తాత గొప్పలు | Raghaviah was born in the middle class family | Sakshi
Sakshi News home page

తాత గొప్పలు

Published Sun, Nov 18 2018 2:13 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

Raghaviah was born in the middle class family - Sakshi

కేశవాపురం గ్రామంలో రాఘవయ్య అనే వ్యక్తి ఉండేవాడు. రాఘవయ్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టాడు. తనకు రాజకీయాలంటే ఇష్టం ప్రజా సేవ చేయాలని ఆరాటపడే వాడు. రాజకీయాల్లోకి వచ్చి వార్డు సభ్యునిగా గెలిచాడు. తదనంతరం సర్పంచ్‌గా పోటీ చేసి ఎన్నికైనాడు. అలా ఐదు పర్యాయాలు గ్రామ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఉండసాగాడు. పాతిక సంవత్సరాలుగా రాఘవయ్యనే సర్పంచ్‌ కనుక కేశవాపూర్‌ అభివృద్ధికి పాటు పడసాగాడు. పాఠశాల, ఆస్పత్రి, రహదారులు, వ్యవసాయం పలు అభివృద్ధి కార్యక్రమాలతో గ్రామానికి కీర్తి తెచ్చాడు.రాఘవయ్యకు ఒక్కగానొక్క కుమారుడు సీతయ్య. సీతయ్యను అల్లారుముద్దుగా పెంచారు. సీతయ్యను రాఘవయ్య బయటకు తీసుకెళ్ళినప్పుడు ఆ బడి నేనే కట్టించాను,ఆస్పత్రి నేనే తెచ్చాను,రోడ్లు నేనే వేయించాను,మోరీలు నిర్మించాను,బావులు తవ్వించాను అంటూ సీతయ్యకు చెప్పేవాడు. సీతయ్య ప్రతిరోజూ అందరికీ ‘మా నాన్న అది కట్టించాడు, ఇది కట్టించాడు‘ అంటూ చెప్పసాగాడు. రాఘవయ్య కుమారుడు అలా చెప్తుంటే చాలా సంతోషపడ్డాడు. సీతయ్య పెద్దవాడయ్యాడు వివాహం చేశారు. సీతయ్య కూడా రాఘవయ్యతో పాటుగా గ్రామంలో తిరగసాగాడు. కానీ సీతయ్య మాత్రం ప్రతి ఒక్కరికి తండ్రి రాఘవయ్య చేసిన అభివృద్ధిని పొగుడుతూ కాలం వెళ్ళదీయసాగాడు.

సీతయ్య కుమారుడు శీనయ్య. శీనయ్య పెద్దగయ్యాడు. ఒకరోజు శీనయ్య గ్రామంలోకి వెళ్ళాడు. గ్రామ పంచాయతీ భవనంలో రాఘవయ్య పంచాయతీ చెబుతున్నాడు. అక్కడే ఉన్న సీతయ్య పంచాయతీ వద్దకు వచ్చిన వేరే గ్రామ పెద్దలకు మా నాన్న అది కట్టించాడు,ఇది కట్టించాడు అంటూ చెప్పసాగాడు. ప్రతిసారీ సీతయ్య తండ్రి గూర్చి ఊతపదంలా  చెప్పడం విసుగనిపించింది. ఒక్కోసారి చాలా కోపం వచ్చినా అణచుకుంటున్నారు ప్రజలు. రాఘవయ్యపై ఉన్న ప్రేమ కొద్దీ సీతయ్యను ఏమీ అనలేక పోతున్నారు. అంతలోనే అక్కడికి శీనయ్య వచ్చాడు. శీనయ్యని చూడగానే వారికి ఒక ఆలోచన వచ్చింది.శీనయ్యను దగ్గరికి పిలిచారు. శీనయ్య మీతాత ఏం చేస్తాడు అని అడిగారు. ‘మా తాత సర్పంచ్‌. అన్ని పనులు చేస్తాడు. గొప్పోడు‘ అని శీనయ్య అన్నాడు. ఒక్కసారిగా అందరూ తలపట్టుకున్నారు సీతయ్యతోనే వేగలేక పోతున్నామంటే, శీనయ్య తయారయ్యాడా! అనుకున్నారు. సీతయ్య మీసం తిప్పసాగాడు. వారిలో మల్లయ్య అనే వృద్ధుడు అందర్నీ నిశ్శబ్దంగా ఉండమని, అయ్యా! శీనయ్య ‘మరి మీ నాన్నగారు ఏం చేస్తారు‘ అని అడిగాడు. ‘మా తాత అది కట్టాడు, ఇది కట్టాడని తాత గొప్పలు అందరికీ చెప్తుంటాడు. మా నాయనకు అదే పని, నేను పడుకున్నా నిద్రలేపి మరీ చెబుతాడు‘ అని అన్నాడు శీనయ్య. అందరూ ఒక్కసారిగా సీతయ్య వైపు చూశారు. సీతయ్య తలదించుకున్నాడు. కిటికీలోంచి వింటున్న రాఘవయ్య కొడుకు పట్ల తాను చేసిన నిర్లక్ష్యాన్ని శీనయ్య ద్వారా వినడం బాధ కలిగించింది. సీతయ్య శీనయ్యను తీసుకుని ఇంటికి వెళ్లాడు. ప్రజలంతా మనసులో నవ్వుకుంటూ ఇకనైనా సీతయ్య మారాలంటూ మల్లయ్య తాతను అభినందిస్తూ ఇంటికి వెళ్లారు. రాఘవయ్య సీతయ్యను కూర్చోబెట్టి ఇక నుంచి గొప్పలు చెప్పడం మాని పదిమందికీ ఉపయోగపడే పనులు చేయమని చెప్పాడు. సీతయ్యలో కూడా అనతికాలంలోనే మార్పు వచ్చి గ్రామ అభివృద్ధి పనులు చేయసాగాడు. సీతయ్యలో మార్పు వచ్చినందుకు కేశవాపురం ప్రజలు కూడా ఆనందించారు
-ఉండ్రాళ్ళ రాజేశం 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement