Asha Bhosle
-
యుగళధారతో మ్యూజిక్ థె‘రఫీ’
రఫీ సోలోలు వేన వేలు... వాటికి అభిమానులు ఉన్నారు. రఫీ డ్యూయెట్లు వేలకు వేలు... వాటికీ అభిమానులు ఉన్నారు. ఈ స్వీటు కావాలా ఆ జున్ను కావాలా అంటే చాయిస్ ఏమైనా ఉంటుందా ఎవరికైనా? రెండూ కావాలి. కాని రఫీతో డ్యూయెట్లు పాడి సరిజోడుగా నిలిచి సంగీతాభిమానులను మెప్పించిన అద్భుత గాయనీమణులను రఫీతో పాటు స్మరించుకోవాలి. డిసెంబర్ 24 రఫీ శతజయంతి. మరి ఆయనతో కలిసి పాడుదామా యుగళగీతం.లాహోర్ నుంచి ఒక అన్నను తోడు చేసుకుని బాంబేకు బయలుదేరిన రఫీ (Mohammed Rafi) తాను గాయకుడిగా బతకాలంటే ముందు సంగీత దర్శకుణ్ణి మెప్పించాలని తెలుసుకున్నాడు. ఆ రోజుల్లో నౌషాద్ చాలా పెద్ద డిమాండ్‌లో ఉన్నాడు. కాని ఆయనను నేరుగా కలిసే శక్తి రఫీకి లేదు. అందుకని అన్నాదమ్ములు ఆలోచించి నేరుగా లక్నో వెళ్లారు. అక్కడ నౌషాద్ తండ్రి ఉంటారు. ఆయన దగ్గర సిఫార్సు ఉత్తరం తీసుకుని బాంబే తిరిగి వచ్చి అప్పుడు నౌషాద్‌ను కలిశారు. ‘లాహోర్ నుంచి వచ్చావా? పాడతావా? ఏం పాడతావ్... నిన్ను వద్దనడానికి లేనంత పెద్ద రికమండేషన్ తెస్తివి’ అని నౌషాద్ రఫీని పరికించి చూసి తన టీమ్‌లోకి తీసుకున్నాడు. అప్పటికి తలత్ ఊపు మీదున్నాడు. అయినా సరే ‘దులారీ’ (1949)లో రఫీ పాడిన సోలో ‘సుహానీ రాత్ ఢల్ చుకీ నా జానే తుమ్ కబ్ ఆవొగే’ పాట పెద్ద హిట్ అయ్యి రఫీ దేశానికి పరిచయం అయ్యాడు. అయినప్పటికీ రావలసినంత పేరు రాలేదు. అప్పుడు నౌషాదే ‘బైజూ బావరా’ (1952)లో మళ్లీ పాడించాడు. ఆ సినిమాలో రఫీ పాడిన సోలో పాటలు ‘ఓ దునియాకే రఖ్వాలే’, ‘మన్ తర్పత్ హరి దర్శన్ కో ఆజ్’ పాటలు ఇక రఫీని తిరుగులేని గాయకుని స్థానంలో కూచోబెట్టాయి. రఫీ రేంజ్‌ను తెలిపిన పాటలు అవి. అయితే అప్పటికే నూర్జహాన్ పాకిస్తాన్ వెళ్లిపోగా ప్రతిభను, ప్రొఫెషనలిజాన్ని నిలబెట్టుకుంటూ లతా మంగేశ్కర్ ‘మహల్’ (1949)లో ‘ఆయేగా ఆయేగా ఆనేవాలా ఆయేగా’ పాటతో స్థిరపడింది. రఫీ, లతా తొలి పాట కామెడీ సాంగ్ అయినా ఆ తర్వాత వారి డ్యూయెట్లు సరైన రొమాంటిక్ టచ్‌ను అందుకున్నాయి. అందుకు ‘బైజూ బావరా’లోని ఈ పాటే సాక్ష్యం.తూ గంగాకి మౌజ్ మై యమునా కా ధారహో రహేగా మిలన్ యే హమారా హోహమారా తుమ్హారా రహేగా మిలన్...మేల్ సింగర్ కొందరికి సరిపోతాడు.. కొందరికి సరిపోడు అనే ధోరణి ఉంది. రఫీ.. రాజ్‌కపూర్‌కు(Raj Kapoor) మేచ్ కాడు. దిలీప్ కుమార్, దేవ్ ఆనంద్‌లకు బాగా సరిపోయేవాడు. కాని లతాకు ఆ అడ్డంకి లేదు. ఏ హీరోయిన్ గొంతైనా లతా గొంతే. మీనా కుమారి, నర్గిస్, వైజయంతీ మాల, మాలా సిన్హా.. అందరికీ లతా గొంతు. అందువల్ల రఫీ, లతాల పాటలు రాజ్ కపూర్ సినిమాల్లో తప్ప తక్కిన అన్నింటిలో కొనసాగాయి. అందరు సంగీత దర్శకులు సరైన తీపితో తయారైన రవ్వలడ్ల వంటి పాటలను వారి చేత పాడించారు.∙దో సితారోంకా జమీ పర్ హై మిలన్ ఆజ్ కీ రాత్ (కోహినూర్)∙ఓ జబ్ యాద్ ఆయే బహుత్ యాద్ ఆయే (పరాస్మణి)∙దిల్ పుకారే ఆరె ఆరె ఆరె (జువెల్ థీఫ్)∙జిల్ మిల్ సితారోంక ఆంగన్ హోగా (జీవన్ మృత్యు)∙వాదా కర్లే సాజ్నా (హాత్ కీ సఫాయి)..వీటికి అంతే లేదు. రఫీ తన కెరీర్లో షమ్మీ కపూర్‌కు పాడటానికి ఎక్కువ సరదా చూపాడు. వాళ్లిద్దరిదీ హిట్ పెయిర్. షమ్మీ కపూర్ సినిమాలో రఫీ డ్యూయెట్లు ఎక్కువగా ఆశా భోంస్లేకు (Asha Bhosle) వెళ్లినా లతా కూడా పాడింది. రఫీ–లతాల జోడి వెన్నెల–వెలుతురు లాంటిది. ఆ చల్లదనం వేరు.→ ఆశా భోంస్లేవ్యాంప్లకు పాడుతూ మెల్లమెల్లగా కుదురుకున్న గాయని ఆశా రఫీతో కలిసి గొప్ప పాటలు పాడింది. అన్నింటిలోకి కలకాలం నిలిచే పాట ‘అభీ నా జావో ఛోడ్ కర్ కె దిల్ అభీ భరా నహీ’ (హమ్ దోనో). ఈ పాటలో రఫీ బాగా పాడుతున్నాడా ఆశానా అనేది చెప్పలేం. ఓపి నయ్యర్ ఆశా చేత ఎక్కువ పాడించడం వల్ల ‘కశ్మీర్ కి కలీ’లో రఫీతో ‘దీవానా హువా బాదల్’, ‘ఏక్ ముసాఫిర్ ఏక్ హసీనా’లో ‘బహుత్ షుక్రియా బడీ మెహర్బానీ’ వంటి సూపర్హిట్లు సాధించింది. ఆర్.డి.బర్మన్ తన సంగీతంలో రఫీ, ఆశాలను అద్భుతమైన పాటల్లో కూచోబెట్టాడు. ‘ఓ మేరే సోనరే సోనరే సోనరే’ (తీస్రీ మంజిల్), ‘చురాలియా హై తుమ్నే జో దిల్‌కో’ (యాదోంకి బారాత్)... ఒంట్లో నిస్సత్తువను వదలగొట్టే పాటలు.→ గీతా దత్ఎంతో గొప్ప గాయని అయి ఉండి తక్కువ కాలం పాడిన గీతా దత్ (గీతా రాయ్) గురుదత్ సినిమాల్లో రఫీతో మురిపమైన పాటలు పాడింది. ‘సున్ సున్ సున్ జాలిమా’ (ఆర్ పార్), ‘హమ్ ఆప్కే ఆంఖోమే ఇస్ దిల్ కో బసాదేతో’(ప్యాసా) ఇవి రెండు గురుదత్ మీద తీసినవి. ‘సిఐడి’లో దేవ్ ఆనంద్, షకీలా మీద తీసిన ‘ఆంఖోహి ఆంఖోమే ఇషారా హోగయా’..పెద్ద హిట్. గురుదత్ సినిమాల్లో కమెడియన్ జానీ వాకర్‌కు పాటలు ఉంటాయి. జానీ వాకర్‌కు కూడా రఫీనే పాడతాడు. తోడు గీతా దత్. ‘అయ్ దిల్ ముష్కిల్ హై జీనా యహా’ (సిఐడి), ‘జానే కహా మేరా జిగర్ గయా జీ’(మిస్టర్ అండ్ మిసెస్ 55)... ఇవన్నీ దశాబ్దాలైనా నిలిచి ఉన్న పాటలు. రఫీతో పాటు గాయనీమణులు నిలబెట్టిన పాటలు.→ సుమన్ కల్యాణ్పూర్రాయల్టీ విషయంలో లతా మంగేష్కర్‌కు (Lata Mangeshkar) రఫీకు విభేదాలు వచ్చాయి. రాయల్టీ కావాలని లతా, అక్కర్లేదని రఫీ మూడేళ్లు విభేదించి పాడలేదు. 1961 నుంచి 63 వరకు సాగిన ఈ కాలంలో రఫీతో డ్యూయెట్లు పాడిన గాయని సుమన్ కల్యాణ్‌పూర్. ‘పూర్‌మేన్స్ లతా’గా పేరుబడ్డ సుమన్‌కు గొప్ప ప్రతిభ ఉన్నా తక్కువ అవకాశాలు దొరికాయి. అయినా సరే రఫీ, సుమన్ కలిసి మంచి హిట్స్ ఇచ్చారు. వీటిలో ‘బ్రహ్మచారి’ కోసం పాడిన ‘ఆజ్ కల్ తెరె మెరె ప్యార్ కే చర్చే హర్ జబాన్ పర్’, ‘జబ్ జబ్ ఫూల్ ఖిలే’లో ‘నా నా కర్తే ప్యార్ తుమ్హీసే కర్బైఠే’ పెద్ద హిట్స్‌గా నిలిచాయి. ‘రాజ్ కుమార్’లోని ‘తుమ్నే పుకారా ఔర్ హమ్ చలే ఆయే’ కూడా పెద్ద హిట్టే. అయితే లతా, రఫీల మధ్య సంధి కుదరడంతో సుమన్ వెనక్కు వెళ్లిపోయింది.వీళ్లే కాదు ఎందరో గాయనులతో రఫీ డ్యూయెట్స్ పాడాడు. షంషాద్ బేగంతో ‘లేకె పెహలా పెహలా ప్యార్’, ముబారక్ బేగంతో ‘ముజ్కో అప్నే గలే లగాలో’, హేమలతాతో ‘తూ ఇస్ తర్హా మేరి జిందగీమే’... లాంటి ఎన్నో మంచి పాటలు ఉన్నాయి. సుశీలతో ‘ఇద్దరి మనసులు ఒకటాయె’, జానకితో ‘నా మది నిన్ను పిలిచింది గానమై’... ఈ పాటలు అపురూపం. రఫీ ఘనతలో రఫీ ఫ్రతిభకు మరో సగమై నిలిచిన గాయనీమణులందరికీ రఫీ శతజయంతి సందర్భంగా జేజేలు పలకాలి. రఫీకి జిందాబాద్‌లు కొట్టాలి. -
ఆశా భోంస్లే కాళ్లు కడిగిన సింగర్ సోను నిగమ్ (ఫోటోలు)
-
బాలీవుడ్ నటి విద్యాబాలన్‌కు ప్రతిష్ఠాత్మక పురస్కారం (ఫొటోలు)
-
బాలీవుడ్ నటి విద్యాబాలన్‌కు ప్రతిష్ఠాత్మక పురస్కారం (ఫొటోలు)
-
వాళ్లు నన్ను పట్టించుకోలేదు.. అలా ఎవరకీ జరగకూడదు: వాణీ జయరామ్
ఏ వృత్తిలో అయినా పోటీ సహజం. అలా వాణీ జయరామ్ బాలీవుడ్‌కి తన వాణి వినిపించడానికి వెళ్లినప్పుడు అప్పటికే అక్కడ ‘స్టార్ సింగర్స్’గా వెలుగుతున్న అక్కచెల్లెళ్లు లతా మంగేష్కర్, ఆశా భోంస్లేల నుంచి గట్టి పోటీ ఎదురైంది. హిందీ చిత్రం ‘గుడ్డి’ (1971)లో పాడిన ‘బోలె రే పపీ హరా..’ పాట ద్వారా బాలీవుడ్‌కి పరిచయమై ‘మధురమైన కంఠం’ అని శ్రోతల నుంచి కితాబులు అందుకున్నారు వాణీ జయరామ్. అయినప్పటికీ ఆ తర్వాత పెద్దగా అవకాశాలు రాలేదు. లత, ఆశాలు వాణీకి అవకాశాలు రాకుండా చేశారనే ఓ టాక్ ఇప్పటికీ ఆ నోటా ఈ నోటా వినిపిస్తుంటుంది. (చదవండి: మూగబోయిన వాణి) ఇదే విషయం గురించి ఓ ఇంటర్వ్యూలో వాణీ జయరామ్ మాట్లాడుతూ – ‘‘కెరీర్ పరంగా నేను ఎవరి పేర్లూ ఉద్దేశించి మాట్లాడను. లతాజీ, ఆశాజీ గొప్ప గాయనీమణులు. వాళ్లు నాకేమైనా చేశారా? చేయలేదా? అనే విషయం గురించి నేను మాట్లాడను. ఒకరు ఏం చేశారనే విషయంపై నేను ఓ నిర్ణయానికి రాకూడదు. అయితే హిందీలో నేను విజయాలు సాధించినప్పటికీ నన్ను పెద్దగా పట్టించుకోలేదు. అది దురదృష్టం. అలా ఎవరికీ జరగకూడదు’’ అని పేర్కొన్నారు. ఇదే సమయంలో ఆమె గాయనీమణులు శంషాద్ బేగం, సుమన్ కల్యాణ్‌పూర్‌ల పేర్లను ప్రస్తావించారు. ‘‘శంషాద్, సుమన్‌లు మంచి సింగర్స్ అయినప్పటికీ అనుకున్నంతగా రీచ్ కాలేకపోయారు. ఇలా ఎందరికో జరిగి ఉండి ఉంటుంది. వారిలో నేను ఒకదాన్ని... అంతే. అయితే ఇలా జరగడానికి ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది’’ అని కూడా వాణి అన్నారు. -
మోదీకి లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డు
ఆదివారం జరిగిన తొలి లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డు ప్రదానోత్సవంలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ముంబైకి వచ్చారు. ఈ అవార్డు ప్రదానోత్సవంలో మోదీకి తొలి లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డు లభించింది. ఆయన అవార్డును అందుకున్న తర్వాత కొంతసేపు ఉద్వేగానికి లోనయ్యారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ...లతా దీదీ నాకు అక్కలాంటిది. ఆమె నుంచి నేను ఎనలేని ప్రేమను పొందాను. లతా దీదీ లాంటి అక్క పేరు మీద అవార్డు వచ్చినప్పుడు, అది ఆమెలోని ఏకత్వానికి, నాపై ఉన్న ప్రేమకు ప్రతీక. అందుకే అంగీకరించక పోవడం నాకు సాధ్యం కాదు అని అన్నారు. ఈ అవార్డును ప్రధాని మోదీ తన దేశ ప్రజలందరికీ అంకితం చేశారు. అంతేకాదు లెజెండరీ సింగర్ ఆశా భోంస్లే, తన సోదరి లతా మంగేష్కర్‌కు నివాళులర్పించడమే కాకుండా 'ఆయేగా ఆనేవాలా' పాట ట్యూన్‌ను హమ్ చేసింది. లతా మంగేష్కర్ స్మారకార్థం ఈ అవార్డును నెలకొల్పారు. దేశ నిర్మాణానికి ఆదర్శప్రాయమైన కృషి చేసిన వ్యక్తికి ప్రతి ఏడాది ఈ అవార్డు ఇవ్వబడుతుందని లతా మంగేష్కర్ కుటుంబం, మాస్టర్ దీనానాథ్ మంగేష్కర్ స్మృతి ప్రతిష్ఠాన్ ఛారిటబుల్ ట్రస్ట్ పేర్కొంది. సినిమా రంగంలో చేసిన సేవలకుగానూ ప్రముఖ నటులు ఆశా పరేఖ్, జాకీ ష్రాఫ్‌లు మాస్టర్ దీనానాథ్ పురస్కారం (ప్రత్యేక గౌరవం) అందుకున్నారు. భారతీయ సంగీతానికి గానూ రాహుల్ దేశ్‌పాండేకు మాస్టర్ దీనానాథ్ పురస్కారం లభించగా, ఉత్తమ నాటక అవార్డు సంజయ్ ఛాయాకు లభించింది. (చదవండి: ఆర్టికల్ రద్దు తర్వాత కశ్మీర్లో మోదీ పర్యటన.. కామెంట్స్ ఇవే..) -
లతా మంగేష్కర్ ఆరోగ్యంపై ఆశా భోస్లే కీలక ప్రకటన
Asha Bhosle rushes to meet sister Lata Mangeshkar: ప్రముఖ గాయని లతా మంగేష్కర్ ఆరోగ్యం ఇంకా క్రిటికల్‌గానే ఉంది. ఆరోగ్యం క్షీణించడంతో ప్రస్తుతం ఆమెను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లు బ్రీచ్ కాండీ ఆసుపత్రికి చెందిన డాక్టర్ ప్రతీత్ సంధాని తెలిపారు. లతా మంగేష్కర్ పరిస్థితి అత్యంత విషమంగా మారడంతో హాస్పిటల్ పరిసరాల్లో పోలీసులు హై సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. ఇక లతాజీ ఆరోగ్యం అత్యంత విషమంగా మారిందని తెలియగానే ఆమె సోదరి, ప్రముఖ గాయని ఆశా భోస్లే హుటాహుటిన బ్రీచ్ కాండీ ఆసుపత్రికి చేరుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..మేమందరం ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నాం.ప్రస్తుతం లతా మంగేష్కర్ ఆరోగ్యం మెరుగుపడుతోంది. ఆమె ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు అని పేర్కొన్నారు. "We hope #Latadidi recovers soon. We are praying for her recovery. Doctors have informed us that she's stable.": #AshaBhosle on #LataMangeshkar's health! Read more here: https://t.co/x9KnspxXxB pic.twitter.com/7ggXJ46ygI — Pune Mirror (@ThePuneMirror) February 5, 2022 -
యాపిల్ ఈవెంట్లో 'దమ్ మారో దమ్'
