ఎవరూ లేరండీ..
ఉగాది కథల పోటీలో ప్రత్యేక ప్రశంసకు ఎంపికైన కథ
ఠంగు ఠంగుమని గోడ గడియారం పదిమార్లు గంట కొట్టింది. మంచం మీద కూర్చొని మోకాళ్ల నుండి కిందివరకు కాళ్ళు ఒత్తించుకొంటున్న జగన్నాథం, నేలమీద కూర్చొని ఒత్తుతున్న రాఘవయ్య ఇద్దరూ ఒక్కమారుగా ఉలిక్కిపడి గడియారం వంక తలతిప్పి చూశారు. ‘అప్పుడే పదయిపోయిందే... ఇక పడుకొందాం...’ అంటూ జగన్నాథం కాళ్ళను పక్కకు పెట్టాడు. రాఘవయ్య పైకి లేచి జగన్నాథానికి ఇంకేమైనా కావాలా అని చుట్టూ చూశాడు. వెనక్కు తిరుగుతున్న రాఘవయ్యతో జగన్నాథం అన్నాడు, ‘రేపు టిఫిన్ ఇడ్లీ కదా! ఇడ్లీలోకి చుక్కాకు చెట్నీ ఎలా ఉంటుంది?’
‘పుల్లపుల్లగా బాగుంటుందయ్యా! తోడుగా నల్లగారం పొడి కూడా ఉంది. నాలుగు నేతిచుక్కలు వేసుకుంటే... మీరు మామూలుగా తినే నాలుగు ఇడ్లీల కన్నా ఇంకో రెండు ఎక్కువ తింటారు.’
‘మధ్యానం నాటుకోడి పులుసు చేసుకొందాం. చాల్రోజులయింది తిని...’
రాఘవయ్య నోట్లో నీళ్ళు ఊరాయి. ‘నాటుకోడి అయితే నేను ఒక ముద్ద సంగటి చేసుకొంటాను. మీరూ కొంచెం తిని చూడండి...’
‘సంగటి నాకు అరగదేమో రాఘవయ్యా...’
‘అన్నీ అరగతాయి లెండయ్యా... అన్నం కూడా చేస్తా కదా... నచ్చకపోతే అన్నమే తిందురుగాని...’
‘కొంచెం మిరియాల చారు కూడా చెయ్యాలి...’
‘చేస్తానయ్యా... ఇక నేను పడుకుంటా. తెల్లార్తోనే లేచి చెత్తలూడ్చి, బోకులు కడిగి, మీకు పేపరు తీసుకొచ్చి, ఆరున్నరకల్లా కాఫీ రెడీ చెయ్యాలి గదా... మంచినీళ్ళు అక్కడ పెట్టాను. ఇంకేమన్నా కావాలంటే గట్టిగా ఒకమారు పిలవండి. లేచేస్తాను’ అంటూ సమాధానం కోసం చూడకుండా పడుకోవడానికి ముందు గదిలోకి వెళ్ళిపోయాడు రాఘవయ్య.
ఉదయం ఎనిమిది గంటలకల్లా సుశీలమ్మ ఒక చేటలో ఆవు పేడ తీసుకొచ్చింది. బాత్రూంలోకెళ్ళి బక్కెట్లో నీళ్ళు పట్టుకొచ్చి పేడ కలిపింది. ఇంటిముందు పరకతో తోసేసి పేడనీళ్ళు చల్లింది. పేడనీళ్ళను కొంతసేపు ఆరనిచ్చి పరకతో అలికింది. ఆ తర్వాత ముగ్గుపిండి తీసుకొని తనకు వచ్చిన ముగ్గు వెయ్యసాగింది. జగన్నాథం ముందు గది తలుపు దగ్గర కుర్చీ వేసుకొని పేపరు చదువుతున్నాడు.
అప్పుడప్పుడూ ముగ్గు వెయ్యడంలో సుశీలమ్మ నేర్పరితనాన్ని పరిశీలనగా చూస్తున్నాడు. ఆమెకు అరవై ఏళ్ళుంటాయి. ‘ఎవరూ లేరయ్యా! ఏదైనా పనిచెప్పండి. పడి ఉంటాను’ అని ఒకరోజు వచ్చింది. తనకు అన్ని పనులు చెయ్యడానికి రాఘవయ్య ఉన్నాడు, ఆమె దీనంగా అడిగితే కాదనలేకపోయాడు జగన్నాథం. అప్పుడే ఇంటిముందు పేడనీళ్ళు చల్లి ముగ్గు పెట్టడానికి మనిషిలేరే అని గుర్తుకు వచ్చింది. ‘మంగళవారం, శుక్రవారం వచ్చి పేడతో అలికి వెళ్ళు, నెలకు ఎంతో కొంత ఇస్తాను,’ అన్నాడు.
సరే అంది సుశీలమ్మ. ఆమె అలకడం ముగ్గు పెట్టడం చూస్తూ, అప్పుడప్పుడూ పేపర్లోకి తల దూర్చుతూ ఉన్న జగన్నాథానికి హఠాత్తుగా గుండుగల్లు చెట్నీ గుర్తుకు వచ్చింది. ఎన్నో ఏళ్ళ నుండి ఆ చెట్నీ తినాలనుకొంటున్నాడు గాని చేసిపెట్టేవాళ్ళే లేరు. ఎవర్నడిగినా ఆ పేరే మేము వినలేదు అంటున్నారు. సుశీలమ్మను అడిగి చూద్దాం అనుకొన్నాడు. ‘నీకు గుండుగల్లు చెట్నీ చెయ్యడం తెలుసా?’ అన్నాడు. ‘గుండుగల్లు సెట్నీనా...?’ కాస్సేపు ఆలోచనలో పడింది సుశీలమ్మ. ‘ఎప్పుడూ విన్లేదుసా... ఎవురూ ఆ మాట అనింది కూడా గురుతుకు రావడం లేదు. నువ్వు సెప్పే గుండుగల్లు సెట్నీ ఎట్లా ఉంటుంది? యాడ దిన్నావు?’ అంది.
‘నలభై ఏళ్ళకు ముందు ఒక స్నేహితుణ్ణి... ఆయన పేరు చిన్నస్వామి... ఆ చిన్నస్వామిని చూడడానికి నేను గుండుగల్లు వెళ్ళా. ఆ ఊరు ఆంధ్రా కర్ణాటక బార్డర్లో ఉంది. ఆ ఊళ్ళో మా స్నేహితుడి భార్య ఈ చెట్నీ చేసిపెట్టింది. ఎంత బాగుంది అంటే నేను తినే అన్నమంతా ఆ చెట్నీతోనే తిన్నాను. ఇంకో కూర తాకలేదు. ఈ చెట్నీ ఎలా చేస్తారు అంటే ఆమె అప్పుడేదో చెప్పింది కాని ఏమీ గుర్తుకు రావడం లేదు. నాకేమో ఆ చెట్నీ మరుపుకు రావడం లేదు. వాళ్ళేమో ఆ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయారట.
ఎక్కడికి పోయారో ఏమో తెలీదు,’’ జగన్నాథం గుండుగల్లు చెట్నీ పూర్వవృత్తాంతం చెప్పాడు.
సుశీలమ్మకు చాలా జాలివేసింది. ‘అయ్యో!’ అనుకొంటూ, ‘ఎవుర్నన్నా అడుగుతా సా... ఆ పక్కోళ్ళు ఈ పక్క ఎవురన్నా ఉండారేమో... వాళ్ళకు తెలిసుంటుంది. నువ్వు సెప్పిన పేరేమి? గుండుగల్లు సెట్నీనా? అదేనా దానిపేరు?’ అంది.
‘ఆ చెట్నీ పేరు ఏమో నాకు తెలీదు సుశీలమ్మా... నేను ఆ ఊర్లో తిన్నా కాబట్టి గుండుగల్లు చెట్నీ అంటున్నాను...’
ఆలోచనలో పడిపోయింది సుశీలమ్మ. ఆలోచనతోబాటు కొంత దిగులు కూడా కలిగింది. ‘సార్... నువ్వు ఎప్పుడైనా సీకికొళ్ళతో సేసిన సెట్నీ తిన్నావా?’ అంది.
‘సీకికొళ్ళా...?’ నోరువెళ్ళబెట్టాడు జగన్నాథం, ‘సీకాయచెట్టు చిగుర్లేనా నువ్వు చెబుతున్నావు?’
‘అవున్సా... సీకాయ సెట్టు సిగుర్లే... ఎర్రగా ఉంటాయి... అవి దెచ్చి ఇడిపించుకొని చిన్నయర్రగడ్లు, మెంతులు, కొంచెం జీలకర్ర, ఎండుమిరపకాయ, ఉప్పు, చింతపండు అన్నీ నూనెలో బాగా ఏయింసి రోట్లో ఏసి తిరగబాత పెడితే శానా శానా బాగుంటుంది సార్... రేపు ఎప్పుడైనా తెచ్చేదా...’ యజమానికి ఏదో ఒక తృప్తి కలిగించాలి అనే స్థిర నిర్ణయంతో ఉన్నట్లు అంది సుశీలమ్మ.
‘ఈకాలంలో సీకాయచెట్లు ఇంకా ఉన్నాయా? నేను చిన్నప్పుడు ఎప్పుడో చూశాను.’
‘గొల్లపల్లి దగ్గర ఒక సెట్టుంది సార్... దగ్గరే కదా... ఇది సిగురుపెట్టే టయిమే... ఉంటే కోసుకొస్తాను... రాఘవయ్య దగ్గర నేనే ఉండి సెట్నీ సేయిస్తాను.’
గుండుగల్లు చెట్నీ కాకపోతే ఇంకో కొత్త చెట్నీ రుచి చూడొచ్చుగదా అని జగన్నాథం ‘సరే’ అన్నాడు.
సుశీలమ్మలో ఆలోచన ఆగలేదు. ‘‘పాపం ఈ సారుకు అన్నీ ఉన్నాయి. డబ్బుకు లోటులేదు. అన్నీ ఉన్నా ఈ వయసులో నోటికి రుసిగా సేసిపెట్టే వాళ్ళే లేరు... నాకు తెలిసింది ఏదయినా సేసిపెడితే బాగుణ్ణు’’ అనిపించింది.
ఆ ఆలోచనలతోనే ముగ్గు వెయ్యడం పూర్తిచేసి ముగ్గుపిండి గిన్నెలు లోపల కిటీకీ ఊచల దగ్గర పెడుతున్నప్పుడు ఏదో గుర్తుకొచ్చిందేమో... గట్టిగా ‘సార్...’ అంది. జగన్నాథం ఉలిక్కిపడి ఆమె వంక చూశాడు.
‘నీకు నల్లేరు సెట్నీ సేస్తారు తెలుసా?’ అంది.
జగన్నాథానికి నల్లేరు తెలుసు. తన చిన్నప్పుడు ఎవరికయినా కుక్క కరిస్తే నల్లేరు దంచి, దాంతోబాటు ఒక రాగి దమ్మిడీని గాటుపడిన చోట పెట్టి కట్టుకడితే విషం పీల్చేస్తుందని అందరూ అనేవారు. నల్లేరుతో బ్రాహ్మణులు సాంబారు చేసి తింటారని కూడా విన్నాడు. చెట్నీ సంగతి వినలేదు. తన ఇంట్లో ఎప్పుడూ చెయ్యలేదు. సుశీలమ్మకు సమాధానం ఇస్తూ, ‘తెలుసుగాని... ఎప్పుడూ తిన్లేదు,’ అన్నాడు.
సుశీలమ్మ కళ్ళు ఆనందంతో మిలమిలమన్నాయి. అయ్యగారు ఇంతవరకూ రుచి చూడని చెట్నీ... ఒకటి కాదు రెండు చేసిపెట్టే అవకాశం వచ్చింది కదా అని సంబరపడిపోయింది.
‘మంగలారం సీక్కొళ్ళు తెస్తాను... మల్లా సుక్రోరం నల్లేరు తెస్తాను. నేనే దగ్గరుండి సేయిస్తాను,’ అంది వెళ్ళబోతూ. సుశీలమ్మ వెళ్ళిపోతూ ఉంటే జగన్నాథం, ‘సుశీలమ్మా’ అని పిలిచాడు.
ఆమె ఆగింది. ‘నాకేదో చేసిపెడతానంటున్నావు... నీ సంగతేమిటి? నీకేమి తినాలనిపిస్తుంది?’ అన్నాడు.
సుశీలమ్మ సిగ్గుపడి పోయింది. చెప్పాలా వద్దా అని ఒక క్షణం సంశయించి ఆ తర్వాత చెప్పింది. ‘ఏడేడిగా సికెన్ బిరియానీ దానికి తోడు ముసిలుమోళ్ళు సేసినట్లు పలసగా వంకాయకూర తినాలనుంది సార్...’ అంది. అన్న తర్వాత సుశీలమ్మ అక్కడ ఉండలేదు. తను చెప్పి ఉండకూడదు, తప్పు చేశాను అన్నట్టు జగన్నాథం ఇంకో ప్రశ్న వెయ్యక మునుపే గబగబా వెళ్ళిపోయింది.
మంగళవారం కొంచెం ఆలస్యంగా వచ్చింది సుశీలమ్మ. ఒకచేతిలో యథాప్రకారం చేటలో ఆవుపేడ ఉంది. ఇంకోచేతిలో ఒక పలచని గుడ్డలో ఏవో చుట్టుకొని తెచ్చింది. మంగళవారం సీకిచిగుళ్ళు తెస్తానని చెప్పింది గుర్తుకొచ్చింది జగన్నాథానికి. సుశీలమ్మ ముఖంలో ఏదో తేడా కనిపించింది జగన్నాథానికి. తన పనంతా పూర్తయిన తర్వాత నడుంమీద చేతులు పెట్టుకొని నిలబడి ముగ్గు వంక కొంతసేపు పరీక్షగా చూసి, తృప్తిగా తల ఆడించుకొంటూ లోపలివైపు రావడానికి అడుగులు వేస్త్తూ జగన్నాథానికి ఎదురుగా బయటిపక్కే నిలబడి మొదలుపెట్టింది.
‘సూడండి సా... నేను తొలిసారి నీ దగ్గరికి వచ్చినప్పుడు ఏం సెప్పాను? ఎవురూ లేరని సెప్పాను గదా... నేను సెప్పింది నిజమేసా...’ లోపల ఏదో ఉద్వేగం తన్నుకొచ్చినట్లుంది సుశీలమ్మకు. రెండు క్షణాలు ఆగి మళ్ళీ మొదలుపెట్టింది. ‘నాకొక్క కొడుకున్నాడు సార్... ఏడేళ్ళయింది వాడు గలుఫు దేశాలు పట్టిపొయ్. నిన్న ఇంటి కొచ్చినాడు... వచ్చి నాల్రోజులయిందట. తర్వాత తెలిసింది. ఈవూర్లో వాడి సావాసగాళ్ళు ఇద్దరున్నారు.
వాళ్ళతో ఏదో బిజినెస్సు మాట్లాడేదానికి వచ్చినాడంట, ఇంటికొచ్చినోడు ‘‘అమ్మా ఎట్లుండావు? తిన్నావా లేదా? నీకు పూట ఎట్లగడస్తా ఉంది?’’ అని అడగాల్నా? వద్దా? అవేమీ లేదు. పక్కన కూర్చోలేదు. నా సెయ్యి పట్టుకోలేదు. నాకేమో కళ్ళలో నీళ్ళు దుమకతా ఉన్నాయి. నాయ్నా అని వాణ్ణి వాటేసుకోవాలని ఉంది. వాడు దగ్గరికొస్తే పాంటూ సర్టూ నలిగిపోతాయనేటట్లు నాలుగడుగుల దూరంలోనే నిలబడినాడు సార్... ఎంతసేపు? వక్కకొరికినంత సేపు.
సేతిలో ఏదో పొట్లం ఉంది. దాన్ని నా ముందు పెట్టి ... ఉహూ... పెట్టలా... నా ముందు పడేసి, ‘‘నీకోసం సికెన్ బిరియానీ తెచ్చాను. నీ కిష్టం కదా!’’ అన్నాడు. అప్పుడు సూడండి సా... నాకు యెక్కడ లేని కోపం వచ్చింది. వాడు ఇసిరేసిన పొట్లం అందుకొని నేను యిసిరేశాను సూడండిసా... అదిపొయ్ తలుపుకవతల యీదిలో పడింది. ఆ తర్వాత వాడు ఒక నిమసం కూడా నిలబడ్లా. ‘‘నువ్వేదో కోపంగా వుండావు. రేపు పొయ్యేటప్పుడు మల్లా వస్తాన్లే అని ఎల్లిపోయ్నాడు’’. గుక్క తిప్పుకోవడానికి అన్నట్లు ఆగింది సుశీలమ్మ. తను చెప్పదలచుకొన్నది పూర్తి కాలేదు అన్నట్లు తెలుస్తూనే ఉంది.
‘‘ఈ దినం తెల్లార్తో మల్లా వచ్చినాడు సా... నూర్రూపాయలనోట్లు కట్టతీసి ఒగటి రెండూ అని పది లెక్కబెట్టి నా సేతిలో పెట్టి, ‘‘కరుసుకు ఉంచుకో... నాలుగు నెల్లకు మల్లా వస్తా,’’ అన్నాడు. నేను ఉలకలేదు, పలకలేదు తలెత్తి వాడి మొగం వంక సరిగా సూడనుగూడా లేదు. బలింతంగా నోట్లు నా సేతిలో పెట్టాడు. నేను యిసిరేశాను. యేమనుకొన్నాడో యేమో... ఒగ నిమసం అట్లే నిలబడి శరశరా యెల్లిపోయాడు’.
సుశీలమ్మ చెప్పడం అయిపోయింది. కొంగుతో రెండు కళ్ళూ తుడుచుకొని సీకి చిగుళ్ళు తీసుకొని వంటింట్లోకి నడిచింది. రాఘవయ్య అప్పటికే చికెన్ బిరియానీకి, వంకాయకూరకు అన్నీ సిద్ధం చేసుకొన్నాడు.
ఆ రోజు ముగ్గురూ అక్కడే తిన్నారు. సుశీలమ్మ ఆనందంగా చికెన్ బిరియానీ రెండుమార్లు వడ్డించుకొని వంకాయకూరతో తినింది. జగన్నాథం సీకికొళ్ళ చట్నీ నంజుకొంటూ బిరియానీ తిన్నాడు. సుశీలమ్మ చెప్పినట్లే సీకికొళ్ళ చెట్నీ చాలా బాగుంది.
ఉత్త అన్నంలో కూడా కలుపుకొని, నేతిచుక్కలు నాలుగు వేసుకొని తృప్తిగా తిని, ‘ఇదే ఇంత బాగుంది... నేను అప్పుడెప్పుడో తిన్న గుండుగల్లు చెట్నీ తింటే ఎలా ఉంటుందో ఏమో...’ అన్నాడు నవ్వుతూ. రాఘవయ్యా, సుశీలమ్మ ఒకరి ముఖం ఒకరు చూసుకొన్నారు. శుక్రవారం వచ్చింది. నల్లేరు చెట్నీ తయారయింది. మాంసం వేపుడు కూడా చెయ్యమన్నాడు జగన్నాథం.
ముగ్గురూ ఆనందంగా తిన్న తర్వాత జగన్నాథం అన్నాడు, ‘రెండు కొత్త రకం చెట్నీలు తిన్నాను. చాలా రుచిగా ఉన్నాయి. ఇక గుండుగల్లు చెట్నీ తినకపోయినా ఫర్వాలేదు.’
ఆరోజు రాత్రి పడుకొనే ముందు జగన్నాథానికి కాళ్ళు ఒత్తుతూ రాఘవయ్య, ‘అయ్యా... ఒక మాట చెప్పేదా,’ అన్నాడు.
‘చెప్పు’ అన్నాడు జగన్నాథం. ‘సుశీలమ్మ నాకెవురూ లేరు అని ఇంకోమారు తేల్చి చెప్పేసింది. నా సంగతి నీకు తెల్సు. పదేండ్లు దాటిందో పదైదేండ్లు దాటిందో నా కొడుకూ కోడలూ యిల్లొదిలిపెట్టి ఎల్లిపోయి.
ఇన్నేండ్లు రానోల్లు యింకేముస్తారు. సుశీలమ్మ చెప్పినట్లు నాకూ ఎవ్వరూ లేరు గదయ్యా... నేను పన్లో చేరిన కొత్తలో మీరూ అదే మాటన్నారు. కొడుకు ఏదో దేశం ఎల్లిపోయ్నాడు అంటిరి కదా...’
‘ఏదో దేశం కాదు రాఘవయ్యా... సినిమాల్లో హీరో వేషాలు వేస్తానని బొంబాయి పోయ్నాడు. పట్టుబట్టి ఆస్తులన్నీ అమ్మించి తీసుకెళ్ళిపోయాడు. మిగిలిపోయింది ఈ యిల్లే... నాకిది చాల్లే... బ్యాంకులో ఉన్న డబ్బుతో నా జీవితం గడిచిపోతుంది. వాడు మళ్ళీ తిరిగొస్తాడని నేను అనుకోవడం లేదు. నువ్వున్నావు. ఆ సుశీలమ్మ ఉంది. నాకేం కావాలన్నా చేసిపెడతారు. ఈ వయసులో ఇంకా కావలసిందేముంది?’
ఔ అన్నట్లు రాఘవయ్య తల ఆడించాడు.
ఆ మరుసటి రోజు జగన్నాథాన్ని నిద్రలేపింది సుశీలమ్మ, ‘కాపీ తెచ్చినాన్సార్!’ అంటూ. ఉలిక్కిపడి పైకి లేచాడు జగన్నాథం. కళ్ళు నులుముకొంటూ ‘నువ్వొచ్చినావేం సుశీలమ్మా... రాఘవయ్య ఏడీ...?’ అన్నాడు ఆదుర్దాగా. ‘ఏమో తెలీదుసా... తెల్లారి మబ్బుతోనే మా యింటికి ఒచ్చినాడు ‘‘సుశీలమ్మా... నేను అరిజెంటు పనిమీద యాడో బోతా వుండాను. నువ్వు రెండు మూడు దినాలు అయ్యగార్ని సూసుకోవల్ల,’’ అన్జెప్పి నిలవనుకూడా నిలవలేదుసా... అదే పొయ్నాడు. నాకు దిక్కుతెలీక నేనుగా యీడికొచ్చేసినా...’ తన తప్పేమీ లేదన్నట్లు, సంజాయిషీ ఇస్తున్నట్లు చెప్పింది సుశీలమ్మ.
ఎంత ఆలోచించినా రాఘవయ్య వెళ్ళిన కారణం జగన్నాథానికి అంతుపట్టలేదు. జగన్నాథం మనసు మనసులో లేదు. సుశీలమ్మ తనకు చేతనైనంత వరకూ చేసిపెడుతోంది. జగన్నాథానికి తినబుద్ధి పుట్టలేదు. మరుసటిరోజు ఉదయం సుశీలమ్మ కాఫీ తీసుకెళ్ళి జగన్నాథాన్ని పిలిచినా లేవలేదు. కాఫీకప్పు పక్కనపెట్టి ఒంటిమీద చెయ్యి వేసి చూసింది. ఒళ్ళు కాలిపోతోంది. గబగబా పరుగెత్తికెళ్ళి ఆ ఊళ్ళో ఉండే ఒక ఆరెంపీ డాక్టర్ని పిలుచుకొచ్చింది.
ఆ రోజంతా గంజి, పాలు, కాఫీ, రెండు రొట్టెముక్కలు తప్ప ఇంకేమీ ముట్టలేదు జగన్నాథం. రాత్రి జగన్నాథం గదిలోకి సుశీలమ్మ రెండుమార్లు వెళ్ళి ఒంటిమీద చెయ్యివేసి చూసింది. రెండుమార్లు చూసినప్పుడు జ్వరం తగ్గినట్లుంది. కాని తెల్లవారేసరికి మళ్ళీ తిరగబెట్టింది. ఆరెంపీ డాక్టర్ దగ్గరికి మళ్ళీ పరుగెత్తుకెళ్ళింది. డాక్టర్ ఇంజెక్షను కూడా వేశాడు. ‘మధ్యాన్నం వరకూ ఇట్లాగే ఉంటే టౌనుకు పెద్దాసుపత్రికి తీసుకెళ్ళండి’ అని చెప్పి వెళ్ళిపోయాడు. జగన్నాథం లేవలేదు. అప్పుడప్పుడూ మూలుగుతున్నాడు. పిలుస్తున్నా బదులు పలకడం లేదు. పెద్దాసుపత్రికి తీసుకెళ్ళాలి అంటే ఏం చేయాలి? పాలుపోలేదు.
పన్నెండు గంటలప్పుడు గుమ్మం దగ్గర చప్పుడయింది. గబుక్కున లేచి చూసింది సుశీలమ్మ. రాఘవయ్య ఇంట్లోకి వస్తున్నాడు. ఎక్కడ లేని కోపం వచ్చింది సుశీలమ్మకు. ఆ కోపంలో ఏం మాట్లాడాలో తెలీలేదు. కోపం కాస్తా ఏడుపయింది. కొంగు నోట్లో దూర్చుకొని దుఃఖాన్ని దిగమింగుతూ జగన్నాథాన్ని చూపించింది. రాఘవయ్య జగన్నాథం మంచం పక్కన నిలబడి కాస్సేపు తదేకంగా చూశాడు. ఒంటిమీద చెయ్యి వేశాడు. వేడిగానే ఉంది.
‘అయ్యా అయ్యా’ అని పిలిచినా స్పందన లేదు. కాస్సేపు అలాగే నిలబడి ఆలోచించిన రాఘవయ్య వంటింట్లోకి వెళ్ళిపోయాడు. బియ్యం ఒక స్టౌ మీద పెట్టి, రెండో దాంట్లో బాణలి పెట్టాడు. కాస్సేపటి తర్వాత మిక్సీ ఆన్ చేశాడు. గంటన్నర లోపల వంట పూర్తయింది. ‘ఇప్పుడు వంట చేయడం అంత ముఖ్యమా! అయ్యగారిని పెద్దాసుపత్రికి తీసుకెళ్ళే విషయం ఆలోచించకుండా ఈ రాఘవయ్య వంటింట్లోకి దూరాడే! ఈ మూడురోజులూ తిండి తిన్లేదేమో!’ సుశీలమ్మ మనసులో విసుక్కొంటోంది.
రాఘవయ్య వంటింట్లోంచి అన్నం గిన్నెతోబాటు ఇంకో గిన్నె కూడా తెచ్చాడు. జగన్నాథం కంచంలో అన్నం పెట్టి, ‘అయ్యా! గుండుగల్లు చెట్నీ చేశానయ్యా! రెండురోజులు కష్టపడితే మీ స్నేహితుడు చిన్నస్వామి పక్కింటివాళ్ళు చెప్పారు. ఏం లేదయ్యా ఫస్టు బాణలిలో నూనె వేసి ఆవాలు, ఉద్దిపప్పు, సెనగపప్పు, జీలకర్ర వేసి దోరగా వేయించాలి. ఆ తర్వాత చింతపండు, చిన్న ఎర్రగడ్డ, తెల్లగడ్డ వేయాలి. చివరలో కొత్తిమీర, కరివేపాకు వేసి ఇంకొంత సేపు వేయించాలి. ఉప్పువేసి అంతా మిక్సీలోకి వేస్తే గుండుగల్లు చెట్నీ రెడీ. ఫస్టు మీరే రుచి చూడాలయ్యా. కంచంలో పెట్టుకొని వచ్చా’ అన్నాడు. జగన్నాథం మంచం మీద లేచి కూర్చున్నాడు.
వేడి వేడి అన్నంలో చెట్నీ కలుపుకొని ఒక ముద్ద నోట్లో పెట్టుకొని ‘అదే అదే... ఇదే గుండుగల్లు చెట్నీ’ అని ఆనందంగా అన్నాడు. ఆయన ముఖమంతా వెలిగిపోయింది. ఆబగా చెట్నీ కలుపుకొంటూ పెద్ద పెద్ద ముద్దలు చేసి తినసాగాడు.
రాఘవయ్య చూస్తూ ఉండలేకపోయాడు. గబగబా లోపలికెళ్ళి తనకో కంచం, సుశీలమ్మకో కంచం తీసుకొచ్చాడు.
- నాయుని కృష్ణమూర్తి