అసిధారావ్రతం!
‘అదేమీ ఆషామాషీ విషయం కాదు. అసిధారావ్రతం!’ అని చాలామంది అంటూ ఉంటారు. అసలు ఏమిటీ అసిధారావ్రతం?
‘అసి’ అంటే ‘కత్తి’, ‘ధార’ అంటే ‘పదునైన అంచు’ అని అర్థం. అర్థం వరకు బానే ఉంది గానీ... మధ్యలో ఈ వ్రతం ఏమిటి మరి!
‘అసిధారావ్రతం’ అనేది నిజంగానే ఒక వ్రతం. పెళ్లైనవాళ్లు బ్రహ్మచర్య దీక్షలో ఉన్నప్పుడు చేపట్టే కఠినమైన వ్రతం ఇది.
ఏవైనా కారణాల చేత భార్యాభర్తలు దూరంగా ఉండాల్సి వచ్చినప్పుడు... ఒకే మంచం మీద పడు కున్న భార్యభర్తల మధ్య ఒక పదునైన కత్తి పెట్టేవారు. కత్తి ఆ భార్యాభర్తల మధ్య హద్దులా ఉంటుంది. ఉన్నచోటు నుంచి తెలిసో తెలియకో ఏ మాత్రం కదిలినా... కత్తికి బలి కాక తప్పదు. అందుకే ఎంతో అంకితభావంతో ఈ దీక్ష చేసేవారు.
ఇప్పుడు ఈ ‘అసిధారావ్రతం’ ఎక్కడైనా ఆచరణలో ఉందా లేదా అనేది తెలియదుగానీ, కఠినమైన పని గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు, ఆ కఠినమైన పనిని అంతకంటే కఠినమైన దీక్షతో చేయాల్సి వచ్చినప్పుడు మాత్రం ‘అసిధారావ్రతం’ అన్న జాతీయాన్ని వాడటం జరుగుతోంది.
కర్ణుడు లేని భారతం!
‘‘వాడు లేని ప్రయాణం... కర్ణుడు లేని భారతం.’’
‘‘నువ్వు రాకుండా పెళ్లి ఎలా జరుగుతుందనుకుంటున్నావు... కర్ణుడు లేని భారతం ఉంటుందా?’’
ఏదైనా పని లేదా సమావేశంలో ఒక వ్యక్తి ప్రాధాన్యతను తెలియజేయడానికి ఉపయోగించే జాతీయం ఇది.
మహాభారతంలో కర్ణుడు నాయకుడా? ఖల్‌నాయకుడా? అనేదాన్ని పక్కన పెడితే...
అతనికి భారతంలో ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. పుట్టుక నుంచి చావు వరకు... కర్ణుడి జీవితంలో ప్రతి ఘట్టం ఆసక్తికరమే. అందుకే మహాభారతంలో అతడి ప్రాముఖ్యతను తెలియజెప్పే ఈ మాట... నిజ జీవితంలో ముఖ్యమైన వ్యక్తుల ప్రాధాన్యతను తెలియజేసే జాతీయం అయ్యింది.
చాట్లో బియ్యం బావిలో నీళ్లు!
ఒక పని ఎంత సులువై నదో సూచించడానికి వాడే మాట ఇది. ‘అన్నీ అందుబాట్లో ఉన్నాయి. ఇక ఆలస్యం ఎందుకు?’ అన్న అర్థం కూడా వస్తుందీ మాటకి. పనికి కావలసిన వనరులన్నీ అందుబాటులో ఉన్నప్పుడు పని పూర్తి కావడం ఎంతో సులభం. చాటలో బియ్యం, బావిలో నీళ్లు ఉన్నాయి. అంటే వంటకు కావలసినవన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఇక వంట చేయడం ఎంతసేపు! అందుకే సులువుగా పూర్తయ్యే పని విషయంలో దీన్ని వాడుతుంటారు.
సింగన్న ప్రయాణం
చెప్పిన పని ఆలస్యంగా చేయడం ఎలాగైతే మంచిది కాదో, హడావిడిగా చేయడం కూడా అంత మంచిది కాదని చెప్పే జాతీయం ఇది. పని మీద శ్రద్ధ ఉంటేనే చాలదు. ఆ పని ఏమిటో, దాన్ని ఎలా చేయాలో తెలుసుకునే శ్రద్ధ కూడా ఉండాలి. లేకపోతే అభాసుపాలై నవ్వుల పాలవుతాం. దీనికి ఉదాహరణే సింగన్న!
వెనకటికి సింగన్న అనే వ్యక్తి ఉండేవాడు. బుద్ధిమంతుడే కానీ తొందరపాటు చాలా ఎక్కువ. దాంతో తరచూ అభాసుపాలయ్యేవాడు.
ఒకరోజు రాత్రి సింగన్న తల్లిదండ్రులు... ‘‘రేపు ఉదయాన్నే సింగన్నను అద్దంకి పంపిం చాలి’’ అనుకోవడం సింగన్న చెవిన పడింది. మర్నాడు తెల్ల వారుజామునే నిద్ర లేచి అద్దంకి వెళ్లిపోయాడు సింగన్న. సాయంత్రం తిరిగి వచ్చాడు. ‘‘ఎక్కడికెళ్లావురా?’’ అని అడిగాడు తండ్రి. ‘‘అద్దంకి వెళ్లొస్తున్నాను’’ అన్నాడు సింగన్న.
‘‘ఎందుకు వెళ్లావు?’’... ఆశ్చర్యంగా అడిగాడు తండ్రి. ‘‘రాత్రి విన్నాలే... నువ్వు ఎలాగూ వెళ్లమని చెప్తావు కదా అని ముందే వెళ్లి వచ్చాను’’ అన్నాడు సింగడు. నవ్వాలో ఏడ్వాలో అర్థం కాలేదు తండ్రికి. వివరం తెలుసుకోకుండా తొందరపడేవాళ్లని సింగడితో పోల్చడం అప్పట్నుంచే మొదలైంది.
మన జాతీయాలు
Published Sun, Nov 29 2015 1:02 AM | Last Updated on Sun, Sep 3 2017 1:10 PM
Advertisement