పరిపూర్ణ మానవుడు... శ్రీరాముడు!
స్పెషల్ స్టోరీ
ఏప్రిల్ 15 శ్రీరామనవమి
మానవ సంబంధాలు గతి తప్పి, వికృత, విశృంఖల ప్రవర్తన వెర్రితలలు వేస్తున్న ఈ రోజుల్లో మనిషి మనిషిలా ఎలా జీవించాలన్న విషయాన్ని తెలుసుకోవడానికి శ్రీరాముని జీవితాన్ని అధ్యయనం చేయవలసిన అవసరం మునుపటి కంటే చాలా ఎక్కువగా ఉంది. ఈ రోజుల్లోనే, రామ కథాశ్రవణం, రాముని గుణగణాల అధ్యయనం, రాముని అనుసరించే ప్రయత్నం చేయడం ఎక్కువ అవసరం.
బ్రహ్మ ఇచ్చిన వరాలబలం వల్ల రావణ వధ అనేది దేవ, దానవ, యక్ష, సిద్ధ, సాధ్య, కిన్నెర, కింపురుషాదులు ఎవరికీ సాధ్యం కాని పని. నర వానరుల పట్ల రావణునికి ఉన్న తేలిక భావం కారణంగా వారి చేతిలో మరణం లేకుండా ఉండాలని వరంలో భాగంగా బ్రహ్మను కోరనూ లేదు, బ్రహ్మ ఇవ్వనూ లేదు. అందువల్ల నరుడుగా జన్మించి, నరుడుగా వ్యవహ రించినపుడు మాత్రమే శ్రీమహావిష్ణువుకైనా రావణుని చంపడం సాధ్యమౌతుంది.
ఇందుకొరకు వానర రూపంలో జన్మించిన దేవతాగణాల సహాయం తీసుకొని రావణుని వధించవలసి వచ్చింది. ఒక పరిపూర్ణ మానవుడు, ఒక ఆదర్శ మానవుడు ఎలా ప్రవర్తించాలి? నరుల పట్ల ఉన్న తేలిక భావం తొలగించాలన్నా, ఆదర్శ మానవ సంబంధాలు, ఆదర్శ కుటుంబ సంబంధాలు ఎలా ఉండాన్న విషయాన్ని నా జీవితమే నా సందేశం అన్నట్లుగా జీవించి చూపాలన్నా ఇది అవసరం అవుతుంది. అలా జీవించి చూపిన అవతారమే శ్రీరామావతారం.
మానవ సంబంధాలు గతి తప్పి, వికృత, విశృంఖల ప్రవర్తన వెర్రితలలు వేస్తున్న ఈ రోజుల్లో మనిషి మనిషిలా ఎలా జీవించాలన్న విషయాన్ని తెలుసుకోవడానికి శ్రీరాముని జీవితాన్ని అధ్యయనం చేయవలసిన అవసరం మునుపటి కంటే చాలా ఎక్కువగా ఉంది. ఈ రోజుల్లోనే, రామ కథాశ్రవణం, రాముని గుణగణాల అధ్యయనం, రాముని అనుసరించే ప్రయత్నం చేయడం ఎక్కువ అవసరం. రాముడిని దేవుడిగా కొలవడం ముమ్మాటికీ తప్పు కాదు. కానీ రాముడిని దేవుడిగా ఆరాధిస్తూనే, రాముడి జీవితం నుంచి మనం ఎలా జీవించాలి అన్న అంశాన్ని నేర్చుకోవడం అంతకంటే ముఖ్యం.
రామాయణ రచనా ప్రారంభంలోనే వాల్మీకి మహర్షి... తన ఆశ్రమానికి వచ్చిన బ్రహ్మ మానస పుత్రుడైన నారద మహర్షిని ఏమడిగాడంటే... ఈ లోకంలో ఇప్పుడే, ఇక్కడే ఉన్న గుణవంతుడు, వీర్యవంతుడు, ధర్మాత్ముడు, కృతజ్ఞత భావం కలిగినవాడు, సత్యం పలికేవాడు, దృఢమైన సంకల్పం కలిగినవాడు, చారిత్రము కలిగినవాడు, అన్ని ప్రాణుల మంచి కోరేవాడు, విద్యావంతుడు, సమర్ధుడు, ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపించేంత సౌందర్యం కలిగినవాడు, ధైర్యవంతుడు, క్రోధాన్ని జయించినవాడు, తేజస్సు కలిగినవాడు, ఎదుటివారిలో మంచిని చూసేవాడు, ఎవరి కోపం దేవతలను కూడ భయపెడుతుందో అట్టి వ్యక్తి ఉంటే నాకు చెప్పండి అని అడిగాడు.
వాల్మీకి మహర్షిలో జాగృతమైన బ్రహ్మజిజ్ఞాసే ఈ ప్రశ్న అన్నది ఇందులో ఉన్న నిగూఢార్థం. వాల్మీకి మహర్షి నారదులవారిని షోడశ గుణాత్మకమైన భగవత్ తత్వాన్ని గురించి ప్రశ్నించగా నారదుడు ఈ లక్షణాలన్నీ నర రూపంలో భూమిపై నడయాడుతున్న నారాయణుడైన శ్రీరామునివేనని వివరిస్తాడు. అలా ఈ లక్షణాలు పరిపూర్ణ మానవుని లక్షణాలుగా కూడా స్వీకరించదగినవి.
చాలా చిన్న కారణాలకే కుంగి పోయి నిస్పృహకు గురయ్యే నేటి తరం శ్రీరాముని వద్ద నేర్చుకో వలసిన అతి గొప్ప లక్షణం స్థిత ప్రఙ్ఞత్వం.
ఈ రోజు ఉదయం తండ్రి పిలిచి ‘‘రామా రేపే నీ పట్టాభిషేకం. నీవు, నీ భార్య అవసరమైన దీక్షను చేపట్టండి’’ అన్నప్పుడు ఎంత ప్రశాంతంగా ఉండిపోయాడో ఆ రోజే రాత్రి కైకేయి పిలిపించి, ‘రామా! మీ నాన్న చెప్పలేక పోతున్నారు. నీకు పట్టాభిషేకం చేయడం లేదు, రేపటి నుంచీ నీవు జటాధారివై, ముని వృత్తి స్వీకరించి 14 సంవత్సరాల పాటు వనవాసం చేయాలి’ అని చెప్పినప్పుడూ అంతే సహజంగా స్వీకరించాడు. ఆవేశపడిపోయి, తల్లిదండ్రులను శాపనార్థాలు పెట్టకుండా ఉండడమే కాక, ఆవేశపడుతున్న లక్ష్మణుడిని మందలించి అరణ్యవాసానికి చాలా హాయిగా సిద్ధపడిపోయాడు.
దేశభక్తి మాతృభక్తి కూడా రాముని చూసి నేర్చుకోవాలి. రావణ సంహారం తరువాత లంకా నగరంలో సంచరిస్తూ ఆ నగర సౌందర్యానికి ముగ్ధుడైన లక్ష్మణునితో ‘బంగారంతో నిండినదైనా నాకు లంకా నగరం రుచించదు లక్ష్మణా, జననీ జన్మ భూములు స్వర్గం కంటే గొప్పవి’ అన్నాడు. ఇంతకుమించిన దేశభక్తి, జాతీయతా భావన మరెక్కడ కనిపిస్తాయి? కృతజ్ఞతా గుణం మానవునికి ఉండవలసిన ఉత్తమ గుణాలలో ప్రధానమైనది.
ఈ గుణం రామునిలో పుష్కలంగా దర్శనమిస్తుంది. పరిస్థితుల ప్రభావం వల్ల తండ్రికి దహన సంస్కారం కూడా చేయలేకపోతాడు రాముడు. సీతను రక్షించడం కోసం రావణునితో పోరాడి కొన ప్రాణాలతో మిగిలి ఉన్న జటాయువు పట్ల కృతజ్ఞతాభావంతో రాముడు, జటాయువుకు అంత్యక్రియలు నిర్వహిస్తాడు. ఇదీ కృతజ్ఞతా గుణం అంటే. మనకు చిన్న ఉపకారం చేసినవారిని కూడా మరచిపోకుండా వారికి అవసరమైనప్పుడు ప్రతి సహాయం చేయగలిగే సంస్కారం రాముని దగ్గరే నేర్చుకోవాలి.
మనలను ఆశ్రయించి శరణు కోరిన వారిని పరిత్యజించకుండా శరణు ప్రసాదించడాన్ని వ్రతంగా కొనసాగించినవాడు రాముడు. చంపదగినట్టి శత్రువు రావణుని సోదరుడైన విభీషణుడు తనను శరణు కోరి అర్ధించినపుడు, (హనుమంతుడు తప్ప మిగిలిన) వానర ప్రముఖులు అవమానించినా, ఎట్లాంటి సంశయం లేకుండా అతనికి శరణు ప్రసాదించి, రావణుడే కోరినా శరణమిస్తానని అంటాడు. ఒక పాలకుడుగా ప్రజారంజకమైన పాలన అందివ్వడమే కాదు.
ప్రజలకు తాను ఆదర్శంగా నిలవగలగాలి. ఉత్తముడైన పాలకుని లక్షణం అది. నా వ్యక్తిగత జీవితం, నా ఇష్టం అనడానికి పాలకునికి హక్కు లేదు. అందుకే తను రావణ వధానంతరం సీతను చేపట్టడాన్ని గురించి విమర్శ రాగానే, ఆమెను పరిత్యజించడానికి సిద్ధపడ్డాడు. రాముడు కేవలం సీతారాముడే కాదు రాజా రాముడు కూడా. తన మీద విమర్శలు వెల్లువెత్తుతున్నా, ప్రజలు చీదరించుకొంటున్నా, నీ చేష్ఠలు భరించ లేకుండా ఉన్నాం, దిగిపోవయ్యా మహానుభావా అని ప్రజలు నెత్తీ నోరూ మొత్తుకొంటున్నా కుర్చీని పట్టుకొని వేలాడుతున్న నేటి రాజకీయ నాయకులు రాముని చూచి నేర్చుకోవలసినది ఎంతైనా ఉంది.
ఇతర ఆభరణాలన్నీ నశించిపోయేవే శాశ్వతమైన భూషణం వాగ్భూషణమే. శ్రీరాముడిని వచస్విగా, ‘వాగ్మి’ (చక్కని వక్త)గా వాల్మీకి వర్ణించాడు. రామచంద్రుడు మృదుభాషి, మితభాషి, మధురభాషి, పూర్వభాషి, స్మితపూర్వభాషి అని ప్రశంసించాడు. తానే ముందుగా పలకరించడం, నెమ్మదిగా, ప్రశాంతంగా ఆవేశానికి లోను కాకుండా మాట్లాడగలగడం రాముని ప్రధాన లక్షణాలు. రాముడు చిరునవ్వుతో పలకరించి, తరువాత మధురమైన మాటలతో మనసు చల్లబరచేవాడు. అంతేకాదు.
కొద్ది నిముషాలు ఎదుటి వ్యక్తితో మాట్లాడగానే అతని వ్యక్తిత్వాన్నీ, సామర్థ్యాన్నీ అంచనా వేయగలిగే సామర్థ్యం రాముని సొత్తు. కిష్కింధకాండలో హనుమంతుడు రాముని తొలిసారిగా యతి వేషంలో కలిసి రామునితో పరిచయ వాక్యాలుగా నాలుగు మాటలు మాట్లాడుతాడు. హనుమంతుని సామర్థ్యాన్ని గురించి రాముడు కచ్చితమైన అంచనా వేస్తాడు. ఈ వ్యక్తి వేదవేత్త అని, వ్యాకరణ నిపుణుడనీ, మాట్లాడే సమయంలో ఇతని శరీర భంగిమలూ (బాడీ లాంగ్వేజ్) మాట్లాడే విధానమూ ఇతనిని ఒక అసాధారణ ప్రతిభాసంపన్నుడిగా తెలియ జేస్తున్నాయని, ఇట్టి మంత్రివర్యుని కలిగిన రాజుకు అసాధ్యమైనది ఉండదనీ లక్ష్మణునితో చెబుతాడు రాముడు. దీన్నిబట్టే రాముని సూక్ష్మబుద్ధి ఎలాంటిదో తెలుసుకోవచ్చు.
రాముని సోదర ప్రేమ, సోదరుల పట్ల అతనికి ఉన్న తాపత్రయం వారి పట్ల అతనికి ఉన్న విశ్వాసం అసాధారణమైనవి. రాముని మరలా తీసుకువెళ్లి రాజ్యాభిషేకం చేయడానికి భరతుడు సైన్యంతో సహా బయలుదేరాడు. దూరం నుంచీ సైన్య సమేతంగా వస్తున్న భరతుని చూచి మనలను చంపి రాజ్యాధి కారాన్ని శాశ్వతం చేసుకోవడానికి భరతుడు వస్తున్నాడు. అతడిని నేను తుదముట్టిస్తానని ఆవేశపడతాడు లక్ష్మణుడు. అప్పుడు రాముడు భరతుని సోదర ప్రేమనూ, తనపట్ల అతనికి ఉన్న భక్తి భావాన్ని లక్ష్మణునికి వివరిస్తాడు. వ్యక్తుల పట్ల లోతైన అవగాహనతో కూడిన రాముని వ్యక్తిత్వం అచ్చెరువు కొలుపుతుంది.
తండ్రి నేరుగా అడవులకు వెళ్లమని చెప్ప లేదు, పెపైచ్చు వెళ్లవద్దని బతిమాలు తున్నాడు. అయినా తండ్రి ఏనాడో ఇచ్చిన మాట వ్యర్థం కారాదనీ తద్వారా తండ్రికి అసత్యదోషం అంటరాదన్న రాముని తపన ఎంత విశేషమైంది! తండ్రి మరణించాక అతని అప్పులతో మాకు సంబంధం లేదు ఏం చేసు కొంటారో చేసుకోండి అని అప్పులవాళ్లను బుకాయిస్తున్న నేటి సంతానం రాముని నుంచి ఎంతో నేర్చుకోవాలి.
తల్లిదండ్రులను అనాథాశ్ర మాలలో చేర్చి వదిలించుకొనే ప్రయత్నాలు చేయడం, ఆస్తిపాస్తుల కోసం అవసరమైతే తల్లిదండ్రులనూ, సోదరులనూ తుదముట్టించడానికి వెనుకాడని నేటి యువత రాముని పితృప్రేమ నుంచీ, సోదర ప్రేమ నుంచీ ఎన్ని గుణపాఠాలను నేర్చుకోవాలి! వికృత, అసహజ సంబంధాలు అనే భూతమ్ జడలు విప్పి నృత్యం చేస్తున్న ఈ రోజుల్లో రాముని ధర్మబద్ధమైన వైవాహిక జీవిత నిష్ఠ, ఏక పత్నీవ్రత నియమం, సుందరాంగి తనంత తాను వలచి వచ్చి వారించినా కన్నెత్తై చూడని నిగ్రహ సంపత్తీ నేటి యువతరానికి మార్గదర్శకాలు.
రామకథ ఈనాటి సమాజానికి కూడా గురుస్థానంలో నిలుపుకోవలసిన మహాకావ్యమే, రాముడు నేటికీ మనకు మార్గదర్శకుడే. నాటికీ నేటికీ ఏనాటికీ రాముని శీలసంపద, గుణసంపత్తి, అగాధమైన అమృతసాగరం. సర్వకాలాలకూ, సర్వదేశాలకూ ఒక దీపస్తంభం రాముని వ్యక్తిత్వం. జన్మతః రాక్షసుడైనా రామబాణ స్పర్శతో విశేషమైన పరివర్తనకు లోనైన మారీచుడు రాముని వ్యక్తిత్వాన్నీ, దివ్యత్వాన్నీ సంపూర్ణంగా అవగాహన చేసుకొన్న ధన్య జీవి.
అతని మాటల్లోనే రాముని గురించిన ఏకవాక్య సమగ్ర వివరణ ‘రామో విగ్రహవాన్ ధర్మః’. మూర్తీభవించిన ధర్మమే రాముడు. ఈ ఒక్క వాక్యం శ్రీరాముని పరిపూర్ణమైన మానవ త్వానికీ, దివ్యత్వానికీ దర్పణం పడుతుంది.
- ఆర్.ఎ.ఎస్.శాస్త్రి
రిటైర్‌డ ప్రిన్సిపాల్, ఆర్‌ట్స అండ్ సైన్‌స కాలేజ్, ఆదోని
తండ్రి నేరుగా అడవులకు వెళ్లమని చెప్ప లేదు, పెపైచ్చు వెళ్లవద్దని బతిమాలు తున్నాడు. అయినా తండ్రి ఏనాడో ఇచ్చిన మాట వ్యర్థం కారాదనీ తద్వారా తండ్రికి అసత్యదోషం అంటరాదన్న రాముని తపన ఎంత విశేషమైంది!