Our proverbs
-
మన జాతీయాలు
టెంకాయ పిచ్చికొండ! కొందరు ప్రతిదానికీ కంగారు పడిపోతూ, గందరగోళానికి గురవుతూ తేలిగ్గా అయ్యే పనిని జటిలం చేస్తారు. లేదా చెడగొడతారు. తెలివి తక్కువతనం, భయం, గందరగోళం లాంటి వాటి వల్ల తమ పనికి తామే చేటు చేసుకుంటారు. ఇలాంటి వారి విషయంలో ఉపయోగించే మాటే ‘టెంకాయ పిచ్చికొండ!’ ‘‘పోయి పోయి వాడికి పని అప్పగించావా? వాడిది టెంకాయ పిచ్చికొండ వ్యవహారం’’; ‘‘నేను చెప్పింది బాగా అర్థమైంది కదా... జాగ్రత్త. టెంకాయ పిచ్చికొండ వ్యవహారం చేయకు’’... ఇలాంటి మాటలు వింటూనే ఉంటాం. అసలలా ఎందుకు అంటారు? ఎందుకంటే దాని వెనుక ఒక కథ ఉంది. పూర్వం ఒక పేదవాడు రాజు దగ్గరికి వెళ్లి తన దారిద్య్రం గురించి చెప్పుకుని, ఏదైనా సహాయం పొందాలనుకున్నాడు. ‘మొదటిసారి రాజుగారి దగ్గరికి వెళుతున్నాను. ఉత్త చేతులతో వెళితే ఏం బాగుంటుంది?’ అనుకొని ఒక టెంకాయ కొన్నాడు. దాన్ని రాజుగారికి ఇవ్వాలనుకున్నాడు. ‘‘టెంకాయ తప్ప ఏమీ ఇచ్చుకోలేని పేదవాడిని. గర్భదారిద్య్రంతో బాధపడుతున్నాను. ఈ పేదవాడి మీద కాస్త కరుణ చూపించండి’’ అని చెప్పాలని బాగా రిహార్సల్స్ వేసుకున్నాడు. కానీ రాజు దగ్గరికి వెళ్లాక ఆయన దర్పం, అక్కడ ఉన్న మందీ మార్బలాన్ని చూసి మాటలు తడబడ్డాయి. చెప్పదలచిన విషయం మర్చిపోయాడు. ‘‘ఏమిటి నీ సమస్య?’’ అని రాజుగారు అడగ్గానే- ‘టెంకాయ పుచ్చుకోండి’ అనడానికి బదులు ‘టెంకాయ పిచ్చికొండ’ అన్నాడు. దీంతో రాజుగారికి కోపం వచ్చి ‘‘ఈ మతి లేనివాడిని బయటికి లాక్కెళ్లండి’’ అని అరిచాడు. నాటి నుంచీ వ్యవహారాలు చెడగొట్టేవారి విషయంలో ఈ మాట వాడుతున్నారు! ఎలుగుబంటి క్షవరం! కొన్ని పనులు అయోమయంగా అనిపిస్తాయి. ఎక్కడ మొదలు పెట్టాలో ఎక్కడ ఆపాలో ఒక పట్టాన అర్థం కావు. కొన్ని పనులేమో ఎంత చేసినా తరగవు. ఇలాంటి సందర్భాల్లో విరివిగా ఉపయోగించే జాతీయమే ఈ ‘ఎలుగుబంటి క్షవరం’. ‘అది పనికాదు బాబోయ్... ఎలుగుబంటి క్షవరం.’నువ్వు అప్పజెప్పిన పనేమన్నా చిన్నదా? ఎలుగుబంటి క్షవరం.’ అసలీ మాట ఎక్కడ్నుంచి పుట్టుకొచ్చింది? ఎలుగుబంటికి ఒళ్లంతా వెంట్రుకలు ఉంటాయి. అలాంటి ఎలుగుబంటికి క్షవరం చేయడమంటే మాటలా? చాలా చాలా కష్టం. అందుకే అత్యంత కష్టసాధ్యమైన పని విషయంలో అలా అంటుంటారు! కుంభకోణం! మోసం జరిగింది అని చెప్పడానికి ‘కుంభకోణం జరిగింది’ అంటుంటాం. నిజానికి కుంభకోణం అనేది తమిళనాడులోని తంజావూరు జిల్లాలో ఉన్న ఒక పట్టణం. బ్రిటిష్ వాళ్లు తొలి నాళ్లలో ఇంగ్లిష్ స్కూళ్లను స్థాపించిన పట్టణాల్లో ఇదొకటి. దీన్ని ‘కేంబ్రిడ్జి ఆఫ్ సౌత్ ఇండియా’ అని కూడా పిలిచేవాళ్లు. ఈ ఘనత మాట ఎలా ఉన్నా... బ్రిటిష్ వారు ఇంగ్లిష్ పాఠశాలలను స్థాపించింది ప్రజల మీద ప్రేమతో కాదని... అదంతా భారతీయ సంస్కృతి, సంప్రదాయల నుంచి వారిని వేరు చేయడానికి చేసిన మోసమని భావించేవారు. కుంభకోణంలో పాఠశాల పెట్టిందీ మోసానికే అనేవారు. కాలక్రమంలో ఈ ‘మోసం’ కాస్తా కుంభకోణానికి పర్యాయ పదమైపోయింది. ఘనాపాఠి ఒక విద్యలో కొమ్ములు తిరిగిన వారిని ‘ఘనాపాఠి’ అంటుంటారు. ఇది వేదానికి సంబంధించిన విషయం నుంచి పుట్టిన మాట. వేదంలో ప్రతి మంత్రానికీ పదం, జట, ఘనం అనేవి ఉంటాయి. చివరిదైన ‘ఘనం’ వరకు చదువుకున్నాడంటే దాన్ని లోతుగా చదువుకున్నాడన్నమాట. అలా చదువుకున్న వాళ్లను ‘ఘనాపాఠి’ అంటారు. వేదానికి మాత్రమే కాక క్రమేణా ఇది ఇతర విద్యలలో ప్రతిభ చూపిన వారి గురించి కూడా ఉపయోగించడం మొదలయ్యింది. -
మన జాతీయాలు
రామబాణం! రాముడు మహా వీరుడు. ఆయన తన బాణం వేస్తే గురి తప్పడం అంటూ జరిగేది కాదు. అందుకే ‘రాముడు మాట తప్పడు, గురి తప్పడు’ అంటుంటారు. రామబాణానికి ఉన్న విశేషం ఏమిటంటే, వరుసగా ఏడు తాటిచెట్లను పడగొట్టే శక్తి దానికుంటుందట. అలాగే... ఆయన వేసిన బాణం, పాతాళలోకం దాకా వెళ్లి తిరిగి వచ్చి మళ్లీ ఆయన అమ్ముల పొదిలో చేరుతుందట. ఇది వాస్తవమా? కావ్య అతిశయోక్తా అనేదాన్ని పక్కన పెడితే... జనాలు ‘రామబాణం’ అనే మాటను ‘తిరుగులేని మాట’ అనేదానికి పర్యాయపదంగా వాడుతుంటారు. ‘ఆయన మాట ఇవ్వడు. ఇస్తే మాత్రం తిరుగులేదు. అది రామబాణమే’ అని అంటుంటారు. విలువిద్య కౌశలానికి సంబంధించి....‘ఎలాంటి పరిస్థితుల్లోనూ లక్ష్యాన్ని చేధిస్తాడు’ అని చెప్పడానికైనా, నైతికతకు సంబంధించి ‘ఆరు నూరైనా నూరు ఆరైనా మాట తప్పడు’ అని చెప్పడానికైనా ఈ జాతీయాన్ని వాడుతుంటారు. ఏనుగు మీద ఎలుక! ‘‘బాబోయ్... ఈ పని భారం మోయలేక పోతున్నాను’’ ‘‘చాల్లే... ఏనుగు మీద ఎలుకను పెట్టినట్లుగా ఈ పని అప్పగించాం. అసలు నీ శక్తితో పోల్చితే ఈ పని ఎంత చిన్నదని!’’ ఇలాంటి మాటలు వినే ఉంటారు కదా! ఏమాత్రం కష్టం కానీ, భారంగా కానీ అనిపించని పని విషయంలో వాడే జాతీయం ఇది. ఏనుగు మీద ఎలుక కూర్చుంటే, ఏనుగుకు భారమని అనిపిస్తుందా! లేదు కదా! అందుకే నీకా పని భారం కాదు అనడానికి ఈ పోలిక. కుక్కొచ్చింది... ఉట్టి తెగింది! యాదృచ్ఛికంగా అదృష్టం కలిసి వచ్చి, పని సులభమయ్యే సందర్భాల్లో వాడే మాట ఇది. ఒక కుక్క బాగా ఆకలితో ఒక ఇంట్లోకి దూరింది. పైన ఉట్టి తప్ప ఏమీ కనిపించలేదు. ఆ ఉట్టిలో ఏదైనా ఉందేమోనని దాన్ని అందుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేసింది. చివరికి విఫలమై తిరుగుముఖం పట్టింది. సరిగ్గా ఆ సమయంలోనే ఇంకో కుక్క ఇంట్లోకి దూరింది. దాని అదృష్టం ఎలా ఉందంటే, అది ఇంట్లో అడుగుపెట్టే సమయానికి ఉట్టి తాడును ఓ ఎలుక కొరికింది. దాంతో ఉట్టి తెగి కిందపడింది. ‘ఆహా, ఏమి నా అదృష్టం’ అనుకుంటూ ఆ కుక్క హాయిగా పొట్ట నింపుకుంది. అలా ఈ కథ నుంచి పుట్టిందే ‘కుక్కొచ్చింది... ఉట్టి తెగింది’ అనే జాతీయం. కొందరు ఎంత కష్టపడినా ఫలితం చేతికి అందదు. కొందరికి మాత్రం అస్సలు కష్టపడకుండానే అన్నీ కలిసొస్తాయి. అప్పటికప్పుడు అదృష్టం తలుపు తట్టి లబ్ధి పొందుతుంటారు. వారి గురించి చెప్పేదే ఈ మాట. తోక పద్యం! ‘అయ్య బాబోయ్ తోక పద్యం మొదలుపెట్టాడు. ఇక్కడి నుంచి జారుకుంటే మంచిది.’ ‘తోక పద్యం చదవడం కాదు... ఏదో ఒకటి తేల్చు.’ ఇలాంటి మాటలు నిత్యజీవితంలో తరచూ వినిపిస్తుంటాయి. అర్థం, పరమార్థం అనేది లేకుండా కొందరు, చెప్పిన విషయాన్నే మళ్లీ మళ్లీ చెప్పి విసుగిస్తుంటారు. ఇక కొందరేమో... ఒక సమస్య గురించి మాట్లాడుతుంటారే గానీ ఒక పట్టాన తేల్చరు. నాన్చుతూనే ఉంటారు. ఇలాంటి సందర్భాల్లో ఉపయోగించే జాతీయమే ఈ తోకపద్యం. నిజానికి తోక పద్యం అనేది కల్పిత పదం కాదు. అది ఒక సాహిత్య ప్రకియ. ఒకరు ఒక పద్యం చెప్పడం పూర్తవ్వగానే, వేరొకరు చివరి పదంతోగానీ, చివరి అక్షరంతోగానీ ఒక పద్యం చెప్పాలి. అలా అని అప్పటికప్పుడు సొంత పద్యాలేమీ చెప్పకూడదు. గతంలో కవులు రాసిన పద్యాలను మాత్రమే చదవాలి. పద్యం పూర్తయిన తరువాత అది ఏ పుస్తకంలో ఉంది, కవి ఎవరు తదితర వివరాలు కూడా చెప్పాలి. ఇలా తోకపద్యం అనేది వినోద సాహిత్య ప్రక్రియ మాత్రమే కాదు, పద్యజ్ఞానాన్ని, జ్ఞాపకశక్తి, ధారణ తదితర విషయాలను పరీక్షించేది కూడా. అయినప్పటికీ జాతీయం విషయానికి వచ్చేసరికి మాత్రం... ఏదీ తేల్చకుండా, అభిప్రాయం తెగేసి చెప్పకుండా సాగతీసే సందర్భాల్లో ‘తోక పద్యం’ అన్న మాటను వాడడం పరిపాటిగా మారింది! -
మన జాతీయాలు
అసిధారావ్రతం! ‘అదేమీ ఆషామాషీ విషయం కాదు. అసిధారావ్రతం!’ అని చాలామంది అంటూ ఉంటారు. అసలు ఏమిటీ అసిధారావ్రతం? ‘అసి’ అంటే ‘కత్తి’, ‘ధార’ అంటే ‘పదునైన అంచు’ అని అర్థం. అర్థం వరకు బానే ఉంది గానీ... మధ్యలో ఈ వ్రతం ఏమిటి మరి! ‘అసిధారావ్రతం’ అనేది నిజంగానే ఒక వ్రతం. పెళ్లైనవాళ్లు బ్రహ్మచర్య దీక్షలో ఉన్నప్పుడు చేపట్టే కఠినమైన వ్రతం ఇది. ఏవైనా కారణాల చేత భార్యాభర్తలు దూరంగా ఉండాల్సి వచ్చినప్పుడు... ఒకే మంచం మీద పడు కున్న భార్యభర్తల మధ్య ఒక పదునైన కత్తి పెట్టేవారు. కత్తి ఆ భార్యాభర్తల మధ్య హద్దులా ఉంటుంది. ఉన్నచోటు నుంచి తెలిసో తెలియకో ఏ మాత్రం కదిలినా... కత్తికి బలి కాక తప్పదు. అందుకే ఎంతో అంకితభావంతో ఈ దీక్ష చేసేవారు. ఇప్పుడు ఈ ‘అసిధారావ్రతం’ ఎక్కడైనా ఆచరణలో ఉందా లేదా అనేది తెలియదుగానీ, కఠినమైన పని గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు, ఆ కఠినమైన పనిని అంతకంటే కఠినమైన దీక్షతో చేయాల్సి వచ్చినప్పుడు మాత్రం ‘అసిధారావ్రతం’ అన్న జాతీయాన్ని వాడటం జరుగుతోంది. కర్ణుడు లేని భారతం! ‘‘వాడు లేని ప్రయాణం... కర్ణుడు లేని భారతం.’’ ‘‘నువ్వు రాకుండా పెళ్లి ఎలా జరుగుతుందనుకుంటున్నావు... కర్ణుడు లేని భారతం ఉంటుందా?’’ ఏదైనా పని లేదా సమావేశంలో ఒక వ్యక్తి ప్రాధాన్యతను తెలియజేయడానికి ఉపయోగించే జాతీయం ఇది. మహాభారతంలో కర్ణుడు నాయకుడా? ఖల్నాయకుడా? అనేదాన్ని పక్కన పెడితే... అతనికి భారతంలో ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. పుట్టుక నుంచి చావు వరకు... కర్ణుడి జీవితంలో ప్రతి ఘట్టం ఆసక్తికరమే. అందుకే మహాభారతంలో అతడి ప్రాముఖ్యతను తెలియజెప్పే ఈ మాట... నిజ జీవితంలో ముఖ్యమైన వ్యక్తుల ప్రాధాన్యతను తెలియజేసే జాతీయం అయ్యింది. చాట్లో బియ్యం బావిలో నీళ్లు! ఒక పని ఎంత సులువై నదో సూచించడానికి వాడే మాట ఇది. ‘అన్నీ అందుబాట్లో ఉన్నాయి. ఇక ఆలస్యం ఎందుకు?’ అన్న అర్థం కూడా వస్తుందీ మాటకి. పనికి కావలసిన వనరులన్నీ అందుబాటులో ఉన్నప్పుడు పని పూర్తి కావడం ఎంతో సులభం. చాటలో బియ్యం, బావిలో నీళ్లు ఉన్నాయి. అంటే వంటకు కావలసినవన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఇక వంట చేయడం ఎంతసేపు! అందుకే సులువుగా పూర్తయ్యే పని విషయంలో దీన్ని వాడుతుంటారు. సింగన్న ప్రయాణం చెప్పిన పని ఆలస్యంగా చేయడం ఎలాగైతే మంచిది కాదో, హడావిడిగా చేయడం కూడా అంత మంచిది కాదని చెప్పే జాతీయం ఇది. పని మీద శ్రద్ధ ఉంటేనే చాలదు. ఆ పని ఏమిటో, దాన్ని ఎలా చేయాలో తెలుసుకునే శ్రద్ధ కూడా ఉండాలి. లేకపోతే అభాసుపాలై నవ్వుల పాలవుతాం. దీనికి ఉదాహరణే సింగన్న! వెనకటికి సింగన్న అనే వ్యక్తి ఉండేవాడు. బుద్ధిమంతుడే కానీ తొందరపాటు చాలా ఎక్కువ. దాంతో తరచూ అభాసుపాలయ్యేవాడు. ఒకరోజు రాత్రి సింగన్న తల్లిదండ్రులు... ‘‘రేపు ఉదయాన్నే సింగన్నను అద్దంకి పంపిం చాలి’’ అనుకోవడం సింగన్న చెవిన పడింది. మర్నాడు తెల్ల వారుజామునే నిద్ర లేచి అద్దంకి వెళ్లిపోయాడు సింగన్న. సాయంత్రం తిరిగి వచ్చాడు. ‘‘ఎక్కడికెళ్లావురా?’’ అని అడిగాడు తండ్రి. ‘‘అద్దంకి వెళ్లొస్తున్నాను’’ అన్నాడు సింగన్న. ‘‘ఎందుకు వెళ్లావు?’’... ఆశ్చర్యంగా అడిగాడు తండ్రి. ‘‘రాత్రి విన్నాలే... నువ్వు ఎలాగూ వెళ్లమని చెప్తావు కదా అని ముందే వెళ్లి వచ్చాను’’ అన్నాడు సింగడు. నవ్వాలో ఏడ్వాలో అర్థం కాలేదు తండ్రికి. వివరం తెలుసుకోకుండా తొందరపడేవాళ్లని సింగడితో పోల్చడం అప్పట్నుంచే మొదలైంది. -
మన జాతీయాలు
వడ్లగింజలో బియ్యపుగింజ! ‘అప్పటి నుంచీ తెగ మాట్లాడుకుంటున్నారు... ఏమిటి విశేషం?’ ‘విశేషమా పాడా! వడ్లగింజలో బియ్యపుగింజ!’ ‘ఏదో చెబుతాడని వెళితే ఏమీ లేదు. వడ్లగింజలో బియ్యపుగింజ.’ ఇలాంటి మాటలు మనకు తరచుగా వినిపిస్తూనే ఉంటాయి. ఒక విషయంలో కొత్తదనం లేనప్పుడు, ప్రాధాన్యత లేనిదైనప్పుడు ఉపయోగించే జాతీయమే ఈ ‘వడ్లగింజలో బియ్యపుగింజ’. వడ్లగింజ మీద పొట్టు ఉంటుంది. ఆ పొట్టు తీస్తే లోపల బియ్యపు గింజ ఉంటుంది. ఇదేమీ కొత్త విషయం కాదు. అందరికీ తెలిసిందే. అయితే వెనకటికో వెంకయ్య ‘ఒక రహస్యం చెబుతాను’ అని తన మిత్రుడిని ఇంటికి పిలిచాడట. ఈ మిత్రుడు ఎలాంటి వాడంటే చీమ చిటుక్కుమన్నా... ‘ఏదో జరిగింది’ అంటూ ఆరా తీసే అతి ఆసక్తికరుడు. మరి అలాంటివాడు రహస్యం అంటే ఊరుకుంటాడా! ఉరుకులు పరుగుల మీద వెంకయ్య ఇంటికి వెళ్లాడు. తీరా వెళ్లాక ఆ వెంకయ్య ఈ మిత్రుడి చెవిలో చెప్పిన రహస్యం ఏమిటంటే- ‘‘నీకో విషయం తెలుసా. బియ్యపు గింజ ఎక్కడ నుంచి వస్తుందో నాకు తెలిసిపోయింది. వడ్లగింజ పొట్టు ఒలిచేస్తే బియ్యపుగింజ బయట పడుతుంది’’ అన్నాట్ట. అప్పట్నుంచీ ఆ మాట వాడుకలోకి వచ్చింది. మీది పిట్టలకు పులుసు కాసినట్లు! పని పూర్తిగా చేయకుండానే చేసేశామనే మానసిక స్థితిలో ఉండేవారి గురించి వాడే జాతీయం ఇది. ఒక వేటగాడు తన భార్యను పిలిచి - ‘‘పిట్టమాంసంతో పులుసు కాయి’’ అని ఆర్డర్ వేశాడట. ‘‘పిట్టేది? మాంసం ఏది?’’ అని భార్య అమాయకంగా అడిగింది. ‘‘అదిగో ఆకాశంలో ఎగురుతున్నాయి చూడు. ఇలా వెళ్లి అలా కొట్టుకొస్తాను. ఈలోపు పులుసు పొయ్యి మీద పెట్టు’’ అని చెప్పాడట. తీరా భార్య పులుసు కోసం ఏర్పాట్లు చేసేసరికి వేటగాడు మాత్రం ఉత్త చేతులతో తిరిగి వచ్చాడు! ఇలాగే కొందరు ఏదేదో చేసేస్తాం అని డంబాలు పలుకుతారు. కానీ చేసేదేమీ ఉండదు. అలాంటి వారి గురించి వాడే మాట ఇది! కంచంత కాపురం! ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఎక్కువగా ఉండేవి. దాంతో ఇల్లు పిల్లా పాపలతో సందడి సందడిగా ఉండేది. నాన్న, పెదనాన్న, చిన్నాన్న, అమ్మ, పెద్దమ్మ, చిన్నమ్మ, తాతయ్య, అమ్మమ్మ... ఇలా అందరూ ఒక ఇంట్లోనే ఉండేవాళ్లు. ఇలాంటి ఇళ్లలోకి అడుగు పెడితే రోజూ పండగ వాతావరణం కనిపించేది. దీంతో పిల్లలు, పెద్దలు కూడా ఎలాంటి మానసిక సమస్యలూ లేకుండా ఉండేవాళ్లు. పిల్లలందరినీ కూర్చోబెట్టుకొని పెద్దలు వెన్నెల రాత్రులలో కథలు చెప్పేవారు. అవి కథలు మాత్రమే కాదు... జీవితానికి మార్గదర్శకాలు. ఇలాంటి పెద్ద కుటుంబాన్ని ‘కంచంత కాపురం’ అనేవారు. కంచి అనేది తీర్థస్థలం. ఎప్పుడూ జనాలతో సందడి సందడిగా ఉంటుంది. తీరిక అనేదే లేదన్నట్లుగా ఉంటుంది. పెద్ద కుటుంబాలు కూడా అంతే కదా! అందుకే ఆ కుటుంబ స్థాయిని చెప్పడానికి ‘కంచంత కాపురం’ అంటుంటారు. కూరగాయ కవి! ‘‘నీకేమయ్యా మాంచి కవివి. కవిత్వాలు రాసి రాసి బోలెడు సంపాదించి ఉంటావు.’’ ‘‘సంపాదనా పాడా? నేను కూరగాయ కవిని.’’ ఈ సంభాషణ వింటే, కూరగాయ కవా అని ఆశ్చర్యం వేస్తుంది. అసలా మాటకు అర్థం ఏమిటి? వెనకటికో కవిగారు కొత్తగా పెళ్లి చేసుకున్నారు. కొన్ని రోజుల తరువాత కూతుర్ని చూసి వెళదామని ఆయన మామగారు వచ్చారు. ‘‘ఏమ్మా... అల్లుడు గొప్ప కవి కదా, సంపాదన బాగానే ఉంటుందా?’’ అని కూతురిని అడిగాడు. ‘‘మీ అల్లుడు కవిత్వం చెప్పి సంపాదించిన డబ్బు కూరగాయలు కొనడానికి మాత్రమే సరిపోతోంది. అన్నీ అప్పులే’’ అని భోరుమంది కూతురు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి, కవిగారు కాస్తా కూరగాయ కవి అయ్యాడు! అప్పట్నుంచీ ఈ మాట వాడుకలోకి వచ్చింది. ప్రతిభకు తగిన ఆదరణ దొరకనప్పుడు ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. -
మన జాతీయాలు (25-10-2015)
పులి మీసాలు మెలి పెట్టినట్లు.... సాధ్యమయ్యే పనేమిటో, అసాధ్యమయ్యే పనేమిటో తెలుసుకోవడానికి... పనిలోకి పూర్తిగా దిగనక్కర్లేదు. మొదలు పెట్టకముందే తెలిసిపోతుంది. అలాంటి సందర్భాల్లో ఉపయోగించే జాతీయం ఇది. ‘ఆ పని చేయడం అంత సులభం అనుకుంటున్నావా? పులి మీసాలను మెలేయడం లాంటిది’ అంటుంటారు కొందరు. ‘పులి మీసాలను మెలేయడం లాంటి ప్రమాదకరమైన పనిని ఎంచుకున్నావు!’ అంటారు మరికొందరు. రకరకాల సందర్భాల్లో ప్రమాద తీవ్రతను తెలియజేయడానికి, ఒక పనిలోని సాధ్యాసాధ్యాల గురించి హెచ్చరించడానికి ఈ మాట వాడుతుంటారు. పులిని దూరం నుంచి చూడాలంటేనే భయం. దగ్గరికి వెళ్లి చూడాలంటే మరీ భయం. ఒకవేళ చచ్చీ చెడీ దగ్గరకు వెళ్లినా... సాహసించి దాని మీసాలు మెలేయగలమా? అది అసాధ్యం కదా! ఇలాంటి అసాధ్యమైన, దుస్సాహసమైన పనుల విషయంలో ఉపయోగించే జాతీయమే ఇది. ఏనుగు నిద్ర! నిద్ర అంటే రెండు కళ్లూ మూసుకోవడం కాదు. నిద్ర పోవడం అంటే, ఆ సుఖంలో ప్రపంచాన్ని పూర్తిగా మరిచిపోవడం. అలసిన శరీరాన్ని, మనసును ఉత్తేజితం చేయడం. కొందరు సుఖంగా నిద్రపోతారు. అది వారి అదృష్టం. దురదృష్టం కొద్దీ కొందరు అనారోగ్య సమస్యల వల్ల సుఖంగా నిద్రపోలేరు. ఇక మూడో కోవకు చెందినవారు... సుఖంగా నిద్రపోయే అవకాశం ఉన్నా... ఏవేవో ఆలోచనలు, అకారణ భయాలతో బుర్ర పాడుచేసుకొని నిద్రకు దూరం అవుతారు. నిద్రకు, మెలకువకు మధ్య ఊగిసలాడుతుంటారు. ఇలాంటి వారిని ఉద్దేశించి వాడే జాతీయం ఇది. వెనకటికొక ఒక ఏనుగు సింహంతో తగాదా పెట్టుకుందట. ఆ తర్వాత అది భయంతో సరిగ్గా నిద్రపోయేది కాదట. తాను నిద్ర పోవడం చూసి సింహం ఎక్కడ చంపేస్తుందోనని వణికిపోయేదట. ఒకవేళ నిద్ర వచ్చినా, ఎందుకైనా మంచిదని ఒక కన్ను తెరిచి నిద్రపోయేదట. పేరుకు నిద్రపోతున్నా... సరిగ్గా నిద్రపోకుండా అవస్థపడే వాళ్లను ఉద్దేశించి ఉపయోగించే జాతీయం ఇది. కోటికి పడగెత్తడం! ఇప్పడు దేశాలకు, రాజకీయ పార్టీలకు, వివిధ సంస్థలకు సొంత అజెండా, జెండా ఉన్నట్లే... పూర్వకాలంలో కోటీశ్వరులకు కూడా సొంత జెండాలు ఉండేవట. ఇతరులతో పోల్చితే తాము ఆర్థికంగా అత్యంత మెరుగైన స్థితిలో ఉన్నామని, తాము కోటీశ్వరులమని గొప్పగా చెప్పుకోవడానికి ఇంటి మీద జెండాను ఎగరేసేవారట (జెండాకి బావుటా, పడగ అనే పర్యాయ పదాలు కూడా ఉన్నాయి). దాంతో వాళ్లను కోటికి పడగెత్తిన వాళ్లు అనేవారట! ఇక్కడ జెండా అనేది వారి ఉన్నత ఆర్థిక హోదాకు చిహ్నం. ఆ ఇంటివారు ఆర్థికంగా ఏ స్థితిలో ఉన్నారో చెప్పుకోవడానికి వారి ఇంటి మీద ఎగిరే జెండాను చూస్తే చాలు. ఆర్థిక దర్పాన్ని ప్రతిబింబించే ఈ సంప్రదాయం కాలగర్భంలో కలిసిపోయినప్పటికీ... కోటికి పడగెత్తడం అనే జాతీయం మాత్రం ఇప్పటికీ సజీవంగా ఉంది. ముదిమాను చేవ వయసు పెరుగుతున్న కొద్దీ చెట్టు విశాలమవుతుంది. బలమైనదవుతుంది. నలుగురికి నాలుగు రకాలుగా ఉపయోగపడేలా తయారవుతుంది. వయసు మీద పడిన వ్యక్తులు కూడా అంతే. వారి అనుభవ జ్ఞానం విలువైనది. ఏ పుస్తకాల్లోనూ, శాస్త్రాల్లోనూ దొరకనిది. ఆ జ్ఞానం వారి మాటల్లో తరచుగా దొర్లుతుంటుంది. సంక్షోభ సమయంలో, ఏ దారి ఎంచుకోవాలో తెలియని అయోమయ స్థితిలో వారి సలహాలు దారి చూపుతాయి. అందుకే పెద్దల మాట చద్ది మూట అంటారు. పెద్దల మాటల విలువను గుర్తు తెచ్చే సందర్భంలో ఉపయోగించే జాతీయం ఇది. -
మన జాతీయాలు
నక్క తోక తొక్కినవాడు! నక్క ఎప్పుడూ ఏమరుపాటుగా ఉండదట. దాని బుర్ర ఎప్పుడూ చురుగ్గా ఉంటుందట. ఎవరిైనైనా చూస్తే చాలు... దానికి అప్పటికప్పుడు ఐడియాలు వచ్చేస్తాయట. అది పరధ్యానంగా, అజాగ్రత్తగా ఉండడం అనేది అరుదట. చిన్న శబ్దమైనా దిగ్గున లేచే అలవాటు దానికి ఉంటుందట! వెనకటికి ఒకడు... చూడకుండా నక్కతోకను తొక్కాడు. మామూలుగానైతే తన తోక తొక్కినందుకు అది ఆ మనిషిని గాయపరచాలి. కానీ ఆ నక్కగారు ఏ మూడ్లో ఉన్నారో గానీ, తన తోక తొక్కినా ఎలాంటి స్పందన కనబరచలేదట! దాంతో అతడు సేఫ్గా తప్పించుకున్నాడన్నమాట! అలాగే ఈ నక్కతోకపై మరో కథ కూడా ఉంది. పూర్వం ఒకాయన ఏదో పనిమీద బయటకు వెళ్తూ అనుకోకుండా నక్క తోకను తొక్కాడట. నిజానికి నక్క ఎదురు కావడమే అపశకునం అంటారు. కానీ దాని తోక తొక్కి వెళ్లినా కూడా ఎటువంటి ఆటంకం ఎదురుకాకుండా అతడి పని విజయవంతం అయ్యిందట. అప్పట్నుంచీ ఎవరికైనా ఏదైనా కలిసొస్తే నక్కతోక తొక్కాడు అనడం పరిపాటి అయ్యింది! మెరుపు... దీపం అవుతుందా! తాత్కాలిక సౌకర్యాలు, సంపదతో కొందరు ధీమాగా ఉంటారు. ‘ఇక నాకేమీ లోటు లేదు’ అనుకుంటారు. సౌకర్యాలు పోయి, సంపద కరిగిపోయిన తరువాత షరా మామూలే! చీకట్లో ఉన్నవాడికి ‘మెరుపు’ కాంతిని ఇస్తుంది. కానీ అది ఎంతసేపు! కన్నుమూసి తెరిచేలోగా ఆ మెరుపు వెలుగు మాయమైపోతుంది. ఎంత మెరుపైనా అది ఎక్కువ సమయం కాంతి ఇవ్వడానికి దీపం కాదు కదా! ఈ వాస్తవాన్ని వివరించేదే ఈ జాతీయం. సంపద చూసుకుని కొందరు మురిసిపోతుంటారు. ఎవరినీ లెక్క చేయకుండా మిడిసిపడుతుంటారు. ఆ సంపద శాశ్వతం కాదన్న వాస్తవాన్ని వాళ్లు మర్చిపోతారు. అలాంటి వాళ్ల విషయంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. తేర గుర్రం - తంగేడు బరిగె! ఎవరి దగ్గరైనా ఒక వస్తువును అరువు తెచ్చుకున్నప్పుడు, మన వస్తువు కంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అలా కాకుండా ఎడాపెడా వాడేయడం మర్యాద కాదు. ఓసారి ఒకాయన ఊరికెళుతూ తన గుర్రాన్ని మిత్రుడికిచ్చి ‘‘నేను వచ్చే వరకు నా గుర్రాన్ని జాగ్రత్తగా చూసుకో’’ అని చెప్పాడట. ఇక ఆ రోజు నుంచి ఆ గుర్రాన్ని ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించాడట సదరు మిత్రుడు. గుర్రాన్ని పరుగెత్తించడం కోసం చీటికీ మాటికీ దాన్ని తంగేడు బరిగెతో చావబాదేవాడట! ఊరికి వెళ్లి వచ్చిన ఆసామి దీనస్థితిలో ఉన్న తన గుర్రాన్ని చూసి ఘొల్లుమన్నాడట. నాటి నుంచీ... మనది కాదు కదా, తేరగా వచ్చింది కదా అని ఇతరుల వస్తువులు లేదా సొమ్మును విచ్చలవిడిగా ఉపయోగించడం లేదా దుర్వినియోగం చేసిన సందర్భాల్లో ఈ జాతీయాన్ని వాడుతున్నారు. నంబీ నంబీ నా పెళ్లికేం చేస్తావు? పూర్వం ఒక ఊళ్లో ఒకాయన ఉండేవాడట. ఇతడిని చూస్తే చాలు ఊరివాళ్లు జడుసుకునేవారట. దీని అర్థం... అతను బలవంతుడు, రౌడీ అని కాదు. ఆయనగారు ఎదురొస్తే ఏ పనీ కాదని! ఎందుకో తెలీదు కానీ... ఆ వ్యక్తి ఎదురొస్తే ఏ పని కూడా సవ్యంగా జరిగేది కాదట. దాంతో పని మీద వెళ్లేటప్పుడు అతగాడు ఎదురుపడితే ఆగిపోయేవారట. ఓసారి అతని దగ్గరకు ఓ పేదవాడు వచ్చాడట. తన పెళ్లి ఖర్చుల కోసం తలా కొంత అడుగుతూ వస్తున్న అతను- ‘‘నంబీ నంబీ నా పెళ్లికేం సహాయం చేస్తావు?’’ అని ఇతణ్ని అడిగాడు. అప్పుడతను-‘‘నీ పెళ్లికి ఎదురురాను ఫో’’ అన్నాడట. ఇంతకు మించిన సహాయం ఏముంటుంది అనుకున్నాడట ఆ పెళ్లికొడుకు! కొందరు పనిలో పాలు పంచుకోకపోయినా ఎలాంటి సమస్యా ఉండదు. కానీ పాలు పంచుకుంటే మాత్రం... ఆ పని జరగకపోగా రకరకాల సమస్యలు ఎదురవుతాయి. వాళ్లు ఏ పనిలోనూ వేలు పెట్టకపోవడమే పెద్ద సహాయం. అలాంటి వాళ్లను ఉద్దేశించి వాడే జాతీయం ఇది.