ఎర్ర సముద్రం రెండుగా చీలిపోయే సన్నివేశం అద్భుతం..! | Ten comandments- Pillar of fire and Parting of the Red Sea | Sakshi
Sakshi News home page

ఎర్ర సముద్రం రెండుగా చీలిపోయే సన్నివేశం అద్భుతం..!

Published Mon, Feb 9 2015 12:31 AM | Last Updated on Sat, Sep 2 2017 9:00 PM

ఎర్ర సముద్రం రెండుగా చీలిపోయే సన్నివేశం అద్భుతం..!

ఎర్ర సముద్రం రెండుగా చీలిపోయే సన్నివేశం అద్భుతం..!

అందుకే... అంత బాగుంది!

ది టెన్ కమాండ్‌మెంట్స్ (1956)
  తారాగణం: చార్ల్‌టన్ హెస్టన్, యూల్ బ్రిన్నర్, యాన్నే బాక్సర్, ఎడ్వర్డ్ జి. రాబిన్‌సన్, యెవాన్ డి. కార్లో, డెబ్రా పెగెట్, జాన్ డెరెక్, సర్ సెడ్రిక్ హార్డ్‌విక్, నీనా ఫాష్ తదితరులు రచన: ఏనీస్ మ్యాకెంజీ, జెస్ ఎల్. లాస్కీ జూనియర్ సంగీతం: ఎల్మెర్ బెర్న్‌స్టీన్ సినిమాటోగ్రఫీ: లాయల్ గ్రిగ్స్ స్పెషల్ ఫోటోగ్రాఫిక్ ఎఫెక్ట్స్: జాన్ పి. ఫుల్టన్ కళా దర్శకత్వం: హల్ పెరీరా, వాల్టర్ హెచ్. టైలర్, ఆల్బర్ట్ నొజాకీ ఎడిటింగ్: అన్నే బాచెన్స్ దర్శకత్వం: సిసిల్ బి. డిమిల్లీ విడుదల తేదీ: 8-11-1956


నిర్మాణవ్యయం: కోటీ 30 లక్షల డాలర్లు (ఇప్పటి లెక్కల్లో దాదాపు రూ. 80 కోట్లు) వసూళ్ళు: 12 కోట్ల 27 లక్షల డాలర్లు (దాదాపు రూ. 740 కోట్లు)
 
 ‘‘నేను హాలీవుడ్ సినిమాలు ఎక్కువ చూడను. అలాగని తక్కువా చూడను. ఈ రోజుకూ ఎవరైనా ఫలానా సినిమా బాగుందని చెబితే మాత్రం చూడకుండా ఉండలేను.మద్రాసు వెళ్లిన కొత్తల్లో... అంటే నేను రచయితగా పని చేస్తున్న రోజుల్లో మౌంట్‌రోడ్‌లోని ఆనంద్, సఫైర్ థియేటర్లలో విడుదలైన ప్రతి హాలీవుడ్ సినిమా చూసేవాణ్ణి. అయితే ఇప్పట్లోలా అంత ఉద్ధృతంగా సినిమాలు విడుదలయ్యేవి కావు. అప్పట్లో నేను ‘జగత్ కిలాడీలు’, ‘జగత్ జంత్రీలు’, ‘జగత్ జెట్టీలు’, ‘అందరూ దేవాంతకులే’ సినిమాలకు రాస్తున్నపుడు నిర్మాతలు కావాలని హాలీవుడ్ సినిమాలు చూపించేవారు. ‘జగత్ జెట్టీలు’ సినిమా చూస్తే ఓ ఐదు హాలీవుడ్ చిత్రాల ప్రభావం కనిపిస్తుంది. ’For a Few Dollars More' సినిమా అందులో ఒకటి.
 
 నా మైండ్‌లో ఇప్పటికీ నిలిచిపోయిన సినిమాలు నాలుగు. ‘ది టెన్ కమాండ్‌మెంట్స్’, ‘బెన్‌హర్’, ‘మెకన్నాస్ గోల్డ్’, ‘టూ ఉమెన్’. సోఫియా లారెన్ నటించిన ‘టూ ఉమెన్’ చూస్తే ఫక్తు భారతీయ సినిమాలా అనిపిస్తుంది. సమాజం వల్ల వంచితులైన తల్లీకూతుళ్ల కథ అది. ఇక ‘ది టెన్ కమాండ్‌మెంట్స్’ విషయానికి వద్దాం. 1956లో తీశారీ సినిమా. అప్పటికి అధునాతన కెమెరాలు లేవు, గ్రాఫిక్స్ లేవు. ఇంకే టెక్నాలజీలూ లేవు. అయినా కూడా అద్భుతంగా తీశారు. చూడగానే ‘‘అబ్బ ఏం తీశారీ సినిమా’’ అనుకున్నాను. 3 గంటల 39 నిమిషాల నిడివి ఉన్న సినిమా ఇది. అయినా ఎక్కడా విసుగనిపించదు. బైబిల్ పరంగా దేవుడు, మనిషికి ఇచ్చిన పది ఆదేశాలకు సంబంధించిన కథ ఇది. ఈ సినిమా తీసింది దర్శక - నిర్మాత సిసిల్ బి. డిమిల్లీ. ప్రపంచమంతా గౌరవించే గొప్ప దర్శకుడాయన. చిత్రమేమిటంటే... ఇదే కథతో ఆయన 1923లోనే మూకీ తీశారు. మళ్లీ 1956లో తీశాడాయన.
 
 ఈ చిత్ర కథ ప్రసిద్ధమైన బైబిల్ గాథ. యూదు ప్రజల్ని బానిసలుగా చూస్తుంటాడు ఈజిప్టు రాజు. త్వరలోనే యూదు వారందరినీ విముక్తం చేసేవాడు పుట్టనున్నాడని రాజుకు తెలుస్తుంది. దాంతో, యూదు వారైన మగపిల్లలందర్నీ చంపేయమని ఆదేశిస్తాడు. అయితే, యోకెబెదు తనకు పుట్టిన బిడ్డను ఒక బుట్టలో పెట్టి నైలు నదిలో వదిలేస్తుంది. అలా నైలు నదిలో బుట్టలో దొరికిన యూదు పిల్లాణ్ణి మోజెస్ పేరుతో సాక్షాత్తూ ఈజిప్టు రాజు కుమార్తె పెంచుకుంటుంది. అతను యూదు ప్రజలందర్నీ బానిసత్వం నుంచి విముక్తులను చేయడం, ప్రభువు ఇచ్చిన పది ఆదేశాలను పాటించమని ప్రజలకు మోజెస్ చెప్పడం, కానీ కొందరు వాటిని అవహేళన చేయడం, భూకంపం వచ్చి నాస్తికులంతా నశించడం, మిగిలిన ఆస్తికులు దైవదత్తమైన భూమికి చేరడం, వాళ్లను పాలించమని జాషువాకు ఆజ్ఞ ఇచ్చి, మోజెస్ అనంతమైన వెలుగుల్లో కలిసిపోవడం... క్లుప్తంగా ఇదీ కథ.
 
 ఊహించడానికే అతి భారీగా ఉండే కథను అంత కన్నా భారీగా, కళ్ళకు కట్టినట్లు సెల్యులాయిడ్ పైకి ఎక్కించిన ఘనత సిసిల్ బి. డిమిల్లీది. ఈ సినిమా కోసం ఆయన చాలా పరిశోధనే చేశారట. సెట్ డిజైన్ల కోసం మునుపటి భారీ పెయింటింగులు తెచ్చి, అలా ఉండాలని కళాదర్శకులకు సూచించేవారట. ఈజిప్టులో, మౌంట్ సినాయ్, సినాయ్ ద్వీపకల్పం ప్రాంతాల్లో ఈ సినిమా చిత్రీకరణ జరిగింది. తెరపై కనిపించే అనేక భారీ సన్నివేశాలు, వాటికి ఉపయోగించిన ఎఫెక్ట్‌లు ఇన్నేళ్ళ తరువాత కూడా సినిమా వర్గాలు, జనం చర్చించుకుంటూనే ఉన్నారు.
 
 చిత్రంలో కథానుసారం ఎర్రసముద్రం రెండుగా చీలిపోయే సన్నివేశాన్ని అద్భుతంగా తీశారు. ఇప్పుడింత టెక్నాలజీ ఉంది కదా, తీయమనండి అంత గొప్పగా చూద్దాం! నిజం చెప్పాలంటే - టెక్నిక్ అభివృద్ధి కాని రోజుల్లోనే చాలా గొప్ప సినిమాలు వచ్చాయి. ఈ సినిమాలో ఆర్టిస్టులు చాలామంది కనిపిస్తారు. కొన్ని సీన్స్‌లో అయితే సుమారు 8 వేల మంది జూనియర్ ఆర్టిస్టులు నటించారట. మోజెస్‌గా నటించిన చార్ల్‌టన్ హెస్టన్ యాక్టింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అప్పట్లో ఈ చిత్రం ఏడు ఆస్కార్ అవార్డులకు నామినేటైంది. ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో అవార్డు అందుకుంది. ఈ సినిమా రిలీజైన మూడేళ్లకు అంటే 1959లో తన 77 ఏళ్ళ వయసులో డిమిల్లీ చనిపోయారు.
 
