నక్క తోక తొక్కినవాడు!
నక్క ఎప్పుడూ ఏమరుపాటుగా ఉండదట. దాని బుర్ర ఎప్పుడూ చురుగ్గా ఉంటుందట. ఎవరిైనైనా చూస్తే చాలు... దానికి అప్పటికప్పుడు ఐడియాలు వచ్చేస్తాయట. అది పరధ్యానంగా, అజాగ్రత్తగా ఉండడం అనేది అరుదట. చిన్న శబ్దమైనా దిగ్గున లేచే అలవాటు దానికి ఉంటుందట! వెనకటికి ఒకడు... చూడకుండా నక్కతోకను తొక్కాడు. మామూలుగానైతే తన తోక తొక్కినందుకు అది ఆ మనిషిని గాయపరచాలి. కానీ ఆ నక్కగారు ఏ మూడ్‌లో ఉన్నారో గానీ, తన తోక తొక్కినా ఎలాంటి స్పందన కనబరచలేదట! దాంతో అతడు సేఫ్‌గా తప్పించుకున్నాడన్నమాట! అలాగే ఈ నక్కతోకపై మరో కథ కూడా ఉంది. పూర్వం ఒకాయన ఏదో పనిమీద బయటకు వెళ్తూ అనుకోకుండా నక్క తోకను తొక్కాడట. నిజానికి నక్క ఎదురు కావడమే అపశకునం అంటారు. కానీ దాని తోక తొక్కి వెళ్లినా కూడా ఎటువంటి ఆటంకం ఎదురుకాకుండా అతడి పని విజయవంతం అయ్యిందట. అప్పట్నుంచీ ఎవరికైనా ఏదైనా కలిసొస్తే నక్కతోక తొక్కాడు అనడం పరిపాటి అయ్యింది!
మెరుపు... దీపం అవుతుందా!
తాత్కాలిక సౌకర్యాలు, సంపదతో కొందరు ధీమాగా ఉంటారు. ‘ఇక నాకేమీ లోటు లేదు’ అనుకుంటారు. సౌకర్యాలు పోయి, సంపద కరిగిపోయిన తరువాత షరా మామూలే! చీకట్లో ఉన్నవాడికి ‘మెరుపు’ కాంతిని ఇస్తుంది. కానీ అది ఎంతసేపు! కన్నుమూసి తెరిచేలోగా ఆ మెరుపు వెలుగు మాయమైపోతుంది. ఎంత మెరుపైనా అది ఎక్కువ సమయం కాంతి ఇవ్వడానికి దీపం కాదు కదా! ఈ వాస్తవాన్ని వివరించేదే ఈ జాతీయం. సంపద చూసుకుని కొందరు మురిసిపోతుంటారు. ఎవరినీ లెక్క చేయకుండా మిడిసిపడుతుంటారు. ఆ సంపద శాశ్వతం కాదన్న వాస్తవాన్ని వాళ్లు మర్చిపోతారు. అలాంటి వాళ్ల విషయంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు.
తేర గుర్రం - తంగేడు బరిగె!
ఎవరి దగ్గరైనా ఒక వస్తువును అరువు తెచ్చుకున్నప్పుడు, మన వస్తువు కంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అలా కాకుండా ఎడాపెడా వాడేయడం మర్యాద కాదు. ఓసారి ఒకాయన ఊరికెళుతూ తన గుర్రాన్ని మిత్రుడికిచ్చి ‘‘నేను వచ్చే వరకు నా గుర్రాన్ని జాగ్రత్తగా చూసుకో’’ అని చెప్పాడట. ఇక ఆ రోజు నుంచి ఆ గుర్రాన్ని ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించాడట సదరు మిత్రుడు. గుర్రాన్ని పరుగెత్తించడం కోసం చీటికీ మాటికీ దాన్ని తంగేడు బరిగెతో చావబాదేవాడట! ఊరికి వెళ్లి వచ్చిన ఆసామి దీనస్థితిలో ఉన్న తన గుర్రాన్ని చూసి ఘొల్లుమన్నాడట. నాటి నుంచీ... మనది కాదు కదా, తేరగా వచ్చింది కదా అని ఇతరుల వస్తువులు లేదా సొమ్మును విచ్చలవిడిగా ఉపయోగించడం లేదా దుర్వినియోగం చేసిన సందర్భాల్లో ఈ జాతీయాన్ని వాడుతున్నారు.
నంబీ నంబీ నా పెళ్లికేం చేస్తావు?
పూర్వం ఒక ఊళ్లో ఒకాయన ఉండేవాడట. ఇతడిని చూస్తే చాలు ఊరివాళ్లు జడుసుకునేవారట. దీని అర్థం... అతను బలవంతుడు, రౌడీ అని కాదు. ఆయనగారు ఎదురొస్తే ఏ పనీ కాదని! ఎందుకో తెలీదు కానీ... ఆ వ్యక్తి ఎదురొస్తే ఏ పని కూడా సవ్యంగా జరిగేది కాదట. దాంతో పని మీద వెళ్లేటప్పుడు అతగాడు ఎదురుపడితే ఆగిపోయేవారట.
ఓసారి అతని దగ్గరకు ఓ పేదవాడు వచ్చాడట. తన పెళ్లి ఖర్చుల కోసం తలా కొంత అడుగుతూ వస్తున్న అతను- ‘‘నంబీ నంబీ నా పెళ్లికేం సహాయం చేస్తావు?’’ అని ఇతణ్ని అడిగాడు. అప్పుడతను-‘‘నీ పెళ్లికి ఎదురురాను ఫో’’ అన్నాడట. ఇంతకు మించిన సహాయం ఏముంటుంది అనుకున్నాడట ఆ పెళ్లికొడుకు!
కొందరు పనిలో పాలు పంచుకోకపోయినా ఎలాంటి సమస్యా ఉండదు. కానీ పాలు పంచుకుంటే మాత్రం... ఆ పని జరగకపోగా రకరకాల సమస్యలు ఎదురవుతాయి. వాళ్లు ఏ పనిలోనూ వేలు పెట్టకపోవడమే పెద్ద సహాయం. అలాంటి వాళ్లను ఉద్దేశించి వాడే జాతీయం ఇది.