నీకేం కావాలో చెప్పు..! | seen is ours tittle is yours | Sakshi
Sakshi News home page

నీకేం కావాలో చెప్పు..!

Published Sun, Jul 8 2018 12:01 AM | Last Updated on Sun, Jul 8 2018 12:02 AM

seen is ours tittle is  yours - Sakshi

తమిళ స్టార్‌ హీరో నటించిన ఓ సినిమా తెలుగు డబ్బింగ్‌ వెర్షన్‌లోని కొన్ని సన్నివేశాలివి. తమిళంతో పాటు తెలుగులోనూ మంచి హిట్‌గా నిలిచిన ఈ సినిమా పేరేంటో చెప్పుకోండి చూద్దాం.... 

సత్యదేవ్‌ అప్పుడే ఆటో డ్రైవర్‌ వేషంలోకి మారిపోయి ప్యాంట్‌లో దోపుకున్న గన్‌ తీసి ఆటో హ్యాండిల్‌ పక్కన్నే పెట్టుకొని చుట్టూ గమనిస్తూ కూర్చున్నాడు. కొద్దిసేపట్లో అక్కడికొచ్చే ఒక వ్యక్తిని కాల్చి చంపాలి అతను. ఆ వ్యక్తి ఎక్కడెక్కడికి వెళుతున్నది సత్యదేవ్‌కి మెసేజ్‌ వస్తూనే ఉంది. ‘‘ఆటో స్టార్ట్‌ చెయ్యండి. నేను త్వరగా హాస్పిటల్‌కి వెళ్లాలి’’ అంటూ ఒకావిడ అప్పుడే ఆటో ఎక్కడం చూశాడు సత్యదేవ్‌. ‘‘సారీ మేడమ్‌! ఆటో రాదు.’’ అన్నాడు.‘‘నేను హాస్పిటల్‌కి వెళ్లాలి’’‘‘సారీ మేడమ్‌! మీరు వేరే ఆటో చూస్కోండి. నేనొక ముఖ్యమైన పనిమీద ఉన్నాను.’’ ‘‘ఇంతకంటే ముఖ్యమా? నాకేం అర్థం కావట్లేదు.’’ అంటూ విసుగ్గా ఆటో దిగిందామె. సత్యదేవ్‌ ఆటోలోంచి మెల్లిగా దిగుతున్న ఆమె కడుపుతో ఉందని గమనించగానే, ‘ఎలాగూ ఇంకాసేపట్లో ఒక చావుకి కారణం కాబోతున్నాను. ఫర్‌ ఎ చేంజ్, ఓ పుట్టుకకి హెల్ప్‌ చేద్దాం’ అనుకున్నాడు.  ఆమెను మళ్లీ ఆటో ఎక్కించి హాస్పిటల్‌లో డ్రాప్‌ చేశాడు సత్యదేవ్‌. వీల్‌చైర్‌ మీద హాస్పిటల్‌ లోపలికి వెళుతూ, సత్యదేవ్‌కి కళ్లతోనే థ్యాంక్స్‌ చెబుతూ రెండు వంద నోట్లు అతడి చేతిలో పెట్టిందామె. సత్యదేవ్‌ తన చేతిలోని ఆ రెండు వంద నోట్లను చూస్కొని చిన్నగా నవ్వాడు. 