 ఈ సినిమా విడుదలైనప్పుడు చాలామంది బాగుందనే అన్నారు. అయితే, బైబిల్‌లో ఉన్న ఎక్సోడస్ కథను చాలా భాగం మార్చి స్వతంత్రంగా ఈ సినిమా తీశారనీ, సాధికారికత లేదనీ విమర్శకులు వాదించారు. అలాగే, మూడు గంటల నలభై నిమిషాల నిడివి ఎక్కువనీ అన్నారు. కానీ, అవేవీ ఆ చిత్రానికి జనాదరణను తగ్గించలేకపోయాయి. ఆ రోజుల్లో అత్యంత ప్రజాదరణ పొందిన ఈ సినిమా ఇప్పటికీ అత్యంత పాపులర్ సినిమాగా నిలవడం విశేషం. కొన్ని దశాబ్దాల పాటు క్రైస్తవ చర్చిలు నిధుల సమీకరణ కోసం ఈ చిత్రాన్ని ప్రదర్శించేవట! ఇప్పటికీ గడచిన నూరేళ్ళ ప్రపంచ సినిమా చరిత్రలోని అత్యుత్తమ చిత్రాల్లో ఒకటిగా ఈ సినిమా నిలిచింది.
 
 అమెరికన్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ సహా అనేక సంస్థలు ఈ చిత్రాన్ని తప్పనిసరిగా చూడాల్సిన సినిమాల జాబితాలో పెట్టాయి. అమెరికాలోని లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ ఈ చిత్రాన్ని సాంస్కృతికంగా ఒక మైలురాయిగా గుర్తిస్తూ, ముందు తరాలకు అందించాలని తీర్మానించడం, అదీ సినిమా విడుదలైన దాదాపు నాలుగు దశాబ్దాల పైచిలుకు తరువాత 1999లో ఆ నిర్ణయం తీసుకోవడం ఈ చిత్రం గొప్పతనానికి ఒక తార్కాణం.
 
 నా ఫేవరెట్ మూవీ ఏదని అడిగితే - నేనెప్పుడూ మన తెలుగు సినిమాల గురించే చెబుతాను. ఫేవరెట్ హీరో ఏయన్నార్, ఫేవరెట్ హీరోయిన్ సావిత్రి, ఫేవరెట్ డెరైక్టర్ ఆదుర్తి సుబ్బారావు అని చెబుతాను తప్ప, హాలీవుడ్ వాళ్ల గురించి చెప్పను. కానీ ‘టెన్ కమాండ్‌మెంట్స్’ దీనికి మినహాయింపు అనే చెప్పాలి. అందుకే ఈ సినిమా గురించి చెప్పాల్సి వచ్చింది.
 
 భారీతనమంటే ఆయనే!
 ప్రపంచ ప్రసిద్ధ హాలీవుడ్ దర్శక, నిర్మాతల పేర్లు చెప్పమంటే - సిసిల్ బి. డిమిల్లీ (1881-1959) పేరు తప్పక ఉంటుంది. అటు మూగ చిత్రాల (మూకీల) రోజుల్లోనూ, ఇటు టాకీ యుగంలోనూ పేరు తెచ్చుకున్న అరుదైన దర్శక - నిర్మాత ఆయన. రంగస్థల నటునిగా జీవితం మొదలుపెట్టి, ఆనక నాటక రచన, దర్శకత్వ బాధ్యతలు చేపట్టి, అటు నుంచి అప్పటికి కొత్త మాధ్యమమైన సినిమా వైపు వచ్చారాయన. ఆయన తొలి మూకీ చిత్రం ‘ది స్క్వా మ్యాన్’ (1914) అప్పట్లో పెద్ద హిట్. డజన్ల కొద్దీ సెలైంట్ చిత్రాలు తీశారాయన.
 
 అప్పట్లోనే కొన్ని సెలైంట్ చిత్రాలలో దృశ్యాలను రెండు రంగుల టెక్నీకలర్‌లో తీశారు. ఆయన తీసే చిత్రాలన్నీ తెరపై భారీగా, ప్రేక్షకులకు కనువిందుగా ఉండేవి. టాకీ యుగంలో ఆయన తీసిన ‘క్లియోపాత్రా’ (1934), ‘శామ్సన్ అండ్ డెలీలా’ (’49), ‘ది గ్రేటెస్ట్ షో ఆన్ ఎర్త్’ (’52) లాంటి వాటి గురించి ఇప్పటికీ సినీ ప్రియులు చెప్పుకుంటూనే ఉన్నారు. ‘ది గ్రేటెస్ట్ షో ఆన్ ఎర్త్’ ఉత్తమ చిత్రంగా ఆస్కార్ అవార్డు అందుకుంది. సినీ రంగానికి డిమిల్లీ చేసిన సేవలకు గుర్తింపుగా ఆయన ఆస్కార్ వారు ‘అకాడెమీ ఆనరరీ అవార్డ్’ ఇచ్చారు.

దాసరి నారాయణరావు
సుప్రసిద్ధ దర్శకులు
...
 - సంభాషణ: పులగం చిన్నారాయణ
 

Advertisement
Advertisement