప్రాయం’’ అని జింబాలిస్ట్ నచ్చజెప్పాడు. ఆ స్క్రిప్టు మీద పనిచేస్తున్న వైలర్‌కి కొన్నాళ్లకి మనసు మారి - దీనికి సరైన కథానాయకుడు లభించకపోతే తప్పుకుంటానని మళ్లీ మెలిక పెట్టాడు. అలాంటి కథానాయకుడుగా చార్ల్‌టన్ హెస్టన్ వచ్చి వైలర్‌ని మెప్పించగలిగాడు.
 
కానీ హెస్టన్‌కి అంత త్వరగా ఆ అదృష్టం వరించలేదు. మరికొందరు హేమాహేమీలు కాలదన్నుకున్న తర్వాత వచ్చి ఒళ్లో పడింది. కాలదన్నుకున్న నట దిగ్గజాల్లో బర్ట్ లాంకాస్టర్ స్క్రిప్ట్ పరమ బోరుగా ఉందని తిరస్కరించాడు. పొడుగు జుబ్బాలు ధరిస్తే తన కాళ్లు అందంగా కనపడవని పాల్ న్యూమన్ కాదన్నాడు. మార్లన్ బ్రాండో, రాక్ హడ్సన్, జాఫ్రీ హార్న్, లెస్లీ నీల్సన్... ఇలా స్టార్లంతా ఇలాంటి వంకలే పెట్టి ఆస్కార్ అర్హత గల బెన్ హర్ పాత్రని చేజార్చుకున్నారు. ఆఖరికి ఇటలీలో కిర్క్ డగ్లస్‌ని కూడా అనుకున్నారు. అంతిమంగా చార్ల్‌టన్ హెస్టన్ ఎంపికయ్యాడు.
 
అప్పటికి 1956లో టెన్ కమాండ్‌మెంట్స్‌లో మోజెస్‌గా నటించి ప్రముఖుడై ఉన్నాడు చార్ల్‌టన్ హెస్టన్. బెన్ హర్‌కి ముందు 1941 నుంచీ 21 సినిమాల్లో నటించాడు. బెన్ హర్ తర్వాత 2003 వరకూ మరో 62 సినిమాల్లో నటించాడు. వాటిలో ఏర్‌పోర్ట్ 1975, ట్రూలైస్ ముఖ్యమైనవి. చివరికి 2008లో తనతో 64 ఏళ్లు కాపురం చేసిన భార్యని వదిలి, 84వ ఏట పైలోకాలకెళ్లిపోయాడు.
 
చార్ల్‌టన్ హెస్టన్ (బెన్ హర్) లేకుండా ఈ మహాదృశ్య కావ్యాన్ని ఊహించగలమా? ఎర్రటి ఎండలో చుక్క నీటికోసం అల్లాడుతున్నాడు. అప్పుడు బైబిలు ఘట్టం! యోహాను 4:13-14 ‘‘అందుకు యేసు ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరల దప్పిగొనును; నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పిగొనడు; నేను వానికిచ్చు నీళ్లు నిత్యజీవనమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను’’. ఇలా ఏసుప్రభువు దాహం తీరుస్తూంటే, అదేమిటి చివరికైనా కృతజ్ఞతాభావంతో చూడడే అన్పించినా, హెస్టన్ ఈజ్ హెస్టనే... ఆస్కార్ న్యాయనిర్ణేతల మనసు అలా గెలిచాడు. ఒకసారి నాటి ఆస్కార్ ప్రధానోత్సవ బ్లాక్ అండ్ వైట్ ఫిలిం క్లిప్పింగ్‌ని చూస్తే - అవార్డునందుకుంటున్న హెస్టన్ కళ్ల నీళ్లు అచ్చంగా ఆ నిజజీవితపు అపూర్వ ఘట్టం తెప్పించినవే. కానీ మనకలాంటి నిజజీవితంలో కళ్లనీళ్లు కేవలం బెన్ హర్‌గా నటించి తెప్పించేస్తాడు! బెన్ హర్‌ని హాలీవుడ్ లెజెండ్‌గా ప్రతిష్టించి పెట్టినవాడు హెస్టన్.
 
ముఖ్యపాత్ర జీసెస్ మాటేమిటి?
షూటింగ్ ప్రారంభమైంది. 1958 మే 18న రోమ్ నగరంలో షూటింగ్ ప్రారంభమయ్యేనాటికి దర్శకుడు వైలర్ చదివింది మొదటి పదీ పన్నెండు పేజీల స్క్రిప్టే. స్క్రిప్టులో బెన్ హర్‌గా హెస్టన్ ఎంత ముఖ్యుడో అతడి తల్లీ చెల్లీ పాత్రల్లో ‘టెన్ కమాండ్‌మెంట్స్’లో హెస్టన్ తల్లిగా నటించిన మార్తా స్కాట్, వైలర్ మరదలు కేథీ ఓ డానెల్ అంతే ముఖ్యులు. ప్రేయసిగా హయా హరారీట్, బాల్య స్నేహితుడిగా స్టీఫెన్ బాయిడ్‌లు అంతే శ్రేష్ఠులు.
 
అయితే... అయితే... అసలు అందరికంటే ముఖ్యపాత్ర జీసస్ క్రైస్ట్ మాటేమిటి?
ప్రొడక్షన్ మేనేజర్ హెన్రీ హెనింగ్సన్ రోమ్ నగరంలో ఓ సంగీత విభావరికెళ్లినప్పుడు అక్కడ పాడుతున్న యువ అమెరికన్ సింగర్ కంఠస్వరం, అత్యంత సుందరమైన అతడి ఆధ్యాత్మికత ఉట్టిపడే ముఖారవిందమూ చూసి పరుగెత్తుకొచ్చి వైలర్, జింబాలిస్ట్‌ల చెవిన వేశాడు. తక్షణం అతన్ని పిలిపించి స్క్రీన్ టెస్ట్ చేశారు. అలా కాకతాళీయంగా క్లాడ్ హీటర్ కరుణామయుడి పాత్రధారి అయ్యాడు. అయితే సినిమాలో అతడి పృష్ట భాగమే చూపించారు తప్ప ముందు నుంచి ఎక్కడా చూపించలేదు, ముఖం ఎక్కడా కనపడకుండా జాగ్రత్త తీసుకున్నారు. కొన్నిసార్లు కొన్ని విషయాలు ప్రేక్షకుల ఇమాజినేషన్‌కి వదిలేస్తేనే న్యాయం చేసినవాళ్లవుతారు. ఇక టైటిల్స్‌లో క్లాడ్ హీటర్ పేరు కూడా వేయలేదు. 1927లో జన్మించిన క్లాడ్ హీటర్ ఇంకా జీవించే ఉన్నాడు.
 
ఇంకా వేల మంది ఎక్స్‌ట్రాలు! 50 వేలమంది ఎక్స్‌ట్రాల కోసం రోమ్‌లో గాలించారు. ఈ ఎక్స్‌ట్రాలతో చాలా చిక్కొచ్చిపడింది. చిరునామాలుండవు, ఫోన్ నెంబర్లుండవు. సమాచారం చేరదు, వాళ్లకీ వీళ్లకీ చెప్పి పంపిస్తే ఆ సమాచారం చేరడానికి కొన్ని రోజులు పట్టేది. ప్రీ ప్రొడక్షన్‌లోనే కాస్ట్యూమ్స్‌కి, సెట్స్‌కి, ప్రాపర్టీస్‌కి సంబంధించి 15 వేల స్కెచ్చులు, డ్రాయింగులు స్టూడియో ఆర్ట్ డిపార్ట్‌మెంట్ సిద్ధం చేసింది. 200 ఒంటెలు, 2,500 గుర్రాలు సమీకరించారు. క్లైమాక్స్‌లో రథప్పందాల్లో పాల్గొనడానికి 72 అశ్వాల్ని యుగోస్లేవియా నుంచీ, సిసిలీ నుంచీ ప్రత్యేకంగా రప్పించారు.

సినిమాకి ఆయువు పట్టు లాంటి ఆ రథప్పందాల షూటింగ్ పూర్తిచేయడానికే మూడు నెలలు పట్టింది. ఈ షూటింగులో ఎంతో ఖరీదైన రెండు 70 ఎం.ఎం.లెన్సులు నాశనమయ్యాయి. మిగతా టాకీ పార్టు ఆరు నెలలు తీసుకుంది. చివర్లో కుష్టు వ్యాధిగ్రస్థులుగా చూపించాల్సిన తల్లీకూతుళ్ల పాత్రధారులిద్దర్నీ నెలరోజులు కుష్టు మేకప్‌లోనే వుంచేశాడు దర్శకుడు వైలర్. వాళ్లలాగే జీవించారు ఆ నెలరోజులూ. ఎట్టకేలకు 1959 జనవరి 7న ఆ చారిత్రాత్మక షూటింగ్ ముగిసింది. మొత్తం పదకొండు లక్షల అడుగుల ముడి ఫిలిం ఖర్చయ్యింది. ఎడిటింగ్ తర్వాత 19 వేల అడుగులతో, మూడు గంటలా 33 నిమిషాల స్క్రీన్ టైముతో విడుదలకి సిద్ధమయ్యింది.
 
బెన్ హర్ కాపాడింది
బెన్ హర్... కోర్టు తీర్పుతో, చానెళ్ల బెడదతో ఖాయిలా దిశగా దౌడు తీస్తున్న స్టూడియోని పుష్కలంగా ధనార్జన చేసి కాపాడింది. అది చేదు అనుభవాన్నే మిగిల్చి ఉంటే, తిరిగి అదే ఎమ్జీఎం స్టూడియో, పారమౌంట్ పిక్చర్స్‌తో కలిసి ఇప్పుడు మరోసారి రీమేక్ చేయడానికి సాహసించేది కాదు. అంత కచ్చితంగా 2016 ఫిబ్రవరిలో విడుదల చేస్తామని ప్రకటించేది కాదు. ఈ రీమేక్ ప్రస్తుత క్లాసిక్‌తో సాటి రాదో, వస్తుందో అప్పుడే చెప్పలేం. కానీ ఒకటి మాత్రం చెప్పగలం: ఓల్డ్ క్లాసిక్ ఎప్పుడూ ఓల్డ్ క్లాసిక్కే. రిఫరెన్స్‌కి ఎప్పుడూ నమ్మకమైన దిక్కే. చారిత్రక అంశాల్లో కచ్చితత్వానికి పెద్దపీట వేసిన బెన్ హర్ ఆస్కార్ చరిత్రలో మొట్టమొదటిసారిగా 11 అవార్డులు కైవసం చేసుకుంది. మళ్లీ ఈ రికార్డుని చాలం కాలం తర్వాత ‘టైటానిక్’ బ్రేక్ చేసింది. ‘టైటానిక్’ రికార్డుని ‘లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రిటర్న్ ఆఫ్ ది కింగ్’ బ్రేక్ చేయగలిగింది.
 
ప్రపంచ సినిమా చరిత్రలో బెన్ హర్‌ని మించిన కళాత్మక సాంకేతికం సాధ్యం కాదేమో. వైలర్‌కే ప్రత్యేకమైన ‘కాంపోజిషన్ ఇన్ డెప్త్’ అనే విజువల్ టెక్నిక్‌తో దృశ్యాలు ఊపిరి సలపనివ్వవు. అలా కళ్లప్పగించి చూస్తూండాల్సిందే. రాబర్ట్ సర్టీస్ ఛాయాగ్రహణం, మిక్లాస్ రోజ్సా సంగీతం... నటీనటుల అభినయాలు, సంభాషణలు, రథప్పందాల యాక్షన్ కొరియోగ్రఫీ... మొత్తంగా వెండితెర మీద నాటి పురాతన రోమ్ నగరపు నిలువెత్తు రంగుల శోభ బెన్ హర్! ఈ నవంబర్ 18తో 55 సంవత్సరాలు నిండిన ఈ క్లాసిక్ ఇంకా ముందు తరాల్ని ఆనందాశ్చర్యాలలో ముంచెత్తుతుంది. సాత్విక - రాజసిక - తామసిక గుణాలతో కుదిపేస్తుంది - మనిషి ధర్మం ఎలా ఉండాలో ఉద్బోధిస్తుంది.
 
జుడా బెన్ హర్ తనకు జరిగిన అన్యాయానికి ప్రతీకారేచ్ఛతో ఎంత రగిలిపోయినా, దయామయుడి స్పర్శతో - క్షమాగుణం ఎంత శక్తిమంతమైనదో తెలుసుకోవడమే అతడి ముక్తికి మార్గమైంది.  క్షమలోనే శాంతి ఉంది, పగ చల్లార్చుకోవడంలో లేనే లేదు.
 చిత్రం ముగింపు ఎంత హృద్యమో, ప్రారంభమూ అంతే ప్రశాంతమయం ఏసు జననంతో. అందుకే దర్శకుడు విలియం వైలర్ స్టూడియో అధిపతుల్ని కోరాడు - బ్యానర్ లోగోలో ఎప్పటిలా సింహం గర్జిస్తే ప్రారంభం రసభంగమౌతుందని. విజ్ఞులైన అధిపతులు అందుకు అంగీకరించారు. అందుకే ఆ సింహం ‘లియో ది లయన్’ సెలైంట్ అయింది, మూవీ బ్రిలియెంట్ అయింది.
 - సికిందర్
 
ఇదీ కథ
క్రీస్తు శకం ఒకటో శతాబ్దపు రోమన్ సామ్రాజ్యంలో బెన్ హర్ ఒక ఐశ్వర్యవంతుడైన యూదు యువరాజు. చిన్ననాటి స్నేహితుడు మెసాలా రోమన్ సైన్యాధికారి. ఇద్దరికీ సైద్ధాంతిక విభేదాలు. యూదుల్ని రోమన్ ఉక్కుపిడికిలితో పాలించాలన్న కాంక్షతో వచ్చి, ఇక్కడ అవిధేయులైన యూదుల పేర్లు వెల్లడించమంటాడు మెసాలా. వాళ్లని చంపి ఒక హెచ్చరిక చేస్తానంటాడు. దీనికి బెన్ హర్ అంగీకరించడు. దీంతో ఇద్దరూ విరోధులవుతారు. పట్టణ వీధుల్లో ఒక ఊరేగింపులో భవంతి పైనించి ఒక పెంకు జారి మెసాలా మీద పడుతుంది. భవంతి పైన బెన్ హర్‌తో కలిసి ఊరేగింపు చూస్తున్న చెల్లెలి చేయి తగిలి వదులుగా ఉన్న ఆ పెంకు జారిపడిందన్న మాట. అసలే బెన్ హర్ మీద కోపంతో ఉన్న మెసాలా, దీన్ని తనమీద దాడిగా ఎంచి బెన్ హర్ చెల్లెల్నీ తల్లినీ చెరసాలలో వేసి, బెన్ హర్‌ని యుద్ధ నౌక మీద తెడ్డు వేసే బానిసగా పంపించేస్తాడు.
 
అసలు జరిగిందేమిటో చెప్పి తనవాళ్లని వదిలెయ్యమన్నా వినిపించుకోడు మెసాలా. అక్కడ్నించీ బెన్ హర్‌కి పగ రగులుతుంది స్నేహితుడి మీద. ఆ నౌక మీది బానిసలకి, ఖైదీలకి దాహార్తి తీర్చే సామాన్యుడిలా ఉంటాడు ఏసుక్రీస్తు. నౌక మీద సముద్రపు దొంగల దాడి జరుగుతుంది. ఆ దాడిలో రోమన్ అధికారి ప్రాణాలు కాపాడతాడు బెన్ హర్. దాంతో ఆ అధికారి బెన్ హర్‌ని కొడుకుగా దత్తత తీసుకుంటాడు.
 
అధికారి ఆప్యాయత ఎంత మాత్రం రుచించదు బెన్ హర్‌కి. మనసంతా మెసాలా చేసిన మోసం మీదే. ఎక్కడ్నునారో ఎలా ఉన్నారో ఇంకా తెలీని తల్లీ చెల్లెళ్ల మీదే. ఈ సమయంలో ఒక అరబ్ గుర్రాల వర్తకుడు పరిచయమౌతాడు. అతడి ద్వారా తెలుస్తుంది - త్వరలో జరగనున్న రథప్పందాల గురించి. అందులో పాల్గొనబోతున్న మెసాలా గురించి. వాణ్ని నువ్వోడించాలని తర్ఫీదునిచ్చి పందాల్లో దింపుతాడు బెన్ హర్‌ని అరబ్ వర్తకుడు. ఈ సందర్భంగా మెసాలాని కలిసి ఒక్కరోజు కోసం తనవాళ్లని విడుదల చెయ్యమని బెన్ హర్ వేడుకుంటే, వాళ్లెప్పుడో చనిపోయారంటాడు మెసాలా.

దీంతో కుంగిపోయిన బెన్ హర్ అలాగే పందాల్లో పాల్గొంటాడు.
 ఆ పందాల్లో బెన్ హర్ చేతిలో చిత్తుగా ఓడిపోయి, కొనవూపిరితో ఉన్న మెసాలా - నీ తల్లీ చెల్లీ కుష్ఠు వ్యాధి సోకి లోయలో ఉన్నారని అసలు విషయం చెప్తాడు. లోయలో హృదయవిదారకంగా ఉన్న వాళ్లిద్దర్నీ చూసుకుని బావురుమంటాడు బెన్ హర్. ఇక సర్వ రక్షకుడు జీసస్సే శరణ్యమని వాళ్లిద్దర్నీ జీసస్ దగ్గరికి తీసుకుపోతూంటే - ఆ లోక రక్షకుడేమో శిలువెక్కుతూ..!

మొదట ద్వేషించాడు! తర్వాత క్షమించమన్నాడు!
బెన్ హర్ గ్రంథ రచయిత లివ్ వాలేస్
ఉద్గ్రంథాలు రాయాలంటే ఉగ్గుపాలప్పట్నించీ ఉదాత్త భావాల్ని ఉగ్గబట్టుకుని ఉండాలి. కానీ ‘బెన్ హర్’ లాంటి మహాగ్రంథ రచయిత లివ్ వాలేస్‌కి ఉగ్గుపాలప్పట్నించే క్రీస్తు అన్నా, క్రైస్తవం అన్నా అస్సలు వొంటికి పడలేదు. ఈ గ్రంథం రాయడానికి పూనుకున్నప్పుడు తను క్రైస్తవుడే కాదు. ఈ గ్రంథం రాసి క్రీస్తు అసలు దేవుడే కాదని నిరూపించదల్చుకున్నాడు. క్రీస్తు అనే నమ్మకాన్ని భూస్థాపితం చేయాలనుకున్నాడు. క్రీస్తు పునరుత్థానమే కాలేదనీ, క్రైస్తవమే బూటకమనీ స్థిరపర్చాలనుకున్నాడు. దీంతో 1873లో పరిశోధనకి పూనుకున్నాడు. ఏళ్ల తరబడి ఆ లోతైన పరిశోధన కాస్తా అతన్ని లోతైన క్రైస్తవంలోకే దిగ లాగింది. ఏసుక్రీస్తు అచ్చంగా దేవుడేనన్న నమ్మకాన్ని ససాక్ష్యంగా కల్పించింది. అప్పుడు ఒక్కసారిగా మోకాళ్ల మీద చతికిలబడి కుళ్లి కుళ్లి ఏడ్చి, గొంతెత్తి అరిచాడు - ప్రభువా నన్ను క్షమించమని!
 
