రామబాణం!
రాముడు మహా వీరుడు. ఆయన తన బాణం వేస్తే గురి తప్పడం అంటూ జరిగేది కాదు. అందుకే ‘రాముడు మాట తప్పడు, గురి తప్పడు’ అంటుంటారు. రామబాణానికి ఉన్న విశేషం ఏమిటంటే, వరుసగా ఏడు తాటిచెట్లను పడగొట్టే శక్తి దానికుంటుందట. అలాగే... ఆయన వేసిన బాణం, పాతాళలోకం దాకా వెళ్లి తిరిగి వచ్చి మళ్లీ ఆయన అమ్ముల పొదిలో చేరుతుందట.
ఇది వాస్తవమా? కావ్య అతిశయోక్తా అనేదాన్ని పక్కన పెడితే... జనాలు ‘రామబాణం’ అనే మాటను ‘తిరుగులేని మాట’ అనేదానికి పర్యాయపదంగా వాడుతుంటారు.
‘ఆయన మాట ఇవ్వడు. ఇస్తే మాత్రం తిరుగులేదు. అది రామబాణమే’ అని అంటుంటారు.
విలువిద్య కౌశలానికి సంబంధించి....‘ఎలాంటి పరిస్థితుల్లోనూ లక్ష్యాన్ని చేధిస్తాడు’ అని చెప్పడానికైనా, నైతికతకు సంబంధించి ‘ఆరు నూరైనా నూరు ఆరైనా మాట తప్పడు’ అని చెప్పడానికైనా ఈ జాతీయాన్ని వాడుతుంటారు.
ఏనుగు మీద ఎలుక!
‘‘బాబోయ్... ఈ పని భారం మోయలేక పోతున్నాను’’
‘‘చాల్లే... ఏనుగు మీద ఎలుకను పెట్టినట్లుగా ఈ పని అప్పగించాం. అసలు నీ శక్తితో పోల్చితే ఈ పని ఎంత చిన్నదని!’’ ఇలాంటి మాటలు వినే ఉంటారు కదా!
ఏమాత్రం కష్టం కానీ, భారంగా కానీ అనిపించని పని విషయంలో వాడే జాతీయం ఇది. ఏనుగు మీద ఎలుక కూర్చుంటే, ఏనుగుకు భారమని అనిపిస్తుందా! లేదు కదా! అందుకే నీకా పని భారం కాదు అనడానికి ఈ పోలిక.
కుక్కొచ్చింది... ఉట్టి తెగింది!
యాదృచ్ఛికంగా అదృష్టం కలిసి వచ్చి, పని సులభమయ్యే సందర్భాల్లో వాడే మాట ఇది.
ఒక కుక్క బాగా ఆకలితో ఒక ఇంట్లోకి దూరింది. పైన ఉట్టి తప్ప ఏమీ కనిపించలేదు. ఆ ఉట్టిలో ఏదైనా ఉందేమోనని దాన్ని అందుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేసింది. చివరికి విఫలమై తిరుగుముఖం పట్టింది. సరిగ్గా ఆ సమయంలోనే ఇంకో కుక్క ఇంట్లోకి దూరింది.
దాని అదృష్టం ఎలా ఉందంటే, అది ఇంట్లో అడుగుపెట్టే సమయానికి ఉట్టి తాడును ఓ ఎలుక కొరికింది. దాంతో ఉట్టి తెగి కిందపడింది. ‘ఆహా, ఏమి నా అదృష్టం’ అనుకుంటూ ఆ కుక్క హాయిగా పొట్ట నింపుకుంది. అలా ఈ కథ నుంచి పుట్టిందే ‘కుక్కొచ్చింది... ఉట్టి తెగింది’ అనే జాతీయం. కొందరు ఎంత కష్టపడినా ఫలితం చేతికి అందదు. కొందరికి మాత్రం అస్సలు కష్టపడకుండానే అన్నీ కలిసొస్తాయి. అప్పటికప్పుడు అదృష్టం తలుపు తట్టి లబ్ధి పొందుతుంటారు. వారి గురించి చెప్పేదే ఈ మాట.
తోక పద్యం!
‘అయ్య బాబోయ్ తోక పద్యం మొదలుపెట్టాడు. ఇక్కడి నుంచి జారుకుంటే మంచిది.’ ‘తోక పద్యం చదవడం కాదు... ఏదో ఒకటి తేల్చు.’ ఇలాంటి మాటలు నిత్యజీవితంలో తరచూ వినిపిస్తుంటాయి.
అర్థం, పరమార్థం అనేది లేకుండా కొందరు, చెప్పిన విషయాన్నే మళ్లీ మళ్లీ చెప్పి విసుగిస్తుంటారు. ఇక కొందరేమో... ఒక సమస్య గురించి మాట్లాడుతుంటారే గానీ ఒక పట్టాన తేల్చరు. నాన్చుతూనే ఉంటారు. ఇలాంటి సందర్భాల్లో ఉపయోగించే జాతీయమే ఈ తోకపద్యం.
నిజానికి తోక పద్యం అనేది కల్పిత పదం కాదు. అది ఒక సాహిత్య ప్రకియ.
ఒకరు ఒక పద్యం చెప్పడం పూర్తవ్వగానే, వేరొకరు చివరి పదంతోగానీ, చివరి అక్షరంతోగానీ ఒక పద్యం చెప్పాలి. అలా అని అప్పటికప్పుడు సొంత పద్యాలేమీ చెప్పకూడదు. గతంలో కవులు రాసిన పద్యాలను మాత్రమే చదవాలి. పద్యం పూర్తయిన తరువాత అది ఏ పుస్తకంలో ఉంది, కవి ఎవరు తదితర వివరాలు కూడా చెప్పాలి.
ఇలా తోకపద్యం అనేది వినోద సాహిత్య ప్రక్రియ మాత్రమే కాదు, పద్యజ్ఞానాన్ని, జ్ఞాపకశక్తి, ధారణ తదితర విషయాలను పరీక్షించేది కూడా. అయినప్పటికీ జాతీయం విషయానికి వచ్చేసరికి మాత్రం... ఏదీ తేల్చకుండా, అభిప్రాయం తెగేసి చెప్పకుండా సాగతీసే సందర్భాల్లో ‘తోక పద్యం’ అన్న మాటను వాడడం పరిపాటిగా మారింది!
మన జాతీయాలు
Published Sun, Dec 6 2015 2:17 AM | Last Updated on Sun, Sep 3 2017 1:33 PM
Advertisement
Advertisement