రెండు సంవత్సరాలు గడిచాయి. ఈ కాలంలో సత్యదేవ్‌ చేతిలో చాలామంది చనిపోయారు. ఆయన పేరు కూడా అంతకంతకూ పెరిగిపోయింది. ఒకరోజు కోర్టులో ఆమెను చూశాడు సత్యదేవ్‌. చంకలో రెండేళ్ల పసిపిల్లను ఎత్తుకొని, అప్పుడే భర్తతో విడాకులు తీసుకొని బయటకొచ్చిందామె. సత్యదేవ్‌ ఆమెకు ఎదురెళ్లి పలకరించాడు. ‘‘తెలుగు సినిమాల్లో మాత్రమే ఇలా జరుగుతుందనుకున్నా. నిజ జీవితంలో కూడానా!’’ నవ్వుతూ అందామె. అతనేమీ అర్థం కానట్టు చూశాడు. ‘‘ఆటో డ్రైవర్‌ నుంచి టాప్‌ పోలీస్‌ ఆఫీసర్‌.. రెండేళ్లలో.. వావ్‌!’’ అలాగే నవ్వుతూ అంది. ‘‘రియల్లీ?’’ కళ్లద్దాలు తీస్తూ ఆశ్చర్యం నటిస్తూ అడిగాడు సత్యదేవ్‌. ‘‘ఐ యామ్‌ జోకింగ్‌. ఆ మర్నాడే హాస్పిటల్‌లో ఓ టీవీలో చూశాను. యూనిఫామ్‌లో ఉన్నారు.’’ చెప్పిందామె. సత్యదేవ్‌ నవ్వి, పాపను చూస్తూ, ‘‘వీరేనా వారు?’’ అన్నాడు.అవునన్నట్టు తలూపి, ‘‘నిషా! ఆ రోజు తను సేఫ్‌గా పుట్టడానికి మీరే కారణం. మిమ్మల్నెప్పటికీ మర్చిపోలేను...’’ అంటున్న ఆమె మాటలను మధ్యలోనే ఆపేస్తూ నిషాను తన చేతుల్లోకి తీసుకొని కాసేపు ఆడుకున్నాడు సత్యదేవ్‌. ‘‘మళ్లీ కలుద్దాం.’’ కాసేపటికి ఇద్దరూ ఈ మాట అనుకొని ఎవరి దారుల్లో వాళ్లు వెళ్లిపోయారు. ఆ తర్వాత కొద్దిరోజులు ఆమె గురించి ఆలోచించాడు సత్యదేవ్‌. ఆమె ఒక క్లాసికల్‌ డ్యాన్సర్‌ అని తెలుసుకొని, ఆమె సిటీలో ఇస్తున్న ఒక షోకు వెళ్లాడు. షో అయిపోయాక కొద్దిసేపు ఎదురుచూసి మరీ ఆమెను వెతుక్కుంటూ వెళ్లి మాట్లాడాడు – ‘‘కంగ్రాచ్యులేషన్స్‌! బ్యూటిఫుల్‌.చాలాఅందంగా డ్యాన్స్‌ చేశారని చెప్పొచ్చా?’’ ‘‘థ్యాంక్యూ.’’ ‘‘ట్రూలీ! ఐ ఎంజాయ్‌డ్‌ ఇట్‌. డ్యాన్స్‌ మీద నాకొక కొత్త ఇంటరెస్ట్‌ కలిగింది.’’ఆమె నవ్వింది. ‘‘సత్యదేవ్‌’’ అంటూ పరిచయం చేసుకున్నాడు. 
‘‘తెలుసు. ఐ యామ్‌ హేమానిక’’ అంది.