యాపిల్ సంస్థ ప్రతి ఏడాది నిర్వహించే 'యాపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫిరెన్స్' ను ఈ ఏడాది నిర్వహించింది. అయితే ‘కాలిఫోర్నియా స్ట్రీమింగ్’ ద్వారా సెప్టెంబర్ 14న నిర్వహించిన ఈవెంట్ ఇండియన్స్‌కు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఐఫోన్ 13 లాంచ్ వీడియో బ్యాక్‌గ్రౌండ్‌లో బాలీవుడ్ సాంగ్ దమ్ మారో దమ్ మ్యూజిక్ వినిపించి యాపిల్ సీఈఓ టీమ్ కుక్ ట్విస్ట్ ఇచ్చారు. లాంచ్ చేసే ప్రోడక్ట్స్‌తోపాటు వాటిని లాంచ్ చేసే విధానంలోనూ తనదైన మార్క్ చూపిస్తూ ఇండియన్ మార్కెట్‌పై ఫోకస్ చేశారు. ప్రపంచంలో రెండో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్ భారత్ అవతరించింది. కానీ భారత్‌లో యాపిల్ మార్కెట్ కేవలం 3 శాతం మాత్రమే ఉంది. ఆ మార్కెట్ షేర్‌ను పెంచేందుకు బాలీవుడ్ ఎవర్ గ్రీన్ హీరో దేవానంద్ నటించిన ఇండియన్ మ్యూజికల్ డ్రామా ఫిల్మిం 'హరేరామ హరేకృష్ణా' సినిమాలోని ప్రముఖ ఆర్డీ బర్మన్-ఆశా భోస్లే'లు పాడిన 'దమ్ మారో దమ్' మ్యాజిక్‌ను వాడారు. దీంతో యాపిల్ బాలీవుడ్ మ్యూజిక్ వాడటంపై నెటిజన్లు చర్చించుకుంటున్నారు. క్యూపర్టినోలో జరిగిన ఈవెంట్లో ఫోన్‌ను లాంచ్ చేయడానికి సీఈవో టిమ్ కుక్ వస్తున్న సమయంలోనూ ఈ మ్యూజిక్ వినిపించింది. దీంతో ఔత్సాహికులు ఐఫోన్ 13 సిరీస్‌లోని ఐఫోన్ 13 తో పాటు ఎంట్రీ లెవల్ పాడ్, ఐపాడ్, యాపిల్ వాచ్ సిరీస్ 7 ఫీచర్ల కంటే ఎక్కువగా ఈ మ్యూజిక్ గురించే చర్చిస్తున్నారు. ఇక యూట్యూబ్ లో సైతం ఓ వీడియో ట్రెండ్ అవుతోంది. ఐఫోన్ 13 ఫోన్ ఎలాంటి ప్రమాదాల్లోనైనా చెక్కు చెదరకుండా ఉంటుందని ఓ వీడియోను రిలీజ్ చేసింది యాపిల్. ఆ వీడియోలో ఓ యువకుడు తన బైక్‌పై కస్టమర్లకు పార్శిళ్లను అందిస్తుండగా 'దమ్ మారో దమ్' సాంగ్ ఆడియా ట్రాక్ ప్లే అవ్వడం నెట్టింట్లో సందడి చేస్తోంది. చదవండి : ఐఫోన్ 13 వచ్చేసింది.. అదిరిపోయే ఫీచర్లుతో.. -
‘ఓ బామ్మలు.. మీ డ్యాన్స్ ముందు హీరోయిన్లంతా దిగదుడుపే’
ఏజ్ జస్ట్ నెంబర్ మాత్రమే.కొంతమందికి వయస్సు మీద పడుతున్న వాళ్లు అనుకున్న లక్ష్యాల్ని, కోల్పోయిన సంతోషాల్ని వయస్సుతో సంబంధం లేకుండా తిరిగి పొందాలని కోరుకుంటుంటారు. సంతోషం కోసం ఏమైనా చేయాలనుకొని ఒక్కసారి మనసులో గట్టిగా అనుకుంటే చాలు తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరిచిపోయి వాళ్లు ఏం చేయాలని అనుకుంటారో అదే చేస్తారు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటారా? తాజాగా ఇద్దరు బామ్మలు వేసిన డ్యాన్స్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇండియన్ ప్లే బ్యాక్ సింగర్ ఆశా భోస్లే సూపర్ హిట్ సాంగ్ 'పియా తు అబ్ తో ఆజా' పాటకు ఓ ఇద్దరు బామ్మలు వేసిన స్టెప్స్ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ఓ ప్రాంతంలో అటుగా వెళ్తున్న ఆ బామ్మలకు పియా తు అబ్ తో అజా పాట వినపడింది. అంతే వయస్సుతో సంబంధం లేకుండా ప్రపంచాన్ని మరిచిపోయి ఆ పాటను అనుకరిస్తూ డ్యాన్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో షికార్లు చేస్తోంది. దీన్ని చూసిన నెటిజన్లు..‘ఓ బామ్మలు.. మీ డ్యాన్స్ ముందు హీరోయిన్లంతా దిగదుడుపే అని కామెంట్లు చేస్తుంటే మరికొందరు.. వీళ్లిద్దరిని చూస్తుంటే డబ్బు మాత్రమే సంతోషాన్ని ఇవ్వదు’ అని కామెంట్ చేస్తున్నారు. -
ఆమె ప్రేమ పెళ్లిని ఎవరూ మెచ్చలేదు!
ఒక్క జీవితంలో ఆమె వంద పోరాటాలు చేసింది. ఆమె ప్రేమ పెళ్లిని ఎవరూ మెచ్చలేదు. ఆమె పాటను ఎవరూ మెచ్చలేదు. ఆమె అక్క ఆమెను ఆదరించలేదు. ఆమెను ఏ హీరోయినూ కోరుకోలేదు. కాని ఆమె నిలబడింది. కొంత ముందు వెనుకలుగానైనా చెల్లెలు కూడా అక్కంత కాగలదు అని నిరూపించింది. ఎన్నో పాటల గంపలు మనకు పంచి నేడు 88వ ఏడులోకి అడుగుపెట్టనుంది. కొన్ని నదులు ప్రవహించి ప్రవహించి సముద్రంలో కలిశాక, ఆ కలిసే చోట, నదే సముద్రమా అన్న భ్రాంతిని కలిగిస్తాయి. ఆశాభోంస్లే అలాంటి నది. సముద్రమంతటి నది. 87 సంవత్సరాల జీవితంలో, ఈ విశ్రాంత సంగమంలో ఒక్కసారి వెనక్కు చూసుకుంటే ఎదుర్కొన్న ఆటుపోట్లు ఎన్ని? తిరిగిన మలుపులెన్ని? ఢీకొట్టుకున్న బండరాళ్లు ఎన్ని? విరిగి పడిన అలలు ఎన్ని? కొన్ని మాత్రమే బయటకు తెలుస్తాయి. అన్నీ ఆమెకే తెలుస్తాయి. ఒక కుండీలో రెండు రోజాపూలు పూచినప్పుడు ఒక ఇంట్లో రెండు కోకిలలు గొంతెత్తకూడదా? కాని మొదటి కోకిలకే అంగీకారం దొరికింది. రెండో కోకిల దానిని సాధించుకోవాల్సి వచ్చింది. ‘మాంగ్కే సాత్ తుమ్హారా’ అని ‘నయాదౌర్’ (1957)లో ఆశాభోంస్లే హిట్ కొట్టే వరకూ ఆమె అంతకు ముందు పాడిన పాటలకు అంతగా గుర్తింపు వచ్చిన దాఖలాలు లేవు. వచ్చినా కొనసాగింపు దొరకలేదు. గీతాదత్, షంషాద్ బేగం, లతా మంగేష్కర్ వంటి ఉద్దండులు ఆ సమయంలో చాలా ప్రతిభావంతంగా పాడుతున్నారు. లతా మంగేష్కర్ ‘మహల్’ (1949)లో ‘ఆయేగా ఆయేగా’ పాడి స్టార్ అయి కూచుంది. అందరూ ఆమెకే పాటలు ఇస్తున్నారు. ఆశాకు ఇచ్చేవాళ్లు లేరు. పైగా ఆమె గొంతు సన్నజాజి తీవ కాదు. పూలరెక్కా కాదు. తుమ్మెద ఝుంకారంలా ఉంటుంది. సున్నితంగా హొయలు పోయే హీరోయిన్లకు అది సూట్ కాదు. మరేమిటి చేయడం? 15-16 ఏళ్ల వయసులో పెళ్లి అప్పటికే పర్సనల్ లైఫ్‌లో ఆశా చాలా సమస్యలు ఎదుర్కొని ఉంది. తండ్రి మరణించగా ఐదు మంది సంతానం ఉన్న ఇంట్లో పేదరికం తాండవిస్తుంటే దానిని భరించలేకో, నిజంగా ప్రేమించో 15–16 ఏళ్ల వయసులో గణ్పత్రావు భోంస్లే అనే సంగీత దర్శకుడితో ప్రేమ వివాహానికి వెళ్లిపోయింది. అక్కడ ఇద్దరు పిల్లలు పుట్టాక, మూడో గర్భంలో ఉండగా పుట్టింటికి పారిపోయి వచ్చింది. అక్కడ ఆదరణ లేకపోయేసరికి ఆత్మహత్య చేసుకుందామనుకుంది. కాని కడుపులో ఉన్న బిడ్డ మీద మమకారంతో ఆగిపోయింది. తండ్రి వల్ల అనువంశికంగా తన వద్ద పాట ఉంది. దానినే జీవనం చేసుకుందామని నిశ్చయించుకుంది. గొప్ప గొప్ప హీరోయిన్లు మొదట కామెడీ వేషాలు వేసినట్టు ఆశా కొత్తల్లో కేవలం క్లబ్ సాంగ్స్‌కే పరిమితమైంది. హెలెన్ ఆమెకూ ఆమె హెలెన్కూ పరస్పరం మేలు చేసుకున్నారు. హెలెన్‌కు ఆశా పాడిన ‘దోనియా మే లోగోంకో’ (అప్నా దేశ్), ‘పియా తూ అబ్తో ఆజా’ (కారవాన్), ‘యే మేరా దిల్’ (డాన్) ఇవన్నీ పెద్ద హిట్స్. కాని ఎస్.డి.బర్మన్, ఓ.పి.నయ్యర్లు ఆశాకు మంచి పాటలు ఇచ్చి ఆమె గొప్ప గాయని అని చెప్పే ప్రయత్నం చేశారు. ఎస్.డి.బర్మన్కు ఆశా పాడిన ‘ఆంఖో మే క్యాజీ’ (నౌ దో గ్యారా), నయ్యర్‌కు పాడిన ‘ఆయియే మెహర్బాన్’ (హౌరా బ్రిడ్జ్) చాలా మంచి హిట్స్. ఓ.పి.నయ్యర్ లతాతో ఒక్క పాట పాడించకుండా దాదాపుగా అన్ని పాటలు ఆశా చేతనే పాడించాడు. ‘మేరే సనమ్’లో నయ్యర్ కోసం ఆశా పాడిన ‘జాయియే ఆప్ కహా జాయేంగే’ క్లాసిక్. పెళ్లి కానుకగా.. ఆ తర్వాతి కాలంలో దుమారంగా వచ్చిన ఆర్.డి.బర్మన్ మంచి పాటలు ఆశాకు ఇచ్చాడు. వారివురూ పెళ్లి కూడా చేసుకున్నారు. ఆశాకు తన తరఫు కానుక అన్నట్టుగా ఆర్. డిబర్మన్ ‘చురాలియా హై’ (యాదోంకి బారాత్), ‘దమ్ మారో దమ్’ (హరే రామా హరే కృష్ణ), ‘ఓ మేరే సోనరే సోనరే’ (తీస్రి మంజిల్), ‘రోజ్ రోజ్ ఆంఖో తలే’ (జీవా), ‘మేరా కుచ్ సామాన్’ (ఇజాజత్) వంటి ఎన్నో హిట్స్ ఇచ్చాడు. కాని ఆశా భోంస్లేను సమున్నతంగా నిలబెట్టిన సినిమా ‘ఉమ్రావ్ జాన్’. గజల్ అంటే లతానే చెప్పుకునే ఆ రోజుల్లో సంగీత దర్శకుడు ఖయ్యాం ఆశాభోంస్లే చేత ఆ సినిమా పాటలన్నీ పాడించడం వాటిని పాడిన ఆశా జాతీయ పురస్కారం అందుకోవడం... అదంతా ఎప్పటి నుంచో ఉన్న ప్రతిభకు ఆలస్యంగా దక్కిన గుర్తింపు. ఉమ్రావ్ జాన్‌లో ‘దిల్ చీజ్ క్యా హై’, ‘ఇన్ ఆంఖొకి మస్తీ’ పండితుల ప్రశంసలు కూడా పొందాయి. తెలుగులో ఆశా భోంస్లే ‘పాలు నీళ్లు’ సినిమాలో ‘ఇది మౌనగీతం’ను మొదటి పాటగా పాడారు. ‘చిన్ని కృష్ణుడు’ (జీవితం సప్తసాగర గీతం), ‘చందమామ’ (నాలో ఊసులకు), ‘ఆశ్వమేథం’ (ఓ ప్రేమా) ఆమె పాడిన మరికొన్ని పాటలు. ఆశాభోంస్లే హిందీ సినిమా పాటను ఒకే రహదారి మీద ప్రయాణించకుండా కాపాడింది. అడ్డుకుంది. రసాస్వాదన అనే గమ్యానికి చేరుకోవడానికి ఆమె పాటల దారి గుండా నడిచే అభిమానులు కోట్లాదిగా ఉన్నారు. వారందరి తరఫున ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు. – సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
కరోనా : ఒక్క పాట.. 214 మంది గాయకులు
ఢిల్లీ : ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకు మరింత విజృంభిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ కష్టసమయంలో ఒక కుటుంబంగా కలిసి నిలబడిన ప్రతీ భారతీయుడికి సినీ గాయకులు ఉత్తేజపరిచే విధంగా సెల్యూట్ చేస్తూ పాట పాడారు. దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన 214 మంది సినీ గాయకులు 'జయతు జయతు భారతం.. వాసుదేవ్ కుతుంబక్కం' అంటూ ఆలపించారు. 6 నిమిషాల నిడివి ఉన్న ఈ పాటలో దిగ్గజ గాయని ఆశా భోంస్లే, సోనూ నిగమ్, ఎస్పీ బాలసుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు. ఈ పాటను ఇండియన్ సింగర్స్ రైట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శంకర్ మహదేవన్, ప్రసూన్ జోషిలు కలిసి రచించారు. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌లో ట్రెండింగ్ లిస్ట్‌లో ఉంది. ప్రముఖ గాయని ఆశా భోంస్లే మాట్లాడుతూ.. ' 'జయతు జయతు భారతం' ఈ కష్ట సమయాల్లో కుటుంబంగా కలిసి నిలబడిన ప్రతి భారతీయుడికి నమస్కారంగా 14 భాషల్లోని చారిత్రాత్మక గీతం అంకితం చేయబడింది. ఇప్పుడు అన్ని సవాళ్లకు మించి కొత్త 'జగా హువా భారత్'లో భాగం కావాల్సిన సమయం ఆసన్నమైంది .మానవాళికి అతిపెద్ద సంక్షోభాలలో ఒకటి గెలిచింది ' అని పేర్కొన్నారు. ('కళ్ల ముందే ప్రాణం పోతుంటే ఏం చేయలేకపోయా') -
‘జైట్లీ జీ, 20 ఏళ్ల నుంచి మిమ్మల్ని ఆరాధిస్తున్నాను’
అనారోగ్యంతో కన్నుమూసిన కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ మృతిపట్ల బాలీవుడ్ సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఓ గొప్ప, నిజాయతీ గల నేతను కోల్పోయామంటూ సోషల్‌మీడియా వేదికగా జైట్లీ కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ‘అరుణ్ జైట్లీ మరణం నన్ను కలిచి వేసింది. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.’ - ఆశా భోంస్లే ‘20 ఏళ్ల క్రితం అరుణ్ జైట్లీని కలిశాను. నాటి నుంచి నేటి వరకు ఆయనను ఇష్టపడుతూనే ఉన్నాను. ఆయన మరణం మన దేశానికి తీవ్ర నష్టం. మిమ్మల్ని చాలా మిస్సవుతున్నాం జైట్లీ జీ. మీ కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నాను.’ - అనిల్ కపూర్ ‘అరుణ్ జైట్లీ చాలా గొప్ప వ్యక్తి. లోధి గార్డెన్స్‌లో మార్నింగ్ వాక్కు వెళ్లినప్పుడు ఆయనను కలిసి పలకరించే అవకాశం లభించేది. మీరు లేని లోటు తీర్చలేనిది.’ - శేఖర్ కపూర్ ‘అరుణ్ జైట్లీ మరణం నన్ను తీవ్రంగా కలిచి వేసింది. డైనమిక్ లీడర్, ప్రతి విషయం గురించి ఆయనకు పూర్తి అవగాహన ఉండేది. అప్పుడప్పుడు ఆయన నన్ను కలవడానికి వచ్చే వారు. మేము చాలా సేపు ముచ్చటించుకునేవాళ్లం. ఆయన కుటుంబానికి నా హృదయపూర్వక సంతాంపం తెలియజేస్తున్నాను.’ - లతా మంగేష్కర్ ‘అరుణ్ జైట్లీ మరణించారని విని ఎంతో బాధపడ్డాను. ఆయన గొప్ప దార్శనీకుడు. ఆయనతో మాట్లాడినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను.’ - అజయ్ దేవగన్ ‘అరుణ్‌జైట్లీ మరణం తీవ్ర దిగ్భ్రాంతికరం. ఆయన కుటుంబానికి, శ్రేయోభిలాషులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.’ - రితేశ్ దేశ్‌ముఖ్ -
‘అందుకే స్మృతి గెలిచింది’
‘ ప్రధాని పదవీ ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా నేను రద్దీలో చిక్కుకుపోయాను. స్మృతి ఇరానీ తప్ప నాకు సహాయం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఆ జనంలో నా ఇబ్బందిని గమనించింది. నేను ఇంటికి క్షేమంగా చేరానని తెలుసుకునే దాకా ఆమె మనసు కుదుటపడలేదు. తను అందరినీ జాగ్రత్తగా చూసుకుంటుంది. అందుకే గెలిచింది’ అంటూ ప్రముఖ గాయని ఆశా భోస్లే కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపై ప్రశంసలు కురిపించారు. తన క్షేమం గురించి ఆరా తీసిన ఆమెపై ట్విటర్ వేదికగా అభిమానం చాటుకున్నారు. కాగా ప్రధాని నరేంద్ర మోదీ గురువారం పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా దేశ, విదేశాల నుంచి విశిష్ట అతిథులతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సూపర్‌స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్, సింగర్ ఆశా భోస్తే, కరణ్ జోహార్, అనుపమ్ ఖేర్, షాహిద్ కపూర్, బోనీ కపూర్, జితేంద్ర తదితర సెలబ్రిటీలు మోదీ ప్రమాణ స్వీకారోత్సవాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు. ఇక మాజీ నటి, ఎంపీ అయిన స్మృతి ఇరానీ 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఓడించి సంచలన విజయం సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆమేథీ ఎంపీగా గెలుపొందిన ఆమె.. గురువారం రెండోసారి కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మోదీ 58 మంది కేబినెట్లో పిన్న వయస్కురాలైన మంత్రిగా చరిత్రకెక్కారు. I was stranded in the crazy rush post PM oath ceremony. No one offered to help me except @smritiirani who saw my plight & made sure I reached home safely. She cares & that’s why she won. pic.twitter.com/vDV84PrIVp — ashabhosle (@ashabhosle) May 30, 2019 -
వైరలవుతోన్న ఆశాభోస్లే ట్వీట్
ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్ లేని ప్రపంచాన్ని అస్సలు ఊహించలేము. మనుషుల మధ్య దూరాలను తగ్గించడానికి అలగ్జాండర్ గ్రాహంబెల్ కనిపెట్టిన టెలిఫోన్ మనిషిని మరింత ఒంటరిని చేసింది. సమూహంలో ఉన్నా ఎవరికి వారు ఫోన్లో మునిగిపోయి ఒంటరిగా ఉంటున్నారు. స్మార్ట్‌ఫోన్ వాడకం మనుషులను ఎంతలా ప్రభావితం చేసిందో ఉదాహరిస్తూ లెజండరీ గాయకురాలు ఆశాభోస్లే ఓ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో తెగ వైరలవుతోంది. సోమవారం ఆశాభోస్లేను కలవడానికి బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్‌తో పాటు మరో ముగ్గురు వ్యక్తులు కోల్‌కతా వచ్చారు. Bagdogra to Kolkata... Such good company but still, no one to talk to. Thank you Alexander Graham Bell pic.twitter.com/PCH92kO1Fs — ashabhosle (@ashabhosle) January 13, 2019 అయితే ఆశాను కలవడానికి వచ్చిన వీరు ఆమె ముందు కూర్చొని ఎవరికి వారు ఫోన్లలో బిజీ అయ్యారు. ఆ సమయంలో తీసిన ఫొటోను ఆశా ట్విటర్లో పోస్ట్ చేస్తూ.. ‘నన్ను చూడటానికి బగ్డోగ్రా నుంచి కోల్‌కతా వచ్చారు కానీ ఏం లాభం.. మాట్లాడేవారు ఒక్కరూ లేరు. టెలిఫోన్‌ను కనిపెట్టిన అలెగ్జాండెర్ గ్రహంబెల్‌కు ధన్యవాదాలు చెప్పాలి’ అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు ఆశా. ఇలా ట్వీట్ చేసిన కొద్దిసేపటికే దాదాపు 22 వేల మంది దీన్ని లైక్ చేశారు. ‘ఆశా చేసిన ట్వీట్ నేటితరానికి కనువిప్పులాంటిదం’టూ కొందరు.. ‘అంత గొప్ప గాయని ముందు ఫోన్ పట్టుకుని కూర్చోవాలన్న ఆలోచన వారికెలా వచ్చింది?’ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. -
యశ్ చోప్రా అవార్డు అందుకున్న ఆశా
లెజండరీ సింగర్ ఆశా భోంస్లేకు ప్రతిష్టాత్మక యశ్ చోప్రా మెమోరియల్ అవార్డును టి.సుబ్బరామిరెడ్డి ఫౌండేషన్ శుక్రవారం ముంబైలో ప్రదానం చేసింది. ఏడు దశాబ్దాల సుదీర్ఘ సంగీత ప్రస్థానంలో ఆశా భోంస్లే 20 భాషల్లో దాదాపుగా 11వేల పాటలు పాడి ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించుకున్నారు. ఆమెకు యశ్ చోప్రా అవార్డు ప్రదానం చేయడం ఆనందంగా ఉందన్నారు టీయస్సార్. ఈ కార్యక్రమంలో టి. సుబ్బరామిరెడ్డి, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు, నటి జయప్రద, బాలీవుడ్ నటి రేఖ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆశా భోంస్లేకు రేఖ అభినందనలు తెలిపి, పాదాభివందనం చేసి తన అభిమానాన్ని చాటుకున్నారు. 2012లో చనిపోయిన యశ్ చోప్రా జ్ఙాపకార్థం టి. సుబ్బరామిరెడ్డి, అను రంజన్, శశి రంజన్లు నెలకొల్పిన ఈ అవార్డును ఇదివరకు లతా మంగేష్కర్, అమితాబ్ బచ్చన్, రేఖ, షారుక్ ఖాన్ అందుకున్నారు. ఈ అవార్డుతో పాటు 10 లక్షల నగదు కూడా అందజేస్తారు. -
ఆశా భోంస్లేకు యశ్ చోప్రా మెమోరియల్ అవార్డ్
ప్రముఖ దర్శక–నిర్మాత యశ్ చోప్రా అంటే కళాబంధు టి.సుబ్బరామిరెడ్డికి ఎనలేని అభిమానం. చోప్రాతో టీయస్సార్‌కి మంచి అనుబంధం ఉండేది. అందుకే ఆయన భౌతికంగా దూరమయ్యాక టి. సుబ్బరామిరెడ్డి ఫౌండేషన్ తరఫున ‘నేషనల్ యశ్ చోప్రా మెమోరియల్’ అవార్డ్‌ను ప్రారంభించారు. 2013లో మొదలుపెట్టి ఇప్పటివరకూ లతా మంగేష్కర్, అమితాబ్ బచ్చన్, రేఖ, షారుక్ ఖాన్లకు ఈ అవార్డును ప్రదానం చేశారు. ఈసారి టి. సుబ్బరామిరెడ్డి ఫౌండేషన్ జ్యూరీ సభ్యులు బోనీకపూర్, మాధుర్ భండార్కర్, హనీ ఇరానీ, పద్మినీ కొల్హాపురి, సుబ్బరామిరెడ్డి ఈ అవార్డును ప్రముఖ గాయని ఆశాభోంస్లేకు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని శనివారం అధికారికంగా ప్రకటించారు. ఫిబ్రవరి 16న ముంబైలో ఈ అవార్డు వేడుక జరగనుంది. ఈ వేడుకలో అమితాబ్ బచ్చన్, ఆమిర్ ఖాన్, షారుక్ ఖాన్, శ్రీదేవి, జయప్రద తదితరులు పాల్గొనబోతున్నారు. -
ఆశాభోస్లేకు యశ్ చోప్రా మెమోరియల్ అవార్డు
భారతీయ కళలను, సంస్కృతిని ప్రోత్సహించే కళాబంధు టి. సుబ్బరామిరెడ్డి జాతీయ స్థాయిలో ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రముఖ దర్శక నిర్మాత యశ్ చోప్రాతో ఆయనది ఎనలేని బంధం. ఆ అనుబంధం తోనే యశ్ చోప్రా తనువు చాలించిన తరువాత సుబ్బరామిరెడ్డి ఫౌండేషన్ తరఫున 2013 నుంచి నేషనల్ యశ్ చోప్రా మెమోరియల్ అవార్డును సినీ ప్రముఖులకు అందజేస్తున్నారు. 2017 సంవత్సరానికి గానూ ఈ అవార్డును ప్రముఖ నేపథ్య గాయని, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, పద్మ విభూషణ్ ఆశాభోస్లేకు ఇవ్వనున్నారు. శనివారం ముంబైలో సమావేశమైన టి. సుబ్బరామిరెడ్డి ఫౌండేషన్ జ్యూరీ సభ్యులు సర్వశ్రీ బోనీకపూర్, మాధుర్ భండార్కర్, హనీ ఇరానీ, పద్మినీ కొల్హాపురి, సుబ్బరామిరెడ్డి, ఆశాభోస్లే పేరును నేషనల్ యశ్ చోప్రా మెమోరియల్ అవార్డుకు ఎంపిక చేశారు. గతంలో ఈ అవార్డును లతా మంగేష్కర్, అమితాబ్ బచ్చన్, రేఖ, షారుక్ ఖాన్ అందుకున్నారు. ఎప్పటిలానే ఈ సారి కూడా ఈ అవార్డు ప్రదానోత్సవం ముంబైలో ఫిబ్రవరి 16న ఘనంగా జరుగుబోతోంది. మహారాష్ట్ర గవర్నర్ సిహెచ్. విద్యాసాగర్ రావుతో పాటు లతామంగేష్కర్ చేతుల మీదుగా 'నేషనల్ యశ్ చోప్రా మెమోరియల్ అవార్డు -2017'ను ఆశాభోస్లే అందుకోబోతున్నారు. ఈ కార్యక్రమంలో అమితాబ్ బచ్చన్, ఆమీర్ ఖాన్, షారుక్ ఖాన్, శ్రీదేవి, జయప్రద తదితరులు పాల్గొనబోతున్నారు. 1933లో జన్మించిన ఆశాభోస్లే పదేళ్ళ వయసులోనే నేపథ్య గాయనిగా తన కెరీర్‌ను ప్రారంభించారు. గడిచిన 75 సంవత్సరాల్లో వందల చిత్రాలలో వేలాది గీతాలను ఆలపించిన ఆశాభోస్లే రెండు సార్లు ఉత్తమ గాయనిగా జాతీయ అవార్డును అందుకోవడంతో పాటు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోనూ చోటు సంపాదించుకున్నారు. ఆమె కీర్తి కిరీటంలో 'నేషనల్ యశ్ చోప్రా మెమోరియల్ అవార్డ్' మరో మైలు రాయిగా నిలువబోతోంది. -
బీఎస్ఎఫ్ సిబ్బంధితో ఆశా భోంస్లే రాఖీ పండుగ
గౌహతి: ప్రముఖ గాయిని ఆశాభోంస్లే(82) రాఖీ పౌర్ణమి పండుగను బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ( బీఎస్ఎఫ్) సైనికులతో అసోంలోని గౌహతిలో జరుపుకున్నారు. ఈ రక్షాబంధన్ వేడుకను ఆర్మీ సోదరులకు అంకితం చేస్తున్నానని ఆమె ట్వీటర్లో కామెంట్ చేశారు. ఈసందర్భంగా ఫోటోలను పోస్ట్ చేశారు. ఆశా భోంస్లేను అసోం సాంప్రదాయ పద్దతిలో సైనికులు స్వాగతం పలికారు. -
ఆశాభోంస్లే కొడుకు మృతి
బాలీవుడ్ సంగీత దర్శకుడు, ప్రముఖ గాయని ఆశాభోంస్లే తనయుడు అయిన హేమంత్ భోంస్లే క్యాన్సర్ తో మరణించారు. గత మూడు సంవత్సరాలుగా క్యాన్సర్ తో పోరాడుతున్న హేమంత్.. స్కాట్లాండ్ లో మరణించారు. హేమంత్ 'నజరానా ప్యార్ కా', 'శ్రద్ధాంజలి' లాంటి బాలీవుడ్ సినిమాలకు సంగీతం అందించారు. లతా మంగేష్కర్ 86వ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించాలనుకుంటున్న సమయంలో ఇలా జరగటంతో ఆ వేడుకలను కూడా రద్దు చేసుకున్నారు. 2012లో ఆశాభోంస్లే కూతురు వర్షా భోంస్లే డిప్రెషన్ కారణంగా ఆత్యహత్య చేసుకుంది. -
సెప్టెంబర్ 8న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు ఆశా భోంస్లే (గాయని), మాధవపెద్ది సురేష్ (సంగీత దర్శకుడు) ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 7. దీని ప్రభావం వచ్చే సంవత్సరం వరకు ఉంటుంది. ఇది కేతువుకు సంబంధించిన సంఖ్య. దీనివల్ల ప్రాపంచిక జీవితం కన్నా ఆధ్యాత్మిక జీవితం పైనే ఎక్కువ మక్కువ ఉంటుంది. వేదపండితులు, స్వామీజీలు, ఇమామ్‌లు, పాస్టర్లకు ఈ సంవత్సరం ఆత్మసాక్షాత్కారం ప్రాప్తించే అవకాశం ఉంది. ఆధ్యాత్మికంగా చాలా పేరు ప్రఖ్యాతులు పొందుతారు. వీలయినంత వరకు ప్రశాంతంగా ఉంటూ, యోగ, ధ్యానాలలో గడపడం మంచిది. యూనిఫారం ధరించే ఉద్యోగులకు, జ్యోతిష్యులకు, వేదపండితులకు, పురోహితులకు మంచి గుర్తింపు, గౌరవ సన్మానాలు జరుగుతాయి. 8వ తేదీన పుట్టిన వారు తమను ఎవరూ గుర్తించడం లేదన్న ఆందోళన, నైరాశ్యంలో ఉంటారు. అది తప్పు అని రుజువు చేస్తూ ఈ సంవత్సరం వారికి మంచి ఆత్మస్థైర్యం, సానుకూల భావనలు అలవడతాయి. వివాహం, సంతాన ప్రాప్తి కోసం ప్రయత్నించేవారి ఆశలు ఫలిస్తాయి. గొంతు, ముక్కు, ఊపిరితిత్తులు, ఛాతీకి సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ముందే నివారణ మార్గాలను అన్వేషించడం మంచిది. లక్కీ నంబర్స్: 2,5,6,8; లక్కీ డేస్: సోమ, గురు, శుక్ర, శనివారాలు; లక్కీ మంత్స్: ఫిబ్రవరి, ఏప్రిల్, ఆగస్ట్, సెప్టెంబర్; లక్కీ కలర్స్: బ్లూ, వైట్, క్రీమ్, రోజ్, ఆరంజ్. సూచనలు: నవగ్రహారాధన, కాకులకు తీపిపదార్థాలు పెట్టడం, ఆవులకు, కోతులకు ఆహారం తినిపించడం, వృద్ధాశ్రమాలలో శ్రమదానం లేదా సాయం చేయడం మంచిది. - డాక్టర్ మహమ్మద్ దావూద్ -
మళ్ళీ దగ్గర చేసిన పాట
విభేదాలతో దూరం జరిగిన అక్కాచెల్లెళ్ళు లతా మంగేష్కర్, ఆశా భోంస్లేలు ఇప్పుడు అనుకోకుండా దగ్గరవుతున్నారు. లతా మంగేష్కర్ సొంత సంగీత సంస్థ ‘ఎల్.ఎం. మ్యూజిక్’ ఇప్పుడు ఆశా భోంస్లే పాడుతున్న ఒక పాటను జనానికి అందించనుంది. ‘ఏ హవా...’ అనే ఆ పాటను ఆశా భోంస్లే, షాన్లు గానం చేశారు. ‘‘మళ్ళీ మా చెల్లెలితో ఇలా కలవడం ఆనందంగా ఉంది’’ అని పేర్కొన్న లత ‘‘మా చెల్లెలు బహుముఖ ప్రతిభ ఉన్న గాయని. ఆమెతో కలసి చాలా పాటలు పాడాను. ఆమెతో కలసి పాడడం ఎప్పుడూ ఓ సవాలే’’ అని వ్యాఖ్యానించారు. 1984లో ‘ఉత్సవ్’ సినిమాలో ‘మన్ క్యోం బెహ్కా రీ బెహ్కా...’ పాట తరువాత లత, ఆశా కలసి పాడలేదు. -
మీరు నావెంటే ఉండాలి!
ఏ గొంతులో మాట కూడా పాటవుతుందో... ఏ గొంతులో ప్రతి పాటా కోకిలమ్మ స్వరమవుతుందో... అలాంటి ఎవర్గ్రీన్ గాయని ఆశా భోంస్లే తాజాగా తన 82 ఏట అడుగుపెట్టారు. వివిధ భాషల్లో దాదాపు 12 వేలకు పైగా పాటలు పాడిన ఈ ‘పద్మవిభూషణ్’ పురస్కార గ్రహీత ఇన్నేళ్ళ తన స్వర ప్రయాణానికి సహకరించిన సినీ వర్గీయులకూ, అభిమానులకూ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు. వారందరి అభిమానం, అండదండల వల్లే దేశంలోని బహుముఖ ప్రజ్ఞావంతులైన గాయనీమణుల్లో ఒకరిగా పేరు తెచ్చుకోగలిగినట్లు ఆమె అభిప్రాయపడ్డారు. ‘‘నా జన్మదినం సందర్భంగా అభినందనలు తెలిపిన వారందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు. మీ అండదండలు లేనిదే నేను నా లక్ష్యాలను చేరుకోగలిగేదాన్ని కాదు. రాబోయే రోజుల్లో కూడా మీరు నా వెంటే ఉండాలని కోరుకుంటున్నాను’’ అని ఆశా భోంస్లే పేర్కొన్నారు. సుప్రసిద్ధ గాయని లతా మంగేష్కర్‌కు చెల్లెలైన ఆశా భోంస్లే అలనాటి మధుబాల, హెలెన్, ఆశా పారేఖ్‌ల దగ్గర నుంచి ఇటీవలి ఊర్మిళా మాతోండ్కర్, కరీనా కపూర్ దాకా అందరికీ తన గళంతో ఎన్నో సూపర్‌హిట్ గీతాలిచ్చారు. ఇప్పటికీ ఆమె వేదికపై పాటలు పాడుతుంటే, హాలు నిండిపోవాల్సిందే. ఈ ఏడాది ప్రథమార్ధంలో ప్యారిస్‌లో జరిగిన ఆశా భోంస్లే సినీ సంగీత విభావరిలో ఆ దృశ్యమే కనపడింది. -
తోట దాటిన పరిమళం
సత్వం: తన మాజీ ప్రేమికుడికి రాసిన ఉత్తరంలో ప్రేమిక అడుగుతుంది: ‘నా సామాన్లు కొన్ని నీ దగ్గర ఉండిపోయాయి... వాటిని తిరిగి పంపించు’. (‘ఇజాజత్’- మేరా కుచ్ సామాన్) ఈ పాటకు ఆర్డీ బర్మన్ ట్యూన్ చేస్తూ, ‘ఈయన, తర్వాత కిరాణా కొట్టు జాబితాతో కూడా పాట రాస్తా’డని ప్రేమగా విసుక్కున్నాడట. కానీ అదేపాట ఆ యేడు(1987) జాతీయ ఉత్తమగీతం అయింది, ఆశాభోంస్లేను జాతీయ ఉత్తమగాయనిని చేసింది. గుల్జార్ నిక్షిప్తం చేసే సూక్ష్మ వివరాలు అట్లాంటివి! ‘పంచమ్’కు మాత్రం తెలీదా! ఒకే గొడుగుకింద ఇరువురు పంచుకున్న జ్ఞాపకాల తడిని- అతడు ఏంచేసీ తిరిగివ్వలేడనీ! భౌతికమైన వస్తువుల మీదుగానే వాటిని మించిపోయే భావాన్ని ‘గుల్జార్ సాబ్’ కల్పించగలడనీ! ‘తోట’ అని అర్థాన్నిచ్చే కలంపేరును స్వీకరించిన అదే గుల్జార్- ‘ఆంధీ’లో అంటాడు: ‘ఈ పూలకొమ్మల్ని చూశావా? అవి నిజానికి అరబ్బీలో రాసిన ‘ఆయతులు’(చరణాలు)’. కాంతిబిందువులు చిలకరించే పన్నీరు; వర్షపు రాతిరి శుభ్రపడే హృదయం; చూపులు పలికే కంటిపాపల గీతం; ఆకాశం కింద, ఒక మూలకు ఒదిగి పడుకునే పేదవాడి దైన్యం; తిరిగి మళ్లీ ఎదురుచూడవలసిన ఒంటరి సాయంకాలం; పగటిని రాత్రిగా మారిపొమ్మనే విరహపు మారాం; రాకముందే వెళ్లిపోవాల్సిన చేదునిజం; అతి సున్నితమైనదేదో, హృదయం ద్రవించేదేదో బొమ్మ కడుతుంది ఆయన పాటల్లో. అలాగని, మార్దవమో, గంభీరతో మాత్రమే గుల్జార్ చిరునామా కాదు. ‘కజ్రా రే’, ‘ఛయ్య ఛయ్య’, ‘జై హో’(రహమాన్‌తో కలిసి ఆస్కార్ అందుకున్న పాట) పుట్టించే హుషారును ఎలా కాదనగలం! ‘ఒక పాట పాపులర్ అయినంతమాత్రాన, అది అల్పమైనది కానక్కర్లేదు,’ అంటాడాయన. పొద్దుట పూజగదిలోంచి వినవచ్చే శ్లోకం, పాలబ్బాయి మోగించే సైకిల్ గంట, భిక్షాటన చేస్తూ పాడుకునే పకీరు, ఇల్లాలి లల్లాయి పదాలు... వీటన్నిటా సంగీతాన్ని ఆస్వాదిస్తాడు. కవిత్వాన్ని వదిలేసి, కేవలం ఆయన దర్శకత్వాన్ని పరిగణించినా గుల్జార్ ఇచ్చింది చాలా చాలా ఎక్కువ! కోషిష్, పరిచయ్, అచానక్(1973-పాటల్లేని సినిమా), మౌసమ్, ఖుష్బూ, ఆంధీ(1975-అత్యవసర పరిస్థితిలో ఇందిరాగాంధీ ప్రభుత్వం నిషేధించిన సినిమా), కితాబ్, కినారా, మీరా, నమ్కీన్, ఇజాజత్, లిబాస్, లేకిన్, మాచిస్(1996-పంజాబ్ అలజడుల నేపథ్యంలోని ప్రేమకథ), హు తు తు(1999-రాజకీయనాయకుల కపటానికి వాళ్ల పిల్లలే ఎదురునిలిచే సందర్భం)... తీక్షణమైన, అర్థవంతమైన, ఉద్వేగమిళితమైన సినిమాలాయనవి! సార్వత్రికమైనదేదో పట్టుకోవడానికి ఆయన ప్రయత్నిస్తాడు. మనుషుల మధ్య, జాతుల మధ్య, మతాల మధ్య ఉండాల్సిన సామరస్యం గురించి మాట్లాడుతాడు. మనుషులుగా పరస్పరం పొదువుకోవాల్సిన అవసరాన్నీ, బంధాలకు పొదుగుకోవాల్సిన అందాన్నీ, వాటిల్లోంచి పొందగలిగే రసాన్నీ ఆయన ఆవిష్కరిస్తాడు. కవీ, కథకుడూ, అనువాదకుడు కూడా అయిన గుల్జార్- ‘బోస్క్‌యానా’గా నామకరణం చేసుకున్న తన ఇంటిని (కూతురు మేఘనను బోస్కీ అని పిలుస్తాడు) పుస్తకాలు, పెయింటింగ్స్‌త అలంకరించాడు; మదినేమో మీర్జా గాలిబ్, గౌతమబుద్ధులతో! దేశవిభజనకు ముందు రావల్పిండి దగ్గరి దీనాలో సంపూర్ణసింగ్ కల్రాగా 1936 ఆగస్టు 18న జన్మించాడు. చిన్నప్పుడు వాళ్లనాన్నకు ఆయన ‘పున్ని’. చిక్కటి స్మృతుల్ని హృదయంలో నింపే బాల్యాన్ని అక్కడ గడిపాడు. నలుగురూ వచ్చీపోయే ఇంటి వసారా, ఒంటికాలితో కుంటుతూ పరుగెత్తిన గల్లీలు, చిట్టచివర కూర్చుని చదువుకున్న బడి... వెనక్కి జార్చుకుని సరిహద్దు దాటాడు. అందుకే, ఆయనకు చిన్నతనం అంటే ఆనందం, విషాదం కూడా. గాలిబ్ వేడుకొన్నట్టుగా ఆయనా ప్రార్థిస్తాడు: బాధాకరమైన గతపు స్మృతుల్ని మరిచిపోయేలా, ఓ దేవుడా, నాకు మరపునైనా ఎందుకు ప్రసాదించవూ! భారత్-పాక్ సంబంధాలు దెబ్బతిన్నప్పుడు, ‘కళ్లకు వీసాలు అక్కర్లేదు; కలలకు హద్దులు లేవు; కళ్లు మూసుకుని నేను సరిహద్దు దాటతాను,’ అని పాడుకున్నాడు. ఆయన పుట్టినరోజును ఇప్పటికీ లాహోర్‌లో జరుపుకునే స్నేహితులున్నారు. తను చదివిన స్కూల్లో ‘గుల్జార్ కల్రా బ్లాక్’ పెట్టారు. 70 ఏళ్ల తర్వాత తన స్వగ్రామానికి వెళ్లినప్పుడు గుండెబరువెక్కి ఆయన కళ్లు తడిసిపోయాయట! ‘ప్రేమలో కూడా బాధుంటుంది; జీవితంలో బాధ కూడా భాగమే’! ఆ బాధతో కూడా సౌకర్యంగా ఉండగలగాలి! చాయ్, కింగ్స్, సింగిల్ మాల్ట్, టెన్నిస్, మనవడు సమయ్, విడిగావుంటూ విడాకులు తీసుకోని ‘రాఖీ’ బంధం, ఆమె ఏ ఆదివారమో వండుకొచ్చే పసందైన చేపలకూర... సాహిత్య అకాడెమీ, పద్మభూషణ్, ఆస్కార్, గ్రామీ, దాదాసాహెబ్ ఫాల్కే... ఇట్లాంటి కొన్ని పదాల్ని వాడి, ఆయన్నొక పాట రాసిమ్మనాలి. కాకపోతే, మరీ ‘ఆత్మగీతం’ అవుతుందని ఆయన ఒప్పుకుంటాడో లేదో! ‘బంధాలంటే ఒక దగ్గర జీవించడం, ప్రతిరోజూ కలవడం తప్పనిసరి కాదు; ఆ అవసరంలేని బంధాలు కూడా కొన్ని అలా ఏర్పడిపోతాయి’. గుల్జార్ అలాంటి ఒక బంధువేతర బంధువు! ఈ పూలకొమ్మల్ని చూశావా? అవి నిజానికి అరబ్బీలో రాసిన ‘ఆయతులు’(చరణాలు). - గుల్జార్ - ఆర్.ఆర్. -
ఆప్ ఆయే... బహార్ ఆయీ...
హైదరాబాదీ..హేమలత: ఆమె రాకతో సినీ సంగీత ప్రపంచంలోకి కొత్త వసంతం వచ్చింది. అప్పటికే గానకోకిల లతా మంగేష్కర్, ఆమె చెల్లెలు ఆశా భోంస్లే బాలీవుడ్‌ను ఏలుతున్న కాలం. అలాంటి కాలంలో పసితనం వీడక ముందే బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. అనతికాలంలోనే ‘తూ ఇస్ తరహ్ మేరే జిందగీ మే..’ అంటూ శ్రోతలను ఓలలాడించిన ఆ గొంతు పేరు హేమలత. అసలు పేరు లతా భట్. హైదరాబాద్‌లోని సంప్రదాయ రాజస్థానీ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టింది. కొద్దికాలానికే ఆమె కుటుంబం కోల్‌కతా చేరుకుంది. బాల్యం అక్కడే గడిచింది. చిన్ననాటి నుంచే హేమలత సంగీతమంటే చెవి కోసుకునేది. ఆమె తండ్రి జయ్‌చంద్ భట్ హిందుస్థానీ శాస్త్రీయ సంగీత విద్వాంసుడే అయినా, ఛాందసుడైన ఆయనకు కూతురు పాడటం ఇష్టం ఉండేది కాదు. అయినా, ఆమె రహస్యంగా పూజా పెండాల్స్ వద్ద పాడేది. హేమలత తండ్రి జయ్‌చంద్ భట్ శిష్యుడు గోపాల్ మల్లిక్ ఆమె ప్రతిభ గుర్తించాడు. జయ్‌చంద్‌ను ఒప్పించి, కోల్ కతాలోని రవీంద్ర స్టేడియంలో ఏర్పాటు చేసిన భారీ కార్యక్రమంలో ఆమె చేత పాడించాడు. అప్పుడామె వయసు ఏడేళ్లు మాత్రమే. అక్కడి నుంచి ఆమె ఇక వెనుదిరిగి చూసుకోలేదు. కలకత్తా నుంచి ఆమె కుటుంబం 1966లో బాంబేకు తరలి వచ్చింది. అక్కడే ఆమె ఉస్తాద్ అల్లారఖా ఖాన్, ఉస్తాద్ రియాజ్ ఖాన్ వంటి ఉద్దండుల వద్ద సంగీత శిక్షణ పొందింది. ఏసుదాస్‌తో అత్యధిక హిందీ గీతాలు పాడిన ఘనత గానగంధర్వుడు కె.జె.ఏసుదాస్‌తో కలసి అత్యధిక సంఖ్యలో హిందీ గీతాలు పాడిన ఘనత హేమలతకే దక్కుతుంది. హిందీ, బెంగాలీ, భోజ్‌పురి, పంజాబీ, రాజస్థానీ, సింధీ, ఒరియా, అస్సామీ, తమిళ, మలయాళ, డోగ్రీ, కొంకణి, ప్రాకృత, సంస్కృత వంటి స్వదేశీ భాషలు, నేపాలీ, అరబిక్, పర్షియన్, ఇంగ్లిష్, ఫ్రెంచ్, ఇటాలియన్ వంటి విదేశీ భాషలు కలిపి మొత్తం 38 భాషల్లో ఐదువేలకు పైగా పాటలు పాడింది. ఎస్.డి.బర్మన్, మదన్మోహన్, సలిల్ చౌదరి, ఖయ్యాం, లక్ష్మీకాంత్-ప్యారేలాల్, కల్యాణ్‌జీ-ఆనంద్జీ, రాజ్‌కమల్, ఉషా ఖన్నా, రవీంద్ర జైన్ వంటి సంగీత దర్శకుల సారథ్యంలో చిరస్మరణీయమైన గీతాలకు తన గాత్రంతో ప్రాణం పోసింది. ముకేశ్, మన్నా డే, మహమ్మద్ రఫీ, తలత్ మహమూద్, కిశోర్ కుమార్, ఏసుదాస్, శైలేంద్ర సింగ్, సురేశ్ వాడ్కర్ వంటి గాయకులతో కలసి యుగళగీతాలతో ఉర్రూతలూగించింది. సినీగీతాలే కాదు, భక్తిగీతాల ప్రైవేట్ ఆల్బంలు, వివిధ దేశాల్లో నిర్వహించిన శాస్త్రీయ సంగీత కచేరీలూ ఆమెను లక్షలాది మంది అభిమానులకు చేరువ చేశాయి. ‘చిత్‌చోర్’లో పాడిన ‘తూ జో మేరే సుర్ మే...’ పాట 1977లో ఆమెకు ‘ఫిలింఫేర్’ ఉత్తమ గాయని అవార్డు తెచ్చిపెట్టింది. ‘ఫకీరా’, ‘సునయనా’, ‘ఆప్ ఆయే బహార్ ఆయీ’, ‘ఆప్‌తో ఐసా న థే’ వంటి సినిమాల్లో హేమలత పాడిన పలు హిట్ పాటలు సంగీతాభిమానులను ఇప్పటికీ అలరిస్తూనే ఉన్నాయి. అమెరికాలో మ్యూజిక్ అకాడమీ అమెరికాలో మ్యూజిక్ అకాడమీ స్థాపించిన ఏకైక సినీ గాయని హేమలత మాత్రమే. ప్రపంచ సిక్కుల సంఘం, పంజాబ్ ప్రభుత్వాల నుంచి అరుదైన గౌరవాన్ని పొందిన ఘనత కూడా ఆమెకే దక్కుతుంది. ఆనంద్‌పూర్ సాహిబ్ అకల్ తక్త్‌లో 1999లో జరిగిన ఖల్సా పంత్ త్రిశతాబ్ది వేడుకల సందర్భంగా ‘గుర్మత్ సంగీత్’ గీతాలను వాటి అసలు రాగాలలో ఆలపించే అవకాశం లభించింది. ఆ సందర్భంగా అప్పటి ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి, పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్‌సింగ్ బాదల్‌ల చేతుల మీదుగా ఘన సత్కారాన్ని అందుకుంది. - పన్యాల జగన్నాథదాసు -
మహిళలు యుద్ధవిద్యలు నేర్చుకోండి
న్యూఢిల్లీ: మహిళలు యుద్ధవిద్యలు నేర్చుకోవాలని ప్రముఖ గాయని ఆశాభోస్లే హితవు పలికారు. మహిళల భద్రతకు ఇది దోహదం చేస్తుందన్నారు. యుద్ధవిద్యలు నేర్చుకోవడం అనివార్యమైందన్నారు. వ్యకి ్తగత జీవితానికీ, వృత్తికీ మధ్య సమతుల్యం పాటించాలన్నారు. ‘ప్రస్తుత పరిస్థితుల్లో మహిళలు ఒంటరిగా బయటికి వెళ్లడం ఎంతమాత్రం సురక్షితం కాదు. యుద్ధవిద్యలు నేర్చుకోవడం అనేది ఓ అవసరంగా మారిపోయింది’ అని అన్నారు. ఫిక్కి మహిళా విభాగం నగరంలో సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ప్రసంగించారు. స్వీయరక్షణ కోసం తన మనవరాలు జినాయ్ని యుద్ధవిద్యలు నేర్చుకుందంటూ ఈ సందర్భంగా ఓ ఉదాహ రణ చెప్పారు. చిన్నారులు కూడా నేర్చుకుంటే మంచిదన్నారు. ఇప్పుడు ఎక్కువశాతం మంది మహిళలు తమ భవిష్యత్తుపైనే దృష్టి సారిస్తున్నారన్నారు. ‘ఎక్కువ శాతం సమయం రికార్డింగ్ స్టూడియోల్లో కాలం గడిపే నేను అలసిపోయి ఇంటికెళ్లిన తర్వాత విశ్రాంతి తీసుకోను. నేరుగా వంటగదిలోకే వెళతా. నా కుమారుడి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఏదో ఒక వంటకం చేస్తా’ అని తన మనసులో మాట చెప్పారు. కాగా మూస పాటలను పాడడానికి ఇష్టపడని ఆశాభోంస్లే రకరకాల పాటలను ఆలపించారు. ‘నయాదౌర్’ సినిమాలో ‘మాంగ్కేసాత్ తుమ్హారా’ అనే మెలోడీ పాటతోపాటు దమ్ మారో దమ్, మెహబూబా.. మెహబూబా, పియా తూ అబ్తో ఆజా వంటి డిస్కో గీతాలను ఆలపించి గానంలో తన నైపుణ్యంతో అందరినీ అబ్బురపరిచారు.