
తపాలా: ఎవరి బాణీ వారిదే!
తెలుగువారికి అత్యంత అభిమానపాత్రులైన నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావులపై 2014 ఫిబ్రవరి 2 ‘ఫన్‌డే’ సంచికలో ‘మన ఇద్దరు’ పేరిట ఓ వ్యాసం ప్రచురితమయింది. అయితే అందులో ఆ మహానటులను పోలుస్తూ వ్యాసకర్త తనకు నచ్చిన రీతిలో రాసుకుంటూపోయారు. ఒకరిపై అభిమానంతో మరొకరిని కించపరచడం ఎంతవరకు సబబు?
ఎన్టీఆర్, ఏయన్నార్‌లతో సమానంగా అంతకాలం స్టార్‌డమ్‌ను చూసినవారు అటు ఉత్తరాదిన కానీ, ఇటు దక్షిణాదిన కానీ మరొకరు కానరారు. అందుకేనేమో ఈ ఇద్దరినీ ‘తెలుగు సినిమా తల్లి’ రెండు కళ్లుగా కీర్తిస్తూ ఉంటారు. ఎన్టీఆర్, ఏయన్నార్ ఇద్దరూ మహానటులే. ఎవరి బాణీ వారిది. ఎన్టీఆర్ శరీర సౌష్టవం, అందం, చందం పలు పాత్రలకు సరిపోతుంది కనుక ఆయన విభిన్న పాత్రలు పోషించి మెప్పించారు. ‘స్వీయలోపంబెరుగుట పెద్ద విద్య’ అన్న సత్యాన్ని పాటిస్తూ ఏయన్నార్ తన కెరీర్‌ను మలుచుకున్నారు. ఇవన్నీ జగద్విదితాలు. వారు సాధించిన విజయాలు, వారి వ్యక్తిగత విషయాల గురించి తెలియనివారు అరుదనే చెప్పాలి.
తమిళనాట యమ్జీఆర్, కరుణానిధి కథల ఆధారంగా ‘ఇద్దరు’ తీశారు. వారిద్దరూ చిత్రసీమ, రాజకీయ రంగాలతో అనుబంధం ఉన్నవారు కాబట్టి అలా తీసి ఉండవచ్చు. కానీ ఎన్టీఆర్, ఏయన్నార్‌లవి భిన్న రీతులు. ఎన్టీఆర్ లాగా ఏయన్నార్ దర్శకత్వ బాధ్యతలు చేపట్టలేదు. రాజకీయాలకు ఏయన్నార్ అసలే ఆమడదూరం. మరి ఇలాంటి ఇద్దరిని పోల్చి, ‘మన ఇద్దరు’ అనే అంశాన్ని తీసుకోవడమే పొరపాటు. అందులోనూ ఒకరిని హెచ్చిస్తూ, మరొకరిని తగ్గిస్తూ సాగడం మరింత పొరపాటు.
ఎవరు ఏమనుకున్నా ‘ఎన్టీఆర్ ఎన్టీఆరే’ అన్నది తెలుగునాటనే కాదు, యావద్భారతంలోనూ అధిక సంఖ్యాకులు అంగీకరించే అంశం. ఉత్తరాదివారు ‘మదరాసీలు’గా పిలుస్తున్న తెలుగువారికి ఓ ప్రత్యేక అస్తిత్వం ఉందని జగతికి చాటిన ఘనత ఎన్టీఆర్ సొంతం. అటువంటి మహానటుణ్ణి వ్యాసంలో అక్కడక్కడా తక్కువ చేస్తూ రాయడం తీవ్ర మనస్తాపం కలిగించింది. దయచేసి మరోసారి ఇలాంటి వాటికి తావు లేకుండా జాగ్రత్త వహించాలని మనవి.
- కొమ్మినేని వెంకటేశ్వరరావు