ఒక్క జీవితంలో ఆమె వంద పోరాటాలు చేసింది. ఆమె ప్రేమ పెళ్లిని ఎవరూ మెచ్చలేదు. ఆమె పాటను ఎవరూ మెచ్చలేదు. ఆమె అక్క ఆమెను ఆదరించలేదు. ఆమెను ఏ హీరోయినూ కోరుకోలేదు. కాని ఆమె నిలబడింది. కొంత ముందు వెనుకలుగానైనా చెల్లెలు కూడా అక్కంత కాగలదు అని నిరూపించింది. ఎన్నో పాటల గంపలు మనకు పంచి నేడు 88వ ఏడులోకి అడుగుపెట్టనుంది. కొన్ని నదులు ప్రవహించి ప్రవహించి సముద్రంలో కలిశాక, ఆ కలిసే చోట, నదే సముద్రమా అన్న భ్రాంతిని కలిగిస్తాయి. ఆశాభోంస్లే అలాంటి నది. సముద్రమంతటి నది. 87 సంవత్సరాల జీవితంలో, ఈ విశ్రాంత సంగమంలో ఒక్కసారి వెనక్కు చూసుకుంటే ఎదుర్కొన్న ఆటుపోట్లు ఎన్ని? తిరిగిన మలుపులెన్ని? ఢీకొట్టుకున్న బండరాళ్లు ఎన్ని? విరిగి పడిన అలలు ఎన్ని? కొన్ని మాత్రమే బయటకు తెలుస్తాయి. అన్నీ ఆమెకే తెలుస్తాయి.
ఒక కుండీలో రెండు రోజాపూలు పూచినప్పుడు ఒక ఇంట్లో రెండు కోకిలలు గొంతెత్తకూడదా? కాని మొదటి కోకిలకే అంగీకారం దొరికింది. రెండో కోకిల దానిని సాధించుకోవాల్సి వచ్చింది. ‘మాంగ్‌కే సాత్ తుమ్హారా’ అని ‘నయాదౌర్’ (1957)లో ఆశాభోంస్లే హిట్ కొట్టే వరకూ ఆమె అంతకు ముందు పాడిన పాటలకు అంతగా గుర్తింపు వచ్చిన దాఖలాలు లేవు. వచ్చినా కొనసాగింపు దొరకలేదు. గీతాదత్, షంషాద్ బేగం, లతా మంగేష్కర్ వంటి ఉద్దండులు ఆ సమయంలో చాలా ప్రతిభావంతంగా పాడుతున్నారు. లతా మంగేష్కర్ ‘మహల్’ (1949)లో ‘ఆయేగా ఆయేగా’ పాడి స్టార్ అయి కూచుంది. అందరూ ఆమెకే పాటలు ఇస్తున్నారు. ఆశాకు ఇచ్చేవాళ్లు లేరు. పైగా ఆమె గొంతు సన్నజాజి తీవ కాదు. పూలరెక్కా కాదు. తుమ్మెద ఝుంకారంలా ఉంటుంది. సున్నితంగా హొయలు పోయే హీరోయిన్లకు అది సూట్ కాదు. మరేమిటి చేయడం?
15-16 ఏళ్ల వయసులో పెళ్లి
అప్పటికే పర్సనల్ లైఫ్‌లో ఆశా చాలా సమస్యలు ఎదుర్కొని ఉంది. తండ్రి మరణించగా ఐదు మంది సంతానం ఉన్న ఇంట్లో పేదరికం తాండవిస్తుంటే దానిని భరించలేకో, నిజంగా ప్రేమించో 15–16 ఏళ్ల వయసులో గణ్‌పత్‌రావు భోంస్లే అనే సంగీత దర్శకుడితో ప్రేమ వివాహానికి వెళ్లిపోయింది. అక్కడ ఇద్దరు పిల్లలు పుట్టాక, మూడో గర్భంలో ఉండగా పుట్టింటికి పారిపోయి వచ్చింది. అక్కడ ఆదరణ లేకపోయేసరికి ఆత్మహత్య చేసుకుందామనుకుంది. కాని కడుపులో ఉన్న బిడ్డ మీద మమకారంతో ఆగిపోయింది. తండ్రి వల్ల అనువంశికంగా తన వద్ద పాట ఉంది. దానినే జీవనం చేసుకుందామని నిశ్చయించుకుంది. గొప్ప గొప్ప హీరోయిన్లు మొదట కామెడీ వేషాలు వేసినట్టు ఆశా కొత్తల్లో కేవలం క్లబ్ సాంగ్స్‌కే పరిమితమైంది. హెలెన్ ఆమెకూ ఆమె హెలెన్‌కూ పరస్పరం మేలు చేసుకున్నారు.
హెలెన్‌కు ఆశా పాడిన ‘దోనియా మే లోగోంకో’ (అప్నా దేశ్), ‘పియా తూ అబ్‌తో ఆజా’ (కారవాన్), ‘యే మేరా దిల్’ (డాన్) ఇవన్నీ పెద్ద హిట్స్. కాని ఎస్.డి.బర్మన్, ఓ.పి.నయ్యర్‌లు ఆశాకు మంచి పాటలు ఇచ్చి ఆమె గొప్ప గాయని అని చెప్పే ప్రయత్నం చేశారు. ఎస్.డి.బర్మన్‌కు ఆశా పాడిన ‘ఆంఖో మే క్యాజీ’ (నౌ దో గ్యారా), నయ్యర్‌కు పాడిన ‘ఆయియే మెహర్‌బాన్’ (హౌరా బ్రిడ్జ్) చాలా మంచి హిట్స్. ఓ.పి.నయ్యర్ లతాతో ఒక్క పాట పాడించకుండా దాదాపుగా అన్ని పాటలు ఆశా చేతనే పాడించాడు. ‘మేరే సనమ్’లో నయ్యర్ కోసం ఆశా పాడిన ‘జాయియే ఆప్ కహా జాయేంగే’ క్లాసిక్.
పెళ్లి కానుకగా..
ఆ తర్వాతి కాలంలో దుమారంగా వచ్చిన ఆర్.డి.బర్మన్ మంచి పాటలు ఆశాకు ఇచ్చాడు. వారివురూ పెళ్లి కూడా చేసుకున్నారు. ఆశాకు తన తరఫు కానుక అన్నట్టుగా ఆర్. డిబర్మన్ ‘చురాలియా హై’ (యాదోంకి బారాత్), ‘దమ్ మారో దమ్’ (హరే రామా హరే కృష్ణ), ‘ఓ మేరే సోనరే సోనరే’ (తీస్రి మంజిల్), ‘రోజ్ రోజ్ ఆంఖో తలే’ (జీవా), ‘మేరా కుచ్ సామాన్’ (ఇజాజత్) వంటి ఎన్నో హిట్స్ ఇచ్చాడు. కాని ఆశా భోంస్లేను సమున్నతంగా నిలబెట్టిన సినిమా ‘ఉమ్రావ్ జాన్’. గజల్ అంటే లతానే చెప్పుకునే ఆ రోజుల్లో సంగీత దర్శకుడు ఖయ్యాం ఆశాభోంస్లే చేత ఆ సినిమా పాటలన్నీ పాడించడం వాటిని పాడిన ఆశా జాతీయ పురస్కారం అందుకోవడం... అదంతా ఎప్పటి నుంచో ఉన్న ప్రతిభకు ఆలస్యంగా దక్కిన గుర్తింపు.
ఉమ్రావ్ జాన్‌లో ‘దిల్ చీజ్ క్యా హై’, ‘ఇన్ ఆంఖొకి మస్తీ’ పండితుల ప్రశంసలు కూడా పొందాయి. తెలుగులో ఆశా భోంస్లే ‘పాలు నీళ్లు’ సినిమాలో ‘ఇది మౌనగీతం’ను మొదటి పాటగా పాడారు. ‘చిన్ని కృష్ణుడు’ (జీవితం సప్తసాగర గీతం), ‘చందమామ’ (నాలో ఊసులకు), ‘ఆశ్వమేథం’ (ఓ ప్రేమా) ఆమె పాడిన మరికొన్ని పాటలు. ఆశాభోంస్లే హిందీ సినిమా పాటను ఒకే రహదారి మీద ప్రయాణించకుండా కాపాడింది. అడ్డుకుంది. రసాస్వాదన అనే గమ్యానికి చేరుకోవడానికి ఆమె పాటల దారి గుండా నడిచే అభిమానులు కోట్లాదిగా ఉన్నారు. వారందరి తరఫున ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు.
– సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
Comments
Please login to add a commentAdd a comment