‘‘తెలుసు.’’ అని కాసేపు హేమానికనే చూస్తూ నిలబడ్డాడు సత్యదేవ్‌. ‘‘యూ మస్ట్‌ బీ బిజీ. మళ్లీ కలుస్తాను..’’ అంటూ అక్కణ్నుంచి వెళ్లిపోయాడు సత్యదేవ్‌. ఆ సాయంత్రమే ఆఫీస్‌లో హేమానిక నంబర్‌ సంపాదించి పెట్టమని ఫ్రెండ్‌ని రిక్వెస్ట్‌ చేశాడు. గంటలో నంబర్‌ వచ్చింది. ఫోన్‌ చేయాలా వద్దా అని చాలా ఆలోచించాడు. చివరకు ‘‘హాయ్‌! నేను సత్యదేవ్‌. ఇది నా నంబర్‌. మీకొక హలో చెప్పాలనిపించింది.’’ అని మెసేజ్‌ చేశాడు.‘‘గుడ్‌ టు హియర్‌ ఫ్రమ్‌ యూ. టచ్‌లో ఉంటాను – హేమానిక’’ రిప్లై ఇచ్చింది. ఆ మెసేజ్‌ వాళ్లను కాల్‌కు, ఆ తర్వాత కాఫీకి తీసుకెళ్లింది. కాఫీలో ఇద్దరూ ముందు తమ గురించి చెప్పుకున్నారు. ఆ తర్వాత తరచూ కలవడం మొదలైంది. ఇష్టాలు పంచుకున్నారు. ఒకరినొకరు కలవకుండా ఉండలేని పరిస్థితికి వచ్చేశారు. సహజీవనంలో ఉన్నారిప్పుడు. నిషా పెద్దదవుతూ వస్తోంది. సత్యదేవ్‌ వాళ్ల ప్రపంచంలోకి వచ్చినప్పుడు నిషాకి రెండేళ్లు. ఇప్పుడు తనకు ఆరేళ్లు. హేమానిక తన స్టూడెంట్స్‌కు డ్యాన్స్‌ నేర్పిస్తూ ఉన్న ఒకరోజు, చాలారోజులుగా తన మనసులో దాచుకున్న విషయం చెప్పడానికి వచ్చాడు సత్యదేవ్‌. హేమానికకు మాట్లాడాలంటూ కళ్లతో సైగ చేసి చెప్పాడు. ఆమె స్టూడెంట్స్‌ను ప్రాక్టీస్‌ చేస్తూ ఉండమని చెప్పి వచ్చి, సత్యదేవ్‌ ఎదురుగా నిలబడి, ఏంటన్నట్టు కనుబొమ్మలెగరేసింది. ‘‘పెళ్లి చేసుకుందామా? విల్‌ యూ మ్యారీ మీ?’’ అనడిగాడు సత్యదేవ్‌.

‘‘ఊరంతా అనుకుంటున్నారు కదూ!’’ చుట్టూ చూసి మెల్లిగా అంది హేమానిక.‘‘లుక్‌! ఐ లవ్యూ. నువ్వు నాకు కావాలి. నిన్ను పెళ్లి చేసుకోవాలి. అంతే!’’‘‘నిషా? ఎంతైనా తను ఇంకొకరి కూతురు.ఆలోచించండి.’’‘‘నన్నలా సందేహించకు హేమా! దయచేసి నన్ను వేరుచేసి మాట్లాడకు.’’‘‘సత్య ఐ యామ్‌ సారీ..’’‘‘నిషా నీ బిడ్డ. నువ్వు కన్న బిడ్డ. కాబట్టి నాకూ బిడ్డే. తనెప్పుడో నా కూతురైపోయింది...’’ సత్యదేవ్‌ తమ భవిష్యత్‌ ఎలా ఉండాలనుకుంటున్నాడో అంతా చెప్తూ పోతున్నాడు. హేమానిక పెళ్లికి ఓకే చెప్పింది. అమ్మాయి నిషాను కూడా అడిగి తను కూడా ఓకే చెప్పాక పెళ్లికి సిద్ధమయ్యారు సత్యదేవ్, హేమానిక. కానీ సరిగ్గా ఆ పెళ్లిరోజే, సత్యదేవ్‌ మీద కోపంతో ఉన్న గ్యాంగ్‌ హేమానికను హత్య చేశారు. సత్యదేవ్‌కు కోపమొచ్చింది. కోపానికి మించిన బాధ తన్నుకొచ్చింది. అప్పుడు కూతురు నిషా ముఖం చూశాడు. అతనికి మొదటిసారి భయమేసింది. తను ఈ ఉద్యోగంలో ఉండటమే ఆ భయానికి కారణం. తన సమయాన్నంతా నిషా కోసమే కేటాయించాలనుకున్నాడు. ఉద్యోగానికి రాజీనామా చేసొచ్చి, నిషానుఅడిగాడు – ‘‘నీకేం కావాలో చెప్పు!’’ అని. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల పాటు ఆ తండ్రీ కూతుర్లిద్దరూ తమ ప్రపంచాన్ని మరచిపోయి కొత్త కొత్త ప్రపంచాలను వెతుక్కుంటూ వెళ్లిపోయారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement