వడ్లగింజలో బియ్యపుగింజ!
‘అప్పటి నుంచీ తెగ మాట్లాడుకుంటున్నారు... ఏమిటి విశేషం?’
‘విశేషమా పాడా! వడ్లగింజలో బియ్యపుగింజ!’
‘ఏదో చెబుతాడని వెళితే ఏమీ లేదు. వడ్లగింజలో బియ్యపుగింజ.’
ఇలాంటి మాటలు మనకు తరచుగా వినిపిస్తూనే ఉంటాయి. ఒక విషయంలో కొత్తదనం లేనప్పుడు, ప్రాధాన్యత లేనిదైనప్పుడు ఉపయోగించే జాతీయమే ఈ ‘వడ్లగింజలో బియ్యపుగింజ’.
వడ్లగింజ మీద పొట్టు ఉంటుంది.
ఆ పొట్టు తీస్తే లోపల బియ్యపు గింజ ఉంటుంది. ఇదేమీ కొత్త విషయం కాదు. అందరికీ తెలిసిందే. అయితే వెనకటికో వెంకయ్య ‘ఒక రహస్యం చెబుతాను’ అని తన మిత్రుడిని ఇంటికి పిలిచాడట. ఈ మిత్రుడు ఎలాంటి వాడంటే చీమ చిటుక్కుమన్నా... ‘ఏదో జరిగింది’ అంటూ ఆరా తీసే అతి ఆసక్తికరుడు. మరి అలాంటివాడు రహస్యం అంటే ఊరుకుంటాడా! ఉరుకులు పరుగుల మీద వెంకయ్య ఇంటికి వెళ్లాడు.
తీరా వెళ్లాక ఆ వెంకయ్య ఈ మిత్రుడి చెవిలో చెప్పిన రహస్యం ఏమిటంటే-
‘‘నీకో విషయం తెలుసా. బియ్యపు గింజ ఎక్కడ నుంచి వస్తుందో నాకు తెలిసిపోయింది. వడ్లగింజ పొట్టు ఒలిచేస్తే బియ్యపుగింజ బయట పడుతుంది’’ అన్నాట్ట. అప్పట్నుంచీ ఆ మాట వాడుకలోకి వచ్చింది.
మీది పిట్టలకు పులుసు కాసినట్లు!
పని పూర్తిగా చేయకుండానే చేసేశామనే మానసిక స్థితిలో ఉండేవారి గురించి వాడే జాతీయం ఇది.
ఒక వేటగాడు తన భార్యను పిలిచి - ‘‘పిట్టమాంసంతో పులుసు కాయి’’ అని ఆర్డర్ వేశాడట. ‘‘పిట్టేది? మాంసం ఏది?’’ అని భార్య అమాయకంగా అడిగింది.
‘‘అదిగో ఆకాశంలో ఎగురుతున్నాయి చూడు. ఇలా వెళ్లి అలా కొట్టుకొస్తాను. ఈలోపు పులుసు పొయ్యి మీద పెట్టు’’ అని చెప్పాడట.
తీరా భార్య పులుసు కోసం ఏర్పాట్లు చేసేసరికి వేటగాడు మాత్రం ఉత్త చేతులతో తిరిగి వచ్చాడు! ఇలాగే కొందరు ఏదేదో చేసేస్తాం అని డంబాలు పలుకుతారు. కానీ చేసేదేమీ ఉండదు. అలాంటి వారి గురించి వాడే మాట ఇది!
కంచంత కాపురం!
ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఎక్కువగా ఉండేవి. దాంతో ఇల్లు పిల్లా పాపలతో సందడి సందడిగా ఉండేది. నాన్న, పెదనాన్న, చిన్నాన్న, అమ్మ, పెద్దమ్మ, చిన్నమ్మ, తాతయ్య, అమ్మమ్మ... ఇలా అందరూ ఒక ఇంట్లోనే ఉండేవాళ్లు. ఇలాంటి ఇళ్లలోకి అడుగు పెడితే రోజూ పండగ వాతావరణం కనిపించేది.
దీంతో పిల్లలు, పెద్దలు కూడా ఎలాంటి మానసిక సమస్యలూ లేకుండా ఉండేవాళ్లు. పిల్లలందరినీ కూర్చోబెట్టుకొని పెద్దలు వెన్నెల రాత్రులలో కథలు చెప్పేవారు. అవి కథలు మాత్రమే కాదు... జీవితానికి మార్గదర్శకాలు. ఇలాంటి పెద్ద కుటుంబాన్ని ‘కంచంత కాపురం’ అనేవారు. కంచి అనేది తీర్థస్థలం. ఎప్పుడూ జనాలతో సందడి సందడిగా ఉంటుంది. తీరిక అనేదే లేదన్నట్లుగా ఉంటుంది. పెద్ద కుటుంబాలు కూడా అంతే కదా! అందుకే ఆ కుటుంబ స్థాయిని చెప్పడానికి ‘కంచంత కాపురం’ అంటుంటారు.
కూరగాయ కవి!
‘‘నీకేమయ్యా మాంచి కవివి. కవిత్వాలు రాసి రాసి బోలెడు సంపాదించి ఉంటావు.’’
‘‘సంపాదనా పాడా? నేను కూరగాయ కవిని.’’
ఈ సంభాషణ వింటే, కూరగాయ కవా అని ఆశ్చర్యం వేస్తుంది. అసలా మాటకు అర్థం ఏమిటి?
వెనకటికో కవిగారు కొత్తగా పెళ్లి చేసుకున్నారు. కొన్ని రోజుల తరువాత కూతుర్ని చూసి వెళదామని ఆయన మామగారు వచ్చారు. ‘‘ఏమ్మా... అల్లుడు గొప్ప కవి కదా, సంపాదన బాగానే ఉంటుందా?’’ అని కూతురిని అడిగాడు. ‘‘మీ అల్లుడు కవిత్వం చెప్పి సంపాదించిన డబ్బు కూరగాయలు కొనడానికి మాత్రమే సరిపోతోంది. అన్నీ అప్పులే’’ అని భోరుమంది కూతురు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి, కవిగారు కాస్తా కూరగాయ కవి అయ్యాడు! అప్పట్నుంచీ ఈ మాట వాడుకలోకి వచ్చింది. ప్రతిభకు తగిన ఆదరణ దొరకనప్పుడు ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు.
మన జాతీయాలు
Published Sat, Nov 14 2015 11:29 PM | Last Updated on Fri, Jul 27 2018 2:18 PM
Advertisement
Advertisement