= రూ. 51.15 లక్షల స్వాహా
= ఐకేపీలో అవినీతి ఊడలు
= ఏపీవో రాఘవయ్య అత్మహత్యాయత్నం
= విచారణ పూర్తి కాలేదంటున్న డీఆర్డీఏ పీడీ
= జనవరిలోనే వెలుగులోకి తెచ్చిన ‘సాక్షి’
మచిలీపట్నం, న్యూస్‌లైన్ : ఇందిరా క్రాంతి పథం (ఐకేపీ) అక్రమార్కులకు చిరునామాగా మారింది. పది నెలల వ్యవధిలో బందరు మండలంలో ఐకేపీలో పనిచేస్తున్న సిబ్బంది రూ. 51.15 లక్షలు కాజేయటం విస్మయం కలిగిస్తోంది. ఇందిరా క్రాంతి పథం ద్వారా అమలుచేసే ఆమ్‌ఆద్మీ పథకంలో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయంటూ ‘సాక్షి’ దినపత్రికలో ఈ ఏడాది జనవరి 22న ‘ఆమ్ ఆద్మీ బీమా సొమ్ము స్వాహా’ శీర్షికతో ప్రత్యేక కథనం వచ్చింది.
అప్పటి కలెక్టర్ బుద్ధప్రకాష్ ఎం.జ్యోతి విచారణకు ఆదేశించారు. తొమ్మిది నెలల పాటు జరిగిన విచారణలో బందరు మండలంలో రూ. 51.15 లక్షల సొమ్ము స్వాహా జరిగినట్టు అధికారులు నిర్ధారించారు. దీనిపై చిలకలపూడి పోలీస్‌స్టేషన్‌లో జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు షేక్ వహీదున్నీసా మంగళవారం ఫిర్యాదు చేశారు. మండల సమాఖ్యకు వచ్చిన నగదును బందరు మండలంలో పనిచేస్తున్న అకౌంటెంట్ ఎం.జీవన్‌బాబు తన సొంత ఖాతాలోకి మార్చుకుని నిధులు స్వాహా చేసినట్టు విచారణలో వెల్లడైందని డీఆర్డీఏ పీడీ కె.శివశంకర్ ‘న్యూస్‌లైన్’కు తెలిపారు.
విచారణ పూర్తయితే నగదు స్వాహా గురించి మరింత సమాచారం అందుతుందని చెప్పారు. కాగా ఐకేపీ ద్వారా మండల సమాఖ్యకు వచ్చిన నగదును అకౌంటెంట్ అడ్డగోలుగా మార్చేసుకుంటుంటే ఏపీవోగా పనిచేస్తున్న ఉద్దండి వీరరాఘవయ్య మిన్నకుండిపోయారని, ఆయనపైనా విచారణ చేయాలని జిల్లా సమాఖ్య సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ నేపథ్యంలో వీరరాఘవయ్య స్వగ్రామమైన కోడూరు మండలం ఉల్లిపాలెంలో పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. ప్రస్తుతం ఆయన విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. లక్షలాది రూపాయలు కైంకర్యం చేసినవారి నుంచి రికవరీ చేస్తారా.. లేదా.. అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సంఘటనలో కీలకపాత్రదారి అయిన జీవన్‌బాబు రాజకీయ నాయకులను ఆశ్రయించి తనదైన శైలిలో చక్రం తిప్పుతున్నాడనే ఆరోపణలు లేకపోలేదు.
నిధుల స్వాహా ఇలా..
గ్రామీణ స్థాయిలో పేదరిక నిర్మూలన కోసం డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేశారు. 2005లో ఈ సంఘాలన్నింటిని ఐకేపీలోకి తీసుకున్నారు. డ్వాక్రా సంఘాల్లోని సభ్యులకు రుణాలు మంజూరు చేయటం, ఆమ్ ఆద్మీ బీమా పథకం ద్వారా సంఘాల్లోని సభ్యులతో బీమా సొమ్ము కట్టించడం, ఎవరైనా చనిపోతే వారికి బీమా సొమ్ము అందజేయడం, డ్వాక్రా సంఘాల్లోని సభ్యుల పిల్లలకు స్కాలర్‌షిప్‌లు మంజూరు చేయడం తదితర పనులను ఐకేపీ చేయాల్సి ఉంది. గ్రామస్థాయిలో గ్రామసమాఖ్యలు, మండలస్థాయిలో మండల సమాఖ్యలు ఏర్పాటు చేశారు.
ఈ సమాఖ్యలకు నగదు పంపిణీ చేసేందుకు అవుట్ సోర్సింగ్ పద్ధతిపై సిబ్బందిని నియమించారు. వీరికి బీమా సొమ్ము కట్టించుకోవడం, స్కాలర్‌షిప్‌లకు విద్యార్థులను ఎంపిక చేయడం వంటి బాధ్యతలు అప్పగించారు. వీరు జాబితాలు తయారు చేసి పంపితే జిల్లా సమాఖ్య నుంచి మండల సమాఖ్యకు నిధులు మంజూరవుతాయి. ఈ నిధుల ఖర్చుపై ఆడిట్ లేకపోవడంతోపాటు అవుట్‌సోర్సింగ్ సిబ్బంది పనిచేస్తుండడంతో దీనిని అలుసుగా తీసుకుని నిధులు స్వాహా చేశారు.
బందరు మండలంలో ఐకేపీలో అకౌంటెంట్‌గా పనిచేసిన జీవన్‌బాబు మండల సమాఖ్యకు వచ్చిన నిధులను ఇండియన్ బ్యాంకులో తన పేరుతో ఉన్న ఖాతాకు మార్చుకున్నాడు. బతికి ఉన్నవారిని చనిపోయినట్లు, చనిపోయిన వారి బంధువులకు తెలియకుండా వేరే వ్యక్తులతో సంతకాలు చేయించి ఆమ్ ఆద్మీ బీమా సొమ్ముకు సంబంధించిన లక్షలాది రూపాయలను డ్రా చేసుకున్నాడు. ఈ విషయం ‘సాక్షి’లో రావడంతో అప్పటి కలెక్టర్ బుద్ధప్రకాష్ విచారణకు ఆదేశించి విచారణాధికారిగా ఏపీడీ శ్రీధర్‌రెడ్డిని నియమించారు.
తీగలాగితే డొంక కదిలింది..
అకౌంటెంట్ జీవన్‌బాబు 2012 సెప్టెంబరు 13వ తేదీన రూ. 6.30 లక్షలు, 2013 జనవరి 11వ తేదీన రూ. 6.25 లక్షలు, మార్చి 18వ తేదీ రూ. 8.60 లక్షలు, ఏప్రిల్ 13వ తేదీన రూ. 13.50 లక్షలు, మే 4వ తేదీన రూ. 4 లక్షలు, జూన్ 6వ తేదీన రూ. 3.50 లక్షలు, ఆగస్టు 7వ తేదీన రూ. 2 లక్షలు డ్రా చేసినట్లు అధికారుల విచారణలో వెల్లడైంది. జీవన్‌బాబుకు అప్పటి మండల సమాఖ్య అధ్యక్షురాలు లంకే వెంకటేశ్వరమ్మ, కార్యదర్శి ఎస్.సునీత సహకరించినట్లు జిల్లా మహిళా సమాఖ్య సభ్యులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఆధారాలున్నాయి..
ఐకేపీలో రూ. 51.15 లక్షలు స్వాహా అయినట్లు తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని డీఆర్డీఏ పీడీ కె.శివశంకర్ ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. నిధులు స్వాహా చేసిన జీవన్‌బాబును విచారణ జరపగా అతను సొమ్ము కాజేసినట్లు అంగీకరించాడని తెలిపారు. స్వాహా చేసిన నగదుతో వాటర్ ప్లాంట్, ఇతర వ్యాపారాలు నిర్వహిస్తున్నట్లు అంగీకరించాడని తెలిపారు. మండల సమాఖ్య సభ్యులను పక్కదారి పట్టించి తన సొంత అకౌంట్‌లోకి నగదును జమ చేసుకుని ఈ తతంగానికి పాల్పడినట్లు విచారణలో వెల్లడైందన్నారు. ఇంకా ఈ అంశంపై పూర్తిస్థాయి విచారణ పూర్తి కాలేదని చెప్పారు. జీవన్‌బాబుకు మరికొందరు ఉద్యోగులు సహకరించారని, వారందరి నుంచి స్వాహా అయిన సొమ్మును రికవరీ చేసే ప్రయత్నం చేస్తున్నామన్నారు.