మదన్‌మోహన మాలవీయ
‘హిందువులు, మహమ్మదీయులు, సిక్కులు, పార్శీలు, ఇక్కడున్న ఇతర సంస్కృతుల వారు– వీరందిరికీ చెందినదే భారతదేశం. ఇందులో ఏ ఒక్క వర్గం కూడా మరో వర్గాన్ని అధిగమించలేదు. నీ చేతికి ఐదు వేళ్లు ఉన్నాయి. ఇందులో బొటనవేలు లేకపోతే చేతికి ఉండే వాస్తవిక బలంలో పదింట ఒక వంతుకు తగ్గిపోతుంది. కాబట్టి అంతా కలసి ఉండాలి. ఒకరిని ఒకరు విశ్వసించాలి.’స్వేచ్ఛావాయువులను ఆస్వాదించడానికి ఉద్యమించిన భారతీయుల ముందున్న కర్తవ్యం ఏమిటో ఇంత స్పష్టంగా చెప్పినవారు తక్కువే. భారత స్వాతంత్య్రోద్యమ ఆరంభ దశ, అందులోని వైవిధ్యం ఆయన చేత అలా పలికించాయి. భారత జాతీయ కాంగ్రెస్ అంకుర దశ ఆ వైవిధ్యానికి అద్దం పట్టింది. ఉమేశ్ చంద్ర బెనర్జీ, సురేంద్రనాథ్ బెనర్జీ, గోపాలకృష్ణ గోఖలే, బాలగంగాధర తిలక్, లజపతిరాయ్, బిపిన్‌చంద్రపాల్, సరోజినీ నాయుడు వంటి హిందువులు; దాదాభాయ్ నౌరోజీ, ఫిరోజ్‌షా మెహతా వంటి పార్శీలు; మహ్మదలీ జిన్నా, అలీ సోదరులు వంటి మహ్మదీయులు, ఇతర వర్గాలు కలసిన ఐక్య సంఘటన శ్వేత పాలన మీద బిగించిన పిడికిలి వలె భాసించేది. పైన పేర్కొన్న ఆ మాటలు ఆ ఉద్యమ దృశ్యంలో ఆనాడు ప్రధాన పాత్రధారిగా ఉన్న ‘మహామన’ మదన్‌మోహన మాలవీయ పలికినవే.
గాంధీజీ ప్రవేశించే వరకు స్వాతంత్య్రోద్యమ గమనం వేరు. అంతకు ముందు జాతీయ కాంగ్రెస్ నేతృత్వంలో సాగిన ఉద్యమం తీరు వేరు. బెంగాల్ విభజన వరకు కాంగ్రెస్ పూర్తిగా మితవాదుల నాయకత్వంలో సాగింది. విజ్ఞాపనలు, వినతిపత్రాలతో మాత్రమే పరిపాలనలో భాగస్వాములం కాగలమన్న నమ్మకం వీరిది. ఆ మేరకు ఆంగ్లేయులను ప్రసన్నం చేసుకోగలిగితే చాలునన్నంత వరకే వారి వ్యూహం. ఈ ఆలోచనా ధార లోనివారే మాలవీయ కూడా. మదన్‌మోహన మాలవీయ (డిసెంబర్ 25, 1861– నవంబర్ 12, 1946) భారతదేశ తొలినాటి చట్టసభల తీరుతెన్నులను రూపొందించిన వారిలో ఒకరు. మాలవీయతో పాటు మోతీలాల్ నెహ్రూ, సర్ దిన్షావాచా, మహ్మదలీ జిన్నా, తేజ్ బహదూర్ సప్రూ వంటివారు సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో తమవైన గొంతులు వినిపించి చట్టసభల సంప్రదాయాలకు రూపురేఖలు ఇచ్చారు. వైస్రాయ్ నాయకత్వంలో ఉన్న ఆనాటి సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో (కేంద్ర చట్టసభ) అత్యధికులు బ్రిటిష్ ప్రభుత్వం నియమించిన వారే. కులీన, ధనిక వర్గీయులే. ఒక్క ముక్కలో చెప్పాలంటే రబ్బర్ స్టాంపులు. అలాంటి సభలో, చాలా పరిమితులకు లోబడి మాలవీయ, జిన్నా తదితరులు భారతీయుల సమస్యలను ప్రస్తావించారు. చట్టబద్ధమైన పంథాలోనే కావచ్చు, హక్కుల గురించి గళమెత్తారు.
బ్రిటిష్ ఆధిపత్యంలోనే భారతీయ సమాజం ఉన్నదన్న వాస్తవాన్ని గుర్తిస్తూనే, దేశాన్ని çపునర్నిర్మించుకోవాలన్న స్పృహను పెంచుకున్న ఆనాటి ద్రష్టలలో మాలవీయ అగ్రగణ్యులు. తనవైన విశ్వాసాలను కాపాడుకోవడం దగ్గర ఎలాంటి రాజీ లేకుండానే, రాజకీయోద్యమంలో ముస్లింలను కలుపుకుని వెళ్లవలసిన వాస్తవాన్ని గుర్తించినవారాయన.భారత జాతీయ కాంగ్రెస్ ప్రముఖునిగా, న్యాయవాదిగా, చట్టసభ ప్రతినిధిగా, పత్రికా రచయితగా, సంస్కర్తగా, విద్యావేత్తగా, మాలవీయ నిర్వహించిన పాత్ర అద్భుతమైనది. ఆయన రాజకీయ, సామాజిక పరిచయాలు ఇంకొక అద్భుతం. మాలవీయ హిందూ మహాసభ వ్యవస్థాపకులలో ఒకరని చెప్పుకోవచ్చు. కానీ వైస్రాయ్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో ఆయన మహ్మదలీ జిన్నాతో కలసి పనిచేశారు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం స్థాపన కోసం అనీబిసెంట్‌తో కలసి నడిచారు. ఆయన వ్యక్తిగతంగా తిరుగులేని హిందూత్వ వాది. కానీ సామాజికంగా మంచి లౌకికవాది. దేశం, దేశ ప్రయోజనం, ఉద్యమమే మాలవీయ ప్రధానంగా భావించినట్టు కనిపిస్తుంది. ముండకోపనిషత్తులోని ఒక మహత్వ తాత్వికతను ఆయన లోకానికి పరిచయం చేశారు. అదే– సత్యమేవ జయతే– సత్యం ఒక్కటే నిలబడుతుంది. ఈ తాత్వికత కోసం ఆయన జీవితమంతా శ్రమించారు.
మాలవీయ ప్రయాగ లేదా అలహాబాద్‌లో పుట్టారు. వారి కుటుంబం అంతా సంస్కృత పండితులే. కానీ కడు పేదరికం. తండ్రి బైజ్‌నాథ్. తల్లి మూనాదేవి. బైజ్‌నాథ్ కథావాచక్. అంటే పౌరాణికుడు. భాగవత కథలు చెప్పడమే ఆయన వృత్తి. కొడుకును కూడా అదే వృత్తిలోకి తీసుకురావాలని తండ్రి అనుకున్నారు. అందుకు అనుగుణంగా మాలవీయ మొదట సంస్కృత పాఠశాలల్లోనే చదువుకున్నారు కూడా. తరువాత అలహాబాద్ జిల్లా పాఠశాలలో చేరారు. అక్కడే ఆయన కవిత్వం రాయడం ఆరంభించారు. ‘మకరంద్’ పేరుతో అవి వెలువడేవి. మూయిర్ సెంట్రల్ కాలేజ్ (తరువాత ఇదే అలహాబాద్ విశ్వవిద్యాలయం) నుంచి మెట్రిక్యులేషన్ చేశారు. హ్యారిసన్ కళాశాల ప్రిన్సిపాల్ అక్కడ నుంచి విద్యార్థి వేతనం ఏర్పాటు చేయడంతో కలకత్తా విశ్వవిద్యాలయంలో బీఏ చదివారు. ఎంఏ సంస్కృతం చదవాలని అనుకున్నా కుటుంబ పరిస్థితులు అనుకూలించలేదు. కుటుంబ వృత్తి (కథావాచక్)ని స్వీకరించమని తండ్రి కోరినా, కాదని అలహాబాద్ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయునిగా చేరారు. 1885లో భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భవించింది. ఆ మరుసటి సంవత్సరం వార్షిక సమావేశాలు కలకత్తాలోనే జరిగాయి. వాటికి మాలవీయ హాజరయ్యారు. గాంధీజీ కంటే రెండు దశాబ్దాల ముందు ఆయనకు కాంగ్రెస్‌తో అనుబంధం ఏర్పడింది. ఆ సభలకు అధ్యక్షుడు దాదాభాయ్ నౌరోజీ. చట్టసభలలో ప్రవేశించి భారతీయుల వాణిని వినిపించాలని మాలవీయ చేసిన వాదనతో నౌరోజీ కూడా ఏకీభవించారు. ఈ సభల తరువాత ఆయనను అలహాబాద్‌కు సమీపంలోనే ఉన్న కాళాకంకర్ సంస్థానాధీశుడు రాజా రామ్‌పాల్‌సింగ్ తన పత్రిక హిందుస్తాన్‌కు సంపాదకునిగా నియమించారు. ఆ తరువాత ఆ ఉద్యోగం వదిలి న్యాయశాస్త్రం చదివారు. అలహాబాద్ హైకోర్టులో న్యాయవాదిగా చేరారు.
చౌరీచౌరా ఉదంతం గుర్తుండే ఉంటుంది. 1922 ఫిబ్రవరిలో గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమానికి పిలుపు ఇచ్చినప్పుడు జరిగిన ఘోర ఉదంతమిది. ఆ సంవత్సరం ఫిబ్రవరి 5న జరిగింది. ప్రస్తుత ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ సమీపంగా ఉన్న చిన్న పట్టణం చౌరీచౌరా. గాంధీజీ పిలుపు మేరకు ఆ పట్టణంలో రెండువేల మంది కార్యకర్తలు మద్యం దుకాణం ఎదుట ధర్నా చేశారు. పోలీసులకీ, కార్యకర్తలకీ గొడవ జరిగింది. పోలీసులు జరిపిన కాల్పులలో ముగ్గురు చనిపోయారు. దీనితో ఆగ్రహించిన ఆందోళనకారులు పోలీసు స్టేషన్‌కు నిప్పు పెట్టారు. 23 మంది పోలీసులు సజీవ దహనమైనారు. ఇందుకు ఆగ్రహించి గాంధీజీ, ‘శాంతియుతంగా నిరసన తెలిపే సంస్కారం ఇంకా భారతీయులకు అబ్బలేదం’టూ ఉద్యమాన్ని నిలిపివేశారు. ఆందోళనకారుల హింసకు పరిహారంగా ఐదు రోజులు నిరాహార దీక్ష కూడా చేశారు. ఇంతవరకే సాధారణంగా పుస్తకాలలో కనిపిస్తూ ఉంటుంది. తరువాత జరిగింది మరీ ఘోరం.
ఆ ప్రాంతంలో సైనిక శాసనం విధించి వందల మందిని పోలీసులు అరెస్టు చేశారు. 228 మంది మీద కేసులు పెట్టారు. వారిలో 172 మందికి అలహాబాద్ హైకోర్టు మరణ దండన విధించింది. పోలీసు నిర్బంధంలో ఆరుగురు మరణించారు. కానీ మళ్లీ కేసును కోర్టు పునర్విచారణ జరిపి 19 మందికి మరణశిక్షను ఖరారు చేసింది. ఈ కేసులోనే 153 మంది తరఫున వాదించి మరణదండన నుంచి విముక్తి కల్పించినవారు మాలవీయ. అప్పుడు మోతీలాల్, తేజ్‌బహదూర్ సప్రూ కూడా అక్కడే న్యాయవాదులు. సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నిజానికి మాలవీయ సమర్థించారు. కానీ అదే సమయంలో ఖిలాఫత్ ఉద్యమాన్ని సహాయ నిరాకరణ ఉద్యమంతో లంకె పెట్టడాన్ని మాత్రం వ్యతిరేకించారు. ఖిలాఫత్ ఉద్యమాన్ని సమర్థించడమంటే రాజకీయాలలోకి మతాన్ని అనుమతించడమని నాడు చాలామంది వాదించారు. అందులో మాలవీయ వంటి హిందూత్వ వాది, నాటికి పూర్తి లౌకికవాది జిన్నా కూడా ఉండడం విశేషం. జాతీయ కాంగ్రెస్ సభలకు నాలుగు పర్యాయాలు 1909 (లాహోర్), 1918 (ఢిల్లీ), 1939 (ఢిల్లీ) 1932 (కలకత్తా) మాలవీయ∙అధ్యక్షునిగా వ్యవహరించారు.
ఆయన దీర్ఘకాలం చట్టసభలలో సభ్యుడు. 1912 –1919 మధ్య ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో మాలవీయ సభ్యునిగా ఉన్నారు. ఈ సభే సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీగా మారిన తరువాత 1926 వరకు కూడా సభ్యుడు.రాజా రామ్‌పాల్ సింగ్ పత్రిక ‘హిందుస్తాని’ సంపాదకత్వం తరువాత మాలవీయ ‘ఇండియన్ ఒపీనియన్’ పత్రికకు సంపాదకత్వం వహించారు. ఆపై ‘అభ్యుదయ’ అనే పత్రికను నిర్వహించారు. ఇవన్నీ దేశీయ భాషా పత్రికలు. జాతీయ స్థాయిలో ఒక పత్రిక ఉండాలనీ, అది ఆంగ్లంలో ఉండాలనీ తరువాత మాలవీయ భావించారు. దాని ఫలితమే 1909లో వెలువడిన చరిత్రాత్మక పత్రిక ‘లీడర్’. మోతీలాల్ నెహ్రూతో కలసి ఆయన ఈ పత్రికను ప్రారంభించారు. మళ్లీ 1910లో ‘మర్యాద’ హిందీ పత్రికను కూడా స్థాపించారు. 1924లో మూత పడవలసిన సమయంలో ఆదుకుని హిందుస్తాన్ టైమ్స్‌కు పునర్జన్మను ప్రసాదించిన ఘనత కూడా మాలవీయకు దక్కుతుంది. లాలా లజపతిరాయ్, ఎం ఆర్ జయకర్ (హిందూ మహాసభ నాయకుడు), పారిశ్రామికవేత్త ఘనశ్యామ్‌దాస్ బిర్లాల సహకారంతో రూ. 50,000 నిధులు ఇచ్చి ఆ పత్రికను రక్షించారు. అప్పటి నుంచి మరణించే వరకు ఆ పత్రిక నిర్వహణ మండలి అ«ధ్యక్షునిగా ఆయన పనిచేశారు.‘సనాతన ధర్మ’ పేరుతో ఒక పత్రికను మాలవీయ బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుంచి వెలువరించేవారు.
మాలవీయ భారతదేశానికీ, నిజానికి విద్యా ‘ప్రపంచా’నికీ అందించిన మహోన్నత కానుక ఒకటి ఉంది. అది –బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం. ఇందుకోసం పని చేయాలని 1911లో అనీబిసెంట్, మాలవీయ అంగీకారానికి వచ్చారు. అనిబీసెంట్ 1898 నుంచే∙కాశీలో సెంట్రల్ హిందూ కళాశాలను నిర్వహిస్తున్నారు. ఈ కళాశాలను కూడా విశ్వవిద్యాలయంలో అంతర్భాగం చేసే షరతు మీద ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ చేసిన బీహెచ్‌యూ చట్టం–1915 మేరకు ఇదంతా సా«ద్య మైంది. 16.5 చదరపు కిలోమీటర్ల పరిధిలో, 30,000 మంది విద్యార్థుల కోసం నిర్మించిన విద్యా సంస్థ ఇది. ఆసియాలోనే పెద్దది. దీనికి మాలవీయ చాలాకాలం కులపతిగా పనిచేశారు.గంగా ప్రక్షాళన కార్యక్రమం ఆరంభించిన ఘనత కూడా మాలవీయకే దక్కుతుంది. గంగా మహాసభ పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేసి, ఆ మహోన్నత నదిని కాలుష్యం నుంచి రక్షించాలని తన వంతు కృషి చేశారు. ఇందుకోసం కొన్ని సంస్థలు, వ్యక్తులు చేసుకున్నదే అవిరళ్ గంగా రక్ష సంఝౌతా ఒప్పందం. 1916లోనే ఆయన ఆ ప్రయత్నం ఆరంభించారు. హరిద్వార్ వద్ద గంగకు హారతి ఇచ్చే కార్యక్రమాన్ని మాలవీయ ఆరంభించారు. అది ఇప్పటికీ కొనసాగుతోంది. అంటే పర్యావరణ పరిరక్షణ ఉద్యమానికి ఆద్యుడు ఆయనే. అంటరానితనం మీద కూడా ఆయన పోరాటం చేశారు. హరిజన సేవక్ సంఘ్ ద్వారా ఆలయ ప్రవేశం చేయించారు. వారికి ఆయన మంత్రదీక్షను ఇచ్చేవారు. మాలవీయ గొప్ప విద్యావేత్త, విద్యాదాత. గొప్ప స్వాతంత్య్ర పోరాటయోధుడు, రాజకీయవేత్త. సంస్కర్త, పార్లమెంటేరియన్. ఆయన పుట్టి పెరిగిన అలహాబాద్ లేదా ప్రయాగలోనే ఉంది త్రివేణీ సంగమం. మూడు స్రవంతుల ఆ సంగమంలో ఒకటి అంతఃస్రవంతి. కానీ మాలవీయ పైన చెప్పుకున్న మూడు లక్షణాలు కూడా స్పష్టంగా కనిపించే చారిత్రక, సామాజిక, రాజకీయ త్రివాణీ సంగమం.
- డా. గోపరాజు నారాయణరావు
Comments
Please login to add a commentAdd a comment