1880లో గ్రంథ రచన పూర్తిచేశాడు. ప్రయాణాల్లోనూ, ఇంటి ముందు బీచ్‌లో చెట్టు కిందనూ కూర్చుని తడవతడవలుగా రాసి పూర్తిచేశాడు. తను తక్కువవాడేం కాదు. గ్రంథ రచన పూర్తిచేసే నాటికి న్యూ మెక్సికో గవర్నర్‌గా ఉన్నాడు. ఆ హోదాలోనే గులాబీ రంగు సిరాతో ముచ్చటగా ఫేర్ చేసిన రాత ప్రతితో ప్రచురణ కర్త దగ్గరికి న్యూయార్క్‌దాకా ప్రయాణించాడు. హార్పర్ బ్రదర్స్ సంస్థ అధిపతి మిస్టర్ జోసఫ్ హెన్రీ హార్పర్ చేతిలో ఆ రాత ప్రతిని పెట్టాడు. వాలేస్ రాసిన ఆ ప్రయోగాత్మక కాల్పనికానికి హార్పర్ చకితుడై, కళ్లకద్దుకుని ప్రచురించి, అదే సంవత్సరం -1880లో - నవంబర్ 12న విడుదల చేశాడు. 550 పేజీల ఆ ఉద్గ్రంథం ఒకటిన్నర డాలర్ ధరకి నెమ్మది నెమ్మదిగా అమ్ముడవుతూ పోయింది. 1900 కల్లా 36 ఆంగ్ల భాషా ఎడిషన్లలో ప్రచురణ అవడమే గాక, ఇరవైకి పైగా భాషల్లో అనువాదమైంది. ఈ భూమ్మీదికొచ్చినందుకు తన వంతు బాధ్యత అలా ప్రశంసనీయంగా నెరవేర్చిన వాలేస్, 1905 ఫిబ్రవరి ఐదున ప్రశాంతంగా కన్నుమూశాడు.
 
బెన్ హర్ చిత్రంలోని కొన్ని డైలాగ్స్
షేక్ ఇల్డెరిమ్: ఒకే దేవుడంటే అర్థం చేసుకోగలను. ఒకే భార్యేమిటి? అనాగరికం!
* మార్కెట్ ప్రాంతంలో బెన్ హర్ - మెసాలా వాదించుకుంటున్నప్పుడు బ్యాక్ గ్రౌండ్‌లో వినిపించే  డైలాగు: కిదర్ జాతా హై భాయ్, కిదర్ జాతా హై?
* పాంటియాన్ పిలేట్: ఎదిగిన మనిషికి తను జీవిస్తున్న లోకం తెలుస్తుంది. ప్రస్తుతానికి ఆ లోకం రోమ్ నగరం.
* బెన్ హర్: దేవుడు నాకు పగదీర్చుకునే శక్తి నివ్వుగాక! నేను తిరిగి వచ్చే దాకా నువ్వు బతికే వుండాలని ప్రార్థిస్తున్నా.
 మెసాలా: తిరిగొస్తావా?
* షేక్ ఇల్డెరిమ్: బల్తసార్ మంచి మనిషి.... కానీ అతనిలాగే అందరూ అయ్యేవరకూ మన ఖడ్గాలు మెరుస్తూ ఉండాలి!
* బెన్ హర్: నువ్వు పెళ్లి కుమార్తెగా ఉండకపోతే ముద్దిచ్చి గుడ్ బై చెప్పే వాణ్ణి.
* ఈస్థర్: నేను పెళ్లి కూతుర్నై ఉండకపోతే చెప్పడానికి గుడ్ బైలే ఉండేవి కావు.
* సెక్స్‌టస్: బుర్ర పగల గొట్టొచ్చు. అరెస్ట్ చేసి లోపలెయ్యెచ్చు. నరకంలో పడెయ్యొచ్చు. కానీ బుర్రలో ఉన్న ఐడియాల్ని ఎలా కంట్రోల్ చేస్తామబ్బా? ఐడియాలతో ఎలా పోరాటం చేస్తాం?
* షేక్ ఇల్డెరిమ్: బుర్ర తక్కువ వెధవా, ఆ పగ్గాలిలా ఇవ్వు! నా గుర్రాల్ని జంతువుల్లాగా చూస్తావా? గొర్రెల్ని బర్రెల్ని తోలుకు వచ్చే వెధవ - గెటాఫ్ ఈడియెట్!
* రియస్: నీ కళ్ళ నిండా ద్వేషం ఉంది. వెరీగుడ్! ద్వేషం మనిషిని బతికిస్తుంది. బలాన్నిస్తుంది.
* సాలా: సెక్స్‌టస్! ఐడియాతో ఎలా పోరాడతామని అడిగావు కదూ? చెప్తా విను- ఐడియాని ఐడియాతోనే పోరాటం చేయాలి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement