టెంకాయ పిచ్చికొండ!
కొందరు ప్రతిదానికీ కంగారు పడిపోతూ, గందరగోళానికి గురవుతూ తేలిగ్గా అయ్యే పనిని జటిలం చేస్తారు. లేదా చెడగొడతారు. తెలివి తక్కువతనం, భయం, గందరగోళం లాంటి వాటి వల్ల తమ పనికి తామే చేటు చేసుకుంటారు. ఇలాంటి వారి విషయంలో ఉపయోగించే మాటే ‘టెంకాయ పిచ్చికొండ!’
‘‘పోయి పోయి వాడికి పని అప్పగించావా? వాడిది టెంకాయ పిచ్చికొండ వ్యవహారం’’; ‘‘నేను చెప్పింది బాగా అర్థమైంది కదా... జాగ్రత్త. టెంకాయ పిచ్చికొండ వ్యవహారం చేయకు’’... ఇలాంటి మాటలు వింటూనే ఉంటాం. అసలలా ఎందుకు అంటారు? ఎందుకంటే దాని వెనుక ఒక కథ ఉంది. పూర్వం ఒక పేదవాడు రాజు దగ్గరికి వెళ్లి తన దారిద్య్రం గురించి చెప్పుకుని, ఏదైనా సహాయం పొందాలనుకున్నాడు. ‘మొదటిసారి రాజుగారి దగ్గరికి వెళుతున్నాను. ఉత్త చేతులతో వెళితే ఏం బాగుంటుంది?’ అనుకొని ఒక టెంకాయ కొన్నాడు. దాన్ని రాజుగారికి ఇవ్వాలనుకున్నాడు. ‘‘టెంకాయ తప్ప ఏమీ ఇచ్చుకోలేని పేదవాడిని. గర్భదారిద్య్రంతో బాధపడుతున్నాను. ఈ పేదవాడి మీద కాస్త కరుణ చూపించండి’’ అని చెప్పాలని బాగా రిహార్సల్స్ వేసుకున్నాడు. కానీ రాజు దగ్గరికి వెళ్లాక ఆయన దర్పం, అక్కడ ఉన్న మందీ మార్బలాన్ని చూసి మాటలు తడబడ్డాయి. చెప్పదలచిన విషయం మర్చిపోయాడు.
‘‘ఏమిటి నీ సమస్య?’’ అని రాజుగారు అడగ్గానే- ‘టెంకాయ పుచ్చుకోండి’ అనడానికి బదులు ‘టెంకాయ పిచ్చికొండ’ అన్నాడు. దీంతో రాజుగారికి కోపం వచ్చి ‘‘ఈ మతి లేనివాడిని బయటికి లాక్కెళ్లండి’’ అని అరిచాడు. నాటి నుంచీ వ్యవహారాలు చెడగొట్టేవారి విషయంలో ఈ మాట వాడుతున్నారు!
ఎలుగుబంటి క్షవరం!
కొన్ని పనులు అయోమయంగా అనిపిస్తాయి. ఎక్కడ మొదలు పెట్టాలో ఎక్కడ ఆపాలో ఒక పట్టాన అర్థం కావు. కొన్ని పనులేమో ఎంత చేసినా తరగవు. ఇలాంటి సందర్భాల్లో విరివిగా ఉపయోగించే జాతీయమే ఈ ‘ఎలుగుబంటి క్షవరం’.
‘అది పనికాదు బాబోయ్... ఎలుగుబంటి క్షవరం.’నువ్వు అప్పజెప్పిన పనేమన్నా చిన్నదా? ఎలుగుబంటి క్షవరం.’
అసలీ మాట ఎక్కడ్నుంచి పుట్టుకొచ్చింది?
ఎలుగుబంటికి ఒళ్లంతా వెంట్రుకలు ఉంటాయి. అలాంటి ఎలుగుబంటికి క్షవరం చేయడమంటే మాటలా? చాలా చాలా కష్టం.
అందుకే అత్యంత కష్టసాధ్యమైన పని విషయంలో అలా అంటుంటారు!
కుంభకోణం!
మోసం జరిగింది అని చెప్పడానికి ‘కుంభకోణం జరిగింది’ అంటుంటాం. నిజానికి కుంభకోణం అనేది తమిళనాడులోని తంజావూరు జిల్లాలో ఉన్న ఒక పట్టణం. బ్రిటిష్ వాళ్లు తొలి నాళ్లలో ఇంగ్లిష్ స్కూళ్లను స్థాపించిన పట్టణాల్లో ఇదొకటి. దీన్ని ‘కేంబ్రిడ్జి ఆఫ్ సౌత్ ఇండియా’ అని కూడా పిలిచేవాళ్లు. ఈ ఘనత మాట ఎలా ఉన్నా... బ్రిటిష్ వారు ఇంగ్లిష్ పాఠశాలలను స్థాపించింది ప్రజల మీద ప్రేమతో కాదని... అదంతా భారతీయ సంస్కృతి, సంప్రదాయల నుంచి వారిని వేరు చేయడానికి చేసిన మోసమని భావించేవారు. కుంభకోణంలో పాఠశాల పెట్టిందీ మోసానికే అనేవారు. కాలక్రమంలో ఈ ‘మోసం’ కాస్తా కుంభకోణానికి పర్యాయ పదమైపోయింది.
ఘనాపాఠి
ఒక విద్యలో కొమ్ములు తిరిగిన వారిని ‘ఘనాపాఠి’ అంటుంటారు. ఇది వేదానికి సంబంధించిన విషయం నుంచి పుట్టిన మాట.
వేదంలో ప్రతి మంత్రానికీ పదం, జట, ఘనం అనేవి ఉంటాయి. చివరిదైన ‘ఘనం’ వరకు చదువుకున్నాడంటే దాన్ని లోతుగా చదువుకున్నాడన్నమాట. అలా చదువుకున్న వాళ్లను ‘ఘనాపాఠి’ అంటారు. వేదానికి మాత్రమే కాక క్రమేణా ఇది ఇతర విద్యలలో ప్రతిభ చూపిన వారి గురించి కూడా ఉపయోగించడం మొదలయ్యింది.
మన జాతీయాలు
Published Sat, Jan 16 2016 11:20 PM | Last Updated on Sun, Sep 3 2017 3:45 PM
Advertisement