పులి మీసాలు మెలి పెట్టినట్లు....
సాధ్యమయ్యే పనేమిటో, అసాధ్యమయ్యే పనేమిటో తెలుసుకోవడానికి... పనిలోకి పూర్తిగా దిగనక్కర్లేదు. మొదలు పెట్టకముందే తెలిసిపోతుంది. అలాంటి సందర్భాల్లో ఉపయోగించే జాతీయం ఇది. ‘ఆ పని చేయడం అంత సులభం అనుకుంటున్నావా? పులి మీసాలను మెలేయడం లాంటిది’ అంటుంటారు కొందరు. ‘పులి మీసాలను మెలేయడం లాంటి ప్రమాదకరమైన పనిని ఎంచుకున్నావు!’ అంటారు మరికొందరు.
రకరకాల సందర్భాల్లో ప్రమాద తీవ్రతను తెలియజేయడానికి, ఒక పనిలోని సాధ్యాసాధ్యాల గురించి హెచ్చరించడానికి ఈ మాట వాడుతుంటారు. పులిని దూరం నుంచి చూడాలంటేనే భయం. దగ్గరికి వెళ్లి చూడాలంటే మరీ భయం. ఒకవేళ చచ్చీ చెడీ దగ్గరకు వెళ్లినా... సాహసించి దాని మీసాలు మెలేయగలమా? అది అసాధ్యం కదా! ఇలాంటి అసాధ్యమైన, దుస్సాహసమైన పనుల విషయంలో ఉపయోగించే జాతీయమే ఇది.
ఏనుగు నిద్ర!
నిద్ర అంటే రెండు కళ్లూ మూసుకోవడం కాదు. నిద్ర పోవడం అంటే, ఆ సుఖంలో ప్రపంచాన్ని పూర్తిగా మరిచిపోవడం. అలసిన శరీరాన్ని, మనసును ఉత్తేజితం చేయడం. కొందరు సుఖంగా నిద్రపోతారు. అది వారి అదృష్టం. దురదృష్టం కొద్దీ కొందరు అనారోగ్య సమస్యల వల్ల సుఖంగా నిద్రపోలేరు.
ఇక మూడో కోవకు చెందినవారు... సుఖంగా నిద్రపోయే అవకాశం ఉన్నా... ఏవేవో ఆలోచనలు, అకారణ భయాలతో బుర్ర పాడుచేసుకొని నిద్రకు దూరం అవుతారు. నిద్రకు, మెలకువకు మధ్య ఊగిసలాడుతుంటారు. ఇలాంటి వారిని ఉద్దేశించి వాడే జాతీయం ఇది.
వెనకటికొక ఒక ఏనుగు సింహంతో తగాదా పెట్టుకుందట. ఆ తర్వాత అది భయంతో సరిగ్గా నిద్రపోయేది కాదట. తాను నిద్ర పోవడం చూసి సింహం ఎక్కడ చంపేస్తుందోనని వణికిపోయేదట. ఒకవేళ నిద్ర వచ్చినా, ఎందుకైనా మంచిదని ఒక కన్ను తెరిచి నిద్రపోయేదట. పేరుకు నిద్రపోతున్నా... సరిగ్గా నిద్రపోకుండా అవస్థపడే వాళ్లను ఉద్దేశించి ఉపయోగించే జాతీయం ఇది.
కోటికి పడగెత్తడం!
ఇప్పడు దేశాలకు, రాజకీయ పార్టీలకు, వివిధ సంస్థలకు సొంత అజెండా, జెండా ఉన్నట్లే... పూర్వకాలంలో కోటీశ్వరులకు కూడా సొంత జెండాలు ఉండేవట. ఇతరులతో పోల్చితే తాము ఆర్థికంగా అత్యంత మెరుగైన స్థితిలో ఉన్నామని, తాము కోటీశ్వరులమని గొప్పగా చెప్పుకోవడానికి ఇంటి మీద జెండాను ఎగరేసేవారట (జెండాకి బావుటా, పడగ అనే పర్యాయ పదాలు కూడా ఉన్నాయి). దాంతో వాళ్లను కోటికి పడగెత్తిన వాళ్లు అనేవారట!
ఇక్కడ జెండా అనేది వారి ఉన్నత ఆర్థిక హోదాకు చిహ్నం. ఆ ఇంటివారు ఆర్థికంగా ఏ స్థితిలో ఉన్నారో చెప్పుకోవడానికి వారి ఇంటి మీద ఎగిరే జెండాను చూస్తే చాలు. ఆర్థిక దర్పాన్ని ప్రతిబింబించే ఈ సంప్రదాయం కాలగర్భంలో కలిసిపోయినప్పటికీ... కోటికి పడగెత్తడం అనే జాతీయం మాత్రం ఇప్పటికీ సజీవంగా ఉంది.
ముదిమాను చేవ
వయసు పెరుగుతున్న కొద్దీ చెట్టు విశాలమవుతుంది. బలమైనదవుతుంది. నలుగురికి నాలుగు రకాలుగా ఉపయోగపడేలా తయారవుతుంది. వయసు మీద పడిన వ్యక్తులు కూడా అంతే. వారి అనుభవ జ్ఞానం విలువైనది. ఏ పుస్తకాల్లోనూ, శాస్త్రాల్లోనూ దొరకనిది. ఆ జ్ఞానం వారి మాటల్లో తరచుగా దొర్లుతుంటుంది.
సంక్షోభ సమయంలో, ఏ దారి ఎంచుకోవాలో తెలియని అయోమయ స్థితిలో వారి సలహాలు దారి చూపుతాయి. అందుకే పెద్దల మాట చద్ది మూట అంటారు. పెద్దల మాటల విలువను గుర్తు తెచ్చే సందర్భంలో ఉపయోగించే జాతీయం ఇది.
మన జాతీయాలు (25-10-2015)
Published Sun, Oct 25 2015 1:01 AM | Last Updated on Sun, Sep 3 2017 11:25 AM
Advertisement
Advertisement