
‘‘నీకు బండి అర్జెంట్‌గా కావాలి అంటున్నవ్.. ఉద్యోగం కోసం. చూడు షామీర్ భయ్యా! మా షోరూంలో ఇప్పుడు ఒక స్కీం వుంది. నెల నెలా పదమూడు వందలు కట్టాల. ప్రతినెలా చివరి ఆదివారం స్కీంలోని సభ్యులందరి పేరు మీద డ్రా తీస్తం. డ్రాల ఎల్తే మిగతా పైసల్ కట్టనవసరం లేదు. గిట్ల యాభై కిస్తీలు కట్టాల. డ్రాల ఎల్లకుంటే లాస్ట్‌ల బండి ఇస్త. ఇగ నువ్ అర్జెంట్ అంటున్నవ్ కనుక ఒక పదివేలు డౌన్ పేమెంట్ కింద కట్టి స్కీంల చేరు. బండి తీస్కో, మధ్యల ఎల్తే నీకు మంచిదే, ఎల్లకుంటే నెల నెలా పైసల్ కట్టుకో. ఏమంటావ్ షామీర్ వింటున్నవా..’’ ‘‘ఆ ఆ వింటున్న రమేష్ అన్న. ఇగ నాకు బండి జరూర్‌గా కావాల్నే.. మైక్రో ఫైనాన్సుల కలెక్షన్ బాయ్‌గా చేరాలంటే కచ్చితంగా బైక్ ఉంటేనే ఉద్యోగం ఇస్తా అని మేనేజర్ చెప్పిండు. ఇంట్లో నాన్న రిటైర్ అయ్యిండు. తన ఆరోగ్యం కూడా బాలేదు. నేను ఈ సమయంల ఉద్యోగం జరూర్‌గ చెయ్యాల్నే.సరే షామీర్ నువ్వు ఎప్పుడు పదివేలు తీసుకొని వస్తవో చెప్పు నేను బండి తెప్పిస్తా. కాగితాలు రెడీ చేసి పెడతా సరేనా! వెళ్ళొస్తా రమేష్ అన్న ..వీలైతే వచ్చే గురువారం తీసుకుంటా.. మళ్ళా లేట్ అయితే ఉద్యోగం వేరేవాళ్ళకు ఇస్తరు.’’
∙∙
షోరూంలకెల్లి బైటికి రాంగనే ఎదురుగా మా చిన్నమామ లతీఫ్.‘‘సలామాలేకూం మామా’’ అన్నా. ‘‘వాలేకుం అసలాం.. క్యారే షామీర్.. రెండ్రోజుల నుండి రమేష్‌తో కనపడుతున్నవ్ బండి గిట్ల కొంటున్నవా!’’ నోట్లో వున్న జర్దాను తుపుక్కు తుపుక్కు అని కింద ఉమ్మేస్తూ ఒక వెకిలి నవ్వుతో మామ. ‘‘మామా.. మైక్రో ఫైనాన్సు ఆఫీస్‌లో కలెక్షన్ బాయ్ వుద్యోగం ఉంది. చేరాలంటే బండి కావాలంట. డిగ్రీ చేసిన వూరి పిల్లగానికే ఆ వుద్యోగం ఇస్తరంట. అందుకే రమేష్ అన్నతో మాట్లాడుతున్నా.’’అంతా విని మళ్ళీ తుపుక్కు అని ఉమ్మేసి.. ‘‘ఔరా! షామీర్ ఇంట్లో నాయన రిటైర్ అయ్యి మంచాల ఉన్నడు. నీకు వేరే వుద్యోగం యేది దొరకలేదార.. ఇప్పుడు బండెట్ల గొంటావ్? ఏదైనా సెకండ్ హ్యాండ్ పాత బండి గిట్ల చూడు!’’‘‘ముందు గదే చూసిన కాని అవి మంచిగ లేవు. వాటిని కొన్నంక మళ్ళా రిపేర్ చేయించాలె. ఒక పదివేలు కడితే కొత్త బండి ఇస్తా అన్నడు రమేష్ అన్న. మిగతా పైసల్ నెల నెలా జీతంలకెల్లి కడుతా.’’‘‘అబ్బో.. సరే నీ ఇష్టం.’’ అనేసి మామ పాన్ డబ్బా దగ్గరకు వెళ్ళాడు.
ఇంటికొచ్చి నాయన పక్కన మంచంల కూర్చున్న.‘‘బేటా! వెళ్ళిన పని ఏమైంది. రమేష్ బండి ఇస్తా అన్నడా!’’‘‘పది వేలు డౌన్ పేమెంట్ కడితే గురువారం బండి తీసుకోమన్నడు.’’
‘‘గిదీనికి, గంత ఆలోచన ఎందుకుర షామీర్! నేను ఇస్త కదా నీకు పదివేలు. బ్యాంకుల నా ఎకౌంట్ల మూడు లక్షలు ఉన్నయ్‌గదా.. అందులో ఒక పదివేలు తీసుకో! ఎలాగు నీకు వుద్యోగం బండి ఉంటే ఇస్తరు అంటున్నావు!’’అప్పుడే వచ్చిన అమ్మ కూడా నాన్న చెప్పినట్టు చెయ్యి’’ అని అంది.మధ్యతరగతి జీవితాలు ఇంతేనేమో! ఏది కొనాలన్నా అన్నీ ఆలోచించాలి.
నాన్న బ్యాంకు అకౌంట్‌లో అక్క పెళ్లి కోసం దాచిన మూడు లక్షలు మాత్రమే ఉన్నాయి. రిటైర్ అయ్యాక వచ్చిన డబ్బు ఇంటి రిపేర్‌కి, నాన్న జబ్బు తగ్గడానికి ఖర్చు చేసాము. నాన్నకు నేను, అక్క, ఇంకో చెల్లె. చిన్న కుటుంబమే అయినా నాన్న జీతం మిగిలేది కాదు. రిటైర్ అయ్యాక తన ఆరోగ్యం కరాబు కావడం, నా చదువు అయిపోవడం ఒకేసారి. అక్క పెళ్లి చేయాలనీ నాన్న సంబంధాలు చూస్తున్నారు.
ఈ పరిస్థితిలో కొడుకుగా నేను నాన్నకు సాయం చేయాలి. సరిగ్గా ఇలాంటి సమయంలో అల్లాహ్ దయ వలన ఈ వుద్యోగం కోసం నా గురించి ఆ మేనేజర్‌కు నా దోస్తు చెప్పిండు. నా చదువు, కుటుంబ పరిస్థితి చూసి ఆ మేనేజర్ వుద్యోగం నాకే ఇస్తాను అన్నారు కాని బండి వుండాలని కండిషన్.ఎందుకంటే చుట్టూ వున్న ఒక ఇరవై ఊర్లలో వర్క్ కోసం తిరగాల్సి ఉంటుంది. అక్క పెళ్లి ఖాయం అయ్యేంతలో ఉద్యోగంలో చేరితే నాన్నకు ఆసరా ఉంటదని నా ఆలోచన. రమేష్ అన్నకు ఫోన్ చేసి చెప్పిన గురువారం బండి తీసుకుంటా అని. బ్లాక్ కలర్ స్ప్లెండర్. ఎప్పటి నుండో నేను కొనాలి అనుకుంటున్న బైక్ అది.
ఆ రోజు గురువారం. నాన్నతో కలిసి బ్యాంకులో పదివేలు తీసుకొని నేరుగా హీరో షోరూంకు వెళ్ళిన. అప్పటికే బండితో రమేష్ అన్న ఎదురు చూస్తున్నాడు. పేపర్ వర్క్ అంతా చేసుకొని స్ప్లెండర్ బైక్ కీస్ నా చేతిలో పెట్టాడు. ఆనందంతో నా మొహం వెలిగింది. నాన్నను బండి మీద కూర్చోపెట్టుకొని రమేష్ కి నమస్తే చెప్పి ఇంటికి బయలుదేరా కొత్త స్ప్లెండర్ బండి మీద. ఇంటి దగ్గర అమ్మ, అక్క, చెల్లె ఎదురుచూస్తున్నారు. రాగానే అమ్మ నాతో... ‘‘షామీర్ అక్కతో కలిసి దర్గా వెళ్లి మొక్కి రారా.. అల్లాహ్ అంతా మంచి చేస్తడు.’’ అని చెప్పింది.
దర్గా వెళ్లి దారిలో స్వీట్ షాప్‌లో ఒక అరకిలో లడ్డూ తీసుకొని ఇంటికి రాగానే.. అమ్మతో మాట్లాడుతూ లతీఫ్ మామ.
‘‘ఏమిరా షామీర్! మంచి జోష్ మీద ఉన్నావ్! బండి కొన్నావ్!’’ మామ మాటలకు నవ్వుతూ అమ్మ చేతిలో లడ్డూ పాకెట్ పెట్టి ఏం మాట్లాడకుండా ‘‘మా దోస్త్ రాము ఇంటికి వెళ్ళొస్తా’’ అని చెప్పి బండి స్టార్ట్ చేసినాను.
జీవితం సాఫీగా గడుస్తుంది కొంచెం ఇప్పుడు. చూస్తుండగానే మూడు నెలలు గడిచిపోయాయి. మైక్రో ఫైనాన్సు మేనేజర్‌కి నా మీద మంచి అభిప్రాయం కలిగింది.
మా ఇంటి పక్కన వుండే షేర్ సాహెబ్ మా అక్కకు ఒక మంచి సంబంధం చెప్పాడు. అబ్బాయి సింగరేణి బొగ్గు కంపెనీలో కాంట్రాక్టు ఫిట్టర్‌గా పనిచేస్తాడు. నెలకు పన్నెండు వేలు జీతం. ఇంకో రెండేళ్ళు చేస్తే పెర్మినెంట్ చేస్తారంట. ఒక్కడే కొడుకు. ఊర్లో సొంత ఇల్లు.అమ్మానాన్నలకు, నాకు ఈ సంబంధం నచ్చింది. పెళ్లి చూపులు ఆదివారం పెట్టుకున్నాము. అంతా సాఫీగా జరిగింది. పిల్లాపిల్లాడు ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. రెండ్రోజుల తరువాత కట్నకానుకల కోసం వాళ్ళ ఇంటికి రమ్మన్నారు.
ఆ రోజు పొద్దున్నే నాన్న, నేను మా లతీఫ్ మామ కట్నం కోసం మాట్లాడటానికి వెళ్లినాము. లతీఫ్ మామ స్వభావం నాకు తెలుసు. తను పుల్ల ఎలా పెట్టాలా అని చూసే రకం. తను రావడం నాకు ఇష్టం లేదు. కాని మామ పెద్దవాడు. ఇంకా పెళ్లి కొడుకు మేనమామ, లతీఫ్ మామ బచ్పన్ దోస్తులంట!అందరం కుర్చున్నాము వాళ్ళ ఇంట్లో. నాన్న పెళ్ళికొడుకు వాళ్ల నాన్నతో మాట్లాడుతున్నాడు. లతీఫ్ మామ.. పెళ్ళికొడుకు వాళ్ల మామతో ముచ్చట్లలో ఉన్నాడు. నేను దేవుడికి మనసులో దండం పెట్టుకుంటున్నాను.. కట్నం తక్కువ వుండాలని! ఒక లక్ష నగదు, మూడు తులాల బంగారం, ఇంకా పెళ్లికూతురు కోసం సామాను ఫర్నిచర్. నాన్న వాళ్ళతో చెప్పాడు ఇంతే ఇవ్వగలము అని. సరే అని అందరూ ఒప్పుకొన్నారు.ఇంతలో పెళ్లికొడుకు మేనమామ నాన్నతో, ‘‘చూడండి! ఇవ్వాళ అందరు పెళ్లిల బైక్ పెడ్తున్నారు కట్నం కింద. మీరు మా వాడికి బైక్ పెట్టాల్సిందే’’ అన్నాడు.నాన్న కుదరదు అని చెప్పాడు.మా లతీఫ్ మామ నాన్న తో.. ‘‘చూడు జహింగిర్ బావా! ఇంత దాకా వచ్చాక బండి కోసం పరేషాన్ ఎందుకు? మన షామీర్‌గాడిది కొత్త బండే కదా! కొని రెండు నెలలే ఐంది. అది ఇద్దాము కట్నం కింద’’ అన్నాడు. ఒక్కసారిగా నాకు ఏదోలా అయింది. సరే మేము వెళ్లి కబురు చేస్తాం అని ఇంటికి వచ్చాము.
ఆ రోజు రాత్రి నాన్న, నేను ఆలోచనలో పడ్డాము.నేను నాన్నతో అన్నాను.. ‘‘నాన్నా! అక్క పెళ్లి ముఖ్యం మనకు. బండి ఏముంది మళ్లీ కొందాము’’ అన్నా. నాన్న నా తలమీద చేయి వేసి ‘‘మరి వుద్యోగం ఎలా?’’ అన్నాడు. నేను మేనేజర్ కాళ్ళు పట్టుకోవడానికైనా సిద్ధం అన్నాను. అక్కడే వున్న అక్క కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి.
తెల్లారగానే ఆఫీస్‌లో మేనేజర్‌ని కలిసి విషయం చెప్పినాను. తను నా సమస్యను అర్థం చేసుకొని ‘‘ప్రత్యామ్నాయం ఆలోచిస్తా. ఏం భయపడకు షామీర్! నీ వుద్యోగం నీదే’’ అన్నాడు. మేనేజర్‌కి దండం పెట్టి బండి స్టార్ట్ చేసి పనికి వెళ్ళిపోయాను.
వచ్చే నెల పదో తారీకున పెళ్లి. పెళ్లి పనుల కోసం నాన్న, నేను తిరుగుతున్నాము. చూస్తుండగానే పెళ్లి రోజు రానే వచ్చింది. మా స్తోమత ప్రకారం అయినంతలో చాలా బాగా పెళ్లి జరిగింది. వెళ్ళేప్పుడు అక్క ఏడుపు ఆపుకోలేక పోయింది. నాకు కళ్ళలో నీళ్ళు తిరిగాయి. పెళ్లి కారు, సర్వీసు వెళ్ళే సరికి రాత్రి ఒంటిగంట అయ్యింది. అందరూ వెళ్ళాక దూరంగా లతీఫ్ మామ పెళ్ళికొడుకు మేనమామ నా బండి దగ్గర బీడీ తాగుతూ ఏదో మాట్లాడుతున్నారు. మా లతీఫ్ మామకు సలాం చెప్పి బండి స్టార్ట్ చేసి వాళ్ళ మామ నా దగరకు వచ్చి, ‘‘షామీర్! పెళ్లి మంచిగా చేసిండ్రు రా! ఇక బండి నేను తీసుకొని వెళ్తున్నా. నువ్ వలీమాకు వచ్చేటప్పుడు బండి పేపర్‌లు మర్చిపోకు. వెళ్తా మరి’’ అని నమస్తే చెప్పి నా బ్లాక్ స్ప్లెండర్ మీద వెళ్ళిపోయాడు.అలానే చూస్తూ ఉన్న నేను, ఏదో అలికిడి కావడంతో పక్కకు చూస్తే, మా లతీఫ్ మామ జర్దాను తుపుక్కు తుపుక్కు అని ఉమ్మేస్తూ నా వైపు వస్తున్నాడు.కొత్త బండి. అక్కతోపాటే వెళ్ళిపోయింది. అల్లా అంతా మంచే చేస్తాడు.‘‘నాన్నా! అక్క పెళ్లి ముఖ్యం మనకు. బండి ఏముంది మళ్లీ కొందాము’’ అన్నా. నాన్న నా తలమీద చేయి వేసి ‘‘మరి వుద్యోగం ఎలా?’’ అన్నాడు. నేను మేనేజర్ కాళ్ళు పట్టుకోవడానికైనా సిద్ధం అన్నాను. అక్కడే వున్న అక్క కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి.
ఆనంద్ కార్తీక్
Comments
Please login to add a commentAdd a comment