ఏ వృత్తిలో అయినా పోటీ సహజం. అలా వాణీ జయరామ్ బాలీవుడ్‌కి తన వాణి వినిపించడానికి వెళ్లినప్పుడు అప్పటికే అక్కడ ‘స్టార్ సింగర్స్’గా వెలుగుతున్న అక్కచెల్లెళ్లు లతా మంగేష్కర్, ఆశా భోంస్లేల నుంచి గట్టి పోటీ ఎదురైంది. హిందీ చిత్రం ‘గుడ్డి’ (1971)లో పాడిన ‘బోలె రే పపీ హరా..’ పాట ద్వారా బాలీవుడ్‌కి పరిచయమై ‘మధురమైన కంఠం’ అని శ్రోతల నుంచి కితాబులు అందుకున్నారు వాణీ జయరామ్. అయినప్పటికీ ఆ తర్వాత పెద్దగా అవకాశాలు రాలేదు. లత, ఆశాలు వాణీకి అవకాశాలు రాకుండా చేశారనే ఓ టాక్ ఇప్పటికీ ఆ నోటా ఈ నోటా వినిపిస్తుంటుంది.
(చదవండి: మూగబోయిన వాణి)
ఇదే విషయం గురించి ఓ ఇంటర్వ్యూలో వాణీ జయరామ్ మాట్లాడుతూ – ‘‘కెరీర్ పరంగా నేను ఎవరి పేర్లూ ఉద్దేశించి మాట్లాడను. లతాజీ, ఆశాజీ గొప్ప గాయనీమణులు. వాళ్లు నాకేమైనా చేశారా? చేయలేదా? అనే విషయం గురించి నేను మాట్లాడను. ఒకరు ఏం చేశారనే విషయంపై నేను ఓ నిర్ణయానికి రాకూడదు. అయితే హిందీలో నేను విజయాలు సాధించినప్పటికీ నన్ను పెద్దగా పట్టించుకోలేదు. అది దురదృష్టం. అలా ఎవరికీ జరగకూడదు’’ అని పేర్కొన్నారు. ఇదే సమయంలో ఆమె గాయనీమణులు శంషాద్ బేగం, సుమన్ కల్యాణ్‌పూర్‌ల పేర్లను ప్రస్తావించారు. ‘‘శంషాద్, సుమన్‌లు మంచి సింగర్స్ అయినప్పటికీ అనుకున్నంతగా రీచ్ కాలేకపోయారు. ఇలా ఎందరికో జరిగి ఉండి ఉంటుంది. వారిలో నేను ఒకదాన్ని... అంతే. అయితే ఇలా జరగడానికి ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది’’ అని కూడా వాణి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment