
సామల టొమాటో పులావ్
కావలసినవి: సామలు – ఒక కప్పు, నెయ్యి/నూనె – 2 టీ స్పూన్లు ఉల్లి తరుగు – పావు కప్పుతరిగిన పచ్చి మిర్చి – రెండు క్యారట్ తరుగు – ఒక టేబుల్ స్పూను, కరివేపాకు – 2 రెమ్మలుఅల్లం తురుము – ఒక టీ స్పూనుఆవాలు – ఒక టీ స్పూను, పచ్చి సెనగ పప్పు – ఒక టీ స్పూనుమినప్పప్పు – ఒక టీ స్పూనుటొమాటో తరుగు – పావు కప్పు, పసుపు – పావు టీ స్పూనుమిరప కారం – పావు టీ స్పూను, కొత్తిమీర – ఒక టేబుల్ స్పూను, నీళ్లు, ఉప్పు – తగినంత, ఉడికించిన బఠాణీ – ఒక కప్పు
తయారీ: సామలకు తగినన్ని నీళ్లు జత చేసి శుభ్రంగా కడిగి సుమారు రెండు గంటలపాటు నానబెట్టాలి. స్టౌ మీద కుకర్ ఉంచి వేడయ్యాక కొద్దిగా నెయ్యి/నూనె వేసి కాగాక ఆవాలు, పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, ఉల్లి తరుగు, అల్లం తురుము, పచ్చి మిర్చి తరుగు, ఉడికించిన బఠాణీలు, క్యారట్ తరుగు, కరివేపాకు వేసి దోరగా వేయించాలి. టొమాటో తరుగు, పసుపు, మిరప కారం వేసి మరోమారు కలపాలి. తగినన్ని నీళ్లు, ఉప్పు వేసి మరిగించాలి. సామలలో నీళ్లు ఒంపేయాలి. మరుగుతున్న నీటిలో సామలు వేసి కలియబెట్టి మూత పెట్టేయాలి. మూడు విజిల్స్ వచ్చాక దింపేయాలి. కొత్తిమీరతో అలంకరించి, కొబ్బరి చట్నీతో గాని, కొత్తిమీర చట్నీతో గాని వడ్డించాలి.
100 గ్రాముల ధాన్యాల్లో పోషకాలు, పీచు పదార్థం ఎంత?
సామలు (Littile Millet)
నియాసిన్ (Niacin)mg (B3) 1.5
రిబోఫ్లావిన్ (Rivoflavin)mg (B2) 0.07
థయామిన్ (Thiamine) mg (B1) 0.30
కెరోటిన్(Carotene)ug 0
ఐరన్ (Iron)mg 2.8
కాల్షియం (Calcium)g 0.02
ఫాస్పరస్ (Phosphorous)g 0.28
ప్రొటీన్ (Protein)g 7.7
ఖనిజాలు (Minerals) g 1.5
పిండిపదార్థం (Carbo Hydrate) g 65.5
పీచు పదార్థం (Fiber) g 9.8
పిండిపదార్థము/పీచు నిష్పత్తి (Carbo Hydrate/Fiber Ratio) 6.68
సామలు పుట్ట గొడుగుల బిర్యానీ
కావలసినవి: సామలు – ఒక కప్పు, నెయ్యి – 2 టీ స్పూన్లు తరిగిన పుట్ట గొడుగులు – 100 గ్రా., ఉల్లి తరుగు – పావు కప్పుటొమాటో తరుగు – పావు కప్పు, అల్లం వెల్లుల్లి ముద్ద – ఒక టీ స్పూను
పసుపు – అర టీ స్పూను, మిరప కారం – ఒక టీ స్పూనుగరం మసాలా – ఒక టీ స్పూను, ఉప్పు – తగినంతనీళ్లు – 2 కప్పులు (చిరు ధాన్యాలకి) + పావు కప్పు (పుట్టగొడుగుల మసాలాకి)కొత్తిమీర – ఒక కప్పు, పుదీనా – అర కప్పుతరిగిన పచ్చి మిర్చి – 1, ఏలకులు – 1, లవంగాలు – 4, బిర్యానీ ఆకు – 1దాల్చిన చెక్క – చిన్న ముక్క, జాపత్రి – చిన్న ముక్క
సోంపు గింజలు – ఒక టీ స్పూనుజీలకర్ర – ఒక టీ స్పూను కరివేపాకు – 2 రెమ్మలు
తయారీ: స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక సామలను వేసి దోరగా వేయించి తీసి పక్కన ఉంచాలి. స్టౌ మీద కుకర్ ఉంచి వేడయ్యాక, నెయ్యి వేసి కరిగించాలి. బిర్యానీ ఆకు వేసి వేయించాక, లవంగాలు, దాల్చిన చెక్క, ఏలకులు, జాపత్రి ముక్క, సోంపు గింజలు, జీలకర్ర వేసి దోరగా వేయించాలి. ఉల్లి తరుగు జత చేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించాక, టొమాటో తరుగు, అల్లం వెల్లుల్లి ముద్ద, గరం మసాలా, ఉప్పు, కారం, పసుపు, కరివేపాకు, పచ్చి మిర్చి తరుగు వేసి వేగనివ్వాలి. బాగా వేగిన తరవాత తరిగి ఉంచుకున్న పుట్టగొడుగులు, కొద్దిగా నీళ్లు పోసి ఉడికించాలి. సామలు జతచేయాలి. కొద్దిగా నీళ్లు, కొంచెం కరివేపాకు, పుదీనా ఆకులు వేసి మూత పెట్టి, రెండు విజిల్స్ వచ్చాక దింపేసి, మూత తీశాక కొత్తిమీరతో అలంకరించాలి. రైతాతో వడ్డించాలి.
సామల దద్ధ్యోదనం
కావలసినవి: సామలు – అర కప్పు, నీళ్లు – 2 కప్పులు పెరుగు – ముప్పావు కప్పు, కొబ్బరి పాలు – పావు కప్పు క్యారట్ – 3 టీ స్పూన్లు, కొత్తిమీర తరుగు – 2 టీ స్పూన్లు, ఉప్పు – తగినంత నెయ్యి/నూనె – ఒక టీ స్పూను, ఆవాలు – అర టీ స్పూను మినప్పప్పు – అర టీ స్పూను, కరివేపాకు – 2 రెమ్మలు
తరిగిన పచ్చి మిర్చి – 2, అల్లం తురుము – ఒక టీ స్పూను
తయారీ: ముందుగా సామలను శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు జత చేసి సుమారు రెండు గంటలపాటు నానబెట్టాలి. నీళ్లు ఒంపేసి తగినన్ని నీళ్లు జత చేసి స్టౌ మీద ఉంచి మెత్తగా ఉడికించాలి. ఉడికిన సామల అన్నాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని, గరిటెతో మెత్తగా అయ్యేలా మెదపాలి. పెరుగు, కొబ్బరి పాలు జత చేసి కలియబెట్టాలి. స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక నూనె/నెయ్యి వేసి కాగనివ్వాలి. ఆవాలు, మినప్పప్పు, కరివేపాకు, పచ్చి మిర్చి తరుగు, అల్లం తురుము వేసి బంగారు రంగులోకి మారేవరకు వేయించాలి. క్యారట్ తురుము జత చేసి మరోమారు వేయించి, సామల అన్నంలో వేసి కలియబెట్టాలి. ఉప్పు జత చేసి బాగా కలియబెట్టాలి. కొత్తిమీరతో అలంకరించి, అల్లం చట్నీతో అందించాలి.
సామల ఖీర్
కావలసినవి: సామలు – ఒక కప్పు, నెయ్యి – ఒక టేబుల్ స్పూను, జీడి పప్పు పలుకులు – 10 కిసిమిస్ – ఒక టేబుల్ స్పూను, బెల్లం పొడి – ఒక కప్పు కొబ్బరి పాలు – ఒక కప్పు, ఏలకుల పొడి – అర టీ స్పూను
తయారీ: సామలను శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు జత చేసి సుమారు రెండు గంటలు నానబెట్టాలి. స్టౌ మీద బాణలి వేడయ్యాక నెయ్యి వేసి కరిగాక జీడి పప్పు పలుకులు, కిస్‌మిస్ వేసి వేయించి పక్కన ఉంచాలి. సామలలోని నీళ్లు ఒంపేసి, తగినన్ని మంచినీళ్లు జత చేసి, స్టౌ మీద ఉంచి మెత్తగా అయ్యేవరకు ఉడికించాలి. కొబ్బరి పాలు జతచేయాలి. బెల్లం పొడి వేసి బాగా కలియబెట్టి, కొద్దిసేపు ఉడికించాలి. ఏలకుల పొడి, వేయించి ఉంచుకున్న జీడిపప్పులు, కిస్‌మిస్ జత చేసి కలిపి దింపేయాలి. వేడివేడిగా తింటే రుచిగా ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment