మహిళలు యుద్ధవిద్యలు నేర్చుకోండి
న్యూఢిల్లీ: మహిళలు యుద్ధవిద్యలు నేర్చుకోవాలని ప్రముఖ గాయని ఆశాభోస్లే హితవు పలికారు. మహిళల భద్రతకు ఇది దోహదం చేస్తుందన్నారు. యుద్ధవిద్యలు నేర్చుకోవడం అనివార్యమైందన్నారు. వ్యకి ్తగత జీవితానికీ, వృత్తికీ మధ్య సమతుల్యం పాటించాలన్నారు. ‘ప్రస్తుత పరిస్థితుల్లో మహిళలు ఒంటరిగా బయటికి వెళ్లడం ఎంతమాత్రం సురక్షితం కాదు. యుద్ధవిద్యలు నేర్చుకోవడం అనేది ఓ అవసరంగా మారిపోయింది’ అని అన్నారు. ఫిక్కి మహిళా విభాగం నగరంలో సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ప్రసంగించారు. స్వీయరక్షణ కోసం తన మనవరాలు జినాయ్‌ని యుద్ధవిద్యలు నేర్చుకుందంటూ ఈ సందర్భంగా ఓ ఉదాహ రణ చెప్పారు.
చిన్నారులు కూడా నేర్చుకుంటే మంచిదన్నారు. ఇప్పుడు ఎక్కువశాతం మంది మహిళలు తమ భవిష్యత్తుపైనే దృష్టి సారిస్తున్నారన్నారు. ‘ఎక్కువ శాతం సమయం రికార్డింగ్ స్టూడియోల్లో కాలం గడిపే నేను అలసిపోయి ఇంటికెళ్లిన తర్వాత విశ్రాంతి తీసుకోను. నేరుగా వంటగదిలోకే వెళతా. నా కుమారుడి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఏదో ఒక వంటకం చేస్తా’ అని తన మనసులో మాట చెప్పారు. కాగా మూస పాటలను పాడడానికి ఇష్టపడని ఆశాభోంస్లే రకరకాల పాటలను ఆలపించారు. ‘నయాదౌర్’ సినిమాలో ‘మాంగ్‌కేసాత్ తుమ్హారా’ అనే మెలోడీ పాటతోపాటు దమ్ మారో దమ్, మెహబూబా.. మెహబూబా, పియా తూ అబ్‌తో ఆజా వంటి డిస్కో గీతాలను ఆలపించి గానంలో తన నైపుణ్యంతో అందరినీ అబ్బురపరిచారు.