తోట దాటిన పరిమళం | Pass the perfume garden | Sakshi
Sakshi News home page

తోట దాటిన పరిమళం

Published Sun, Aug 17 2014 12:15 AM | Last Updated on Sat, Sep 2 2017 11:58 AM

తోట దాటిన పరిమళం

తోట దాటిన పరిమళం

సత్వం:  తన మాజీ ప్రేమికుడికి రాసిన ఉత్తరంలో ప్రేమిక అడుగుతుంది: ‘నా సామాన్లు కొన్ని నీ దగ్గర ఉండిపోయాయి... వాటిని తిరిగి పంపించు’. (‘ఇజాజత్’- మేరా కుచ్ సామాన్) ఈ పాటకు ఆర్డీ బర్మన్ ట్యూన్ చేస్తూ, ‘ఈయన, తర్వాత కిరాణా కొట్టు జాబితాతో కూడా పాట రాస్తా’డని ప్రేమగా విసుక్కున్నాడట. కానీ అదేపాట ఆ యేడు(1987) జాతీయ ఉత్తమగీతం అయింది, ఆశాభోంస్లేను జాతీయ ఉత్తమగాయనిని చేసింది. గుల్జార్ నిక్షిప్తం చేసే సూక్ష్మ వివరాలు అట్లాంటివి! ‘పంచమ్’కు మాత్రం తెలీదా! ఒకే గొడుగుకింద ఇరువురు పంచుకున్న జ్ఞాపకాల తడిని- అతడు ఏంచేసీ తిరిగివ్వలేడనీ! భౌతికమైన వస్తువుల మీదుగానే వాటిని మించిపోయే భావాన్ని ‘గుల్జార్ సాబ్’ కల్పించగలడనీ! ‘తోట’ అని అర్థాన్నిచ్చే కలంపేరును స్వీకరించిన అదే గుల్జార్- ‘ఆంధీ’లో అంటాడు: ‘ఈ పూలకొమ్మల్ని చూశావా? అవి నిజానికి అరబ్బీలో రాసిన ‘ఆయతులు’(చరణాలు)’. కాంతిబిందువులు చిలకరించే పన్నీరు; వర్షపు రాతిరి శుభ్రపడే హృదయం; చూపులు పలికే కంటిపాపల గీతం; ఆకాశం కింద, ఒక మూలకు ఒదిగి పడుకునే పేదవాడి దైన్యం; తిరిగి మళ్లీ ఎదురుచూడవలసిన ఒంటరి సాయంకాలం; పగటిని రాత్రిగా మారిపొమ్మనే విరహపు మారాం; రాకముందే వెళ్లిపోవాల్సిన చేదునిజం;
 
అతి సున్నితమైనదేదో, హృదయం ద్రవించేదేదో బొమ్మ కడుతుంది ఆయన పాటల్లో. అలాగని, మార్దవమో, గంభీరతో మాత్రమే గుల్జార్ చిరునామా కాదు. ‘కజ్రా రే’, ‘ఛయ్య ఛయ్య’, ‘జై హో’(రహమాన్‌తో కలిసి ఆస్కార్ అందుకున్న పాట) పుట్టించే హుషారును ఎలా కాదనగలం! ‘ఒక పాట పాపులర్ అయినంతమాత్రాన, అది అల్పమైనది కానక్కర్లేదు,’ అంటాడాయన. పొద్దుట పూజగదిలోంచి వినవచ్చే శ్లోకం, పాలబ్బాయి మోగించే సైకిల్ గంట, భిక్షాటన చేస్తూ పాడుకునే పకీరు, ఇల్లాలి లల్లాయి పదాలు... వీటన్నిటా సంగీతాన్ని ఆస్వాదిస్తాడు.
 
కవిత్వాన్ని వదిలేసి, కేవలం ఆయన దర్శకత్వాన్ని పరిగణించినా గుల్జార్ ఇచ్చింది చాలా చాలా ఎక్కువ! కోషిష్, పరిచయ్, అచానక్(1973-పాటల్లేని సినిమా), మౌసమ్, ఖుష్బూ, ఆంధీ(1975-అత్యవసర పరిస్థితిలో ఇందిరాగాంధీ ప్రభుత్వం నిషేధించిన సినిమా), కితాబ్, కినారా, మీరా, నమ్‌కీన్, ఇజాజత్, లిబాస్, లేకిన్, మాచిస్(1996-పంజాబ్ అలజడుల నేపథ్యంలోని ప్రేమకథ), హు తు తు(1999-రాజకీయనాయకుల కపటానికి వాళ్ల పిల్లలే ఎదురునిలిచే సందర్భం)... తీక్షణమైన, అర్థవంతమైన, ఉద్వేగమిళితమైన సినిమాలాయనవి!
 
సార్వత్రికమైనదేదో పట్టుకోవడానికి ఆయన ప్రయత్నిస్తాడు. మనుషుల మధ్య, జాతుల మధ్య, మతాల మధ్య ఉండాల్సిన సామరస్యం గురించి మాట్లాడుతాడు. మనుషులుగా పరస్పరం పొదువుకోవాల్సిన అవసరాన్నీ, బంధాలకు పొదుగుకోవాల్సిన అందాన్నీ, వాటిల్లోంచి పొందగలిగే రసాన్నీ ఆయన ఆవిష్కరిస్తాడు. కవీ, కథకుడూ, అనువాదకుడు కూడా అయిన గుల్జార్- ‘బోస్క్‌యానా’గా నామకరణం చేసుకున్న తన ఇంటిని (కూతురు మేఘనను బోస్కీ అని పిలుస్తాడు)  పుస్తకాలు, పెయింటింగ్స్‌త అలంకరించాడు; మదినేమో మీర్జా గాలిబ్, గౌతమబుద్ధులతో!
 
దేశవిభజనకు ముందు రావల్పిండి దగ్గరి దీనాలో సంపూర్ణసింగ్ కల్రాగా 1936 ఆగస్టు 18న జన్మించాడు. చిన్నప్పుడు వాళ్లనాన్నకు ఆయన ‘పున్ని’. చిక్కటి స్మృతుల్ని హృదయంలో నింపే బాల్యాన్ని అక్కడ గడిపాడు. నలుగురూ వచ్చీపోయే ఇంటి వసారా, ఒంటికాలితో కుంటుతూ పరుగెత్తిన గల్లీలు, చిట్టచివర కూర్చుని చదువుకున్న బడి... వెనక్కి జార్చుకుని సరిహద్దు దాటాడు. అందుకే, ఆయనకు చిన్నతనం అంటే ఆనందం, విషాదం కూడా. గాలిబ్ వేడుకొన్నట్టుగా ఆయనా ప్రార్థిస్తాడు: బాధాకరమైన గతపు స్మృతుల్ని మరిచిపోయేలా, ఓ దేవుడా, నాకు మరపునైనా ఎందుకు ప్రసాదించవూ!

భారత్-పాక్ సంబంధాలు దెబ్బతిన్నప్పుడు, ‘కళ్లకు వీసాలు అక్కర్లేదు; కలలకు హద్దులు లేవు; కళ్లు మూసుకుని నేను సరిహద్దు దాటతాను,’ అని పాడుకున్నాడు. ఆయన పుట్టినరోజును ఇప్పటికీ లాహోర్‌లో జరుపుకునే స్నేహితులున్నారు. తను చదివిన స్కూల్లో ‘గుల్జార్ కల్రా బ్లాక్’ పెట్టారు. 70 ఏళ్ల తర్వాత తన స్వగ్రామానికి వెళ్లినప్పుడు గుండెబరువెక్కి ఆయన కళ్లు తడిసిపోయాయట! ‘ప్రేమలో కూడా బాధుంటుంది; జీవితంలో బాధ కూడా భాగమే’! ఆ బాధతో కూడా సౌకర్యంగా ఉండగలగాలి!
 
చాయ్, కింగ్స్, సింగిల్ మాల్ట్, టెన్నిస్, మనవడు సమయ్, విడిగావుంటూ విడాకులు తీసుకోని ‘రాఖీ’ బంధం, ఆమె ఏ ఆదివారమో వండుకొచ్చే  పసందైన చేపలకూర... సాహిత్య అకాడెమీ, పద్మభూషణ్, ఆస్కార్, గ్రామీ, దాదాసాహెబ్ ఫాల్కే... ఇట్లాంటి కొన్ని పదాల్ని వాడి, ఆయన్నొక పాట రాసిమ్మనాలి. కాకపోతే, మరీ ‘ఆత్మగీతం’ అవుతుందని ఆయన ఒప్పుకుంటాడో లేదో!
 ‘బంధాలంటే  ఒక దగ్గర జీవించడం, ప్రతిరోజూ కలవడం తప్పనిసరి కాదు; ఆ అవసరంలేని బంధాలు కూడా కొన్ని అలా ఏర్పడిపోతాయి’. గుల్జార్ అలాంటి ఒక బంధువేతర బంధువు!

 ఈ పూలకొమ్మల్ని చూశావా?
 అవి నిజానికి అరబ్బీలో రాసిన
 ‘ఆయతులు’(చరణాలు).
 - గుల్జార్
 - ఆర్.ఆర్.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement